Previous Page Next Page 
అపశ్రుతులు పేజి 24


    ఒక్కసారి భయంగా అతనివైపు చూసి తలదించుకుంది రాధ.
    కొన్ని క్షణాలిద్ధరిమధ్యా గంభీరంగా దొర్లాయి.
    "చెప్పమ్మా......ఫర్వాలేదు. మీ స్నేహం ఎటువంటిదని? నీకు ఎంత దగ్గరగా వచ్చాడని?" ఆయన గొంతులో సాద్యమైనంత సౌమ్యాన్ని నింపుకుంటూ అడిగారు.
    "మీ అనుమతి తీసుకుని నన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు రామకృష్ణ" వణికే గొంతుతో ధైర్యాన్ని పుంజుకుంటూ నెమ్మదిగా చెప్పింది రాధ.
    పగలబడి నవ్వారు శ్రీనివాసయ్యరు 'శభాష్. పెళ్ళి చేసుకుంటానన్నాడూ. రాజా, అమ్మమ్మ, నాన్నా అమ్మా.... ఇంకా సనాతన సంప్రదాయాల కంటుకుపోయే కుటుంబంలో పుట్టిన రామకృష్ణ నిన్ను పెళ్ళి చేసుకుంటాడా?.....పెళ్ళి చేసుకుంటానని, అమాయకురాలైన ఆడపిల్లను" అతని పెదవులు బిగుసుకున్నాయ్.
    "అబ్బే....లేదు బాబయ్యా ఆయన అలాంటి వారు కాదు...."
    "నీకేం తెల్సమ్మా....ఒక్కో ఆడదాన్ని అనుభవించాలనే తృష్ణలో మగవాడు యెన్ని వేషాలు వేస్తాడో ఎంత గడ్డి కరుస్తాడోనూ.....సరే కనుక్కుంటాను...... నువ్వు జాగ్రత్తగా వుండు. మోజు తీరాక తాళికట్టిన నీ తండ్రే మీ అమ్మని మోసం చేశాడు. మీ ఇద్దరి ప్రేమా, చీరలివ్వడం, పూలు ముడవడంలోనే ఆగివుంటే ఫర్వాలేదు.....అలాటిది కూడా ఇటుపైన జరగడానికి వీలులేదు. మీ కక్కి మీదుండే గౌరవంతో ఆరు సంవత్సరాలై పిల్ల లా గెంతుతూ. బాబయ్యా అని పిలిపించుకుంటూన్న. ఆ మమకారంతో. నువ్వు స్మఘంలో గౌరవమయిన గృహిణిగా జీవించాలని ఆశిస్తున్నాను.......నేను పెంచిన పిల్ల భ్రష్టురాలని..... నలుగురూ నవ్వే పరిస్థితి రానీయకు రాధాకి నా గుండెల్లో మంటలు రేగించకు .... రామకృష్ణతో మరి మాట్లాడకు. రామకృష్ణా.....అతని తల్లిదండ్రులూ, అందరూ సమ్మతిస్తే ఎంతకట్నమైనా ఇచ్చి ఘనంగా పెళ్ళిచేస్తాను.....ఊ మరి వెళ్ళు" .... ఈ సారి అతని గొంతు సన్నగా కంపించింది.

                                     *    *    *

    రాత్రి పదిగంటలకి భోజనానికి వచ్చిన వాసూరావ్ ని తన గదికి పిలిపించుకున్నారు శ్రీనివాసయ్యరు.
    "ఏమిటి నాన్నా మాట్లాడాలన్నారట....మీతో చెప్పాలనుకుంటున్నాను. నన్ను పైదేశం పంపిస్తారుట ..... అంటూ తండ్రి దగ్గరలో కుర్చీ మీద కూర్చున్నాడు వాసూరావ్.....
    "సంతోషించాల కాని..... అతనే .... నీ స్నేహితుడు. రామకృష్ణ.... రాధ కివాళ ఎవో కానుకలిచ్చాడు.....ఏమిటి సంగతి?" వాసూ రావ్ వైపు చూసి వ్యంగ్యంగా నవ్వారు శ్రీనివాసయ్యరు.
    "సంగతి కేముంది? రాధను తను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడు?"
    "ఉహూ..... మరెందుకు చేసేసుకోలేదూ?"
    "నాకేం తెల్సు నాన్నా .... వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. కంగారు పడిపోతున్నాడు వాసూరావ్." తండ్రితో వారి ప్రేమ గురించి ఎలా చెప్పాలో తెలియక.
    'హు... నీకేం తెలియదూ! రాస్కెల్, రామకృష్ణ ను ఈ గుమ్మం ఎక్కిచ్చింది నువ్వు.....వారిద్ధరికీ..."
    "ఊరుకోండి నాన్నా .... అన్నిటికీ నన్నే అంటారు ... తండ్రి మాట కడ్డు వస్తూ అన్నాడు వాసూరావ్.
    "ఊరుకొంటారు....ఊరుకొంటాన్రా? తాను కృష్ణను తీసుకురా రేపు ఉదయం..... రాధ జీవితంతో ఆడుకునేవాడో ..... పెళ్ళి చేసుకునే వాడో.....తెల్చేస్తాను." ఆవేశం, కోపంతో, ఊగి పోతున్నారాయన.
    "పెళ్ళి చేసుకునే వాడే.... తీసుకొస్తాలెండి. అతన్నే అడగండి." అంటూ చరచరా ఇవతలి కొచ్చాడు. వాసూరావ్.

                                      *    *    *

    ఉదయం ఏడుగంటలకే తీసుకొచ్చాడు రామకృష్ణని వాసూరావ్.
    వస్తూనే వినయంగా నమస్కరించాడు రామకృష్ణ శ్రీనివాసయ్యరుకి. కూర్చోమని చేతితో సౌంజ్ఞ చేసి కొన్ని నిమిషాలేమో ఆలోచిస్తూ ఉండిపోయారు శ్రీనివాసయ్యరు.
    వాసూరావ్ వల్ల విషయం విన్నవాడుగనుక. ఆయనేమీ ప్రశ్నించకముందే "మీదగ్గర కోసారి ఓ ముఖ్య విషయం అడగాలని నేనే రాజులను కుంటున్నాను" అంటూ నసిగి శ్రీనివాసయ్యరు వైపు చూశాడు రామకృష్ణ.
    "ఏమిటా ముఖ్య విషయం?" గంభీరంగా ధ్వనించిందతని గొంతు.
    "పెళ్ళి విషయం.....అంటే మీ రాధను..... నా కివ్వడానికి మీ కభ్యంతర మేమైనా ఉంటుందేమో అని?"
    "ఉంటే?" ఖంగుమంది శ్రీనివాసయ్యరు గొంతు.
    "ఉండకూడదనే అనుకుంటాను"
    "ఎందు కుండగూడదూ? మీ ఇద్దరికీ ఇష్టమైతేనేరా!..... నీ తల్లిదండ్రులు కూడా రాధను కోడలిగా చేసుకోవడానికి అంగీకరించాలి. రాధ జీవితం సక్రమంగా నడవాలంటే, ఒక్క నువ్వే పెళ్ళి చేసేసుకుంటా నంటే సరిపోదు. మీ తల్లి తండ్రులు రాధని వారి ఇంటికోడలిగా తీసుకెళ్ళడానికి అంగీకరించాలి. అలా అందరికీ అంగీకారమైనప్పుడు మీరు కోరినవన్నీ ఇచ్చి పెళ్ళి చేస్తాను. రేపు మా వాసుని నీతో పంపిస్తాను. నీకూడా వచ్చి మీ వాళ్ళని పిలుస్తాడు. వారుకూడా రాదని చూడాలి. వారితో నేను కొన్ని రాధవిషయాలు అంటే ఆమె మా యింటికెలా వచ్చిందో చెప్పాలి, వెళ్ళు. మీ తల్లిదండ్రులకు తీసుకురా" అన్నారు శ్రీనివాసయ్యరు శాంత గంభీరస్వరంతో.
    ఇబ్బందిగా కదిలి మళ్ళీ కూర్చుని, క్షణం తర్వాత నసుగుతూ "వాళ్ళు చాలా పాతకాలపు మనుషులు. వంశం, సంప్రదాయం అంటూ జరగనివ్వండీ.... నన్ను నమ్మండి. నేనా అమ్మాయికి అన్యాయం చెయ్యను.....మా ఇద్దరికీ పెళ్ళిచేసి ఆశీర్వదించండి"నెమ్మదిగా ఒక్కొక్క మాటా ప్రయత్న పూర్వకంగా  అన్నాడు రామకృష్ణ.
    "వీలవదు అలా! వెళ్ళి పో.....రాధతో అనవసరంగా పరిచయం పెంచుకోకు" అన్నాడు శ్రీనివాసయ్యరు కోపాన్ని అణచుకుంటూ.
    "అలా అనకండి సార్స్. అని ఇంకా ఏమో చెప్పబోతూన్న రామకృష్ణ.......గెటౌట్..." అన్న శ్రీనివాసయ్యరు గర్జనకు త్రుళ్ళిపడ్డాడు.
    మౌనంగా, అవమానభారంతో తలవంచి వెళ్ళిపోతూన్న రామకృష్ణ వెనుక తానూ వెళ్ళబోతూన్న వాసూరావ్ ని.
    "వాసూ ఇలా రా" అని పిల్చాడు శ్రీనివాసరావయ్యరు.
    నెమ్మదిగా భయంభయంగా చూస్తూ తండ్రిని సమీపించాడు వాసూరావ్.
    "అతన్నిహ.....మనింటికి రానియ్యకు......నువ్వు రాయభారాలు నడపకు..." తీవ్రంగా హెచ్చరించారు.
    "అలాగే నాన్నా. అంటూ వెనుదిరిగిన వాసూరావ్ వీధి గేటుదగ్గర రామకృష్ణను కలుసుకున్నాడు.
    "మీ నాన్నగార్ని అడిగెయ్యమని ప్రోత్సహించావు. చివాట్లు తినిపించడానికా?" తాను కృష్ణ మొహం రోషంతో కంది ఉంది.
    మా నాన్నకూడా చాదస్తం మనిషని ఇప్పుడే గ్రహించాను. కృష్ణా క్షమించు....నా వలన జరిగే సహాయమేమున్నా నీకు తప్పక చేస్తాను."
    "చేస్తావుకదూ!........థాంక్సు.....మరి మీ ఇంటికి ఇదివరకులా రాలేను......సరి....సాయంత్రం నా రూమ్ కి రా మాట్టాడాలి" అంటూ నిష్క్రమించాడు రామకృష్ణ వాసూరావ్ చెయ్యి పట్టి నొక్కి వదుల్తూ.
    వాసూరావ్ సహాయంతో రాధతో రిజిష్టర్ మ్యారేజ్ కి ఏర్పాట్లు చేసుకున్నాడు రామకృష్ణ.
    అతను విదేశాలకు వెళ్ళబోయే రోజే మంచి రోజు కావడాన్న పెళ్ళయి ఇష్టధైవాలకి మొక్కిన క్షణాల్లో ప్లెయినెక్కి పోయాడు రామకృష్ణ.
    
                                                  *    *    *

    రాధతో తాను గడిపిన రోజులు తలచుకు బరువుగా నిట్టూర్చి ఏ రాత్రికో నిద్రపోయాడు రామకృష్ణ.
    "మర్రోజడిగితే. సారీ, ఫ్రెండ్.....ఎక్కడో పారేశాను." అన్నాడు వాసూరావ్. విచారం వ్యక్తం చేస్తూ.
    "పోనీ రాధ ఎప్పట్లో వస్తుంది? మీ ఇంటికి. నువ్వు పారేసిన ఉత్తరంలో వ్రాయలేదా?" ప్రశ్నించాడు రామకృష్ణ.
    మా వదినతో వెళ్ళిందని మాత్రమే వ్రాశాడు. మళ్ళీ ఫలానా రోజు వస్తుందని వ్రాయలేదు" అన్నాడు వాసూరావ్.
    రామకృష్ణలో రాదను చూడాలనే వాంఛ ఉధృతమౌతుంది.
    తర్వాత మూడు నెలలు మా అన్నయ్య ఉత్తరమే వ్రాయడంలేదని దబాయించాడు వాసూరావ్.

                               *    *    *

    పట్నం వేల్లివచ్సిన శ్రీనివాసరావు "అతను అంటే ఏ మిత్రుడింకా ఆరు నేలలు దాకా రాడటమ్మా.....భోగట్టా చేశాను" అన్నాడు రాధను పిలుస్తూ.
    మౌనంగా తల వంచి దీర్ఘంగా నిట్టూర్చింది రాధ.
    రమాకుమార్ బోర్లా పడుకుని కడుపుతో పాకుతున్నాడు నవ్వుతున్నాడు. కేరింతలు కొడ్తున్నాడు. ఆ ఇంటి వ్యక్తులందరి హృదయాలు ఆ పసిబిడ్డపైనే కోటి ఆశలు పెట్టుకున్నాయి.
    పొలంలో కోతలౌతున్నాయి. "నాతో పొలానికి వస్తావుకదమ్మా" అన్నాడు శ్రీనివాసరావు రాధను తట్టి లేపుతూ.
    "జ్వరం వచ్చినట్టుంది బాబయ్యా మీరు వెళ్ళండి. తర్వాత వస్తాను" అంది రాధ. బద్ధకంగా వత్తిగిలి మళ్ళీ పడుకుంటూ.
    ఆత్రుతగా ఆమె చెంపపై చెయ్యివేసి "వద్దు రెస్టు తీసుకో తాతయ్యకి చెప్పు డాక్టరుకి కబురు చెయ్యమని" అని చెప్పి "శాంతా రాధకు జ్వరం వచ్చింది. డాక్టరుకి చూపించు" అని భార్యను లేపి చెప్పాడు శ్రీనివాసరావు.
    ఆ రోజు డాక్టరుకి చూపించి మందువేశారు. కాని క్రమమగా రాధ జ్వరం తీవ్రమైనది. ఒకటి, రెండూ, నాలుగు రోజులు టెంపరేచరు నార్మలుకి రాలేదు. కంగారు పడిపోతున్నాడు శ్రీనివాసరావు.
    పొలం పనులూ, ఇతరమైన అన్ని వ్యాపకాలూ విసర్జించి రాధ మంచం దగ్గర కుర్చీలో అలా మతి లేనివాడిలా కూర్చుండిపోయిన శ్రీనివాసరావుని చూసి విసుక్కుంటున్నారా ఇంట్లో వ్యక్తులు.
    మతి పోయిందేవిట్రా? కోతలు సంగో రయ్యాయ్. కుప్పలు వేయించాలి. ఎక్కడి పనులక్కడే పడుకోబెట్టి దాని మంచం దగ్గర కూర్చుంటున్నావ్?.....ఇదెక్కడి బాంధవ్యంరా బాబూ. మేమంతా లేమూ ఆ అమ్మాయిని చూడ్డాన్కి?" చిరాగ్గా కొడుకువైపు చూస్తూ అన్నారు రంగనాధం.
    "పోతే పోనీండి నాన్నా? నాకేనని చెయ్యడాన్కీ కాళ్ళాడ్డంలేదు" తల రెండు చేతుల్లో పట్టుకున్నాడు శ్రీనివాసరావు.
    "ఎవరన్నా నవ్వగలరు? ఇదేమిట్రా ఇంత ఆపేక్ష? అమ్మా, నాన్నా, భార్యా ఎవ్వరిమీదా లేనిదీ! ఆయువుంటే వుంటుంది. లేకపోతే..."
    "అమ్మా..." అసహనంగా అరిచాడు శ్రీనివాసరావు జానకమ్మను సగంమాటలోనే వారిస్తూ.
    "ఆమెను కసురుకుంటారెందుకు? నలుగురు నవ్వుతారు. మీరా అమంయి మంచాని కంటి పెట్టుకు కూచుంటే. వెళ్ళండి. మందు ఇప్పిస్తున్నారుగా. ఈ నలుగు రోజులకే అరవై రూపాయల బిల్లయింది. కానియ్యండి ఎవ్వరికెంత ఋణమో..."
    "శాంతా?.... ఎందుకు మీరంతా నన్నిలా కొరుక్కు తింటున్నారు?.... డబ్బూ పొలం అన్నీ ఏమైనా అయిపోనీ రాధ మళ్ళీ మామూలు మనిషయ్యేదాకా నేనెటూ కదలను" స్థిరంగా ధ్వనించింది శ్రీనివాసరావు గొంతు.
    జ్వరతీవ్రతలో కొంచెం కళ్ళు తెరచి చివరి మాటలేవో అర్ధం చేసుకున్న రాధ "నేనేమీ అయిపోను. వెళ్ళండి బాబయ్యా" గొణిగి నట్టుంది.
    "నువ్వెవ్వరి మాటలూ పట్టించుకోకమ్మా. విశ్రాంతి తీసుకో" ఆమె నుదుటిపై ఉడుకు లామ్ గుడ్డ తడిపి వేస్తూ అన్నాడు శ్రీనివాసరావు.
    మళ్ళీ మగతగా కళ్ళు మూసుకున్న రాధ, చివాలున లేవబోయింది. "ఎందుకు? ఏమిటి కావాలి?" ఆతృతగా ప్రశ్నించాడు శ్రీనివాసరావు.
    "బాత్ రూమ్ కెళ్ళాలి" అతి నీరసంగా ఉందామె గొంతు.
    "శాంతా-రాధనోసారి బాత్ రూమ్ వైపు తీసుకెళ్ళు" అన్నాడు శ్రీనివాసరావు అవతలి గదిలో ఉన్న శాంతని పిలుస్తూ.
    అలా రాధ మంచం చుట్టూ తిరిగే శ్రీనివాసరావు ప్రవర్తన అసహ్యించుకున్న శాంత-"నాకు తీరికలేదు. లేచి వెళ్ళమనండి. లేకపోతే మీరే తీసుకువెళ్ళండి. కూతురేగా తప్పులేదు" ఆ గదిలోంచే గట్టిగా సమాధానం చెప్పింది.
    "అన్ని చాకిరీలు దానిచేత చేయించుకున్న దానవు బాత్ రూమ్ కోసారి చెయ్యిపట్టుకు తీసుకువెళ్ళలేవూ" అంటూ విసురుగా శాంత గదిలో కొచ్చి ఆమె చెయ్యి పట్టుకు బలంగా ఇవతలికి లాగాడు శ్రీనివాసరావు.
    "ఇదెక్కడి శని దాపరించిందిరా కొంపకి. శాంతమీద చెయ్యి చేసుకుంటావా?" అంటూ గబగబా వచ్చారు రంగనాధం.
    "అర్ధం లేకుండా మాట్లాడి నా మనస్సు నొప్పించకండి నాన్నా. దీని వాంతు లెన్నిసార్లు కడిగింది రాధ. రమ కడుపులో ఉన్నప్పుడు తెల్లవార్లూ దీనికాళ్ళు వళ్ళూ పట్టేదే ఆ విశ్వాస మన్నావద్దా!
    "ఎవత్తెనో అంతల పొంతలదాన్ని నెత్తినేక్కిన్చుకుని దానికి చాకిరీ చెయ్యమంటే ఎవడు చేస్తాడ్రా?....." కోడలి మీద కొడుకు చెయ్యి చేసుకుంటున్నాడనే ఉక్రోషంతో అంది జానకమ్మ.
    "అంతల పొంతల వాణ్ణి నేనమ్మా! ఈ కొంపకి శనిని నేనేనమ్మా.....నేను.....రాధననకండి "టప టపా గోడకేసి తల కొట్టుకున్నాడు శ్రీనివాసరావు.
    మతి చలించిన వాణ్ణి చూసినట్టు చూశారు శ్రీనివాసరావు ని రంగనాధం, జానకమ్మా, శాంతా
    జానకమ్మ మంచం దగ్గరకెళ్ళి పిల్చేసరికి మళ్ళీ మగత నిద్రలోకి జారిపోయింది రాధ.
    మర్నాడు రాధను పరీక్ష చేసిన డాక్టరు రాధకు టైఫాయిడు జ్వరమని చెప్పాడు. ఎంత ఫీజైనా సరే ఇస్తాననీ. రాధని బ్రతికించమనీ డాక్టర్ని అర్ధించాడు శ్రీనివాసరావు. పొలం, ఇతర వ్యవహారాలూ అన్నీ రంగనాధం పై పడ్డాయి. శ్రీనివాసరావు ఇల్లు కదలడమే లేదు.
    రామకృష్ణ కొద్దిరోజుల్లో వస్తున్నాడనీ, అతను వచ్చేలోపలే ఏదో సమ్మంధం స్థిరం చేద్దామనుకుంటున్నామనీ మీతో మాట్లాడ్డాన్కి మీ అల్లుడీ వారంలో వస్తున్నారనీ రంగనాధానికి ఉత్తరం వ్రాసింది కామేశ్వరి.
    అల్లుడి రాకకోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు రంగనాధం. జానకమ్మా.....శాంత ఏ పనీ పాటా పట్టించుకోని శ్రీనివాసరావుని చూస్తూ చిరాకుపడిపోతూంది.
    రాధ సపర్యలకోసం ఒక స్త్రీని ఏర్పాటు చేశాడు శ్రీనివాసరావు. రాధ జ్వరం తీవ్రరూపం దాల్చింది. పూర్తిగా తెలివికోల్పోయిన రాధ. ఏవేవో అస్పష్టంగా గొణుగుతూంది. నవ్వుతూంది. ఎదుస్తూంది. బెంబేలయిపోయి అన్నం నీళ్ళూ తీసుకోవడం మానేశాడు శ్రీనివాసరావు.
    రాధకోసం అలా దిగజారిపోతూన్న శ్రీనివాసరావు ఆంతర్యమేమిటో ఎవ్వరికీ అర్ధం కావడంలేదు.

                                                                *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS