ఆగిపోయింది రాజ్యలక్ష్మీ. ఒక్కసారి బలంగా నిట్టూర్చింది. యిదంతా ఎందుకు చెప్తున్నానో నాకే అర్ధం కాదు. అనుకుంది స్వగతం గా. ఆమె ముఖం వంక చూచేందుకు కూడా మనస్కరించలేదు ప్రభాకర్ కి. ఒకరి మనసికారోగ్యం కోసం. మరొకరి మనసులో మానిన గాయాన్ని ముల్లుతో పొడవడం కంటే బాధాకరమయిన దేదీ లేదు. అంతకంటే గత్యంతరం కూడా లేదు. వంచిన తలయినా ఎత్తకుండా వూపిరి పీల్చడం కూడా మర్చిపోయి వింటున్నాడు.
"ఆ రాత్రి ఒకటే వాన. ఒకటే యీదురు గాలి, మెరుపులు, వురుములతో భయంకరంగా వుంది. మాధవికి చిన్నప్పటి నుండి ఉరుములు చీకటి అంటే భయమే! దానికి తోడూ రాక్షసిలా వూగిపోతున్న మర్రి చెట్టు గాలి యింటిని ఎగరగోట్టేస్తున్నట్టుంది. మాధవి పక్కనే పడుకుని దాన్ని దగ్గరగా తీసుకుని ధైర్యం చెప్తున్నాను.
మెల్లిగా ఎవరో తలుపు కొట్టిన చప్పుడయింది. మాధవి మరింతగా దగ్గరకు జరిగి కరచుకు పోయింది. "వద్ద్దమ్మా..... తలుపు తియ్యకు. నాకు భయం." అంటూ ఏడవడం మొదలు పెట్టింది.
బయట ఎవరో తలుపు కొడుతూనే వున్నారు. మెల్లిగా మాధవికి ధైర్యం చెప్పాను, "భయం లేదూ మధూ ఎవరో చూచి వచ్చేస్తాను. నా తల్లివి కదూ....' అంటూ పట్టు విడిపించుకుని తలుపు తీయడానికి వెళ్ళాను.
ఆరోజు నాకేవరినీ యింట్లోకి రానివ్వడం యిష్టం లేదు. అదే విషయం చెప్పి పంపెద్దామని తలుపు దగ్గరకు వెళ్ళి ఓరగా తెరిచి చూడబోయాను. ఆ చీకట్లో నాకెవ్వరూ తెలియలేదు. వెళ్ళిపొమ్మని చెప్పి తలుపు మూసి వెయబోతుండగా దాడాల్న బలవంతంగా తలుపు తోసుకుని ఆ వ్యక్తీ లోపలకు వచ్చేశాడు.
ఆశ్చర్యంగా , భయం , భయంగా ఒక్క అడుగు వెనక్కి వేశాను. అతను పరిచయమైన వాళ్ళలో ఒకడు కాడు. కాని పరికించి చూస్తె తెలిసినవాడే జమిందారు గారి నౌకరు.
వెంటనే మాధవి వంక చూచాను. అప్పటికే భయంతో ముడుచు పోయి వుంది. చలికి గజగజా వణికిపోతోంది. మెల్లిగా దగ్గిరకు తీసుకుని భయపడకు. యిప్పుడే వచ్చేస్తానని ధైర్యం చెప్పి పక్క గదిలోకి దారి తీశాను.
వెంకన్న చెప్పింది వినగానే . నాకు అతన్ని హత మార్చాలన్నంత కోపం వచ్చింది. జమిందారు గారు నన్ను సౌమ్యంగా అంగీకరింపచేయలేనిది, బలవంతంగా చేయడానిని నిర్ణయించారు. నా దగ్గర నుండి బలవంతంగా మాధవిని తీసుకు రమ్మనమని పంపారు. వెంకన్నని. ఒక్కసారి అది నా చెయ్యి దాటిపోయాక నే చేయగలిగింది ఏమీ లేదని తెలుసు.
తక్షణమే అతన్ని అక్కడి నుంచి వెళ్ళి పొమ్మన్నాను. రాక్షసుడి లా నవ్వాడు. నేనెంత మొత్తుకున్నా వినేవాళ్ళు లేరు ఆ అర్ధరాత్రి. ఆ వాతావరణంలో బయట వురుములు భూమిని బద్దలు కొడుతున్నాయి. గాలి హోరు సముద్ర తరంగాల్ని దాతుకోస్తోంది.
వెంకన్న సలహా కూడా యిచ్చాడు. పిల్లను వదిలి గుట్టు చప్పుడు కాకుండా వూరు వదిలి పొమ్మనమని.' వెంకన్న చెంప చెళ్ళు మంది. అతని కళ్ళు నిప్పులు కురిశాయి నన్ను ఒక్క తోపు తోసి ముందు గదిలోకి వెళ్ళి మంచానికి కొట్టుకున్న నా నుదురు చిట్లి రక్తం కారసాగింది. దైహికంగా ఆ బాధ కంటే మానసికంగా నా ఆవేశం నన్ను నిలువనీయలేదు. మెల్లిగా లేచి బలం తెచ్చుకుని ముందు గదిలోకి వెళ్ళాను.
అప్పటికే బలవంతంగా మాధవిని ఎత్తుకుని భుజం మీదకు వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఎనిమిదేళ్ళ కే ఏపుగా ఎదిగిన మధు బలంగా రెండు కళ్ళతో తంతుంది. అమ్మా, అమ్మా అంటూ గిలగిల లాడుతోంది.
ఒక్క అంగలో అతని వెనక్కి వెళ్ళి చొక్కా పట్టుకుని బలంగా లాగాను. అందుకు సిద్దంగా లేని అతను ఒక్క ఊపుతో వెనక్కి పడ్డాడు. చేతిలో వున్న మధు జారి మంచం మీద పడింది.
ఒంటరిగా వున్న ఆడదాని దగ్గరి నుంచి పసిపిల్లను తీసుకోవడానికి యింత కష్టపడవలసి వస్తుందను కున్నట్లు లేదు. రోషంగా లేచాడు. తోక తొక్కినా త్రాచల్లే. జేబులోంచి కత్తి తీసి దగ్గరగా వచ్చాడు. నేను పెనుగు లాడబోతుంటే నా వెనక నుంచి చెయ్యి వేసి గట్టిగా రెండు చేతులు పట్టుకున్నాడు. కండలు తేలి, కంచుకోటల్లె వున్న అతని చేతుల మధ్య నుంచి తప్పించుకోవడం నా వశం కాలేదు. ఆ చేతుల మధ్య బందీ అయిన నాకు వూపిరిరాడనంతగా వుంది. "మధూ" ఒక్క అరుపు అరిచాను. అంతకంటే ఏం చేయాలో తెలియని ఆ క్షణంలో నడి సముద్రంలో గడ్డిపోచలా అది తప్ప ఎవరూ లేరు.
అంతవరకూ మమ్మల్ని చూస్తూ వణికి పోతున్న మధు వెంటనే మంచందిగింది. నా కేక విని. "వదులు అమ్మను కొట్టకు..... అమ్మకు నొప్పి..... ఏదో నోటి కొచ్చినట్టూ అరుస్తూ ప్రక్కగా వున్న రోకలి బండను ఎత్తి గట్టిగా ఒకటి మోదింది.
కుప్పలా కూలుపోయాడు వెంకన్న. రొంటిన వున్న డబ్బంతా గదంతా జారి పడింది. అతని తల నుండి కారుతున్న రక్తం వెల్లువై ప్రవహించింది.
"అబ్బా" అని అరుస్తూ పక్కకి పడిపోయిన అతన్ని బిత్తరపోయి చూడడం మొదలు పెట్టింది. పెద్దగా వురుముతో వచ్చిన మెరుపు ఇల్లంతా నిండింది. వెండిలా వచ్చిన వెలుగు లో వరదలా పారుతున్న రక్తాన్ని చూస్తుండగానే మాధవి కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. ఒక్కసారి కెవ్వున అరిచి క్రింద పడిపోయింది.
ఆ క్షణంలో నాకేం చెయ్యాలో పాలు పోలేదు. మెదడంతా మొద్దుబారి పోయింది. నన్ను నేను నిగ్రహించుకుని , జరిగినది గ్రహించేటప్పటికి చాలాసేపు పట్టింది.
అచేతనంగా వున్న వెంకన్న ను చూస్తుంటే కడుపులో ఏదో భయం కెలక సాగింది. నీరసించి పోతున్న మనసుతో బలవంతాన లేచి మాధవిని ఎత్తి మంచం మీద పడుకో బెట్టాను. నెల మీద వున్న డబ్బంతా తీసి ఓ గుడ్డలో మూట కట్టాను.
నా చిన్నతనం నుండి అండగా వున్న ముసలమ్మ తప్ప నాకా క్షణంలో మరెవ్వరూ కనిపించలేదు. గబగబా పక్కింటికి వెళ్ళి, ముసలమ్మ ను లేపి క్లుప్తంగా చెప్పి డబ్బు చేతికిచ్చాను. ముఖం నిండా నీళ్ళు కుమ్మరించి బలవంతంగా మాధవిని లేపి లాక్కెళ్ళి వాళ్ళింట్లో వదిలేశాను. యీ వూరికి తీసుకు వెళ్ళమని.
ఊరికి దూరంగా వుండటం వల్ల కొద్ది రూరం లోనే స్టేషను వుంది. వర్షం లో తడుస్తూనే పోతున్న మాధవిని గట్టిగా పట్టుకుని వణికిపోతూ రైలు వైపు వెడుతున్న వాళ్ళు కనుమరుగు అయ్యేవరకు చూస్తూ నిలుచుండి పోయాను.
ఆ అలజడి. ఎదురుగా చెట్టులా పడి వున్న వెంకన్న . తోచని కర్తవ్యం నన్ను మూడురాల్ని చేశాయి. శక్తంతా హరించుకు పోయింది అయోమయంగా చూస్తున్న నాకు తెలియకుండానే పక్కకి పడిపోయాను.
నాకు మెలకువ వచ్చేటప్పటికి యింటి నిండా జనం, పోలీసులు ఒకటే హడావుడి. కళ్ళు తెరిచి తెరవకుండానే ఏవేవో ప్రశ్నలు వేయసాగారు.
నాకు తోచినట్లు తలాతోకా లేకుండా చెప్పాను. నేను షాక్ లో వున్నానని యింకేమీ ప్రశ్నించ కుండా వాళ్ళతో పాటు స్టేషన్ కు తీసుకు పోయారు.
నా వృత్తి చాలా మందికి తెలియడం వల్ల నేను చెప్పింది తేలికగా నమ్మారు. "వెంకన్న ఎవరో నాకు తెలియదని. మోటుగా ప్రవర్తించి , పిచ్చి వాడిలా పొడవడానికి కత్తి తీశాడని , ఆత్మరక్షణ కోసం రోకలితో కొట్టానని చెప్పాను. వెంకన్న చేతిలో కత్తి కూడా వుండటం తో నన్ను తేలిగ్గా నమ్మారు. నాకు స్వల్పంగా శిక్ష వేసి జైలులో వుంచారు.
వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుసుకుని మాధవి ఏమయిందని ప్రశ్నించారు. వారం రోజుల క్రితం తెలిసిన వాళ్ళ దగ్గరకు పంపానని , శిక్ష పూర్తయ్యే వరకు అక్కడే వుంటుందని అన్నాను. ఏమనుకున్నారో ఏమో మళ్ళీ దాని మాట అడగలేదు.
జైలులో వున్నప్పుడు కూడా జమిందారు ఆయన ప్రయత్నం మానలేదు.
అయన మధు మీద ఆశ వదులుకోక పొతే జరిగింది జరిగినట్లు చెప్తానని, వెంకన్న చేత పంపిన డబ్బు కూడా చూపిస్తానని బెదిరించాను. ఆ తరువాత, ఆయనేమయ్యారో.... ఏమిటో నాకు తెలియనే తెలియదు, తెలుసుకోవాలన్న కోరిక కూడా లేకపోయింది.
శిక్ష అనుభవిస్తున్నన్నాళ్ళు నాకు ఒకటే చింత ఆ ఒక్కరాత్రి మాధవి ప్రత్యక్షంగా చూశాక, ఆ సంఘటన దాని జీవితం మీద ఎలాంటి ప్రభావం తెస్తుందా అన్న భయం నన్ను వదలలేదు. మాధవే మరిచిపోగలిగితే - మళ్ళీ జన్మలో ఆరోజు దానికి జ్ఞాపకం రాకపోతే....... అదే ఆశతో బ్రతికాను నిజానికి అదే ఆశ నన్ను బ్రతికించింది.
శిక్ష పూర్తీ చేసుకుని వెదుక్కుంటూ ఈ వూరు చేరాను. చావుకు సిద్దంగా ఉండి కూడా మాధవిని కళ్ళలో వత్తులు వేసుకుని చూస్తోంది ముసలమ్మ. నెలల తరువాత నా రాక చుట్టూ పక్కల వాళ్లకు ఆశ్చర్యం కలిగించింది. నేనో దిక్కు లేని దాన్నని, తనకు ఆసరాగా వుంటానని దగ్గరకు తెచ్చుకున్నానని ముసలమ్మ అందరితో చెప్పింది.
ఇక్కడి కొచ్చాక మాధవిని చూచాక నాకు పోయిన పెన్నిదేదో దొరికినట్లయింది. గడచిన ఆ రాత్రి మాధవి పూర్తిగా మర్చిపోయిందని నేను తెలుసుకున్నాక అనుభవించిన ఆనందం నా జన్మలో అనుభవించలేదు.
పీడకలలా అప్పుడప్పుడు దాని మనసులో మెదిలే భయాలకు నాకు ఏం చెయ్యాలో తెలియలేదు. మానసికంగా మరిచిపోయినా, అకాళరాత్రి చిహ్నాలు అజ్ఞాతంగా మనసులో స్థావరం చేసుకుని, దాన్ని భయపెడుతూనే వున్నాయని నాకు తెలుసు.
అవి పూర్తిగా మరుగు పడిపోవాలని నాకు చేతనయినది చేశాని దాన్ని నీతి నియామాలతో పెంచాలని చదువు, సంస్కారాలతో తీర్చి దిద్దానని......" యింక మాట్లాడ లేకపోయింది రాజ్యలక్ష్మీ. బుగ్గల మీంచి ధారలుగా కారిపోతున్న కన్నీళ్లు ఆమెను మాట్లాడనీయకుండా చేశాయి.
ధారావాహికంగా ఆమె చెప్తున్నది వింటుంటే ఎంతకాలం గడిచింది ఎవరికీ తెలియలేదు. చాలాసేపు మౌనం వలన నిశ్శబ్దం అవరించుకుంది. బయటపడుతున్న వాన చప్పుడు మెల్లిగా వినిపిస్తోంది.
కూర్చున్న చోట నుంచి లేచి కిటికీ వైపు వెళ్ళాడు ప్రభాకర్ చెమర్చిన కళ్ళను.....చెమట పట్టిన నుదుటిని తుడుచుకుంటూ.
మెల్లిగా కిటికీ తలుపులు తెరిచాడు. బయట యింకా సన్నగా వాన పడుతూనే ఉంది. కాని యిందాకటి ఉదృతం తగ్గింది. ప్రళయం తరువాత మెల్లిగా అవరించబోయే ప్రశాంతం లా నిట్టూర్చాడు.
అతనికి వెనక్కి తిరిగి వాళ్ళిద్దరరింక చూడాలనిపించలేదు. బరువెక్కిన హృదయాలతో కలత బారిన మనసుతో బయటకు చూస్తూ చాలాసేపు గడిపాడు. అతని మనసంతా సానుభూతి లాంటి భావం నిండిపోయింది. సానుభూతి ?..... హు సానుభూతి చాలే జీవితాలా యివి' అనుకున్నాడు బాధగా.
