ఉపయోగించననే పదం ఇందిరకి కష్టం కలిగించింది . అందుచేత ఆ పిల్ల బాధపడుతూ అన్నది.
"పెద్దమాటే అన్నారు మాస్టారూ ! నేను తెలిసో తెలియకో మిమ్మల్ని సాయమడిగేను. అంతమాత్రానికే యింత పెద్ద పదాన్నేందుకువాడేరు? ఉపయోగించడం , ఉపయోగించకపోవడమనే ఖరీదు మాటలెందుకిప్పుడు?"
రెండు క్షణాలు యిద్దరూ మౌనంగా గడిపేరు. అతను అకస్మాత్తుగా లేచి నించుని అన్నాడు.
"ఇవాళ పాఠం చెప్పలేను. రేపు చెబుతాను."
"మంచిది మాస్టారూ! రేపే రండి. ఇక నా నుండి ఈ సినిమా ప్రసక్తి మీరు వినరు లెండి. నేనేమైనా విసురుగా మాటాడివుంటే క్షమించండి నన్ను" అన్నది ఇందిర.
శ్రీనివాసరావు బయటికి వేచ్చేసేడు.
(ఇందిర మంచి పిల్ల! సినిమాలో చేరిపోదామనే ఉత్సాహం మినహాయించి నన్నే విధంగానూ ఆ పిల్ల నొప్పించలేదు. అనవసరంగా నేనా అమ్మాయిని బాధ పెట్టేను. అస్తమానం నన్ను నేను సమర్ధించుకునే దురుసుతనం ఎక్కువై పోతుంది )
ఇంటికి వెళ్లి పోదామను కున్నప్పుడతనికి శాంతాదేవి ఆహ్వానం గుర్తువచ్చింది. గబగబా రామమందిరం వేపు నడక సాగించేడు.
శాంతాదేవి యిల్లు కనుక్కోవడం ఏమంత కష్టంగా లేదు. పైపెచ్చు -- ఆ యింటి ముందు యిద్దరు పిల్లల్ని కూచోబెట్టుకుని కబుర్లు చెబుతుంది శాంత. శ్రీనివాసరావుని చూడగానే అంది -
"రండి , మీరు ఏడింటికి గాని రారనుకున్నాను. చాలా పెందరాళే వచ్చేరు. థేంక్స్ లోపలికి రండి."
"ఇవాళ ట్యూషన్ లేదు. అందుచేత తొందరగానే తేమిలింది" అన్నాడతను ఆమెను అనుసరిస్తూ.
వాళ్ళిద్దరూ యింట్లోకి వస్తున్నప్పుడు , అక్కడ బుద్దిగా కూచుని చదువుకుంటున్న యిద్దరూ కుర్రాళ్ళు పుస్తకాలు సర్దుకుని లేచి యింట్లోకి వెళ్ళిపోయేరు.
శ్రీనివాసరావు వీధి అరుగు పక్కగా ఉన్న గదిలో కూర్చున్నాడు. ఆ యింట్లో ఉండవలసిన ఖరీదైన వస్తువులన్నీ ఆ గదిలోనే ఉన్నట్టు పసి గట్టెడు. తతిమ్మా యిల్లంతా మాసిపోయి ఉన్నట్టూ, కాంతిని పోగొట్టుకుని వెలవెలబోతున్నాట్టు అతను ఆ గదిలో నించే చుడగలిగేడు.
లోపలెవరో ఖంగున దగ్గుతున్న శబ్దం వినిపిస్తుంది.
అతని ముందు ఓ మేజా బల్ల వుంది. ఆ బల్ల మీద అందమైన పుస్తకం వుంది. "హౌ టూ స్టాప్ వర్రింగ్" దాని పేరు. పుస్తకం తెరచి చూసేడు. మొదటి పేజీలో యింగ్లీషులో రాసి వుంది."
శుభాకాంక్షలతో
ఆంజనేయులు "
ఆ మాట చదివి పుస్తకం మూసేడు. సరిగ్గా అప్పుడే లోపలినించి వచ్చింది శాంతాదేవి.
కూర్చుంటూ అన్నది -
"మా యిల్లు చూసేరుగా , చాలా పాతది."
"సొంతమా?"
"నాన్న ఉద్యోగంలో ఉన్న రోజుల్లో కట్టించేరు. అవతల భాగం అద్దె కిచ్చేం. దాని మీద యిరవై రూపాయలు వస్తాయి."
"బాగుంది"
"ఏమిటి? ఇల్లా, అద్దెనా?"
"ఆఫీసులో వున్నంతసేపూ నాకు ఈ యిల్లు గుర్తు రాదు. ఆఫీసులో కొన్ని హంగులు అదనంగా ఉన్నాయి గదండి మరి."
శ్రీనివాసరావు వాళ్ళ సొంత వూళ్ళోని (యిప్పుడది మరొకళ్ళ స్వాధీనంలో ఉంది) సొంత యిల్లు గుర్తుకు వచ్చి , అక్కడ అతని వైభవమంతా మనసులో మెదిలి - చెళ్ళున చెంప చరిచినట్టుగా క్షణంలో మాయమైపోయింది.
"ఈ యింట్లో వున్నది ఆరుగురం. నాన్నా, నేనూ ఇద్దరు చెల్లెళ్ళూ, ఇద్దరూ తమ్ముళ్ళూనూ. అందరూ చదివే పిల్లలే. ఇక ఒక చెల్లేమో అవిటిది. దానికి చదువు లేదు. ఈ యింట్లో సుఖమూ లేదు. ఈ యింటిని పోషించే భారం నాది. నాకే ముందుగా రెక్కలు వచ్చేయి. నాకు రెక్కలు వచ్చినప్పుడే నాన్న మంచమేక్కెడు."
ఈ తడవ లోపలినుంచి మరింత ఉదృతంగా దగ్గు వినిపించింది.
"ఆయనే మా నాన్న లోపలినించి అయన బయటికి వచ్చి రెండు సంవత్సరాలైంది. అవిటి చెల్లెలే ఆయనకి తల్లి. తండ్రీ అన్నీను. ఈ యింట్లో మొట్టమొదట నేను పుట్టేను. గనక నా వెనక మనుషులందరి బరువూ బాధ్యతా నేనే స్వీకరించవలసి వచ్చింది శ్రీనివాసరావుగారూ!"
శ్రీనివాసరావుకి అతని మిలటరీ అన్న అప్పుడే గుర్తువచ్చి మళ్ళా అంతలోనే తొలగిపోయేడు."
"నాన్న యివాళ మంచం మీద పడి వున్నాడే కానీండి. అసాధ్యుడనే చెప్పాలి. దూరం అలోచించి నాకూ చదువు , టైపూ నేర్పించేడు. ఇవాళ మమ్మల్ని పోషించమని చెప్పి కూర్చున్నాడు. ఏమిటో మీకు విసుగ్గా వుంది కాబోలు. పుట్టినరోజు పండగని మిమ్మల్ని పిలిచి, మీ ముందు నా కష్టాలన్నీ ఏకరవు పెడుతున్నాను. నేను ప్రతి పనీ తిక్కగా చేస్తున్నాను. ఎక్కడైనా , ఎవరైనా పుట్టింరోజు పండుగ నాడు కష్టాలు చెప్పుకుంటారా?"
"భలే వారే మీరు ! ఏమండోయ్ ....కష్టాలు మీరొక్కరే భరిస్తున్నట్టు భ్రమ పడకండి. అందరికీ వున్నాయి నీడలు!"
శాంతాదేవి కాసేపటివరకూ తలదించుకునే వుంది. తల ఎత్తినప్పుడు మాత్రా, ఆమె కళ్ళల్లో నీళ్ళు చూసేడు శ్రీనివాసరావు , ఉలిక్కిపడి అన్నాడు -
"తప్పండి , ఏడవకూడదు."
"ఏమైనా సరే . ఇవాళ నా కధంతా మీతో చెప్పుకుంటాను శ్రీనివాసరావుగారూ. మీరు మళ్ళా మళ్ళా మా యింటికి వచ్చేవారు కాదు. ఇలాటి అవకాశమూ మరి చిక్కదు. అందుచేత మీ కిష్టం లేకపోయినా సరే, నేను చెప్పదలచుకున్నది చెప్పక మానను. ఆడపిల్లగా పుట్టానే గాని మగాడిలా పెరిగాను. ఈ మాగడపిల్ల కష్టపడి పనిచేసి సంపాయిస్తుందిప్పుడు. మరో అయిదుగుర్ని పోషిస్తున్నది కూడాను. ఏమిటోనండి నాకూ కొన్ని కోరికలుంటాయని నా చుట్టూతా ఉన్న వాళ్ళెందుకు అనుకోరో తెలీకుండా ఉంది. రక్త మాంసాలు గలదానిని. మీ అందరిలా బతుకుతున్నదానిని.....అవునండి.....చిత్రమేమిటంటే .....సిగ్గు విడిచి చెబుతున్నందుకు క్షమించాలి మీరు. నా వయసెంతనుకున్నారు? ఇరవై మూడండి బాబూ! ఇరవయ్యో ఏటనుంచే ఉద్యోగం చేస్తున్నాను. మేనమామ మొదలగువారు నాకు పెళ్ళి అవసరం లేదని రూడిగా చెప్పేరు. తెలుసాండి! వాళ్ళ పుణ్యమా అని ఈ యింటికి వరాన్వేషణ నిమిత్తమై ఒక్కరూ రాలేదు. నేను యిల్లు కదిలి ఉద్యోగం చేయడమనే కార్యాన్ని వాళ్ళెవరూ హర్షించలేదు. నేను ఉద్యోగం చేయని నాడు నా వాళ్ళని పోషించేదేవరు? వీళ్ళు పోషిస్తారా? కల్ల! కనక నా వాళ్ళ కోసం నేను ఉద్యోగం చేస్తున్నాను. మరేం కానిపని చెయ్యడం లేదుగా. చూస్తుండండి శ్రీనివాసరావుగారూ , నా చెల్లెళ్ళూ తమ్ముళ్ళూ ఏదో ఒకనాడు ప్రయోజకులవక మానరు. ఇప్పటివరకూ నన్ను యాగీ చేస్తున్న బంధువర్గానికి వాళ్ళు బుద్ది చెప్పకా మానరు. ఈనాడు నన్ను యెగతాళి చేసిన జనమే, రేపు నా ప్రయోజకత్వానికి ఈర్ష్యతో ఏడ్చి చావాలి సార్!"
శ్రీనివాసరావుకి శాంతాదేవి చెబుతున్నదంతా దారుణంగా వినిపించింది. శాంతాదేవి జాతకంతో తన జాతకాన్ని పోల్చి చూచుకుని అతనింత గాలి పీల్చుకో గలిగేడు.
"రెండు నెలల క్రితం కాబోలు , నేను ఆంజనేయులు గారితో కనిపించెను మీకు"
