Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 23


    "అన్నయ్యా! నాకు పెళ్ళి వద్దు ఏం వద్దు. శ్రీనివాస్ క్షేమంగా ఉంటే అంతేచాలు--" అన్నది ఏడుస్తూ రాధిక.

    "నేను ప్రయత్నిస్తున్నానమ్మా"

    "శ్రీనివాస్ కేమన్నా అయితే నేను బ్రతుకనన్నయ్యా. వాళ్ళు తెచ్చిన సంబంధం చేసుకుంటానుగాని, అతడిని వదిలిపెట్టమనన్నయ్యా" అన్నది దీనంగా.

    "కడుపుకోత" అన్న జంగయ్య మాటలు చెవుల్లో గింగురు మన్నాయి. మాట్లాడలేకపోయాడు.

    "ఏమిట్రా! దీనికి పిచ్చి పట్టినట్టుంది" అని యశోద వచ్చింది.
 
    "తరాలు అంతరాలు అమ్మ! నువ్వు దాన్ని అర్ధం చేసుకో వెందుకని! ఇంటిమీద నాన్న పరాయి స్త్రీలతో కాలక్షేపం చేసినా నువ్వు ఊరుకుంటున్నావు. రాధిక ఛల్ పో అంటుంది!" అన్నాడు.

    యశోదమ్మ ముఖం మలినం అయింది. ఆమెకు పిల్లల ముందు తల వంచుకోవాల్సి వచ్చినందుకు బాధపడింది.

    "పదండి బొబ్బట్లు చేసాను. చల్లారి పోతున్నాయి." అని వెళ్ళిపోయింది. పిల్లలిద్దరూ తల్లిని అనుసరించారు.


                                     6


    "ఓహో! తండ్రి కప్పులు తనయునికి తెలియదని నన్ను నమ్మమంటారు." శ్వేత పక, పక నవ్వింది.

    "మీరు నమ్మినా మానినా నేను చెబుతుంది నిజం."

    "ధనవంతులు నిజం మాట్లాడతారంటే నాకు నమ్మకం లేదు."
 
    "ఏం చేస్తే మీకు నమ్మకం కల్గుతుంది చెప్పండి" అన్నాడు అసహాయంగా.

    "మీరు జంగయ్యతో నిజం చెప్పించండి"

    "ఆ నిజంతో మీకేం పని?"

    "మీకున్న పనే. పార్వతమ్మ నాకు తల్లిలాంటిది" అన్నది. కాని సిద్దార్ధ నమ్మలేకపోయాడు. ఆమెకు ఈ శ్రీనివాస్ తో ఏదో సంబంధం ఉంది.

    "పదండి" అన్నాడు.

    "ఒక్కసారి కరీమ్ గారితో చెప్పి వస్తాను" ఆమె లోపలికి వెళ్లి వచ్చింది. ఇద్దరూ జంగయ్య ఇల్లు చేరి స్థాణువులా నిలబడి పోయారు. వాకిట్లో మంచంలో పడి ఉన్న జంగయ్య శవం పై పడి అతనిభార్య ఏడుస్తుంది.

    బాలరాజు తరువాత పుట్టిన ఇద్దరాడపిల్లలు తల్లికి వంతపాడినట్టు ఏడుస్తున్నారు.

    వీధిలో జనమంతా చుట్టూ నిలబడి చూస్తున్నారు.

    "ఏమిట్రా బాలూ! ఏం జరిగింది?"

    "ఏమిటో తెలియదురా! రాత్రి బాగా త్రాగి వచ్చాడు నాన్న. ఆయనకదేం కొత్తకాదు. మధ్యరాత్రి నుండి మూల్గుతూ, దొర్లాడు, తెల్లారాక, డాక్టరుకు చూపించాలనుకున్నాను. తెల్లవారుజామునే పోయాడు" అన్నాడు బాలరాజు.

    అతని కళ్ళు ఒడలినా, ఉబ్బి ఉన్నాయి.

    "ఇది మామూలు మరణం కాదు. పోలీసులను పిలవాలి" అన్నది శ్వేత. ఆ విషయం బాలరాజుతో చర్చించారు.

    "అతని గుండె ఆగి చనిపోయి ఉంటాడు. అసలు పోలీసువాళ్ళకు బుద్దిలేదు"

    "నిన్నుకొట్టిన వారందరికి బుద్ది లేదంటావేం బాలూ....." సిద్దార్ధ ఆలస్యం చేయక రిపోర్ట్ రాసిచ్చాడు.

    పోలీసులు వచ్చారు. కావల్సిన తతంగం అయింది. అందరి స్టేట్ మెంట్లు తీసుకుని, శవాన్ని హాస్పత్రికి తరలించారు. సిద్దార్ధకు కుతూహలం గాను, బాధగానూ ఉంది.

    అతను ముందు వెళ్ళాడు.

    డాక్టరు శవాన్ని చూస్తూనే "మైగాడ్...." అని భుజాలు, గుండె ముట్టుకున్నాడు.

    "సిద్దార్ధా!"

    తీక్షణమైన పిలుపు విని ఉలిక్కిపడ్డాడు, మధుమూర్తి నిలబడ్డాడు.

    "అన్నయ్యా!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS