Previous Page Next Page 
నాలుగు మంచాలు పేజి 24


    'బాగా మరిగారే! సుఖ పడటం మీ చేతుల్లో వుంటే చేతకాని వారని పించుకోవటం ఏం బాగులేదు.'
    'మీ లెక్చర్లు దేవేంద్ర సభలో వేద రుఘుల సమక్షాన దంచండి.'
    'అప్పుడే నన్ను స్వర్గానికి పంపించేస్తారా?'
    శ్రీనివాస్ యీ ప్రశ్నతో సూర్యం తో పాటు ఆమె తడబడి పోతూ "అది కాదండి . మీ లెక్చర్లు మాకు అర్ధం కావు.'
    'మీలాంటి వాళ్లెందరో నన్ను అర్ధం చేసుకోలేదు.'
    'మీ భార్య కూడానా?'
    శ్రీనివాస్ నవ్వి మాటలు మార్చడానికి కామోసు 'మీకో కొన్ని యక్ష ప్రశ్నలు వేస్తాను. చెప్తారా?'
    'వెయ్యండి.'
    'శెట్టి గారు మీరు కూడా సమాధానం యివ్వాలి.'
    శ్రీనివాస్ : దైవికమైన చుట్ట మెవ్వరు?
        లాభాల్లో గోప్పడేది?
        సుఖాల్లో గోప్పదేది?
        ఎవడు చచ్చిన వాడితో సమానం?
    ఈ ప్రశ్నలు ఒకటి తరవాత ఒకటి వేసి సమాధానాలు తనే చెప్పసాగాడు.
    శ్రీని : దైవికమైన చుట్టం -- ప్రేయసి
        లాభాల్లో గొప్పది -- ఆమె చూపు
        సుఖాల్లో గొప్పది -- ఆమె చూపు
        సుఖాల్లో గొప్పది -- సంసార సుఖం
        ఎవడు చచ్చిన వాడితో సమానం -
            ఇవేవీ లేని వాడు.
    సూర్యం నవ్వి 'మీ స్వంత కూర్పు బాగుంది. గానీ-- ఈ యక్ష్ ప్రశ్నలకు ధర్మరాజు ఏం సమాధానం చెప్పాడో చెప్పండి.'
    'జ్ఞాపకం లేదండి.'
    'అయితే వినండి. దైవిక మైన చుట్టం -- భార్య , లాభాల్లో గొప్పది- ఆరోగ్యం , సుఖాల్లో గొప్పది - సంతోషం , దరిద్రుడు చచ్చినవాడితో సమానం.'
    శెట్టి గారు లేచి ముందుకు వస్తూ 'ధర్మరాజు గొప్పగా చెప్పాడండి. భార్య, ఆరోగ్యం , సంతోషం, డబ్బు లేకపోతె ఏం జీవితం అండీ? చింతతో కూలి పోవలసిందే!'
    'ఆలోచించండి. మనలో యీ నాలుగులో యెవరికి యేమి లేవో?' శ్రీనివాస్ అందుకున్నాడు.
    సూర్యం ఆలోచించుకున్నాడు. మొదటి మూడు తనకు లేవు. ఆ మూడూ లేకపోతె నాలుగోది వున్నా సుఖం లేదు. అతనికి సంతోషం రావాలంటే డబ్బు ఒక్కటే కాదు. భార్య వుండాలి, ఆమె శ్రద్ధ తీసుకుని తన ఆరోగ్యం సరి చేస్తుంది.
    'పొడుం పీల్చండి.' అన్నాడు శ్రీనివాస్.
    'అమ్మో-- మీ ఎదర నీకిస్తే తుమ్ము లోస్తాయ్.'
    'నాకు తెలిసింది మీరెక్కడ పీలుస్తారో?'
    'ఎక్కడండీ?'
    'దేవేంద్ర సభలో రంభా, వూర్వసుల మధ్య.'
    'వాళ్ళలో నన్ను చేర్చారు -- నాకు నాట్యం చేత కాదు సార్.'
    'నేను నమ్మను.'
    'నిజంగా రాదు.'
    'నిన్న నాట్యం చేసారు.'
    'ఎక్కడండీ!'
    'మా ఎదరగా తుమ్ముల మద్దెల వాగుతుంటే తమరు తైతక్కలాడలేదూ?'
    'మీతో మాట్లాడలేం బాబూ -- ఎన్నెన్నో అర్ధాలు కల్పిస్తారు.'
    'ఏదో సినిమాలో ఒక ప్రేమికుడన్నట్లు అన్నారు.'
    'ఏమన్నాడు?'
    'ఆడవాళ్ళ మాటలకు అర్ధాలే వేరులే అని.'
    'ఏమైనా మీరు నన్ను గెలవలేరుగా.'
    'నేను గెలవక పోయినా -- నా పొడుం గెలిచింది.'
    'ఎలా?'
    'మీ కాళ్ళు యిది వరకు గాలిలో వుండేవి. ఇప్పుడు భూమ్మీద వున్నాయ్.
    'చూడండి.' అంటూ సూర్యాన్ని మధ్యను పెట్టి 'నేను యీ వార్డుకు వచ్చి వారం రోజులైనా కాలేదు. అందులో నా జీవితంలో యిలాంటి మనిషిని యిదివరకు చూడలేదు. ముక్కూ ముఖం యెరగని మనిషితో సరదాగా యెలా మాట్లాడుతూ కూర్చో మంటారు? అలా మాట్లాడకపోతే కాళ్లు గాలిలో తెలిపోతాయా? మీరే చెప్పండి?'
    'లేదండి. మీరు చాలా మంచివారు.' అన్నాడు సూర్యం.
    'ఏమండీ మీరు వకాల్తా తీసుకున్నారా?' శ్రీనివాస్ అందుకున్నాడు.
    'నాకు వకాల్తా యెందుకూ? మీ విషయం లో యెవరో తీసుకోవాలి. చూడండి. మీరు యీయన సిగరెట్ కాల్చకుండా చూడాలి.'
    'డాక్టరు కాల్చవద్దన్నాడా?'
    'అవును. తను కాల్చకూడదు. మీతో మాట్లాడుతూ కూర్చుంటే యెలా ?' అంటూ వెళ్ళిపోయింది.
    'ఏమండీ ....ఆ సిగరెట్ అలా పారెయ్యండి.'
    'దీన్ని ...ఈ సిగరెట్ ని ...ఈ సర్వ రోగ నివారిణి ని - సంతోషాన్నీ తృప్తి నీ యిచ్చే యీ దేవతవి-- పారేమంటారా?'
    'దేవత కాదు -- దెయ్యం .. సర్వ రోగాలను తెస్తుంది.'
    'మీకు అలవాటుంటే దీని విలువ తెలిసేది.'
    'ముందు పారేస్తారా లేదా?'
    శ్రీనివాస్ పారేసి ఒకసారి సూర్యం వేపు చూసాడు. 'నన్ను యిలా యిదివరకు యెవరూ ఆజ్ఞాపించ లేదండీ, అధవా ఆజ్ఞాపించినా నేను వినలేదు. నాకు నచ్చినది, తోచినది నేను యెందరికో దూరమయ్యాను.'
    'నేను నమ్మను.'
    'నిజం. ఏడవవలసిన సమయాల్లో కూడా నాకు నచ్చినది కాబట్టి నవ్వాను.'
    'ఏ ఆడదీ ఎప్పుడూ ఆజ్ఞాపించలేదా?'
    శ్రీనివాస్ చిరునవ్వుతో
    'మీరు ఆడవాళ్ళ ఆజ్ఞలను శిరసా వహించినట్లున్నారు.'
    సూర్యం బదులు చెప్పక పోవటం తో శ్రీనివాస్:
    'ఎందుకు యీ లోకాన ఉదయించామో చెప్పండి?'
    'ఏదో సాధించడానికి.'
    'కాదు. సుఖపడాలనే కాంక్షతో.'
    'సుఖపడ్తే సాధించలెం'
    'నేనన్న సుఖం ఏదో సాధించాక కూడా వస్తుంది. ఆ సుఖం యెలా వస్తుంది?'
    'లోభానికి దూరంగా వుంటే మనిషి సుఖ పడతాడని పంచమ వేదం చెప్పింది.'
    'అసలు లోభం వలెనే మనిషి పుడ్తాడు దానితోనే పెరుగుతాడు. అలాంటిది దాన్ని దూరమైతే అడవి లోని క్రూర మృగాన్ని బోనులో పెట్టినట్లు అవుతుంది. లోభం, కామం, మోహం వగైరా అన్నీ మనిషికి పరిసరాల వంటివి. ఈ పరిసరాల్లో సుఖంగా నివశించాలి. ఆ సుఖం యెలా వస్తుంది?'
    'మీరే చెప్పండి?'
    'ప్రాపంచిక సుఖాలు అనుభవిస్తూ ఆనందించడం వలన--'
    'అబ్బే -- అవి శాశ్వతం కావు.'
    'పూర్తీ చెయ్య నివ్వండి. మీరు కష్టాల్లో సుఖాన్నీ, దుఃఖం లో సంతోషాన్ని , ఆ మాట కొస్తే నరకం లో స్వర్గాన్ని, చీకటి లో వెలుగును యెప్పుడు వూహించుకో గలుగు తారు?'
    'మనసులో ఆశను మొలిపించేటప్పుడు '
    'ఆ ఆశను యెలా మొలిపించు కోగలరు?'
    'ధైర్యం వలన.'
    'ఆ ధైర్యం యెలా వస్తుంది?'
    'లోభం కాల్చుకోవటం వలన.'
    'కాదు లోభాన్ని కాల్చేసారంటే మనస్సునే కాల్చేసారన్న మాట. లోభం ప్రతి రూపమే మనసు. ఈ మనసు ఏం సాధించాలన్నా లోభం వుండాలి. లోభం తోనే మనసు కోరికలు కోరుతుంది. సుఖ దుఃఖాలు అనుభవిస్తుంది. ఇలా అనుభవించగలగటం వలెనే మనిషి ఆలోచిస్తున్నాడు, అర్ధం చేసుకుంటున్నాడు-- గమ్యం తెలుసుకొడానికి ప్రయత్నిస్తూ పురోగామిస్తున్నాడు.'
    'ఇలా స్వంతం అనుకుంటే ఘనకార్యాలు చెయ్యలేరు.'
    'అలా అనుకోవటం వలెనే ఆశ వుత్పన్నమౌతుంది. ఆశ అనే ద్రాక్ష పళ్ళ గుత్తులేనిది అందుకోవటమనే ప్రసక్తే రాదు. అంచేత మనిషికి మూలం లోభం వుండాలి. ఆ లోభం ఒక కొవ్వు లాంటిది. ఆ కొవ్వును వేడి చేసి మధ్యను వత్తే పెట్టి కొవ్వోత్తే తయారు చెయ్యాలి. అలా చెయ్యటానికి ధైర్యం అనే శక్తి కావాలి. ఎప్పుడైతే కొవ్వొత్తి చేసారో అది యీనాడు కాకపొతే రేపైనా వెల్గుతుంది. ఆ వొత్తి వెలుగు తుంటే లోభం దానంతట అదే కరిగి పోతుంది.'
    'నేనన్నదే నిజం అని ఒప్పు కుంటున్నారుగా, లోభం కు దూరంగా వుండాలని.'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS