Previous Page Next Page 
ఆదివిష్ణు కథలు పేజి 23


    నిజమేనేమో. నేనింత నిశితంగా ఆలోచించలేదు మరి. మావూరు వదిలొచ్చాననే దిగులు ఒక్కటే మొదట్లో ఉండేది. ఇప్పుడదీ దూరం అవుతోంది. అందుచేతనే పాత శ్రీనివాసరావు నాకు ఇవాళ కొత్తగా కనిపించాడు.
    వర్షం బాగా తగ్గిపోడం చేతనూ, శ్రీనివాసరావు బలవంతం చేతనూ నడక ప్ర్రారంభించాను. దార్లో శ్రీనివాసరావు గుండెల్లో దాగిన కథ కదిలింది.
    బి.ఏ. పాసయిన శ్రీనివాసరావు ఏడాదిపాటు గోళ్ళు గిల్లుకోడం, వాళ్ళ మేనమామకి బాధ కలిగింది. ఉత్తరం రాసి శ్రీనివాసరావుని హైద్రాబాద్ తెచ్చుకున్నాడు. ఆయన పనిచేస్తున్న (ఎంతోకాలంగా) ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వేయించాడు. ఆ కంపెనీ మంచి స్థితిలో ఉన్నది. జీతం పెద్దదే కాకుండా ఏడాదికి రెండు బోనసులట.
    ఇంతకంటే ఎక్కువగా ఏం చేయగలడు?
    శ్రీనివాసరావు యింకా అన్నాడు.
    "కానీ మాస్టారు! మావయ్య వెనక మావయ్యని మింగేంత స్వార్ధముంది. ఆ స్వార్ధానికి నేనొక్కడ్నే కాదు, మా అమ్మా నాన్నా అందరూ దెబ్బ తినేస్తున్నారు. మావయ్యకో కూతురుంది. దానికి నేను మొగుడ్నిట. దైవ సాక్షిగా నేనే ఆడపిల్లనీ ప్రేమించలేదుగాని ఆడపిల్లంటే యిదిగో యిలా ఉండాలనే నా అభిప్రాయానికి పూర్తిగా వ్యతిరేకం ఆ అమ్మాయి. అదే నాకు నచ్చనిది; రండి. వో మాటు మా మావయ్య వాళ్ళింటికొచ్చి అందర్నీ చూడండి. నానోటితో చెప్పితే మీరు నమ్మకపోవచ్చు."
    వాళ్ళింటికీ కావాలని చెప్పి వెళ్ళాను. ఇంటిని చూస్తూ శ్రీనివాసరావు చెప్పింది అబద్దమేమో అనిపించింది. చాలా అందంగా వుంది ఇల్లు. వాళ్ళ మావయ్యని పరిచయం చేసి శ్రీనివాసరావు ఇంట్లోకి వెళ్ళేడు.
    ఆయన పేరు చెంగల్రావు. ఆయన గురించి రెండు ముక్కలు చెప్తాను. చెంగల్రావుగారికి నాకు నచ్చే తెలుగు రాదు. ఆయన మాట్లాడుతున్నది మాత్రం తెలుగే. కాదనను. కానీ ఆ తెలుగు వో పట్టాన అర్ధం కాదు. చెంగాల్రావు వాళ్ళ అల్లుడి ఆగడం గురించి చెప్పదలచుకున్నది సూక్ష్మముగా యిది.
    "ఈ వేళ మధ్యాన్నం మా అల్లుడు వాళ్ళాఫీసులో తగువుపడ్డాడు. అతడ్నీ, ఆఫీసర్నీ ఇద్దర్నీ ఒప్పించి రాజీ కుదిర్చేందుకు నా తలప్రాణం తోకకొచ్చింది."
    ఈ రెండు ముక్కల్నీ అయిదు నిమిషాలు అటుదిటు చేసి ఆయన ఖంగారుపడి నన్ను ఖంగారుపెట్టాడు. ఆ కాసిని మాటల్లోనూ ఎక్కువభాగం 'యాదు' ! పర్ షాన్ 'కోషిష్' 'జరా' ల్లాంటి పదాలు కోకొల్లలై తెలుగు మాటల్ని మింగేశాయి. ఇది నాకు బొత్తిగా నచ్చలేదు; వెంటనే వో అభిప్రాయానికి వచ్చేను. ఎక్కడో తెలుగు భాషాభిమానే కానక్కర్లేదు. మా వేపునుంచి వచ్చిన మనిషి ఈ యింటిలో వుండాల్సి వస్తే పిచ్చెక్కుతుందని గట్టిగా చెప్పాను.
    అంతమాత్రం చేత చెంగల్రావుగార్ని తప్పు పట్టలేం చిరకాలం నుంచీ ఈ ప్రాంతాల్లో ఉంటున్నారు గనుక ఆయనకీ వరస సరసరాన జీర్ణించుకుపోయి ఉంటుంది.
    చెంగల్రావుగారు మాట్లాడుతూండగా పక్కగదిలో శ్రీనివాసరావుని వో ఆడకూతురు గట్టిగా గదమాయిస్తుంది. గొంతు విషయం యెలా వున్నా ఓ ఆడపిల్ల సైతం చెంగల్రావుగారి ధోరణిలోనే మాట్లాడటమనేది నాక్కష్టమనిపించింది. నాకు పూర్తిగా వినిపించిన మాట యిది :
    "దొరతో కోట్లాడినవంట. గట్టకుదర్దు. మంచిగుండు"
    శ్రీనివాసరావు ఆ పిల్లనోరెల్లా మూయించాడో తెలీదు గాని కాసేపటికి యిద్దరూ బయటకొచ్చారు. ఆ అమ్మాయిని పరిచయం చేశాడు శ్రీనివాసరావు. అతని క్కాబోయే భార్య పేరు యాదగిరమ్మ. మొహాన స్ఫోటకపు మచ్చలు. చామనచాయ. తండ్రిని మించిన స్తూలకాయం.
    ఆ యింటినుంచి వచ్చేస్తూండగా అనుకున్నాను - ఈ భూమ్మీద పుట్టిన ప్రతీవాడు అదృష్టవంతుడు కాలేడు.
    కొన్ని తమాషాగా జరుగుతాయి అవసరమనుకున్నప్పుడు నాకు మావూరి  వేపు బదిలీ కాలేదు. ఈ నగరం తాలూకు నాగరికతతో రాజీపడి కొంచెం సరదాగా తిరుగుతున్న సమయంలో అనుకోకుండా మావూరివేపే బదిలీ వచ్చింది.
    రేపుదయం వెడతాననగా నారాయణగూడ తాజ్ మహల్ హోటల్లో రాముడు నాకు పార్టీయిస్తూన్న సందర్భంలో అనుకోకుండా శ్రీనివాసరావు హోటలు గేటు దగ్గర కలిశాడు. ఆహ్వానితుడు కాకపోయినా రాముడికి ఆతిథయ్యాడు. ఎనిమిదిగంటలకి పార్టీ ముగిసింది. శ్రీనివాసరావు నా చేతిని నొక్కుతూ అన్నాడు.
    "అదృష్టవంతులు గంగిగోవులాటి మనూరికి దగ్గరవుతున్నారు. ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందనుకున్నారు."
    కానీ, అతని కళ్ళల్లో 'జెలసీ' లాంటిది చూచాను.
    ఆ మర్నాడు హడావిడిగా బస్టాండుకు వెళ్ళాను. సూర్యుడింకా రాలేదు. మసక మసకగా ఉందింకా. బస్సు కదిలే వేళ అయింది. సామాను పైన వేయించి ఆత్రంగా బస్సెక్కాను. బస్సు కదిలింది. ముందుగా వో సీటు ఖాళీగా ఉంది. గబగబా అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. నాపక్కనున్న మనిషి కదిలి నావేపు చూచాడు.
    అతను శ్రీనివాసరావు. ఉలిక్కిపడి అడిగాను.
    "ఇదేమిటి మీరూ వస్తున్నారా?"
    అతను సిగరెట్టు వెలిగిస్తూ కాళ్ళూపుతూ అన్నాడు.
    "నా స్వర్గాన్ని వదిలి బ్రతకలేను మాస్టారు! ట్యూషన్లు చెప్పుకునైనా మనూర్లో శాంతిగా బ్రతకగలను."
    
                                         *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS