ప్రకాశరావుకు జలుబు జ్వరంలా ప్రారంభమయిన రుగ్మత కొంచెం తీవ్ర రూపం దాల్చింది. ఇంట్లో అందరూ కంగారు పడటం ప్రారంభించారు.
'ఆరూ! స్వీట్! డాక్టర్ గారికి ఫోన్ చెయ్యి." నీరసంగా అన్నాడు ప్రకాశరావు.
"మన ఫేమలీ డాక్టర్ కెనా?"
"కాదు శ్రీధర్ గారికి."
అరుంధతి గుండెలు దడదడ లాడాయి. ఆరోజు ఒక రకమైన మైకంలో పడిన తనను డాక్టర్ మాటలతో తట్టి లేపి నప్పటి నుండి డాక్టర్ ను కలిసి కోలేదు. శ్రీధర్ కూడా అరుంధతి ని కలిసికోవడానికి ప్రయత్నించ లేదు.
అరుంధతి తనను తాను నిందించుకొంది. ఇకమీదట శ్రీధర్ ను కలుసుకోరాదని నదృడంగా నిశ్చయించుకుంది. తన శక్తులన్నీ కేంద్రీకృతం చేసి కొని ప్రకాశరావు ను ప్రేమించడానికి తపస్సు చేయ సాగింది. ఇప్పుడు మళ్ళీ శ్రీధర్ ను ఆహ్వానించటమా? అరుంధతికి తన మీద తనకు నమ్మకం కలగటం లేదు.
"ఆయనకు వద్దు! మోహ మాటం కొద్ది మన దగ్గిర బిల్లు తీసుకోరు! మన ఫేమిలీ డాక్టర్ కే టెలిఫోన్ చేస్తాను."
"శ్రీధర్ అయితే బిల్ తీసికోరనే ఆయనకు టెలిఫోన్ చెయ్య మంటున్నాను. ఇంకో డాక్టరయితే అదనీ ఇదనీ బోలెడు డబ్బు గుంజుతాడు."
"ఎంత మాత్రం వీల్లేదు! స్నేహాన్ని ఇలా ఉపయోగించు కోవడం నాకిష్టం లేదు. ఇంకొక డాక్టర్ నే పిలుస్తాను. ఆ మాత్రం బిల్ మనం ఇచ్చుకోగలం!"
జ్వరంతో మంచం మీద పడుకున్న ప్రకాశరావు కోపంతో లేచి కూచున్నాడు.
"ఏం? రవికి సహాయం కోరడాని కయితే , నీకు మొహమాటం లేదు కానీ, నాకు కొంచెం మందియ్యలంటేనే మొహమాటం వచ్చిందా?' అరుంధతికి మరింత మండింది.
"రవికి సహాయం చెయ్యమని నేనాయనను కోరలేదు. అదీగాక ఒక బీద కుర్రవాడికి సహాయం చెయ్యమని అడగటానికి సిగ్గు పడక్కరలేదు. స్వార్ధానికి స్నేహాన్ని ఉపయోగించుకుందుకు మాత్రమే సిగ్గు పడాలి."
"సరే! నువ్వు సిగ్గు పడుతూ కూర్చో! నేనే టెలిఫోన్ చేస్తాను."
తూలుతూ లేచాడు ప్రకాశరావు.
కానీ అడ్డు నిల్చింది అరుంధతి.
"నేనెంత మాత్రమూ ఒప్పుకోను. మీరలా చేస్తే నేనింట్లోంచి వెళ్ళిపోతాను.
"ఎడ్రస్ ఇచ్చి వెళ్ళిపో!"
నిర్లక్ష్యంగా ఆమెను పక్కకు నెట్టేసి ఫోన్దగ్గిరకు వచ్చాడు ప్రకాశరావు. అరుంధతి ఒక్క అంగలో ఫోన్ గట్టిగా పట్టుకుని "ఉహు! నేను బ్రతికుండి ఇది జరుగనివ్వను" అంది మొండిగా....
"అయితే నేను బ్రతికుండటం నీకిష్టం లేదన్న మాట!"
'అలాంటి మాటలనకండి!"
అక్కడే నిలబడి భార్యాభర్తల తగవును నిస్సహాయంగా ఆందోళనతో చూస్తున్న వెంకట లక్ష్మీ చటుక్కున అనేసింది.
ఆ మాటలు వినగానే అరుంధతి ఫోన్ మీది చేతిని తీసేసింది.
ప్రకాశరావు నీరసంగా ప్రక్కనే ఉన్న కుర్చీలో కూలబడ్డాడు.
"అమ్మా! దొరగారికి జ్వరం తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితిలో ఆయనను రెచ్చగొట్టడం మంచిది కాదు. శ్రీధర్ బాబును పిలిపించండి వారి బిల్ వారికి బలవంతంగా ఇచ్చేద్దాం! ఇందులో మొహమాట మేముంది? స్నేహముంది గనుక ఇతరుల కంటే ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు."
వెంకటలక్ష్మీ ఆందోళన నిండిన గద్గగ స్వరం అరుంధతి కి ప్రకాశరావు పరిస్థితి స్పష్టం చేసింది. వెంటనే శ్రీధర్కు టెలిఫోన్ చేసింది. వార్త విన్న శ్రీధర్ ఫోన్ లోనే తన పరితాపాన్ని తెలిపి వెంటనే వచ్చాడు. డాక్టర్ అడుగుల చప్పుడు వింటూనే గడగడ వణికి పోయింది అరుంధతి. అతి ప్రయత్నం మీద కను రెప్ప ఎత్తింది. డాక్టర్ కళ్ళు కలవగానే విద్యుద్ఘాతం తగిలినట్లయి, క్రిందకు వాల్చుకుంది. రెండేళ్ళ సంసారిక జీవితంలో ఇంతటి ఉద్వేగాన్ని తానెన్నడూ అనుభవించ లేదు. చివరకు దాంపత్య జీవితంలోని మొట్ట మొదటి రాత్రి కూడా తన నింతటి సంభ్రమం లో ముంచలేదు. డాక్టర్ ను తలెత్తి చూడలేకపోయినా, అతనితో పెదవి విప్పి మాట్లాడక పోయినా, అతడున్నాడన్న పరిజ్ఞానమే తనను పులకరాలతో నింపి వేస్తుంది.
శ్రీధర్ మాత్రం నిండు కుండలా, గంభీరంగా ఏం జరగనట్లే ఉన్నాడు. ప్రకాశరావు ను పరీక్ష చేసాడు. టైఫాయిడ్ అని తేల్చి, అంటుజబ్బనీ, మిగిలిన వారు తగిన జాగ్రత్త లు తీసికోవాలని మరి మరి చెప్పాడు. వెంటనే తగ్గడం అసంభవం కానీ తీవ్రత తగ్గటానికి మాత్రం మందివ్వగలననీ ప్రతి నాలుగు గంటలకు ఇయ్యమని మందిచ్చి వెళ్ళిపోయాడు. డాక్టర్ టైఫాయిడ్ అనగానే అరుంధతి కీ వెంకట లక్ష్మీకి మతి పోయినట్లయింది. బెంబేలుగా ఒకరి వంక ఒకరు చూసుకొన్నారు. ఆరోజు పగలంతా అరుంధతి తానె అతనికి స్వయంగా వేళకు మందూ పళ్ళరసం ఇస్తూ వచ్చింది. వెంకటలక్ష్మీ ఎలాగో వంట చేసి గది బయట కూర్చుంది.
"వెంకటలక్ష్మీ! కొంచెం ఈ జ్వరం తగ్గేవరకూ నువ్వూ ఇక్కడే పడుకోరాదూ? నాకేదో గాభరాగా ఉంది." అంది అరుంధతి.
వెంకటలక్ష్మీ ముఖం వికసించింది. "తప్పకుండా తల్లీ" అంది.
అరుంధతి చాపా, దుప్పటీ , దిండూ ఇయ్యబోయింది. వెంకటలక్ష్మీ వద్దని నిరాకరించింది.
"కొన్ని సంవత్సరాలు గా నాకు నేల మీద పడుకోటం అలవాటయి పోయిందమ్మా! భగవంతుడి శరీరాన్ని శిలతో సృష్టించాడు. ఏం చేసినా నాకేం కాదు."
విరక్తి తో సమాధానం ఇచ్చింది. అరుంధతి ఆమెను బలవంతం చెయ్యలేక పోయింది. ఎనిమిది గంటలకు మందిచ్చి పన్నెండు గంటలకు మళ్ళీ ఇవ్వడానికి అలారం పెట్టుకొని పడుకొంది అరుంధతి. ఒక రాత్రి వేళ మెలకువ వచ్చి వెంటనే గడియారం చూసింది. మూడయింది. గాభరాగా మందు సీసా చూసేసరికి అందులో మోతాదు అయిపొయింది.
నెమ్మదిగా ప్రకాశరావు కాళ్ళు ఒత్తుతున్న వెంకట లక్ష్మీ అరుంధతి లేవగానే ఉలికిపడి, చేతులు వెనక్కు తీసింది. అదృశ్యం చూసి బాధతో మూలిగింది అరుంధతి మనసు. వెంకట లక్ష్మీ అలా ప్రవర్తించి నందుకు కాదు. తానలా ప్రవర్తించ లేక పోయినందుకు! ఆ విధంగా సపర్య చెయ్యాలని తనకు తట్టనందుకు!
"మందు నువ్విచ్చావా వెంకట లక్ష్మీ?" శాంతంగా అడిగింది.
వెంకట లక్ష్మీ బెదురుగా "అవునమ్మా! పన్నెండయింది. మీరు పడుకొన్నారు. డాక్టర్ బాబు ప్రతి నాలుగు గంటలకూ ఇవ్వమన్నారు. అందుకని నేనిచ్చే సాను. దొరగారు నిద్రమత్తు లో మీరే ఇచ్చారని అనుకొన్నారు."
"అలారం మ్రోగినా నాకు మెలకువరాలేదు చూడు?"
"అసలు అలారం మ్రోగ లేదమ్మా! మనం అలారం కీ ఇవ్వటం మరిచి పోయాము."
"మరి నీకెలా మెలకువ వచ్చింది?"
వెంకట లక్ష్మీ సమాధానం చెప్పలేదు. అరుంధతి కి తెలిసి పోయింది. అమెఅసలు నిద్ర పోలేదు.
