ఈ ప్రసక్తి రావడంతోనే శ్రీనివాసరావు ఉలిక్కిపడ్డాడు. కాని, దాన్ని కప్పి పెట్టేడు .
"అప్పుడు మరేమనుకున్నారు సార్?"
అతనేం చెప్పలేదు.
"చెప్పండి. మీరేమనుకున్నారో నాకు కావాలి."
"నిజం చెప్పమంటారా?"
"నాకు కావలసింది నిజమే."
"అయితే వినండి. ఒక ఆడపిల్ల మరో పరాయి మగవాడితో ఒకే రిక్షాలో కనిపించడంలో ఏదో ఒకటి అనుకోవడం రూలే. అయితే దాన్ని నేను అతిక్రమించేను. ఏదో అనుకోవాలని ఏమీ అనుకోలేక యింటికి వచ్చేసేను. మళ్ళా రెండో తడవ మిమ్మల్ని చూచి వున్నట్లయితే ఏమైనా అనుకునేవాడినేమో మరి!"
"మేమూ అదే అనుకున్నాం. మీకు కనిపించేం గనకే అల్లరవలేదు మేము. రేపు పదిహేడో తేదిని ఆంజనేయులు గారు నన్ను పెళ్ళి చేసుకుంటున్నారు."
"కంగ్రాట్స్"
"ఆయనకి నా గురించి అంతా తెలుసు. నా ఫామిలి తెలుసు. నా సంపాదన తెలుసు. నా వుద్దేశం తెలుసు. నా ఆశ తెలుసు. ఇన్నీ తెలుసుండి. నాకు చేయూతనిచ్చెందుకు ఆయనే ముందుకి వచ్చేరు, మా పెళ్ళికి వాళ్ళన్నగారిని ఒప్పించేరు. చాలా నిరాడంబరంగా ఈ శాంతాదేవి పెళ్ళి జరగబోతుంది. ఈ మగాడపిల్ల మరో మగదిక్కుతో ధైర్యాన్ని పుంజుకుని, చెల్లెళ్ళూ తమ్ముళ్ళ బంగారు కలల్ని నిజం చేయబోతుంది. ' అన్నది ఆవేశంగా.
(అంజనేయులూ! నువ్వే మగాడివి! "దేవుడు" నాటకంలో అంజనీలు చేయలేని ఒక మహత్తర కార్యాన్ని నువ్విక్కడ చేస్తున్నావు. నీ లోపలి మనిషి గట్టివాడు. నీ లొపలి ఆలోచనలు గంభీరమైనవి. బ్రదర్! నీ పాటి సాహసం నాకు లేదు. నీపాటి చరిత్ర నాకు వుండదు. నా పెళ్ళి అమ్మ చేసింది. కాని నేను చేసుకోలేదు. నా పెళ్ళాం ఏ కోరికలు లేని మామూలు ఆడపిల్ల. అలాటి ఆడపిల్ల నేవరైనా నిక్షేపంగా పెళ్ళాడేస్తారు . అందుచేతనే, అమ్మ ఆ పిల్లనే నాకు చేసింది. అందుచేతనే నేను 'బవరేజ్' గాడినైపోయేను . కాని బాబూ! నువు నాకు అతీతుడువి.)
అక్కడికి ఒక కుర్రాడు ఒక ప్లేటులో ఫలహారం పట్టుకు వచ్చేడు.
"వీడు తమ్ముళ్ళలో పెద్దవాడు. ఫిప్తు ఫారం చదువుతున్నాడు. బ్రిలియంట్ లెండి. ఇంజనీరైపోగలడు" అన్నదామె.
ప్లేటుని శ్రీనివాసరావుకి అందించి "నమస్కారం" అన్నాడు వినయంగా ఆ కుర్రాడు.
"ఇంజనీరు వద్దు శాంతగారూ! డిమెండు తగ్గింది."
"పోనీ డాక్టరు!" అన్నదామె."
నిజానికి యింజనీరు , డాక్టరు - వీళ్ళలో ఎవరు గొప్పా అని శ్రీనివాసరావు చాలాసేపు యోచిస్తూ టిఫిన్ పుచ్చుకున్నాడు.
కాఫీ ముగిసిన తరవాత అతను లేచి నుంచుని అన్నాడు.
"వెళ్ళి వస్తాను శాంతగారూ! మీ పుట్టింరోజు కానుకగా నేనేమీ పట్టుకురాలేదు. క్షమించండి. మీ సదుద్దేశాన్ని జయప్రదం చేసేందుకు దేవుడన్ని విధాల మీకు మేలు చేస్తాడని ఆశిస్తాను . సెలవు."
శాంతాదేవి చాలా నిబ్బరంగా నవ్వగలిగిందప్పుడు."
సాయంత్రం ఆరింటికే యింటికి వచ్చి కూచున్నాడు శ్రీనివాసరావు.
7
రెండు రోజుల క్రితం సీతతో మాటామాటా వచ్చి మాటాడటం తగ్గించుకున్నాడు శ్రీనివాసరావు. తల్లికేమో గత వారం రోజుల నించీ నలతగా వుంటుందిట. పిల్లలు అల్లరి చేయడం ఎక్కువవడం వల్ల. ఆరోజు ఆరింటికి గదిలో ఒంటరిగా కూర్చుండిపోయేడు.
ఇందిరమ్మలో ఏదో మార్పు వచ్చే వుంటుంది. సినిమా ప్రసక్తి వచ్చిన రెండో నాడు ట్యుషన్ చెప్పేందుకు వెళ్ళినప్పుడు ఇందిర యింట్లో లేదని, ఎవరో ఫ్రెండింటికీ వెళ్లిందని చెప్పేరు. మూడోనాడు ఇందిరకి ఒంట్లో బాగోలేదని ఆఫీసరే చెప్పడం మూలాన అతను ఆనాడూ వెళ్ళలేదు. నాలుగో నాడు ఇందిర ఎవరో బంధువులింటికి వెళ్లిందని ఆయనెంతో తాపీగా చెప్పినప్పుడు మాత్రం శ్రీనివాసరావు ఆశ్చర్యపోయాడు.
పరీక్షలేమో కొంపముంచుకు వచ్చినట్టు వారాల్లో వుండగా , ఈ తండ్రికి ఇందిరను ఊళ్లు పంపేందుకు మనసెలా ఒప్పిందో అతనికో పట్టాన అర్ధమైంది కాదు. ఇందిరేగాకుండా అదే మరో స్టూడెంటై వుంటే , ఆ స్టూడెంటు, ఆ తల్లినీ దండ్రుల్నీ శ్రీనివాసరావు గదమాయించి వుండేవాడు.
శాంతాదేవికి, అంజనేయులికి పెళ్ళయిన రోజు ఆఫీసరు ఆ పెళ్ళికి రాలేదు. ఇందిరకి ఒంట్లో బాగోలేదని వైరు రావడం మూలంగా అయన ఊరు వెళ్ళినట్టు తెలిసింది. శాంతాదేవి పెళ్ళికి ఆఫీసరు రానందుకు ఆఫీసు బృందం బాధపడితే , ఇందిరకి సుస్తీ చేసినందుకు శ్రీనివాసరావు ఒక్కడే బాధపడ్డాడు.
ఆ రెండో రోజున ఆఫీసరు వచ్చినప్పుడు శ్రీనివాసరావు ఇందిర స్వస్థతను గురించి అడగ్గా, అయన చాలా గమ్మత్తుగా ,మాటాడేరు.
"నౌ షీ ఈజ్ అల్ రైట్. కాని మిస్ట్రర్రావ్ , అమ్మాయి పరీక్షలకు వెళ్ళదు. డాక్టరు విశ్రాంతి అవసరమన్నాడు."
ఆ మాట విని శ్రీనివాసరావు నిరుత్సాహపడ్డాడు.
(ఏమిటో , ఈ చేతులు ఎవరికీ మంచి చేయలేకపోతున్నాయి. సార్! పాపం, ఇందిర పరీక్ష అన్యాయమై పోయింది. నేనేమిటో అనుకున్నాను. నా శక్తి వంచన లేకుండా కృషి చేసి ఇందిర పాసయ్యే అవకాశమిద్దామనుకున్నాను. నా ఆశ నమ్మాయిపోయింది. పాడు జాతకం నాది. సరిగ్గా పరీక్ష రోజుల్లోనే ఇందిరకి సుస్తీ చేయాలా , సార్?)
"ఇందిర యిప్పుడెక్కడున్నారు, సార్?"
"వెంటబెట్టుకు వచ్చేను. ఇంట్లోనే మంచం మీద వుంది."
అతనా విషయాన్ని అంతటితో వదిలి పెట్టేడు.
ఇంతకాలం ఇందిరకి ట్యూషన్ చెప్పడంతో సాయంత్రాలు కులాసాగా వుండేవి. ఇప్పుడా అదృష్టం చేజేతులా పాడు చేసుకున్నట్టు అతను భావించేడు.
సీత కాఫీ పట్టుకు వచ్చి అతనికి దూరంగా నిలబడి వుంది. అతను చేయి చాచేడు. ఆ చేతికి కాఫీ యిస్తూ సీత అడిగింది.
"ఇందిరకి ట్యూషన్ చెప్పడం లేదా?"
"లేదు"
"ఎంచేత?"
"నా ఖర్మ.....నా జాతకం.....ఆ పిల్లకి జబ్బు చేసిందట."
"ఆ పిల్లకి జబ్బు చేస్తే , మీరు మీ ఖర్మనీ, మీ జాతకాన్నీ తిట్టుకోవడం దేనికి?"
"ఏమిటో సీతా! నన్నంటి పెట్టుకున్న వాళ్ళేవరికీ సుఖాలు లేవు బొత్తిగా."
"మీతో ఏం మాట్లాడినా చిక్కే"
"గమ్మత్తు గదా!"
"ఏం గమ్మత్తో . మాట వరసకి పలకరించినా తిన్నగా మాటాడరాయే."
"లక్షణం , మరి."
"విసుగూ, కోపం -"
"అవునవునే సీతా! నేనుత్త దుర్వాసుడినే! నాకు నవ్వడం గాని మిమ్మల్ని నవ్వించడం గానీ చాతకావు. సరదాగా మాట్లాడి కొన్ని సంవత్సరాలయిపోయింది. నావల్ల, నా పిచ్చితనంతో మీరంతా బాధపడిపోతున్నారు. ఇదిగో , నేనోటి చెబుతాను, వినరాదూ. నావల్ల మీ అందరికీ యిబ్బంది తగ్గేరోజు దగ్గిరపడిందోయ్ పిచ్చి మొహమా! నాకో మంచి యోగం పట్టబోతుంది. శనిగాడు విరగడయ్యే రోజు దగ్గిర పడింది. ఆనాడు మీరంతా సుఖంగా దివ్యంగా బతగ్గలరు . ఆ ....."
