ఉదయం పదిగంటలు దాటింది. ఆఫీసులో స్టాఫంతా ఎవరి సీట్లలో వాళ్లు కూర్చుని పని చూసుకుంటున్నారు.
పోస్టు మాన్ వచ్చి వుత్తరాల కట్ట యాద్ గిరి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఒక్కసారి ఆ హాల్లో వున్న అందరూ చేస్తున్న పని మానేసి తలలు తిప్పి యాద్ గిరి వంక చూశారు. ప్రతిరోజూ ఆ వేల్టికి పోస్టు రావటం స్టాఫంతా అలా ఆసక్తిగా ఆశగా ఆ ఉత్తరాల వంక చూడటం అది మామూలే.
యాద్ గిరి వుత్తరాల మీద ఎద్రసులు చూసి వో కవరు మురళీ టేబిలు మీద పెట్టి మిగిలినవి తీసుకుని మేనేజరు గదిలోకి వెళ్ళిపోయాడు.
'అయ్యో ఇవాళ మన ఎవ్వరికీ లేనే లేవా? ఈ ఫ్యూన్ ముండా వాడు సరిగా చూశాడో లేదో' అంటూ అంగలార్చాడు కామేశ్వరర్రావు. అతనీ మధ్య సెలవు పెట్టి వెళ్లి ఓ పెళ్లి కూతుర్ని చూసి వచ్చాడు. చూసీ చూడగానే ఆ అమ్మాయి అతనికి నచ్చింది. ఆ సంగతే తండ్రికి చెప్పి ఇంక ముహూర్తం పెట్టించేయమని చెప్పి వచ్చేశాడు. తండ్రి దగ్గర నుంచి కాని కాబోయే మామగారి దగ్గర నుంచి కాని వుత్తరం వస్తుందని పదిహేను రోజుల నుంచి ఎదురు చూస్తూనే వున్నాడు. పాపం, రోజూ నిరాశే ఎదురవుతోంది. ఆ అమ్మాయికి తను నచ్చలేదేమో అన్న వూహ మాత్రం అతనికి రాలేదు. అందుకే రోజూ ఆ వుత్తరం కోసం చూస్తున్నాడు--
'ఎవరికి రాకపోవటమేం మురళీధరరావు గారికి వచ్చిందో కవరు వుత్తరం.' అన్నాడు జనార్దనం కామేశ్వరర్రావు ని ఇంకా ఉడికించాలని.
'ఆ తెలుసు' అన్నాడు కామేశ్వరర్రావు . ఆ వుత్తరం అసలు తనదే కాకూడదా. పొరబాటున ఆ బంట్రోతు మురళీ చేతికి ఇచ్చి వుండకూడదా అని లోలోపల కోరుకుంటూ.
మురళీ ఆ కవరుని వోసారి ఇటు తిప్పి అటుతిప్పి చూశాడు. ఎడ్రసు వ్రాసిన వారి దస్తూరి ఎవరిదై వుంటుందో అతనికి చటుక్కున గుర్తు రావటం లేదు. వ్రాసిన వారి పేరూ ఎడ్రసు వుంటుందేమో నని చూశాడు-- లేదు ఉత్తరం మాత్రం చాలా బరువుగా వుంది. అదనంగా స్టాంపులు అతికించారు. ఎక్కడ్నించి అయి వుంటుంది?' అనుకుంటూ గబగబా కవరు చించి కాగితాలు పైకి లాగాడు. ఆ మాత్రంగా పేజీలు తిప్పేసి చివర సంతకం చూశాడు. ఆ పేరు చూస్తూనే విస్తుపోయాడు.
అతని చెల్లెలు వైదేహి వ్రాసిన ఉత్తరం అది. ఇంత పెద్ద వుత్తరం లో చెల్లాయి ఏం వ్రాసి వుంటుంది? తను పెళ్లి చేసుకోగానే వ్రాసిన వుత్తరానికి సమాధానంగా 'ఇంక నీకూ మాకు ఎలాంటి సంబంధమూ లేదు.' అంటూ తండ్రి వ్రాసిన కార్డు ఒకటి వచ్చింది. ఆ తరువాత జీతం అందుకోగానే అదివరకు లాగే ఇంటికి కొంత డబ్బు పంపించాడు. 'ఇంక నుంచీ నీ డబ్బు మాకు అవసరం లేదు. నువ్వు పంపినా మేము తీసుకోము' అన్న జవాబుతో అది తిరిగి వచ్చింది. ఆ తరువాత ఈ నాలుగు నెలల్లో నూ వాళ్ళ సంగతులేమీ తెలియనే లేదు. ఇప్పుడు ఇందులో ఏం వ్రాసి వుంటుంది?
అతని మనస్సు కీదుని శంకిస్తూ భయంతో దడదడ లాడింది -- మంచిని ఆశిస్తూ సంబరపడి ఆ ఉద్వేగం తో గబగబ చదవటానికి వుపక్రమించాడు . రెండు వాక్యాలయినా చదవక ముందే
'సాబ్ బులా రహేహైం.' అంటూ వచ్చాడు రహీం.
ఒక్కసారి వాడిని నమలకుండా మింగేద్దామా అన్నంత కోపం వచ్చినా, ఇంక చేయగలిగింది ఏమీ లేదన్నట్టు, విసుగ్గా కాగితాలు డ్రాయరు లో పదేసి లేచి వెళ్లాడు.
మేనేజరు అడిగినవాటి కన్నింటి కి ఓపిగ్గా సమాధానాలు చెప్పాడు. అతను తృప్తిగా తల వూగిస్తూ అంతా విని, ఇంక నువ్వు వెళ్ళవచ్చును అన్నట్లు చెప్పగానే ఇవతలకి వచ్చి మళ్లీ ఆత్రంగా వుత్తరం తీశాడు. అది సగం అయినా కాలేదు.
'అయ్యగారు పిలుస్తున్నారు' అంటూ ఈసారి యాద్ గిరి వచ్చాడు.
'నా ప్రాణానికి ఒకడు చాలనట్లు ఇద్దరు బంట్రోతులు తయారయారు. అన్నట్లు వాడి వంక చూసి మళ్లీ వుత్తరం లోపల పెట్టి లేచి వెళ్లాడు.
ఈసారి సప్లయి లూ స్టాక్ పొజిషనూ అంతా డిస్కసు చేస్తూ ఓ గంట సేపు కూర్చో పెట్టాడు మేనేజరు-- విధి లేక కూర్చున్నట్లు కూర్చుని అంతా విని తోచిన సమాధానాలు చెప్పి ఇవతలకి వచ్చాడు.
ఆ తరువాత ఎలాగో గబగబ వుత్తరం చదవటం ముగించాను అనిపించాడు. కాని అతనికేమీ తృప్తిగా లేదు. సావకాశంగా మరోసారి చదువు కోవాలని పించింది-- పైగా ఆ వుత్తరం చదివిన దగ్గర నుంచీ మనస్సుకి కుదురు లేకుండా పోయి ఏపనీ చెయ్య బుద్ది కావటం లేదు. అయినా మరీ అర్జెంటు అనిపించిన పని మాత్రం ఎలాగో పూర్తీ చేసి, 'ఇంట్లో కొద్దిగా పని వుంది.' అని మేనేజరు కి చెప్పి ఆఫీసు లోంచి ఇవతల పడ్డాడు.
తిన్నగా యింటి కి వెళ్లి బట్టలయినా మార్చుకోకుండా జేబులోంచి కాగితాలు తీసి చదవటం మొదలు పెట్టాడు.
అన్నయ్యా,
ఈ పాటికి నువ్వు అమ్మని నన్నగారినీ మమ్మల్నందర్నీ మరిచి పోయి వుంటావు -- మేమంతా కూడా నిన్ను పూర్తిగా మరిచిపోవాలనేదే నాన్నగారి అజ్ఞా -- మాకు అంటే చెప్పేశారు కాని తను మాత్రం నిన్ను మరిచి పోలేక పోతున్నారు. ఇక అమ్మ అయితే నిన్ను గుర్తు చేసుకొని క్షణం లేదు దిగులుతో కుమిలిపోని ఘడియ లేదు.
అసలు నీ పెళ్లి వార్తని మోసుకొచ్చిన వుత్తరం ఈ ఇంట్లో ఎలాంటి సంచలనాన్ని కలిగించిందో ఎలాంటి వాతావరణాన్ని సృష్టించిందో చెప్తాను.
ఆవాళ మధ్యాహ్నం మూడు గంటల వేళ-- నేను కూడా నాన్నగారితో ఏదో మాట్లాడుతూ వీధి వరండాలో నే వున్నాను. పోస్టు మాన్ వచ్చి నాన్నగారి చేతిలో వో ఇన్ లాండ్ కవరు పెట్టి వెళ్ళిపోయాడు.
'ఆ-- పెద్దాడు వ్రాసిందే' అంటూ సంబరంగా కవరు విప్పటానికి వుపక్రమించారు . అప్పటికి కొద్ది రోజుల క్రితం నుంచీ రోజూ మాకు నీ పెళ్లి ముచ్చట్లు చెప్పుకుని మురిసిపోటం తోనే సరిపోయింది. అంటే ఆవాళ మనం అంతా వెళ్లి చూసిన అమ్మాయి బాగానే వుంది. నీకూ నచ్చిందనే మేమంతా అనుకున్నాము. ఆ విషయం స్పష్టంగా వ్రాస్తూ పెళ్లి ఎప్పుడు చేస్తే నీకు వీలుగా వుంటుందో వ్రాస్తావని రోజూ నీ వుత్తరం కోసం ఎదురు చూస్తున్నాము-- ఊరికే ఎదురు చూస్తూ కూర్చోటం కాదు, నీ పెళ్ళికి మాకు వచ్చే ఆడబడుచు లాంచనాలతో బెనారస్ చీరలు కొనుక్కోవాలనీ , పెళ్లి కూతురికి ముత్యాల నెక్లెస్ పెట్టాలనీ -- అట్టే ఆలస్యం కాకుండా అంటే నేను పురిటి మంచం యెక్కి కూర్చోక ముందే నీ పెళ్లి జరిగిపోతే బాగుంటుందనీ ఏవేవో ఖబుర్లు చెప్పుకుని మురిసి పోతుండే వాళ్ళం --
సరే, నాన్నగారు ఏం చెప్తారో వినాలనీ, అయన చెప్పక ముందే అయన కుర్చీ వెనక నిలబడి ఆ వుత్తరం గబగబా చదివేయాలనీ అత్రపడుతూ లేవబోయిన నేను నాన్నగారి మొహం చూసి బిత్తరపోయి అలాగే కూర్చుండి పోయాను. ఆయన్ని అంత రౌద్ర మూర్తి గా నేను అడివరకూ ఎప్పుడూ చూడలేదు-- తన కళ్ళని తనే నమ్మలేకపోయినట్లు ఆ వుత్తరం తనది అవునా కాదా అన్నట్లు ఒక్కసారి వెనక్కి ముందుకీ తిప్పి మరోసారి చదువు కున్నారు. అంటే ఫర్రున చించేసి ఆ కాగితం ముక్కలు అవతల పారేసి లేచి వెళ్లి గదిలో పడుకున్నారు.
భయంతో బిగుసుకుపోయి కూర్చుండి పోయిన నేను కొంచెం సేపటికి తెలివి తెచ్చుకున్న దానిలా మెల్లిగా వంట గదిలోకి వెళ్లాను. అక్కడ అమ్మ కాఫీ చేస్తోంది. నేను అలా గుమ్మం దగ్గర నిలబడే మెల్లిగా జరిగిందంతా చెప్పాను.
'ఏమిటీ? అన్నయ్య వుత్తరం వ్రాశాడా, దాన్ని నాన్నగారు చింపి పోగులు పెట్టారా? ఏమిటే నువ్వు చెప్పేది -- ఏదీ-- ఆ కాగితం ముక్కలిలా పట్రా అంది.
ఆ ఆలోచన నాకు రానందుకు నన్ను నేనే తిట్టుకుంటూ గబగబా వాకిట్లో కి వెళ్లాను. కసిగా నలిపి వుండ చుట్టి పారేసిన కాగితం ముక్కలు అక్కడే వున్నాయి ఇంకా గాలికి యెగిరి పోకుండా. గబగబా వాటిని తీసుకుని అమ్మ దగ్గరికి వచ్చాను.
వంటగదిలో వో పీట వాల్చి దాని మీద ఆ ముక్కలన్నింటి నీ ఎలాగో వో క్రమంలో పేర్చ గలిగాను. అది చదువుతుంటే 'అయ్యో-- అమ్మా అన్నయ్య .' అన్న మాటలు మాత్రం అప్రయత్నంగానే నా నోటి నుంచి వెలువడ్డాయి. తరువాత ఏం చెప్పాలన్నా ఎంత ప్రయత్నించినా నా నోట మాట రానట్లే అయింది.
'ఏమిటే అన్నయ్య కేమయిందే' అంది అమ్మ కళ్ళంట నీళ్ళు పెట్టుకుంటూ.
'అన్నయ్య కి ఏం కాలేదమ్మా-- బోగం వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.' అన్నాను ఎలాగో గొంతు పెగుల్చుకుని,. అమ్మ కొయ్యబారి పోయినట్లు కూర్చుండి పోయింది. ఒక్కక్షణం. ఆ తరువాత 'ఏమిటే నువ్వు చెప్పేది-- నేను నమ్మను నా బిడ్డ అలాంటి పని చేయడు.' అంటూ ఒక్క వుదుటున లేచి వెళ్లి దేముడి మందిరం ప్రక్కని అలమారు లో పెట్టుకున్న కళ్ళ జోడు తెచ్చుకుని పెట్టుకుని పీట దగ్గరికి వచ్చి ఆ వుత్తరం లోకి సంశయంగా భయంగా చూసింది. అంతా అర్ధం అయింది. అంతే అలాగే అక్కడే గోడకి జేర్లబడి కూలబడి పోయి కొంగు కళ్ళకి అడ్డం పెట్టుకుని ఎంతసేపు కుమిలిపోయిందో నేను చెప్పలేను. ఆవిడ పడుతున్న బాధని రెండు కళ్ళతోటి చూస్తూ అలా నిలబడి పోయానే కాని ఆవిడని ఎలా వోదార్చాలో ఏమని నచ్చచెప్పాలో నాకు తెలియలేదు.
చివరికి ఏం తోచిందో లేచి గబగబ నాన్నగారి గదిలోకి వెళ్ళింది. నేనూ ఆవిడ వెంటే వెళ్లి గుమ్మం దగ్గర నిలబడ్డాను.
నాన్నగారు కళ్ళకి చేయి అడ్డం పెట్టుకుని వో ప్రక్కకి వత్తిగిలి పడుకుని వున్నారు.
'ఏమండీ, ఇది నిజమే అంటారా-- నాకు నమ్మకం కలగటం లేదు-- వాడంటే కిట్టని వాళ్ళే వరో లేనిపోనివి పుట్టించి వ్రాసి వుంటారు.' అంది అమ్మ వెర్రి ఆశ ఏదో మనస్సు లో పెనుగు లాడుతుండగా.
'హు-- కొట్టని వాళ్ళు-- ఇలాంటివి పుట్టించే విరోధులు ఎవరుంటారు-- అయినా --అయినా వాడి చేతివ్రాత తెలియటం లేదూ-- తను చేసిన ఘనకార్యాన్ని వాడు గొప్పగా తన చేతులతో స్వయంగా మనకి వ్రాశాడే! ఇంకా మనకి అనుమానం ఎందుకు?....ఇంకో మాట కూడా వ్రాశాడుగా, మనకి చెప్పకుండా తను చేసిన ఆ పనిని మనం క్షమించగలిగితే తనూ భార్యా నొ సారి వస్తామని-- రానక్కర్లేదని ఇవాలే రాసి పడేస్తాను-- ఇంత అప్రతిష్ట పనిచేసి వూళ్ళో మనం తలఎత్తుకు తిరగాలేకుండా చేసిందే కాకుండా దాన్ని వూళ్ళో కి మన యింట్లో కి తీసుకొచ్చి మన బ్రతుకుల్ని యింకా నవ్వుల పాలు చేస్తాడులా వుంది.'
అన్నారు నాన్నగారు. అయన గొంతు ఎంత బింకంగా పలికిందో అంత ఆర్ద్రంగా కూడా వుంది. అవధులు లేని ఆగ్రహంతో ఆవేదనతో అయన అంతరంగం కుతకుత లాదిపోతోందని ఎవ్వరైనా గ్రహించుకుంటారు.
'ఇదంతా నేను చేసుకున్న ఖర్మ ....కాకపోతే నా కడుపుని పుట్టిన బిడ్డ ఇలా వంశానికి మచ్చ తెచ్చే పని చేస్తాడని ఏనాడైనా అనుకున్నామా.' అంది అమ్మ నుదురు కొట్టుకుంటూ.
'ఖర్మే మరి-- తల్లి దండ్రులకి తల వంపులు తెచ్చే పని బిడ్డలు చేశారూ అంటే అది పెద్ద వాళ్ళ దురదృష్టమే' అన్నారు నాన్నగారు.
ఇంతలో కుసుమా శేషూ స్కూలు నుంచి వచ్చారు. నేను వాళ్ళిద్దర్నీ ముందుగానే పెరట్లో కి తీసుకు వెళ్ళిపోయి సంగతంతా వివరించి చెప్పాను.
పెరటి వరండా మీద నేను చెల్లాయి తమ్ముడు బిక్క మొహాలు వేసుకుని కూర్చుండి పోయాము చీకటి పడేదాకా. ఆ రాత్రి ఇంట్లో వంట ప్రయత్నమే లేదు అంటే నువ్వు నమ్మలేవేమో.
సరే ఎలాగో తెల్లవారింది. నిత్య కృత్యాలన్నీ పేరుకి యధావిదిగానే జరుగుతున్నాయి. మేం పిల్లలం ఎలా వున్నా అమ్మా నాన్నగారు ఎంతగానో కృంగి పోయారు. వీధి మొహం చూడాలంటే నే వాళ్ళకి ప్రాణం చచ్చి పోతున్నట్లుగా వుంది-- ఇవాళ కాకపోతే నాలుగు రోజులు పోయాక యినా నలుగురికీ తెలియదా -- వాళ్ళకేం చెప్తాం అని బాధపడి పోతున్నారు.
అమ్మ నీ సంగతులన్నీ , నువ్వు చిన్నతనంలో చేసిన అల్లరి దగ్గర నుంచీ ఏవేవో ఖబుర్లు చెప్తూ వుంటుంది. అవి తలుచుకోటం బాధపడటం మామూలాయి పోయింది-- ఒకసారి , అంటే నువ్వు బి.ఎల్ చదువుతుండ గా అనుకుంటా శర్మ గారి అబ్బాయి సంగతి చెప్పిందిట కదూ అమ్మ నీకు...'
చదువుతున్న కాగితాల మీద నుంచి దృష్టి మళ్ళించి ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్చాడు మురళీ-- అవును ఆ సంఘటన అతనికి బాగా జ్ఞాపకం వుంది.
