Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 22

 
    సిద్దార్ధకు కాస్త క్లూ దొరికినందుకే ఎంతో ఆనందంగా వుంది. కడుపుకోత అన్నమాట అతన్ని పుండులా సలుపుతోంది. శ్రీనివాస్ మరణిస్తే ఆ తల్లికి మరే ఆధారం లేదు. కాంపౌండులో అడుగుపెట్టి, ఆశ్చర్యంగా మేడమీదికి చూచాడు. కిటికీ దగ్గర శ్వేత నిలబడి వున్నది.

    "కనిపించిన ఆడదల్లా మీ కబంధ హస్తాలలో బందీ అవుతుందని అనుకోవటం పొరపాటు -" శ్వేత గొంతు అది.

    "నువ్వు గట్టిగా అరిస్తే యెవరో సహాయానికి వస్తారని నీ ఆశ. కాని ఈ కాంపౌండు దాటి వచ్చేది నా కుటుంబ సభ్యులే" అన్నాడు పురుషోత్తమరావు.

    "మీ కుటుంబ సభ్యులు నాకు రక్షణ ఇశ్తారనుకునేటంత మూర్ఖు రాలిని కాను."

    సిద్దార్ధ , బయటి మెట్లమీదుగా, తండ్రి గదిలోకి వెళ్ళాడు.

    పురుషోత్తమరావు ఒక్క నిముషం తడబడినా, మరు నిముషమే చిరుగా నవ్వాడు.

    "రాసిద్దూ! ఈమె శ్వేత అని అడల్ట్స్ కి పాఠాలు చెప్పడానికి వచ్చింది మన ఊరు. వీడు మా అబ్బాయి" అన్నాడు పరిచయం చేస్తూ.

    "నమస్తే -" అన్నదామె. ఆమె ముఖంలో ఏదో నిరాశ కనిపించింది. అదేమిటో ఊహించలేకపోయాడు.

    "కూర్చోండి" అన్నాడు.

    శ్వేత కూర్చున్నది. పురుషోత్తమరావు కొడుక్కే వినపడేటంత మెల్లగా, గుసగుసగా చెప్పాడు.

    "కాస్త మెంటల్ నాన్నా --"
 
    సిద్దార్ధ అప్రయత్నంగా నవ్వేసాడు.

    "ఇక నాకు సెలవు ఇప్పిస్తారా!" శ్వేత అడిగింది.

    "పాఠాలు మరోసారి వింటాము ---" పురుషోత్తమరావు, వెంటకారం, హాస్యం కలిపి అన్నాడు.

    సిద్దార్ధ లేవబోయాడు కాని, ఎందుకో ఆగిపోయాడు. అతనికి చాలా విచారంగా వుంది. స్త్రీకి ఇంకా ఒంటరిగా తిరిగే పరిస్థితి లేదు తన దేశంలో.

    స్వాతంత్రం వచ్చి ముప్పై అయిదు ఏళ్ళు దాటినా స్త్రీకి స్వతంత్రం లేదు.

    స్త్రీ పరిపాలించే రాజ్యం!

    స్త్రీని దేవతగా పూజించే దేశం ఇది.

    అతను మాట్లాడక పోయేసరికి పురుషోత్తమరావు బుఝం తట్టాడు.

    "ఏమిట్రా అంత మూడీగా వున్నావ్?"

    "ఏం లేదు నాన్నా!"

    "ముందు వచ్చినప్పుడంతా ఇలాగే ఉన్నానా! ఆ ఉత్సాహం ఆ హుషారు లేనేలేవు"

    "అది కాదు నాన్నా! అన్నయ్య గురించి అనుమానంగా ఉంది. అతను చేసే తప్పుడు పనులన్నీ జంగయ్యను గట్టిగా పట్టుకుంటే విషయాలు బయటికి వస్తాయి.

    "జంగయ్యతో మాట్లాడావా!"

    "అవును నాన్నా." అన్నాడు విషయాలు క్లుప్తంగా చెబుతూ.

    "అలాగా! ఆ జంగయ్య తాగుబోతు. యెవరు ఓ సీసా కొట్టిస్తే వారి మాట మాట్లాడుతాడు." అన్నాడు.

    "అఇతే పని మరీ తేలిక, అతను త్రాగితే నిజం చెబితే త్రాగించవచ్చు." అన్నాడు.

    "సిద్దూ! ఈ పనికిమాలిన విషయంలో తల దూర్చకు. నీ కెందుకు? రిజల్ట్స్ రాగానే హాయిగా ఏ ఫారిన్ కో వెళ్ళిపోతావు. రేపే కాశ్మీరుకో, ఊటీకో వెళ్ళు" అన్నాడు.

    "అదికాదు నాన్నా! పార్వతమ్మ దుఃఖం చూస్తే నువ్వూ కరిగి పోతావు. ఆమె అమ్మకు జబ్బు చేస్తే నాకు పాలు ఇచ్చింది. ఆ అభిమానం అనుకుంటాను. ఆమెను చూస్తే నా కడుపు తరుక్కుపోతుంది" అన్నాడు.
 
    "ఆమెభర్త అప్పుడు మన పాలేరు. మన పొలం చేశాడు. అందుకు పాలుఇచ్చింది. దానికని నువ్వు ఏడ్వాలా!" అన్నాడు తీక్షణంగా.

    "అదికాదు నాన్నా........"

    "ఏది కాదు. వినే వాళ్ళుంటే చెప్పేవారెన్నయినా చెబుతారు." అన్నారు. పార్వతమ్మ తన కొడుకు విషయం చెప్పిందిగాని, తనకు పాలిచ్చిన సంగతి ఏది చెప్పలేదు.

    క్రిందికి వచ్చాడు సిద్దార్ధ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS