Previous Page
మరుపులో మెరుపులు పేజి 24

 

    రాజ్యలక్ష్మీ చెప్పిన ప్రతి వాక్యం చెవుల్లో మారుమ్రోగుతోంది. ప్రపంచంలో ఎందుకిలా కొన్ని జీవితాలు యింతగా అన్యాయమయి పోతాయి? ఏం సుఖాలు లేకపోయినా , పుట్టిన ప్రతి ప్రాణికి, అవసరమయిన వాటికి జరిగే పోరాటం లో యింత దారుణమా?....... దానికి ఫలితం యింత కఠినంగానా?
    పదిమందిలో సగర్వంగా తిరిగే అదృష్టం లేక పోయినా , కనీసం 'నా' అనుకునేందుకు ఒకరైనా లేకుండా, బ్రతికిన బ్రతుకంతా బాధల మాయమయి, కసి, కోపం - ప్రతీకారం, తప్ప - ఆత్మీయత అనే పదానికి అర్ధమే తెలియకుండా .........ఓ........గాడ్ ఏం జీవితాలు......?" అనుకున్నాడు.
    పూసిన మొగ్గ వికసించను కూడా వికసించక మునుపే, యినప చక్రం క్రింద నలిగి పోయి అంధకారం తప్ప. కాంతి కిరణమే లేని ఆ జీవితాన్ని భరించిన రాజ్యలక్ష్మీ ని గురించి ఏమనుకోవాలో తెలియలేదు ప్రభాకర్ కి.
    పసితనం వదలని వయస్సు, అర్ధం కాని వాతావరణం లో అలాంటి దారుణమయిన రాత్రిని కళ్ళారా చూసిన కుసుమ...... ఆఫీసులో వురుములకు భయపడి తనకు చెరువుగా వచ్చిన సంఘటన గుర్తుకు వచ్చింది. క్రింద ఒలికిన ఎర్ర సిరాను చూస్తూ తన గుండెల్లో ముఖం దాచుకున్న కుసుమను తలచుకుంటూ బలంగా నిట్టూర్చాడు .
    వాళ్ళిద్దరిని వంటరిగా వదిలేసి తనక్కడి నుండి వెళ్ళిపోదామనుకున్నాడు. అంతలోనే ఆ ఆలోచన మానుకుని మౌనంగా బయటకు చూస్తూ వుండి పోయాడు.
    గదంతా నిశ్శబ్దం అవరించుకుంది. ఆలోచనలతో అలసిపోయిన కుసుమను శరీరంలో శక్తంతా హరించుకు పోయినట్లయింది. మంచాని అతుక్కుపోయిన కుసుమ తల్లి నోటి వెంబడి విన్న ప్రతి సంఘటన, ఎన్నడో చూసిన నిజానికి ప్రతిబింబమై మెదలసాగింది. బుద్దితెలిసిన నాటి నుండి అజ్ఞాతంగా, అందీ అందకుండా మనసులో మెదులుతున్న భావాలకు ఓ రూపం చేకూరం గానే , కొన్నేళ్లుగా సాగిస్తున్న అన్వేషణ లో అలసిపోయి వదులుకున్న ఆశ ఎదురుగా నిలచినట్లయింది. తనని వదలని భయాలను తలచుకుంటుంటే తెలియకుండానే, మనసంతా ఓ దూది పింజలా తేలికగా అనిపించసాగింది. మరుగున పది పోయిన జ్ఞాపకాలను తవ్వి తీస్తున్న కొద్ది ఏదో అర్ధం కాని ఆవేదన కుసుమను విడవకుండా వెంటాడింది.
    అక్రమంగా పుట్టి, అబద్దాలతో పెరిగి, దొంగగా అవడానికి కూడా వెనకాడని తనని తల్చుకుంటుంటే మనసంతా జుగుప్స తో నిండిపోయింది. 'తన జీవితం అసలు ఎందుకిలా అవాలి?.... తనేం పాపం చేసిందని..... అందరి ఆడపిల్లల్లాంటి , అందమయిన జీవితం లేకపోయినా, అందరిలా నా అని చెప్పుకునేందుకు తల్లి, తండ్రి..... ఆప్యాయత..... తండ్రి.....చిన్నతనంలో ఎన్నిసార్లు వూహించుకో ప్రయత్నించింది. నాన్నను గురించి.... అంత అన్యాయం భరించినా, అమ్మ ఏనాడు నాన్నను గురించి చెడుగా చెప్పలేదు. పని నుంచి యింటికి వస్తూ లారీ క్రింద పడి చనిపోయాడని తానింత కాలం నమ్మింది. చిన్నప్పుడు ఎన్ని రాత్రులు నాన్న వుంటే ఎలా ఉండేదో వూహిస్తూ గడిపింది? అందరి నాన్నలా తన్ని ప్రేమగా చూచేవాడని..... కోరిన వన్నీ ఎదుట వుంచి.... ఎత్తుకు లాలించి.... భగవాన్.... తన అసలు తండ్రి కి తన ఆగమనం కూడా తెలియదు.
    తనకు ఊహ తెలిశాక ఎన్నిసార్లు అమ్మను ఆడగబోయిన మాట తప్పించేది. ఒకసారి తను బలవంత పెట్టేసరికి "గతించిన వాటిని గురించి పోనివ్వకుండా వుండటం ఎప్పుడూ మంచిది కాదు. మరణించిన వాళ్ళను గురించి, మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడం వల్ల మనసు బాధపడటం తప్ప మరేం జరగదు. మీ నాన్నను గురించి చెప్పాల్సింది చెప్పాను. యింకేప్పుడూ అడగకు." అంది.

 

                       
    నిజమే ఎదురుగా తనకోసం అన్ని కష్టాలు భరించిన అమ్మను కాదని- లేని నాన్నను గురించి తనేం ఆలోచించింది. తన తల్లి జీవితం నరక ప్రాయం చేసిన ఆ వ్యక్తిని గురించి తనెందుకు ఆలోచించాలి?'
    ఆ క్షణంలో కుసుమ మనసులో కోపం సుళ్ళు తిరిగింది. మనసులో ఏవేవో ఆలోచనలు చోటు చేసుకున్నాయి. రకరకాల సంఘటనలు ఒకదాని వెనుక మనసులో తరుముకు వచ్చాయి. ఆవేశమంతా అవిరిలా హరించి పోయింది.
    ఒక్కసారి ధైర్యంగా తల్లి వంక చూచింది. గతాన్ని తవ్వి మరుగున పడిన స్మృతులను జ్ఞప్తి కి తెచ్చుకుని, అలసిపోయిన ఆమె ముఖం చూస్తుంటే , ఏదో అపరాధం చేసినట్లు బాధపడింది. ఒక్కసారి అమ్మ దగ్గరకు పరిగెత్తి ఆమె వడిలో ముఖం దాచుకోవాలని పించింది. కాని ఏ పనికి ఓపిక లేనంతగా నీరసం ఆవరించింది. నిర్లిప్తంగా , నీరసంగా వున్నచోటే వుండిపోయింది.
    నిముషాలు నిశ్శబ్దాన్ని అనుసరించ సాగాయి. ఎవరికి వారే ఆలోచనలను ఆశ్రయించారు.
    చాలాసేపటికి ప్రభాకర్ లేచి కుసుమ పక్కగా వచ్చాడు. వాచి వంక చూసుకుని మెల్లిగా కుసుమ భుజం మీద చెయ్యి వేసి నొక్కాడు. సజల నయనాలతో కళ్ళెత్తి చూసింది. ఆ గదిలో ఆ వ్యక్తీ అప్పుడే ప్రత్యక్షమయినాడా అన్నట్లు, జ్వరపడి లేచి నీరసించినట్లున్న, ఆమె ముఖంలోకి చూచి మృదువుగా నవ్వాడు.
    మెల్లిగా లేచి అమ్మ దగ్గరకు వెళ్ళి చేతి మీద చెయ్యి వేసి నొక్కింది. కుసుమ ఆమె కళ్ళ వెంబడి రాలిపోతున్న నీటి చుక్కలు ఒకటొకటి గా రాలి ఆ చేతి మీద పడసాగాయి.
    మధూ అంటూ తల మీద చెయ్యి వేసి గుండెల దగ్గరగా చేర్చుకుంది. తల్లి గుండెలో ముఖం దాచుకున్న కుసుమకు మును పెన్నడూ లేనంత దగ్గరగా అనిపించసాగింది. అలా యెంత సేపుందో ఆమెకే తెలియదు.
    కొద్దిగా తేరుకుని మెల్లిగా లేచి ప్రభాకర్ ప్రక్కగా వచ్చి నిలబడింది. సుదీర్ఘంగా నిట్టూర్చి లేచి నుంచుంది రాజ్యలక్ష్మీ వాళ్ళిద్దరి మనసులు మూగగా బాధపడుతున్నాయి. ఏ ఒక్కరికి రెండవ వాళ్ళ నీడ కూడా చూడాలని పించడం లేదు. ఎవరికి వారే ఒంటరితనాన్ని కోరుతున్నారు.
    "మాధవి బాగా అలసిపోయింది. మళ్ళీ ఓ వారం రోజులు పోయాక తీసుకు వస్తాను." అన్నాడు ప్రభాకర్ ఆమె ముఖం వంక చూడకుండానే, మంచం మీద వున్న కోటును అందుకుంటూ.
    ఒక్కసారి సజల నేత్రాలతో గదంతా పరికించి చూసి బలంగా నిట్టూర్చింది కుసుమ. మౌనంగా ప్రభాకర్ ను అనుసరించింది.
    "చూడండీ!" వెనకగా వినవచ్చిన మాట వింటూ యిద్దరూ వెనక్కి తిరిగారు. ఎందుకో కుసుమ గుండెల్లో ఒక్కసారి దడదడ లాడింది. ఆ క్షణంలో యింకా ఏం వినాల్సి వస్తుందో అనిపించింది.
    "అనాధగా పరిచయమయిన మధును అలాగే వుండి పోనివ్వండి. యిప్పుడా యీ కొత్త అనుబంధాలను నాకు అనుభవించాలని కాని, అందరిలో తిరగాలని కాని లేదు. అజ్ఞాతంగా గడిచిపోయిన జీవితం యిలాగే గడపాలని నా కోరిక." అంది. గద్గాదికంగా వినవచ్చిన ఆమె కంఠం వింటూ యిద్దరూ చలించి పోయారు.
    అవి మాటలు కావు! తప్త హృదయం లోంచి తోసుకోచ్చిన సజీవ రక్త బిందువులు! సానుభూతి గా చూస్తూ ఆగిపోయాడు ప్రభాకర్. యింకా ఏమయినా చెప్తుందేమో అన్నట్లు.
    యింతకాలం నాకు ఒక్కటే చింతగా వుండేది. ఎలాంటి జీవితం గడిపినా, "నా" అనుకునేందుకు నా పాప వుంది. అది కూడా లేకుండా మధు వంటరిదై పోతుందేమో నని అనుకున్నాను. యివాళ ఆ భయం కూడా తీరిపోయింది." అంది నిర్లిప్తంగా నిట్టురుస్తూ.
    ఒక్క క్షణం కళ్ళెత్తి ప్రభాకర్ వంక చూచింది కుసుమ- యిద్దరి కళ్ళూ ఒకే భావాన్ని సూచిస్తున్నాయి. వెంటనే తడబడే అడుగులతో తల్లికి దగ్గరకు వెళ్ళి, భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా జరిగింది.

                                                                32
    బయట వర్షం బాగా తగ్గింది . మధ్య మధ్య మెరుపులు మాత్రం వచ్చి పోతున్నాయి. తేమగా వున్న గాలి చిరు చలిని కలిగిస్తోంది. వూరంతా నిశ్శబ్దంగా వున్నా గాలికి చెట్ల మీంచి పడే నీటి చుక్కలు. పల్లానికి పరిగెడుతున్న వాన నీళ్ళు కలిగించే లయబద్దమయిన శబ్దం ఆహ్లాదకరంగా వినిపిస్తోంది. భీభత్సం తరువాత ఆవరించిన ప్రశాంతి లో, భయపడి తల్లి వడిలోకి వరిగిన పసిబిడ్డలా వుంది ప్రపంచం.
    దాదాపు అదే స్థితిలో వున్న మనసుతో ప్రభాకర్ వెనుకనే బయటకు వచ్చింది కుసుమ. చుట్టూ పరికించి చూస్తూ నిలబడిపోయింది. చటుక్కున వచ్చి, పోయిన మెరుపును చూస్తుంటే, ఎప్పటిలా భయమనిపించ లేదు కుసుమకు. గాడాంధకారం అలుముకున్న మనసులో అదో కాంతి కిరణం లా తోచింది. నిశ్శబ్ధమయిన నిశీధం లో నుంచుని వున్నా, మనసంతా ఏదో వెలుగుతో నిండి పోయింది. నిశ్చింత ఒక రకమయిన నిబ్బరాన్ని కలిగిస్తూ వున్నా, ఆవరించిన నీరసం ఆమెను వదిలి పోలేదు.
    "కుసుమా?......." పిలిచాడు ప్రభాకర్. "చెప్పు" నాతొ రావాలని వుందా.....యిక్కడ వుండాలని వుందా?' అడిగాడు.
    ఏం జవాబు చెప్పాలో తెలియక మౌనంగా వుండిపోయింది.
    "నేను మొన్న బొంబాయి వెళ్ళినప్పుడు డాక్టర్ ని కలిశాను. నాకు తెలిసినంత వరకు నీ విషయాలన్నీ చెప్పాను. అతనే చెప్పాడు. మనసులో పూర్తిగా మరుగు పడని భయాలు యిలా మధ్య, మధ్య భయపెడుతూనే వుంటాయి. జ్ఞప్తికి వస్తే గాని మనం చేయగలిగింది ఎక్కువగా వుండదు. అయనా, నిన్ను తప్పకుండా తీసుకు రమ్మనమన్నాడు...." ఆగిపోయాడు . కుసుమ ఏమంటుందో అని.
    అంతకూ ఏమీ మాట్లాడని కుసుమ వైపు చూచి, 'ఆ డాక్టర్ వల్ల నీకు మానసికంగా సంపూర్ణంగా ఆరోగ్యం చేకూరిందంటే-- యిక నీ స్వేచ్చకు నా అడ్డెం వుండదు." అన్నాడు అతి మెల్లగా. అతని కంఠం లో మార్పు, అంత వరకు ఎన్నడూ వినని విధంగా వున్నా అతని మాటల ధోరణి ఆమెను ఆశ్చర్య పరిచాయి.
    ఆ క్షణం లో ఆమె మనసులో ఎన్నో చెప్పాలనిపించింది. కాని ఏ ఒక్కటి పెదవి విప్పి చెప్పలేక పోయింది. ఏమీ మాట్లాడ కుండానే కారు దాకా నడిచింది.
    కుసుమ పక్కగా నడుస్తూ మరేమీ మాట్లాడ కుండానే వంగి కారు డోర్ తెరిచాడు. కారు ఎక్కబోతూ, ఆగి డోర్ దగ్గరగా వున్న అతనికి చేరువగా వచ్చింది.
    "నాకు ఏ డాక్టర్లూ అవసరం లేదు. కొద్ది రోజుల్లో నాకు నేనే సద్దుకో గలను. కాని ఒక్క వారం రోజులు మనం ఎక్కడి కయినా వెడదాం. నాకెవరిని చూడాలని గాని, మాట్లాడాలని గాని లేదు. ప్లీజ్" అంది అభ్యర్ధనగా.
    ఒక్క క్షణం ఆమె వంక తదేకంగా చూశాడు. "కుసుమా....కాదు....మాదూ....' అంటూ రెండు చేతులు ఆమె చుట్టూ వేసి హృదయానికి హత్తుకున్నాడు బలంగా.
    "నేను మధును కాదు మీ కుసుమనే....' అంటూ ఆ ఒక్క చోట తప్ప తన భయాలు తీరి నిశ్చింత కలిగే , మరో ప్రదేశమే లేనట్లు అతని చేతుల్లో ఒదిగిపోయి గుండెల్లో ముఖం దాచుకుంది.
    అలాంటి పరిష్వంగం కోసం కొన్ని నెలలుగా ప్రభాకర్ వేచి వున్నా - అ క్షణం లో అతని కెలాంటి అవేశమూ కలుగలేదు. కేవలం ఏదో సాధించగలిగాననే సంతోషం, కష్టించి పని చేసినప్పుడు సత్ఫలితాన్ని చూచినప్పుడు కలిగే సంతృప్తి తప్ప.
    కారుమబ్బులతో పోరాడి అలసిపోయిన చంద్రుడు హాయిగా పయనిస్తున్నాడు. వర్షం లో తడిసిన పక్షి టపటపా రెక్కలు కొట్టుకుని పిల్లలకు మరింత దగ్గరగా జరిగింది. ప్రళయం తరువాత ఆవరించిన ప్రశాంతంలో విశ్రాంతిగా వాలింది విశ్వం.

                                                       (సమాప్తం)


 Previous Page

WRITERS
PUBLICATIONS