"మీతో ఓ మాట చెప్పాలి!" గొణిగింది అన్నాడు.
"చెప్పండి!" అంది నింపాదిగా శాంతంగా.
"ఇక్కడ కాదు! అలా కేంటీన్ వైపు వస్తారా?"
"సారీ! ఇప్పుడే కదా ఆఫీసుకు వచ్చింది."
"మీరు పిచ్చివాళ్ళు అప్పుడే వర్క్ చేస్తున్నారు అన్నాడు ఏదో భోధిస్తున్నట్టుగా.
"చూడండి ఈ ఆఫేసు పని ఎన్నాళ్ళు చేసినా ఎన్నేళ్ళు చేసినా వుంటూనే వుంటుంది. వారానికి అయిదురోజులు రోజుకి ఎనిమిది గంటలు! అయినా పని తరగదు! రోజు తరిగిపోతాయి. అంచేత అప్పుడప్పుడు స్వంత వ్యవహారాలు చూసుకోవాలి. చేసుకోవాలి! లేకపోతే నెత్తిన రాళ్ళేస్తాఋ అందరి పని మనమే చేసెయ్యాలి మేడం!" నవ్వుతూ అన్నాడు శివరాం.
నంద సమాధానం ఇవ్వలేదు.
"అలా టీ తాగి వద్దాం రండి!"
"నో థాంక్స్!" సున్నితంగా వారించింది నంద.
బల్లమీదికి వంగి ఎవరికీ వినబడనంత మెల్లిగా అన్నాడు. "అలా చేస్తారేమిటి మీరు? మీతో ఓ విషయం ఏకాంతంగా మాట్లాడాలి! రండి! అందుకే పిలుస్తున్నాను!" గుప్పున సెంటు వాసన కమ్మేసింది.
"ఏ విషయమో ఇక్కడే చెప్పండి! ఇంతకంటే ఇంకేం ఏకాంతం కావాలి? అద్దాలగుండా మనం కనిపిస్తామే కానీ మన మాటలు వినిపించవు ఎవరికీను."
అటు యిటు చూశాడతను. స్టెల్లాకూడా లేదు. ఏదో ధైర్యం వచ్చేసినట్లయింది. "నందగారూ!" అతని కంఠం కొద్దిగా కంపించింది." ముఖంలో ఎరుపు దనం వచ్చేసింది. "నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ! ఐ లవ్ యూ!" అన్నాడు తడబడ్తోన్న గొంతుతో.
నంద మనస్సులో ఒక్కక్షణం పాటు ఏవేవో భావాలు మెదిలాయి. ఇతన్నిక్కడే షూట్ చేయాలి!" అనిపించింది. అంతలో ఎటికసీ, నాగరికతా గుర్తుకొచ్చి మెల్లిగా నవ్వింది. "థాంక్స్ శివరాంగారూ! మీ ప్రేమకి ధన్యవాదాలు కానీ నేను మిమ్మల్ని ప్రేమించలేను!" అంది.
"ఏం? నాకేమిటి తక్కువ! ఆవేశంగా గిల్టీగా అడిగాడు.
మీకేమీ తక్కువ కాదు. కానీ నేనిదివరకే ఇంకొకర్ని ప్రేమిస్తున్నాను."
"ఎవరతను?"
"మీకు అవసరం లేదనుకుంటాను!"
"ఆ అదృష్టవంతుడెవడో తెలుసుకోవాలని నా ఆకాంక్ష!"
"ఆయన పేరు అనిల్! సి.ఐ.అప్ పోలీస్!" దృఢంగా అంది నంద. అతన్నేడిపించాలన్నట్టుగా "మేం పెళ్ళి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి ఒట్టి ప్రేమికులు మాత్రమే కాదు! కాబోయే భార్యాభర్తలం కూడా!" అంది.
అంతలో స్టెల్లా రావటంతో చప్పున బయటికి వెళ్ళిపోయాడు శివరాం! అతని ముఖాన యీడ్చికొట్టినట్టుగా అయిపోయాడు.
స్టెల్లా మరేదీ ప్రశ్నించకుండా పనిలో మునిగిపోయింది నంద. స్టెల్లా అడిగితే శివరాం గురించి చెప్పాలని ఓ క్షణం పాటు అనుకుంది. అయితే ఆ అవసరం రాలేదు. ఇద్దరు పనిలో బిజీగా అయిపోయారు.
13
"వెధవ బ్రతుకు!" అంది స్టెల్లా.
"ఏం ముంచుకొచ్చింది" తాపీగా అడిగింది నంద.
"ఎప్పుడో మా నాన్న లోన్ తీసుకున్నాడట! ఆయన తీర్చకుండా చనిపోయాడు. ఆయన పేర్ను డిక్రీ వుంది. అది మా పేర ట్రాన్స్ ఫర్ అయిందంటాడు. ఇదెక్కడి గొడవ ఆస్తి పంచుకోలేదా? అప్పు పంచుకోలేదా అని అడుగుతాడు ఆ వెధవ! మరి ఇన్నేళ్ళు ఎందుకు? నిద్రపోతూ వచ్చావు? అని అడిగితే మా అడ్రస్ దొరకలేదుట! ఆంధ్రాలో వున్న నాపై దండెత్తకపోతే అమెరికాలో వున్న మా చెల్లాయికి నోటీసివ్వరాదూ?" రుసరుసలాడింది స్టెల్లా.
"ఇంతకీ నువ్వేమన్నావ్?"
"మా అడ్వకేట్ ని సంప్రదించి చెబుతానన్నాను!"
"మంచిమాటే!"
"ఏం మంచి నందా! ఇదా మనం వూహించిన జీవితం! బ్రతుకులు ఇలా తగలడతాయనుకున్నామా?"
"నేను అనుకోలేదు!"
"నేనూ అనుకోలేదు సుమా! ఎన్ని కలలు కన్నాను!! ప్చ్! తలచుకుంటే గుండె టారెత్తి పోతుందనుకో!"
"స్టెల్లా మృదువుగా పిలిచింది నంద.
"ఊఁ" అదోలా పలికింది స్టెల్లా.
"మనం హోటల్ కి ఏదో తినాలని వెళతాం అక్కడ అది వుండదు. వూర్లో అదొక్కటే హోటల్! మనకి ఆకలేస్తుంది. అక్కడున్నవే తినక తప్పదు. ఏం చేస్తాం? తినక చస్తామా? అదో అలాటిదయింది మనందరి బ్రతుకూను! కోరేదొకటి! దొరికేదొకటి!" భారంగా పలికింది నంద గొంతు.
అంతేనే! నువ్వన్నది నిజం! నిజంగా ఆ రోజులు మళ్ళీ వస్తాయంటావు? ప్చ్! గోల్డెన్ డేస్!" స్టెల్లా గొంతులో బాధ ధ్వనించింది.
"ఆ రోజులే కాదు! ఈ రోజులూ మళ్ళీ రావు- ఎప్పటికప్పుడు గతించిన కాలమే జరిగే కలం కంటే సుఖం అనిపిస్తుంది. అలా అందరూ అనుకుంటూనే వున్నారు అదంతే అంది నంద. తనకి తెలిసింది, ఆమెకి తెలియందీ ఏదో బోధిస్తున్నట్టుగా అంది ఆమె.
నిట్టూర్చింది స్టెల్లా.
"స్టెల్లా! నేనెలాంటి లైఫ్ కోరానో తెలుసా?"
చెప్పు వింటానన్నట్టుగా చూసింది స్టెల్లా.
"ఒకసారి మాకాలేజీలో డిబేటింగ్ జరిగింది. అందులో అంశం మీరెలాంటి జీవితం కోరుకుంటారు అని యిచ్చాడు మా కాలేజీలో తెలుగు హెడ్ గారికి సన్యాసి రాజుగారని పేరు ఆయనకీ పేరుకి మాత్రం పెళ్ళయింది. కానీ ఆ మహానుభావుడు సంసార సుఖానికి నోచుకోలేదు. భార్య అసలు కాపురానికి రాలేదు. ఇతన్ని ఇల్లరికం రమ్మంటే ఈయన వెళ్ళలేదు దాంతో ఆవిడ రకరకాల బాధలు పెట్టింది. డైవర్స్ అడిగితే ఇవ్వలేదు. మధ్యవర్తుల మాట వినలేదు. చివరికి కోర్టు కెళ్ళాడు. ఆమె అక్కడ ఆయన్ని ఎంత అవమానానికి గురిచెయ్యాలో అంతా చేసింది. దాంతో ఆయన పూర్తిగా విసిగిపోయాడు.
