Previous Page Next Page 
స్వాతి జల్లు పేజి 23

 

                                      9

    ప్రకాశరావు కు జ్వరంగా ఉన్నా, తన కళ్ళు వాలి పాయ్యాయి. తన శరీరం నిద్రా సుఖం పొందగలిగింది. కానీ, వెంకటలక్ష్మీ కళ్ళు వాలిపోవు. ఆమెకు నిద్ర రాదు! ఎంత చేదుగా ఉన్నా ఇది యదార్ధం.
    పగలు అరుంధతి, ప్రకాశరావు ప్రక్కనే ఉండేది. కానీ, రాత్రి ఆమెకు తెలియకుండానే నిద్రాదేవత ఆమె నావరించుకొనేది. నలతతో నిద్రపట్టని ప్రకాశరావు "ఆరూ!" అని తెగ కలవరించేవాడు. పిలిచిన వెంటనే పలికెది వేంకట లక్ష్మీ. కళ్ళలో ఒత్తులు వేసికొని, అతని అవసరాలను చూసుకొనేది. ఒళ్ళు తెలియని జ్వర బాధతో , రాత్రి బెడ బట్టే మసక  కాంతిలో , అతి మెల్లని వెంకటలక్ష్మీ స్వరాన్ని గుర్తించలేక , అందులోని ఆప్యాయతను మాత్రమే అర్ధం చేసుకో గల్గిన ప్రకాశరావు ఆమెను అరుంధతి గానే సంభోదించి ,అలానే బావించేవాడు. ఆ భావనను చెదర గొట్టడానికి కేమాత్రమూ ప్రయత్నించేది కాదు వెంకట లక్ష్మీ. అరుంధతి కిప్పుడంతా అర్ధమయింది. అంతకుముందు అణుమాత్రంగా ఉన్న విషయం ప్రకాశరావు జబ్బుతో రూడి అయిపొయింది. దాని యదార్ధ స్వరూపం తనకు స్పష్టంగా తెలియకపోయినా , వెంకటలక్ష్మీ ప్రకాశరావు ల అనుబంధం సామాన్యమైనది కాదు. ఇందులో ప్రకాశరావు పాత్ర ఏమిటో అసలు తెలియదు.
    ప్రకాశరావు పూర్తిగా తగ్గిపోయింది. అరుంధతి "హమ్మయ్య " అనుకొంది. వెంకటలక్ష్మీ ముఖం వెలిగింది.
    "అరుంధతి గారూ! నా వైద్యం కంటే నిజంగా మీ సంరక్షణే ఈయన జబ్బును త్వరగా నయం చేసింది. మీలో ఇంతటి సేవ దీక్ష దాగి ఉందని నేనెన్నడూ వూహించలేదు. ప్రకాశరావు గారు చాలా అదృష్టవంతులు!"
    అరుంధతిని ప్రశంసించాడు డాక్టర్ శ్రీధర్. అరుంధతి వంచిన తల ఎత్తలేక పోయింది. వెంకటలక్ష్మీ డాక్టర్ కు నిర్వికారంగా కాఫీ అందించింది.
    "డాక్టర్ బాబు గారూ! మాకోసం ఇంత శ్రమ పడ్డారు. ఇవాళ ఒక్క పూటకు నా వంట రుచి చూడండి!"
    వినయంగా అడిగింది వెంకటలక్ష్మీ . అరుంధతి ఈ సూచన కెంతో సంతోషించింది.
    ప్రకాశరావు కూడా బలపరిచాడు.
    తనకు నయం చేసినందుకు శ్రీధర్ కు కృతజ్ఞతలు చెపుతూ "నా ఆరూ నన్ను బ్రతికించుకొంది" అన్నాడు ప్రకాశరావు గర్వంగా అరుంధతి వంక చూస్తూ.
    ఈ ప్రశంసా వాక్యాలు అరుంధతికి శూలంతో పోడుస్తున్నట్లున్నాయి.
    "నాకు కాదు! ఈ పొగడ్తలన్నీ ఆ నిర్భాగ్యురాలు వెంకట లక్ష్మీకి!"' అని అరవాలనిపించింది.
    కానీ ....తన గొంతులోంచి మాటలు పైకి రావటం లేదు.
    సాధారణంగా అతిదులేవరికైనా వెంకట లక్ష్మే వడ్డిస్తుంది. కానీ, శ్రీధర్ కు అరుంధతి స్వయంగా వడ్డించింది. అలా చెయ్యటం లో ఆమె కెంతో సంతృప్తి లభించింది.
    "నేనేనాడూ , ఇంతగా తిన్నట్లు నాకు గుర్తు లేదు బహుశా మీ చేతుల్లో అమృతమున్నట్లుంది. డాక్టరనయి, ఆరోగ్య సూత్రాలు మరిచిపోయి తినేస్తున్నాను." నవ్వుతూ అన్నాడు శ్రీధర్.
    "ఆ అమృతం మా వెంకటలక్ష్మీ చేతుల్లోది. కనీసం ఈ పొగడ్త లైనా ఆమెకు దక్కనీయండి.'
    శ్రీధర్ సిగ్గుపడ్తూ నవ్వాడు.
    "అవునవును! పోనీయండి ఈ పొగడ్తలు ఆవిడకే బదిలీ చేసేయండి కానీ, "కనీసం " ఎందుకూ? పదాలు వ్యర్ధంగా వాడకూడదు."
    "నేను వ్యర్ధంగా వాడలేదు!"
    "అయితే , ఆ మాటకు ప్రయోజనమేమిటి?"
    "ఏం లేదు."
    ఆమె ధోరణికి శ్రీధర్ నవ్వాడు.
    అరుంధతి కూడా హాయిగా నవ్వింది. శ్రీధర్ వెళ్ళబోతుంటే , అరుంధతి "మీ బిల్"  ఇచ్చి వెళ్ళండి" అంది.
    శ్రీధర్ కనుబొమలు చిట్లించి, "మీకు మతి పోయిందా? మనలో మనకివన్నీ ఏమిటీ?" అన్నాడు.
    అరుంధతి ముఖం గంబీరంగా మారిపోయింది.
    "బిల్ ఇచ్చి వెళ్ళండి లేకపోతె , నాకు కష్టం కలుగుతుంది. మన స్నేహానికి ,దానికీ ముడి పెట్టకండి! అప్పుడు స్నేహమే దెబ్బతింటుంది."
    గంబీరంగా ఉన్న అరుంధతి ముఖం చూసి కొంచెం జంకినా, "ఇంత చిల్లర విషయాలకు ప్రాధాన్యమియ్యకండి" అన్నాడు.
    ఇంక నెమ్మదిగా మాట్లాడి ప్రయోజనం లేదనుకొంది అరుంధతి. స్వరంలోకి కాఠిన్యం తెచ్చి పెట్టుకుంది.
    "మీరూ దయా స్వరూపులనీ, అనేక మంది బీదలకు సహాయం చేస్తారనీ నాకు తెలుసు! భగవంతుడి దయ వల్ల మీ దయా ధర్మాల మీద ఆధారపడే పరిస్థితిలో లేము!"
    డాక్టర్ గతుక్కుమన్నాడు.
    వెంటనే 'బిల్' వ్రాసిచ్చి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.
    డాక్టర్ సావధానంగా వ్రాసి ఉంటె తక్కువ వేసి ఉండేవాడేమో? కానీ, అరుంధతి మాటల వల్ల దెబ్బ తినిన మనసుతో యాంత్రికంగా అలవాటు చొప్పున వేసేసాడు ఎనబై యారు రూపాయలు!
    ప్రకాశరావు పత్యం తీసికొన్నాడు బాగా కోలుకున్నాడు.
    "నీ ఋణం ఎలా తీర్చుకోవాలో అర్ధం కావటం లేదు ఆరూ!" అరుంధతి ని దగ్గిరగా తీసికొంటూ అన్నాడు.
    అరుంధతి అతని కళ్ళలోకి చూస్తూ "మీరు తీర్చుకోవలసింది నా ఋణం కాదు. డాక్టర్ గారి ఋణం తొందరగా ఋణ విముక్తు లు కండి" అంది.
    ప్రకాశరావు వెంటనే అరుంధతి ని వదిలేసాడు.    
    "డాక్టర్ 'బిల్" ఇచ్చేరా?"
    "అయన ఇవ్వలేదు. నేనే దెబ్బలాడి తీసికొన్నాను."
    "అయితే ఫరవాలేదు. మనం ఇయ్యక పోయినా అయన ఏమీ అనుకోరు!"
    'అయన అనుకొన్నా, అనుకోకపోయినా మనం ఇచ్చి తీరవలసిందే!"
    "ఏమిటా వితండవాదం? రేపు అయన కేవైనా కేసులు వస్తే నేను ఫీజు తీసికొంటానా? మీ సుందర్రావు బావ నాకేమిచ్చాడూ?"
    అరుంధతి ఫకాలున నవ్వింది.
    "మా సుందర్ర్రావు బావ కాదు. మీ స్నేహితుడు సుందర్రావు.మీ ఫీజు మీరు డబ్బు రూపంలో తీసికోకపోతే , అందుకు నేను బాధ్యురాలినా? డాక్టర్ గారి బిల్ ఇచ్చేయండి. అయన కేసేదైనా మీ దగ్గిర కు వస్తే మీరు కోరినంత ఫీజు అయన దగ్గిర నేనే వసూలు చేసి ఇస్తాను."
    "నేను ఇవ్వను. ఇవ్వనంటే ఇవ్వను" కోపంగా అని ప్రకాశరావు అక్కడి నుంచి లేచిపోయాడు. వెంకటలక్ష్మీ దీనంగా అరుంధతి వంక చూసింది.
    "ఇంకా దొరగారు బలహీనంగా ఉన్నారు. వాదన పెంచుకోకండమ్మా!"
    అరుంధతికి వెంకటలక్ష్మీ మీద మండింది. నాలుక చివరకు వచ్చిన ఏవేవో పరుష వాక్యాలను, అతి ప్రయత్నం మీద వెనక్కు తీసికొంది. అలోచించి, అలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ప్రకాశరావు కోర్టుకు వెళ్ళగానే, రిక్షాలో బజారుకు వెళ్ళి తన చేతి బంగారు గాజులు నమ్మేసి శ్రీధర్ ఇంటికి వెళ్ళింది. శ్రీధర్ లేడు. అతని నౌకరు చాలా నమ్మకమైన వాడు. తనపేరు వ్రాసిన కాగితంలో, ఆ డబ్బు చుట్టేసి, నౌకరు కిచ్చి డాక్టర్ గారి కియ్యమని చెప్పి, ఏదో పెద్ద బరువు దింపుకోన్నట్లు అనుభూతి చెందింది. సంసారాలు ప్రశాంతంగా సాగిపోవటానికి భార్యాభర్తలు ఒకరితో ఒకరు సర్దుకు పోవాలంటారు. సర్దుకు పొవట మంటే ఇదేనా?   

                         *         *            *                        


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS