Previous Page Next Page 
ఆచరణ లో అభ్యుదయం పేజి 22


                                 9
    ఉదయం ఏడు గంటల వేళ కళ్యాణి అప్పుడే స్నానం అదీ ముగించుకుని వంట ప్రయత్నం లో పడింది--
    పెరటి తలుపు చప్పుడైతే వెనక్కి తిరిగి చూసి, 'నువ్వా మణి రా' అంది. మణి మేడ మీద వాళ్ళ అమ్మాయి.
    ఆ అమ్మాయి కాస్త సిగ్గు పడుతున్నట్లు సంకోచిస్తున్నట్లు లోపలికి వచ్చి 'ఈ గ్లాసుడు కందిపప్పు ఇమ్మంది మా అమ్మ' అంది.
    'ఇస్తాను ఉండు' అని ఆ పిల్లకి చెప్పి గబగబా చేతిలో వున్న పని పూర్తి చేసి చెయ్యి కడుక్కు ని వచ్చి ఆ పిల్ల చేతిలో గ్లాసు తీసుకుని దాన్నిండా కందిపప్పు పోసి ఇచ్చింది. అది తీసుకుని వెళ్ళిపోయింది మణి.
    ఆ ఇంట్లో నాలుగు కుటుంబాలు వుంటున్నాయి. క్రింద రెండు వాటాలు మేడ మీద రెండు వాటాలూను.
    క్రింది భాగాలలో మురళీ కుటుంబం, దేశ్ పాండ్ కుటుంబం వుంటున్నారు. మేడ మీద గోపాలం కుటుంబం మెహతా వాళ్ళూ వుంటున్నారు.
    గోపాలం వాళ్ళూ కూడా ఈ మధ్యే అంటే మురళీ వాళ్ళు ఆ ఇంట్లోకి వచ్చిన వార రోజుల తరువాత అక్కడికి వచ్చి చేరారు. గోపాలం భార్య శాంత చాలా కలుపుగోలు మనిషి. కలుసుకున్న వేళా విశేషమూ, ఒకే భాషా వాళ్ళు కావటం వల్లా శాంత కి కళ్యాణి పట్ల వో ప్రత్యేకమైన అభిమానం ఏర్పడి పోయింది -- ఒకే ఇంట్లో వుంటున్నందుకు కలిగిన పరిచయం గా స్నేహంగా కాకుండా శాంత ఆత్మీయతా వుట్టి పడేలా 'చెల్లాయ్' అని పిలుస్తుంటే కళ్యాణి మనస్సంతా నిండి పోయినట్లయేది.
    'మనం కలుపుకోటానికి ఏ వరసయినా ఒకటే కాని నాకు చెల్లాయి లంటే సరదా -- నేను మా ఇంట్లో అందరి కంటే చిన్న దాన్ని. నాకోరిక ఎలా తీరుతుంది. నిన్ను చూడగానే అలా పిలవాలని పించింది. అని ఆప్యాయంగా నవ్వుతూ శాంత చెప్తుంటే.
    'నాకు అదే బాగుంది అలాగే పిలు అక్కయ్యా.' అంది కళ్యాణి.
    ఏడుగురు పిల్లలూ, భర్తా తనూ అంత పెద్ద సంసారాన్ని ఈదుకోస్తూ రోజులూ చాలా భాగం వంట ఇంటికే అంకితం అయిపోయే శాంత కి ఇరుగింటికి పోరుగింటికి పెత్తనాలు చెయ్యటానికి తీరికా వుండదు ఆమెకి అంతగా ఇష్టమూ వుండేది కాదు.
    ఎప్పుడైనా మనస్సు మరీ చిరాకుగా వున్నప్పుడు మాత్రం కళ్యాణి దగ్గరికి వచ్చి కూర్చుని ఏదో కష్టం సుఖం వెళ్ళబోసు కుంటుండేది.
    అలా అలా అప్పుడప్పుడు ఆవిడ చెప్పిన వాటిని బట్టి కళ్యాణి కి ఆ కుటుంబం గురించి చాలా విషయాలు తెలిశాయి.
    శాంతకి పెళ్ళయి పదేళ్ళ యింది-- పెళ్ళయిన ఏడాదికే పెద్ద కొడుకు పుట్టాడు-- వాడు పుట్టిన నక్షత్రానికి శాంతీ అదీ లేకపోయినా తోలి చూలు పుట్టిన మొగ బిడ్డకి ఘనంగా బాలసారె చేసుకోవాలని అటు శాంత తల్లితండ్రులు అటు గోపాలం తల్లి తండ్రులూ చాలా ముచ్చట పడ్డారు-- కాని కొత్తగా కన్పర్ము అయిన ఉద్యోగం, ప్రమోషన్ లిస్టు లో తన పేరు కూడా జేర్చబడే సూచనలు వున్నాయి. అలాంటి సమయంలో గోపాలం ఒక్క రోజు కూడా శలవు పెట్టటం మంచిది కాదని సలహా ఇచ్చాడు ఆఫీసరు.

                                   
    ఇంక మరి చేసేది లేక ఆ వేడు కేదో ఇక్కడే చేసుకుంటాం శాంతనీ బాబునీ పంపించేయమనీ వ్రాశాడు గోపాలం.
    మూడునెలల పసివాడిని తీసుకుని వచ్చింది శాంత. ఆ తరువాత రెండు నెలలకే బాలసారె జరిగింది. ఆ వేడుకకి అటు శాంత తల్లి తండ్రులూ ఇటు గోపాలం తల్లి తండ్రు లూ కూడా వచ్చారు-- ఇరుగు పొరుగు వాళ్ళని గోపాలం ఆఫీసులో వాళ్ళని అందరికి పిలిచి అట్టహాసంగా టీ పార్టీ ఇచ్చారు-- అమ్మమ్మ చేయించుకు వచ్చిన మురుగులు చేతులకి తగిలించుకుని సిల్కు బుష్ షర్టు తొడుక్కుని దొరబాబు లా వున్న బాబు వీళ్ళ చేతుల్లోంచి వాళ్ళ చేతుల్లోకి వాళ్ళ చేతుల్లోంచి వీళ్ళ చేతుల్లోకీ మారుతున్నాడు. వాడి పేరు ఇప్పుడు వెంటక రమణ. వచ్చిన వాళ్ళందరి దగ్గర నుంచీ బహుమతులు కొట్టేసి అందుకు ప్రతిఫలంగా రెండు బుగ్గలూ సొట్టలు పడేలా వాడు వో చిరునవ్వు పారేస్తుంటే ఇంట్లో వాళ్ళకి వూళ్ళో వాళ్ళకీ కూడా ముచ్చటగానే వుంది-- ఆ తరువాత పదిహేను రోజుల దాకా ఆనాటి విశేషాలని బాబు చిలిపి చేష్టలనీ తలుచుకు తలుచుకు మరీ మురిసి పోయారు ఆ భార్య భర్తలు-- టీపార్టీ ఖర్చుకి అయితేనేం, వచ్చిన బంధువులకి బట్టలూ అవీ కొనటాని కయితే నేం రెండు వందల రూపాయిల  అప్పు అయినా బాధ అనిపించలేదు వాళ్ళకా సంతోషంలో.....
    తరువాత ఏడాది తిరగకుండానే శాంత కి అమ్మాయి పుట్టింది. అల్లుడికి ఆ వార్త వ్రాస్తూ పిల్ల నక్షత్రానికి చాలా శాంతి చేయించాలని హోమాలు జపాలూ చేయించాలని వ్రాశాడు శాంత తండ్రి. అలాంటి వాటిలో తనకి నమ్మకం వున్నా లేకపోయినా, పెద్దవాళ్ళు ఎలాగా వూరు కోరనీ క్రితం సారిలా ఇక్కడ చేసుకుంటే మళ్లీ ఆ ఖర్చంతా తడిసి మోపెడవుతుందనీ గోపాలం నాలుగు రోజులు శలవు పెట్టివెళ్లి పని జరిపించుకు వచ్చాడు.
    తరువాత కొద్ది రోజులకి శాంతా పిల్లలూ వచ్చారు. ఇక్కడ ఇంట్లో పని ఇద్దరు పిల్లల్ని చూసుకోటం శాంతకి కొంచెం అలసటే అనిపించేది.
    'ఆ.. అందరూ చేసుకోటం లేదు?-- నాలుగు రోజులు పొతే ఈ నీరసం అదే సర్దుకుంటుంది .' అని లక్ష్య పెట్ట కుండానే రోజులు గడిపేసేది. ఒకవేళ ఎప్పుడైనా గోపాలం దగ్గర ఆ మాట లంటే , 'ఓ యబ్బ, యిద్దరు పిల్లలు పుట్టే సరికే నువ్విలా తయారయితే మీ అమ్మా మా అమ్మా పదేసి మంది పిల్లల్నికని ఎలా పెంచి పెద్ద వాళ్ళని చేశారను కున్నావూ?' అనేవాడు పెద్దగా నవ్వుతూ.
    శాంత నీరసంగా నవ్వేసి వూరుకునేది -- మరో సంవత్సరం గడిచింది. శాంత కి మళ్లీ పురిటి రోజులు-- వో సాయంకాలం గోపాలంతో పాటు ఇంటికి వచ్చి, కాస్సేపు కూర్చుని వెళ్ళిన వో స్నేహితుడు తరువాత కాస్త చనువుగానే అతన్ని హెచ్చరించాడు. 'నీ మిసెస్ చాలా వీక్ గా వున్నారు. టానిక్కు లూ అవీ ఇప్పిస్తూనే వున్నావనుకో-- అయినా పిల్లల విషయంలో కాస్త స్పేసింగు వుండాలి-- నాలుగేళ్ల కి ముగ్గురు పిల్లలంటే తల్లి ఆరోగ్యమూ పాడవుతుంది పిల్లలూ బలహీనంగానే వుంటారు-- ఇంక నుంచి జాగ్రత్తగా వుండు.'
    గోపాలానికి సర్రున వచ్చింది కోపం. అయినా అతన్నేమీ అనటం ఇష్టం లేక ఎలాగో తమాయించు కున్నాడు. కానీ యింటికి వచ్చాక మాత్రం 'ప్రతివాడికీ ఇదో జబ్బు-- ఫామిలీ ప్లానింగో అంటూ వెధవ గోల -- కనిపించిన వాళ్ళందరి కీ సలహా లివ్వాలని చూస్తారు-- నా పెళ్ళాం బిడ్డలా బరువు అక్కడికి తనేదో మోస్తున్నట్లు వుంది వాడి ధోరణి -- పెట్టి పోషించే వాడికి నాకు లేని బాధ మధ్య వాడి కెందుకో.' అంటూ ఆ రోజల్లా గుంజు కుంటూనే వున్నాడు.
    సరే ఆ తరువాత అయిదేళ్ళ ల్లోనూ మరో నలుగురు పిల్లలు పుట్టారు.
    మూడో పురుడు దగ్గర నుంచీ శాంత కాన్పు కి పుట్టింటికి వెళ్ళటం మానేసింది. -- ఆవేల్టకి సహాయంగా వుండటానికి ఆమె తల్లో అతని తల్లో వచ్చేవారు-
    ఇంచుమించు సంవత్సరాని కోసారి ఆ ఖర్చులూ, పెరుగుతున్న సంసారం, రోజురోజుకీ పెరిగిపోతున్న ధరలు, నిర్యవసరాలు గడవటమే గగనమై పోతోంది-- పసిపిల్లకి పాల డబ్బాలు ఎడ పిల్లకి మందు సీసాలు ఇంకా పెద్ద వాళ్ళకి స్కూలు జీతం ఇలా ఖర్చులు పెరిగి పోతున్నాయి. పిల్లలకు పట్టుమని తలో నాలుగు జతల బట్టలయినా లేవు -- గోపాలం ఆఫీసుకి కూడా కాస్త చిరుగులు పట్టి దారపు పోగులు రేగిపోయిన పంట్లాములు, కాలర్ చిరిగిపోయిన షర్టూలూ వేసుకు వెళ్తున్నాడు ఇంక శాంత సరేసరి చిరుగులూ, కుట్లూ కనిపించకుండా చీర కట్టుకోటానికి వీలుకానంత పాత చీరలు కూడా కట్టుకుని కాలక్షేపం చేస్తోంది. పెళ్లి నాటికి బొద్దుగా అందంగా, ముద్ద బంతి పువ్వులా వుండే శాంత ఈనాడు పాలిపోయిన మొహం చప్పి దవడలు, గుంటలు పడ్డ కళ్ళతో సన్నగా ఈనే పుల్లలా తయారయింది.
    తొమ్మిదేళ్ళ నాడు ఘనంగా పెద్దవాడి బాలసారె జరుపుకుని అట్టహాసంగా స్నేహితులందరికీ విందు చేసిన అతను ఇవాళ కన్న బిడ్డలకి కడుపు నిండా బలమైన ఆహారం అయినా ఇవ్వలేక పోతున్నాడు, పోనీ తనేమైనా చేతులు ముడుచు కుని కూర్చున్నాడా అంటే అదేం లేదు. చచ్చి సున్నమయి వోవర్ టైములు కూడా పని చేస్తున్నాడు. నిజం చెప్పాలంటే పదేళ్ళ క్రిందటికి ఇప్పటికి అతని జీతం నెలకి వో నూరు రూపాయల పైనే పెరిగింది. అయినా దాంతో నెలంతా గడవటమే లేదు-- మధ్యలో అక్కడా, ఇక్కడా చేబదుళ్లు చెయ్యటం జీతం రాగానే అవి తీర్చటం, మళ్లీ పదిహేనో తారీకునే అప్పుకి బయలుదేరటం.
    'ఛీ-- వెధవ బ్రతుకు ' అని ఎన్నిసార్లో తమ జీవితాల్ని తామే తిట్టుకుంటారు ఆ భార్యాభర్తలు-- అయినా ఆ జీవితాలు అలాగే సాగిపోతున్నాయి.
    అదీ వాళ్ళ సంసారం --
    
                        *    *    *    *
    మెళుకువ వచ్చినా లేవబుద్ది కాక ట్రాన్సిస్టరు అలా ప్రక్కని పెట్టుకుని వార్తలు వింటూ పడుకున్న మురళీ వార్తలు సమాప్తం అన్న తరువాత ట్రాన్సి స్టరు ఆపేసి లేచి రగ్గు మడత పెట్టి ఇవతలికి  వచ్చాడు.
    వంటిట్లో కళ్యాణి కత్తిపీట ముందు పెట్టుకుని దొండకాయలు చక్రాల్లా తరుగుతోంది. 'ఇంకా ఎనిమిదయినా కాలేదు. అప్పుడే నీస్నానం అదీ అన్నీ అయిపోయి నట్లున్నాయి. ఎందుకీ హడావిడి. ఇంత చలిలో చీకటితో లేవటం ఎందుకు ఏదో మించి పోయినట్లు.' అన్నాడు గడప దగ్గర నిలబడి లోపలికి చూస్తూ.
    'బాగుంది ఆరుగంటలకి లేవయం కూడా త్వరగా లేవటం క్రిందే లెక్కా ఏమిటి?-- అబ్బా చలీ అనుకుంటూ రగ్గు ముసుగు పెట్టుకుని పడుకుంటే ఆ చలి ఎంతకీ వదల్దు -- చీకటితో లేచి గబగబా మొహం కడిగేసుకుని , ఆ పళంగా కుళాయి  శుబ్భరంగా విప్పేసి దాని క్రింద కూర్చున్నా మంటే చలీగిలీ అన్నీ ఒక్కసారిగా యెగిరి పోతాయి....'
    'అయితే నువ్వు చన్నీళ్ళ స్నానం చేశావా?'
    'లేదు లెండి బాబూ, మాటవరస కేదో అంటే పట్టుకుంటారు-- త్వరగా వెళ్లి మొహం కడుక్కురండి-- కాఫీ కలుపుతాను.' అంది కళ్యాణి కత్తి పీటా కూర ముక్కాల పళ్ళెం వో వారకి పెట్టి, అవి తరిగిన దగ్గర జాగా శుభ్రం చేస్తూ.
    'అవును గాని-- పై వాళ్ళ పాప పొద్దున్నే వచ్చినట్లుంది ఎందుకూ?' అన్నాడు మురళీ యధాలాపం గానే అడుగుతూ.
    'ఆ...ఏదో ,...కాస్త కందిపప్పు కావాలని వచ్చింది...నెలాఖరు కదూ వాళ్ళ ఇంట్లో నిండు కున్నట్లుంది....'
    'ఏదోలే పాపం ...మనమేం వూరికే ఇవ్వటం లేదు. అదీ వందలూ వేలు కాదు. ఈ మాత్రంగా నైనా మనిషికి మనిషి సాయం చేయలేకపోతే ఎలా....ఏదడిగినా విసుక్కోకుండా ఇస్తూ వుండు' ఆ కుటుంబం పట్ల జాలి, సానుభూతి వున్నాయి అతని కంఠం లో.
    'బాగుంది నేనెప్పుడు లేదన్నాను? ఒక్కోసారి కొన్ని కొన్ని మనకే చాలవేమో అనిపించినా ఆ మాట పైకి చెప్పకుండా ఏదో సర్దుబాటు చేస్తూ వుంటాను.' అంది.
    మురళీ మొహం కడుక్కోటానికి బాత్ రూమ్ వైపు వెళ్ళిపోయాడు.

                             *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS