Previous Page Next Page 
ఆచరణ లో అభ్యుదయం పేజి 24


                                    10

    మురళీ బి.ఎల్ . చదువుతుండగా వోసారి శలవలకి వచ్చినప్పుడు వో మధ్యాహ్నం అతనూ తల్లీ భోజనం చేస్తున్నారు. శివరామయ్య గారు అంతకు ముందే భోజనం చేసి ఆఫీసుకి వెళ్ళిపోయారు.
    భోజనం చేస్తూ ఆ ఖబురు ఈ ఖబురూ చెప్పుకుంటూ ఉండగా రమణమ్మ గారు హటాత్తుగా గుర్తు వచ్చినట్లే అంది 'శర్మ గారి అబ్బాయి సంగతి చెప్పాను రా నీకు?'
    'ఉహు -- లేదే! ఎమయిందసలు?' అన్నాడు మురళీ.
    'ఇంకా ఏం కావాలి? అబ్బాయి తనతో చదువుకుంటున్న వో క్రిష్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడుట.'
    'నిజమా?'
    'అబద్దం అయితే బాగానే వుండి పోను -- ఆ తల్లితండ్రుల ప్రాణాలు ఎలా కొట్టుకు పోతాయో , వాళ్ళే మయి పోతారో అన్న జ్ఞానం ఆ పిల్లాడికి కాస్తయినా వుందంటావా -- పాతికేళ్ళు పెంచి పెద్ద వాడ్ని చేసి ఉన్నదంతా వూడ్చి పెట్టి వాడ్ని డాక్టర్ చదివించారే , ఇంటికి పెద్ద కొడుకు కష్టానికీ, సుఖానికి ఆదుకుంటాడు మిగతా పిల్లల బాధ్యత అంతా చూసుకుంటాడు అని వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కదా , ఆ అబ్బాయి చెయ్యాల్సిన పనేనా ఇది -- ఏం చదువులో ఏం గోలో , పిల్లలు కళ్ళ ముందు నుంచి దూరం అయారంటే నే భయం పట్టుకునేలా తయారయింది లోకం...ప్చ్....ఆ అవమానాన్ని దుఃఖాన్ని దిగమింగ లేక ఊళ్ళో ఎవ్వరికీ మొహం చూపించలేక ఆ శర్మ గారూ భార్యా మంచం పట్టారు. అంది రమణమ్మ గారు ఆ కష్టమేదో తమకే వచ్చినంత దిగులుగా.
    'ఆ పెళ్ళేదో జరిగిపోయాక వీళ్ళెంత బాధపడినా లాభం లేదు కదమ్మా-- అయినా ఇప్పుడు మాత్రం ఆ అబ్బాయి డబ్బూ అదీ ఏమీ ఇవ్వడని ఎందుకను కోవాలి వీళ్లు -- భార్యా భర్తలిద్దరూ డాక్టర్లు, నాలుగు చేతులా సంపాదిస్తారు. హాయిగా తమ్ముళ్ళ ని చదివిస్తాడు, చెల్లెళ్ళ కి పెళ్ళిళ్ళు చేస్తాడు......'
    'చాల్లే నిర్వాకం. అంటూ కొడుకు మాటలని మధ్యలోనే తుంచేసిందావిడ. 'వెధవ డబ్బు కోసమా ఇప్పుడు వీళ్ళ ఏడుపంతాను? కుటుంబం పరువూ ప్రతిష్ట గంగలో కలిశాక ఇంక వాడు ఎంత డబ్బు ఇస్తే మాత్రం అవి తిరిగి వస్తాయా? పెళ్లి కెదిగిన ఆడపిల్లలు ముగ్గురున్నారు. అన్నగారు ఇలాంటి పని చేశాడని తెలిశాక అయిన కుటుంబాల వాళ్లెవరైనా ఆ    పిల్లల్ని చేసుకుంటారా-- డబ్బు లేక  పోయినా ఒకప్పుడు ఎంతో పరువుగా గర్వంగా తల ఎత్తుకుని తిరిగిన కుటుంబం ఇప్పుడు వెలి వేయబడినట్లు అయిపొయింది-- తల్లి తండ్రులని సుఖ పెట్టాల్సింది పోయి వాళ్ళ కిలాంటి రంపపు కోత కలిగించే పిల్లలు పుట్టి ఏం లాభం?'
    'ఆ-- ఏదో నాలుగు రోజులు నలుగురూ కాస్త కొత్తగా చెప్పుకుంటారు. ఆ తరువాత వాళ్ళే మరిచి పోతారు -- ఇంకా ఈ కాలంలో కూడా వెలిగిలీ ఏమిటి.' అంటూ తల్లి మాటల నన్నింటినీ తేలిగ్గా ఎగర గొట్టే శాడు మురళీ మజ్జిగా అన్నం తింటూ.
    రమణమ్మ గారు అయోమయంగా కొడుకు ముఖంలోకి చూస్తుంటే పకపకా నవ్వేస్తూ కంచంలో చెయ్యి కడుక్కుని లేచి వెళ్ళిపోయాడు మురళీ....

                                            
    అదంతా ఒక్కసారి కళ్ళకి కట్టినట్లుగా అయింది మురళి కి. తల్లి అంతర్యం అభిమానం గుర్తు వచ్చి అతని కళ్ళు చెమర్చాయి. మునివేళ్ళ తో కను కోసలని అద్దేసుకుని మళ్లీ వుత్తరం లోకి దృష్టి మళ్ళించాడు.
    'అన్నయ్యా , అమ్మ అదంతా చెప్పి వాడికి అప్పటి నుంచీ ఇలాంటి ఆలోచనలు వున్నాయేమో, నా బుర్ర అంత దూరం ఆలోచించలేదు-- అయినా ఈ మాయదారి ప్లీడరీ చదువుకి ఆడపిల్లలు ఎవ్వరు ఎగబడ లేదేమో మరి-- సరే, నా గుండెల మీద కుంపటి లా కూర్చోటానికి వాడితో కలిసి చదువుకున్న పిల్లే కావాలన్న మాటేముంది. వాడితో కలిసి వుద్యోగం చేస్తున్నది దొరికింది-- అసలు నా ప్రారబ్ధం కాకపొతే, నేనే వాడ్ని అంత దూరం వుద్యోగానికి పంపించాను. నాన్నగారు చెప్పిన చదువు చదివించినా నాన్నగారు చెయ్యమన్న వుద్యోగం చేసినా వాడు కళ్ళ ముందే వుండేవాడు, ఈ ఘోరం జరగకపోను అని బాధపడుతూ వుంటుంది........'
    మరొక్కసారి వుత్తరం లోంచి దృష్టి మళ్ళించి దూరంగా ఎటో చూస్తూ గతం నేమరువేసుకో సాగాడు.
    మురళీ ది చిన్నప్పటి నుంచీ, చాలా చురుకైన స్వభావం, చదువులో మంచి తెలివి తేటలు వాటికి తోడు ఒక్క క్షణం అయినా వృధా గా కాలక్షేపం చెయ్యకుండా శ్రద్దగా చదివేవాడు. అన్ని క్లాసుల్లో ఫస్టుగా ప్యాసయ్యాడు, బియ్యే లో కూడ క్లాసు వస్తుందనీ ఎమ్మే చదవాలని అనుకున్నాడు. కాని బియ్యే ఆఖరి సంవత్సరం చదువుతుండగా అతనికి చాలా జబ్బు చేసింది. రెండు నెలల పాటు అసలు కాలేజీ కే వెళ్ళ లేకపోయాడు -- ఆ తరువాత కొద్ది రోజులకే పబ్లిక్ పరీక్షలు కావటం చదువుకోటానికి వ్యవధి లేకపోవటం ఒక్కటే కాకుండా కాస్త శ్రమపడి చదవ టానికి ఒంట్లో శక్తి ;లేకపోవటం వల్ల ఏదో బొటాబొటీ మార్కులతో ప్యాసయ్యాడు. ఫస్టు క్లాసు వస్తే ఆ సంగతి వేరు కాని ఈ మాత్రంగా ప్యాస యిందానికి ఇంకా ఇది చదువుతాను అక్కడికి వెళ్తాను అని తండ్రిని ఇబ్బంది పెట్టటం అతనికి ఇష్టం లేకపోయింది, అందుకే, ఇంక చదువు మానేస్తాను ఉద్యోగం చూసుకుంటాను అన్నాడు మురళీ.
    'అనుకోగానే ఉద్యోగాలు మాత్రం దొరికి పోతాయా? అయినా ఈ ఒక్క డిగ్రీయే కాకుండా ఏ ట్రైనింగ్ గో అయితే నాకు తెలుసున్న వాళ్లతో చెప్పి మేష్టరు వుద్యోగం అయినా వేయిస్తాను-- ఉద్యోగ ప్రయత్నంలో కాలయాపన చేస్తూ వూరికే ఇంట్లో వుండే బదులు ఈలోగా ఆ చదువయినా పూర్తీ చేస్తే బాగుంటుంది.' అన్నారు శివరామయ్య గారు.
    ఆయన సలహా వింటూనే గయ్యిమని లేచింది రమణమ్మ గారు 'బ్రతకలేక బడి పంతులు అన్నట్లు ఇంత లోకంలో ఇన్ని వుద్యోగా లుండగా వాడు చెయ్యటానికి ఆ మేష్టరు గిరీ తప్పితే మరేమీ కనిపించ లేదా ఏమిటి మీకు?-- అయినా వాడికీ మన ఆనవాయితీ యే రావాలా ఏమిటి? ఇప్పటికీ పాతికేళ్ళ నుంచి చేస్తున్నారు మీరీ మేష్టరీ వుద్యోగం -- మీ సంపాదనలో ఒక్క దమ్మిడీ ఆదా చేసుకో గలిగామా? మామగారి పుణ్యమా అని ఈ మాత్రం ఆస్తి ఇచ్చి పోబట్టి ఈ మాత్రం గా నయినా బ్రతక గలుగు తున్నాం కాని, లేకపోతె మనస్థితి ఎంత అధ్వాన్నంగా వుండేదో చెప్పక్కర్లేదు -- మన ఖర్చులూ పిల్లల కార్యాలూ కధలూ అన్నీ అయ్యేసరికి ఈ కాస్త ఆస్తీ ఇంకా మిగిలి వుంటుందని నాకేం నమ్మకం లేదు-- మరి కాస్త మంచి వుద్యోగం వచ్చే చదయినా చెప్పించాక పొతే ఎలా?' అంది ఆవిడ భర్త ఆలోచనని ఎంతమాత్రమూ ఆమోదించకుండా.
    'అయితే మరి ఏం చెయ్యమని నీ వుద్దేశ్యం' అన్నారాయన.
    'హాయిగా ప్లీడరీ చదివించండి.' అంది ఆ హాయిగా అన్నమాటని ఎంతో ఆప్యాయంగా ఒత్తి పలుకుతూ. ఆవిడ అంత పట్టుదలగా ఆ చదువే ఎందుకు కోరుకుందో శివరామయ్య గారికి మురళీ కి కూడా అర్ధం అయిపొయింది. రమణమ్మ గారి పెద్ద తల్లి కూతురు కమలాక్షి , మేనమామ కూతురు వర్ధని కూడా ఇంచుమించు ఆమె ఈడు వాళ్ళే -- వాళ్ళ ముగ్గురి పెళ్ళిళ్ళు కూడా కొద్ది నెలల తేడాతో ఒక్క సంవత్సరం లోనే జరిగాయి -- ఎవరి కాపురాలు వాళ్ళు చేసుకుంటూ ఆ తాపత్రయంలో పడి పోవటంతో ఇంక తరచు కలుసు కోవటం కాని ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుకోటం కాని జరగలేదు.
    ఆ మధ్య ఒక బంధువుల ఇంట పెళ్ళిలో వాళ్ళు ముగ్గురూ మళ్లీ చాలా కాలం తరువాత కలుసుకున్నారు.
    కమలాక్షి భర్త పెళ్లి నాటికే 'లా' ప్యాసయ్యాడు. వెనక చిల్లి కానీ ఆస్తి లేదని గునుస్తూనే అప్పుడు ఆ సంబంధం చేశారు. కాని ఇప్పుడు వాళ్ళ పరిస్థితి వొహ్ లక్షల మీద వుంది. ప్లీడరు గా రెండు చేతులా ఆర్జిస్తూ మేడలూ, పొలాలూ అన్ని కొన్నాడతను--
    ఇక వర్ధనమ్మ భర్త కూడా ప్లీడరీ యే చదివాడు. అయినా అతనికి ప్రాక్టీసు  చెయ్యటం ఇష్టం లేక వో కంపెనీ లో చేరాడు. ఇప్పుడు దానికి వో బ్రాంచి మేనేజరుట. నెలకి మూడు వేల జీతం, వుండటానికి పెద్ద బంగళా -- తిరగటానికి విమానం లాంటి కారు అన్నీ వున్నాయి --
    కమలాక్ష్మీ, వర్ధనమ్మ ల వంటి మీద వున్న నగలూ, ఆ పెళ్ళిలో వాళ్ళు కట్టిన పట్టు చీరలూ అన్నీ చూస్తుంటే రమణమ్మ గారి కళ్ళు చెదిరిపోయాయి. అక్కడి నుంచి వచ్చీ రాగానే ఆవిడ ఎంతో వుత్సాహంగా వాళ్ళ ఖబుర్లన్నీ చెప్తుంటే 'ఇంతకీ మీ అమ్మకి నా చదువు, ఉద్యోగం నచ్చినట్లు లేవు.' అన్నాడు శివరామయ్య గారు వేళాకోళం గా, కొడుకుతో.
    'నేనేం అలా అనలేడు.' అని మొహం ముడుచుకుంది రమణమ్మ గారప్పుడు -- ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఆవిడ తన ఇష్టాన్ని నిస్సంకోచంగా బయట పెట్టటానికి ఆవిడ జంకలేదు-- వాళ్ళు ఇద్దరూ చదివిన చదువు చదివి తన కొడుకు కూడా వాళ్ళలా ఆర్జించు కోవాలని ఆవిడ కోరిక.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS