Previous Page Next Page 
మరుపులో మెరుపులు పేజి 22

 

    దైహికంగా అతని చేతుల మధ్య వున్నా -- కుసుమకు ఆరోజు ప్రభాకర్ అనే వ్యక్తికీ కొన్ని మైళ్ళ దూరంలో వున్నట్టు అనిపించింది. విసుగ్గా తలుపు ,మీద గబగబా కొట్టాడు ప్రభాకర్.
    సన్నగా తలుపు తెరుచుకుంది. ఎవరో అని వంగి చూసేందుకు కూడా అవకాశం యివ్వకుండా ఒక్కసారిగా తలుపు తోసి లోపలికి వెళ్ళి తలుపులు మూశాడు. అంతవరకు భయంగా వణికిపోతున్న కుసుమ ఒక్క వూపులో వెళ్ళి మంచం మీద పడింది.
    అంత రాత్రి వేళ అనుకోకుండా అపరిచిత మయిన వ్యక్తితో - వచ్చిన కూతురిని చూస్తూ తెల్లబోయింది. రాజ్యలక్ష్మీ మంచం దగ్గరగా వెడుతూ
మధూ!" అంది ఆతృతగా.
    తలుపు దగ్గరగా నిలబడి పోయి, కుసుమ వైపు వెడుతున్న రాజ్యలక్ష్మీ ని పరిశీలనగా చూచాడు ప్రభాకర్. గదంతటికీ , మసగ మసగ్గా వున్న లాంతరు వెలుగులో కూడా స్పష్టంగా కనుపించింది ఆమె ముఖం. కాంతి హీనమై, పాలిపోయినట్లున్న ముఖంలో కూడా కుసుమ పోలికలు స్పష్టంగా కనుపించాయి. బాధలకు, ఎదురు నిలిచి మానసికంగా కరుకు బారి పోయినట్లు కళ్ళ క్రింద నల్లటి చారలు చోటు చేసుకున్నాయి. లేని వయసు చూపుతున్న ఆమె ముఖం వంక చూడలేనట్లు తల వంచుకున్నాడు.
    "ఎవరు మీరు?' అడిగింది రాజ్యలక్ష్మీ. ఎక్కడా తొణుకు లేని కంఠధ్వని ఒక రకమయిన నిశ్చలత్వాన్ని తెలుపుతోంది.
    కొద్ది క్షణాలు తటపటాయించాడు....."నేను....నేను మాధవి భర్తను." అన్నాడు ఆమె వంకే చూస్తూ. వులిక్కిపడింది. వెంటనే నమ్మలేనట్లు చూచింది. ఎర్రబారిన కొలకులతో, సూటూ, బూటుతో సంపన్నుడి లా వున్న నిలువెత్తు మనిషి మాధవికి భర్తంటే నమ్మలేకపోయింది. ఆమె కళ్ళలో అనుమానాన్ని గమనిస్తూ -----
    "కాని మీ అమ్మాయి మగవాడి నీడ కూడా భరించలేదని మీకు తెలుసా?' చాలా సూటిగా అన్నాడు. అంతవరకు ప్రసన్నంగా వున్న ఆమె ముఖంలో కఠినత్వం పొంగి కారింది.
    "ఆడదై పుట్టి -- అందులో అందమున్న ఆడదానికి అలాంటి వరం కలగడం కంటే మరో అదృష్టం లేదు."
    ఆశ్చర్యంగా చూచాడు. సుదీర్ఘంగా నిట్టూర్చాడు. అంతలోనే అతని కనుబొమలు ముడి పడ్డాయి.
    "మీ అమ్మాయి అంగీకరించలేని సుఖాల తోనే మీరు జీవించడానికి సిద్దపడ్డారన్న విషయం నాకు తెలుసు."
    కోపంతో కందిపోయినట్లున్న ముఖం రక్తం లేనట్లు పాలిపోయింది. ఒక్క క్షణం తెల్లబోయి చూస్తూ "మీరు ఎవరో నాకు తెలియదు. నా వ్యక్తిగత విషయాలు మీ కనవసరం తక్షణం నా యింట్లోంచి వెళ్ళండి." తలుపు తెరిచి పట్టుకుంది. బయట జోరుగా వీస్తున్న గాలి ఒక్కసారి యిల్లంతా వూపింది. మిణుకు మిణుకుమంటున్న దీపం ఆరిపోయింది. గదంతా చీకటి మయం. బయట వర్షపు హోరు. చీకట్లు చీల్చుకుంటూ కత్తి లాంటి మెరుపు కాంతి వంతమై ఆరిపోయింది. ఎక్కడో పడ్డ పిడుగు భూమి దద్దరిల్లెట్టు మ్రోగింది.
    కెవ్వు మంది కుసుమ.
    "మధూ." అంటూ ఒక్క అడుగు వేసింది రాజ్యలక్ష్మీ.'    తడుముకుంటూ వెళ్ళి లాంతరు వెలిగించాడు ప్రభాకర్. చేతుల మధ్య తల వుంచుకుని మధ్య మధ్య అస్పష్టంగా అంటోంది. "అమ్మా వద్దు.... నాకు భయం.... తలుపు తెరవకు...."
    "మధూ.....లే.....నీకు ఏదో పాడు కల వస్తోంది....." లేవబోతున్న  రాజ్యలక్ష్మీ ని బలంగా పట్టుకు ఆపాడు.
    "ఆమెను గుర్తుకు తెచ్చుకోనివ్వండి. ఈ భయంతో గతమో, వాస్తమో తెలియని అయోమయంలో గడపడం ఆమెకు ఏవిధంగానూ శ్రేయస్కరం కాదు. గుర్తుకు తెచ్చుకునేందుకు సహాయం చేయండి."
    అచేతనంగా వుండిపోయిన కుసుమ దగ్గరగా వెళ్ళి ముందున్న బల్ల మీద ముని వేళ్ళతో కొట్టాడు.
    "గుర్తుకు తెచ్చుకో కుసుమా?...... ఈ వేళ్ళ చప్పుడు వింటే నీకెందుకు భయం?"
    "ఎవరో వస్తారు....అమ్మ తలుపు తీస్తుంది. నన్ను వంటరిగా వదిలేసి వాళ్ళతో వెళ్ళి పోతుంది. నాకు చీకట్లో భయం.... వంటరిగా తలుపు తీయద్దు.....అస్పష్టంగా అర్ధం కాకుండా అంటోంది.
    ఒక్కసారిగా కుసుమకు దగ్గరగా వచ్చి "లే! మధూ" బలవంతంగా భుజాలు పట్టుకు వూపింది రాజ్యలక్ష్మీ. అసహనంగా చూచాడు ఆమె వంక. "మీదీ వూరు కాదని.... సిరిపురం జమిందారు గారి కేసులో శిక్ష కూడా భరించారని నాకు తెలుసు. మీ   అంతట మీరు చెప్తే ఎంతయినా ప్రయోజన ముంటుంది లేదా నేనే చెప్పాల్సి వస్తుంది. నాకు అన్నీ తెలుసు."
    "మీకేమీ తెలియదు. అసలు ఎవ్వరికీ తెలియదు. నాకు తప్ప. ఆ నిజం నాతోనే అంతమయి పోవాలను కున్నాను. పసితనం లో మాధవికి కలిగిన మరుపు రాని అదృష్టం అనుకున్నాను. ఆ అదృష్టమే దాన్ని సంఘం లో ఒక మనిషిని చెయ్య నిస్తుందను కున్నాను." ఆగిపోయింది.
    "ఏం చెప్పను దానికి?....దాని తల్లి మావాడికి అమ్మిన సుఖాలతో దాన్ని పెంచిందనా? తండ్రి అనే వాడెవరో కూడా తెలియనీయ కుండా పెంచి, చివరకు ఆ పోరాటం లో జైలుకు కూడా వెళ్ళిందనా?..... అన్నం కూడా వండటం రాని వయస్సు లో దాని తండ్రి బలాత్కారానికి బానిసై , బ్రతుకంటే తెలియని వయస్సులో తల్లినై ...ఏం చెప్పను..... అది విని అది పొందబోయే దేమిటి? ఏది చెప్పగలిగినా, చెప్పలేకపోయినా , ఒక్కటి చెప్పగలను. జీవితంలో నాకున్న ఏకైక బంధం అది. దాని ఆగమనమే నా జీవితాన్ని నలిపి వేసినా, అది తప్ప నాకెవ్వరూ లేరు. దాని కోసం ఏ పని చెయ్యడాని కి వెనుకడ లేదు. నా శిక్ష కాలంలో దేవుడి నేదయినా ప్రార్ధించి వుంటే  కాళరాత్రి లాంటి ఆ రాత్రిని అది మర్చి పోగాలిగితే -- అ క్షణం వరకు దాని కీవితం లో పూర్తిగా తుడుచుకు  పొతే - సరికొత్త జీవితంతో, సంఘం లో ఒక మనిషయ్యేందుకు నా కంఠం లో వూపిరున్నంత కాలం ప్రయత్నం చేస్తానని."
    చుట్టూ నల్లబడి, కళావిహీనం అయిన కళ్ళు అంధకారాన్ని చీల్చుకుంటూ ఏదో చూడాలని ప్రయత్నిస్తున్నాయి. ముడతలు పడ్డ నుదురు , ముడుచుకున్న కను బొమలు ఏవో జ్ఞాపకాలను తవ్వాలని చూస్తున్నాయి. ఆవేశం, బాధ అన్నీ కలిసి అదురుతున్న పెదవులు మాటలకు తడబడుతున్నాయి.
    
                                       31
    "ప్రపంచంలో నా అనేవాళ్ళు లేని నాకు నువ్వెలా వచ్చావో తెలుసా మధూ. '
    చిన్న జమిందారు మూలంగా. షికారు కేడుతూ నన్ను చూచారుట కావాలనిపించానుట దాని అర్ధం కూడా తెలియని రోజుల్లో నాకు తెలిసినా తెలియకపోయినా , జమిందారు గారికి కావలసినవి ఆగలేదు.
    నువ్వు పుట్టబోతున్నట్లు తెలుసుకున్న నాకు ఏం చెయ్యాలో తోచలేదు. భయంతో పిచ్చిదాన్ని అయ్యాను. అంతవరకూ నాకు అండగా వున్న ముసలమ్మ నన్ను జమిందారు గారి దగ్గరకు తీసుకు వెళ్ళింది. కొదుకు చేసిన అన్యాయానికి కనికరించ మని వేడుకొంది. కనీసం పుట్టబోయే, బిడ్డను ఓ అనాధ గా అనయినా భావించి పెంచుకో మంది. అయన పరువు ప్రతిష్ట బజారు లో తిరిగే అమ్మాయి కోసం ఖర్చు పెట్టడానికి యిష్టపడలేదు.
    పెళ్ళి కాకుండా పిల్లని పెంచడానికి సిద్దపడిన నన్ను చుట్టూ పక్కల వాళ్ళు కాకుల్లా పొడిచారు నన్ను చూచి వాళ్ళ పిల్లలు చెడి పోతారని భయపడ్డారు . నా అంతట నేను వెళ్ళక పొతే నామరూపాలు లేకుండా చేస్తామని భయపెట్టేరు.    
    తత్పలితంగా ఎక్కడో వూరికి దూరంగా మారు మూల బ్రతకడం ప్రారంభించాను. చేతిలో చిల్లుగవ్వ లేదు. తోడుగా ఉన్న ముసలమ్మ కు పని చేసే ఓపిక లేదు. పాలకు ఏడ్చే పాపాయి. మంచి నీళ్ళతో తృప్తి పడని కడుపు నన్ను సర్వనాశనం చేయడానికి నిర్ణయించాయి. కళ్ళు మూసుకు భరించాను.
    నా అందాన్ని చూసి వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. జేబుల నిండా డబ్బులతో వినోదాలను కొనుక్కునేందుకు వచ్చేవారిని చూస్తుంటే నాకు తెలియకుండానే కసి పెరిగిపోయింది.
    అర్ధరత్రయ్యేటప్పటికి తలుపు మీద వేళ్ళ చప్పుడు వినిపిస్తూనే వుండేది. పెరుగుతున్న మాధవి అప్పట్లో అది మెలకువగా వుందని కాని, అది నన్ను గమనిస్తోందని కాని నాకు తెలియదు. ఒకవేళ తెలిసినా చేయగలిగిందేమీ లేదు.
    కొన్నాళ్ళ లో కొంత డబ్బు మూట గట్టుకుని అక్కడినుంచి పారిపోవాలని, పాత జీవితాన్ని మర్చిపోయి, నీతిగా, నియమంగా నాలా కాకుండా నా పాపను పెంచాలన్న కోరిక బలంగా వుండేది. అది కూడా భగవంతుడికి యిష్టం లేకపోయింది. నేను మళ్ళీ మనిషిగా బ్రతకడం అనవసరం అనుకున్నాడేమో , నా వూహలన్నీ తారుమారయ్యాయి.    
    ఆయేడే జమిందారుగారి కొడుకు చచ్చి పోయాడు హటాత్తుగా. డబ్బున్న వాళ్ళ మరణానికి ప్రపంచం కూడా సానుభూతి చూపుతుంది. అదే బీదవాడయితే , బరువయినా తగ్గిందనుకుంటారు. పెళ్ళి, సంసారం , ఏమీ లేకుండా చెట్టంత కొడుకు పోయేటప్పటికి , జమిందారు గారికి బెంగ పట్టుకుంది. అయన పాపపు సొమ్ముకు వారసుల్లెరే అని. అలాంటి సమయంలో అనుకోకుండా అయన దృష్టికి నేను గుర్తుకు వచ్చాను.

 

                            
    నేను మాధవిని అయన దగ్గర వదిలేసి వెళ్ళి పొతే నా జీవితమంతా ఏ చింతా లేకుండా గడిపేందుకు అవసరమయిన డబ్బు యిస్తానన్నారు. నాకు వళ్ళు మండి పోయింది. అటు వంటి ఏ సమయంలో కూడా నిన్ను చేరదీస్తా ననలేదు. నా పాపను వదిలి నేను వెళ్ళడం అనేది అసంభవం అని నిర్ణయించుకున్నాను. ఒక్కొక్కసారి పోనీ అది మాధవి భవిష్యత్తుకు మంచిదేమో అనిపించేది. కాని పూర్తిగా చిన్నతనం వదలని నాకు అయన మీద కసి తీర్చుకోవాలన్న కోరిక నాకు తెలియకుండానే నాలో పెరగసాగింది. నా జీవితం నాశనమవడానికి కారణం అయన కొడుకు. అయన వృద్ధాప్యం నిశ్చింతగా గడపడానికి నేను నా కూతురిని వదులు కోవాలా?  అంతే? ఏం మొండి తనం నాలో ప్రవేశించిందో అయన ఎన్ని ఆశలు పెట్టినా లొంగలేదు. పైగా మళ్ళీ కబురు చేశారంటే శాశ్వతంగా యీ ఊరు వదిలి పోతానని చెప్పాను.
    ఆయనకు కోపం వచ్చింది. బెదిరించారు. నేనుదేనికీ దడవలేదు. అది నాకున్న ఏకైక బంధం. దాన్ని నేను త్రెంచు కోలేను. దాన్ని డబ్బు కోసం అమ్ముకోలేను. నా పాపే లేకుంటే నే బ్రతకాల్సిన అవసరమే లేదు. నా బ్రతుకంతా వెచ్చించయినా మాధవిని నా దగ్గరే నా పాపగా పెంచుకోవాలి."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS