ఉత్తరం పూర్తి చేయగానే ఆమె మనస్సు భారమైపోయింది. గుండెలపై ఏదో భారం పెట్టినట్టుగా అయిపోయింది.
ఆ రోజులు గుర్తుకి వచ్చాయి వెంటనే.
ఆ రోజు కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి తల్లీ తండ్రి సీరియస్ గా వుండటంచూసి ఆలోచనలో పడింది. ఆఖరికి తల్లి బాధలో తండ్రి కోపంలో విషయం తెలిసింది తన మేనత్త పద్మావతి నారాయణ ఫ్రెండ్ మోతీలాల్ తో ఎటో వెళ్ళి పోయింది. భర్తపోయి చిన్నతనంలోనే పుట్టింటికి చేరిన ఆమె ఇన్నేళ్ళూ మెత్తగా, గౌరవంగా మంచిగా గడిపింది జీవితాన్ని హఠాత్తుగా ఇలా ఎలా చేసిందో.
అంతే! ఆరోజు నుంచి ఇంట్లో కళాకాంతులు లేవు!
ఇంటిని బేరం పెట్టసాగాడు నారాయణ.
అతి కష్టంమీద పదిహేను వేలకి ఇల్లు అమ్మేశాడు.
పురాతనం అయిన ఆ ఇంటికి అంతకంటే ధర పలకటం అదీ గొప్పగానే అనిపించింది ఆ రోజుల్లో-
ఇల్లు అమ్మిన తర్వాత నెలరోజుల లోపుగానే తండ్రి ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాడు. ఆ వూరిని, స్మృతుల్నీ వదిలేసి వచ్చారు.
ఇక్కడికి వచ్చాక అన్నీ దురదృష్టాలే!
తండ్రిని ఎవరో కాంట్రాక్టర్ ట్రాప్ చేయించి అరెస్ట్ చేయించాడు. ఉద్యోగం పోయింది. దిక్కులేని వాళ్ళు నిజాయితీగా వుండాలన్నా కష్టమే! తన నిజాయితీని ఋజువు పరుచుకునేందుకు ఆ ఇంటి డబ్బులో చాలా భాగం ఖర్చు పెట్టాడు నారాయణ. కానీ ఫలితం లేకపోయింది. డబ్బు మాత్రం ఖర్చయిపోయింది. ఆ రోజుల్లోనే తల్లికి జబ్బు చేసింది నరాలు ఎక్కడివక్కడ పట్టేస్తాయి వున్నట్టుండి. ఆమె ఏమీ చేయకూడదు.
ఇన్ని అనర్ధాలకు మూలకారణంగా పద్మావతిని అనుకునే వాళ్ళు ఎప్పుడూ. నాన్న తిట్టిపోసినా అమ్మ ఏమీ అనేదికాదు. ఆమె మనస్సులో ఏముందో ఏనాడూ బయల్పడదు.
ఇప్పుడు ఈ ఉత్తరం వచ్చింది.
తండ్రి ఏమంటాడో! తల్లి ఏమంటుందో! మిగతా వాళ్ళదే వుంది? వాళ్ళకేం తెలుసు? తను! తను! తన మనస్సులో మాత్రం జాలి పుడుతుంది.
తప్పు చేయటం మానవ సహజం! తెలిసో తెలియకో కొంచెమో ఘనమో అయినా మరీ ఈ రోజుల్లో తప్పుచేయని మనుషులు ఎవరు? మానవత్వంలో తప్పుల్ని క్షమించాలి! దీర్ఘవైరం కూడదు ఏ విషయములో నయినా! తల్లి నడిగి రమ్మని రాస్తే! అమ్మా, నాన్నా ఒప్పుకుంటే ఎన్నో విధాలుగా మేలవుతుంది!
ఆమె ఇంట్లో దిక్కుగా వుంటుంది! తను ఆఫీసుకి వెళితే ఇల్లు చూసుకుంటుంది జాగ్రత్తగా. అన్నిటికంటే తనకి కొంత బాధ్యత తప్పుతుంది! ఈ ఇంటిని, యీ సంసారాన్ని మోసేబరువు తగ్గుతుంది- తోడు లభిస్తుంది. అందుకోసమయినా వాళ్ళని ఒప్పించి ఆమెని రమ్మని రాయాలి!
తమ్ముడు, చెల్లాయి ఏమంటారో?" అయినా వాళ్ళకేం తెలుసు చిన్నపిల్లలు...ఇరుగు పొరుగు? ఆ వూళ్ళో అయితే ఆ విషయాలు తెలుసు! తమ కుటుంబం గురించి పట్టించుకోడానికి యిక్కడ ఎవరికి తెలుసు!
బంధువులు తమ విషయాలు పట్టించుకోవడం మానేశారు? ఆ బంధువుల విషయంగా తమకీ అంత పట్టింపు లేదు.
ఇంకెందుకీ ఆలోచనలు! రమ్మని వ్రాయాలి!
అని నిశ్చయించుకోగానే ఆమెకి ఏదో ధైర్యం వచ్చినట్టుగా అయింది. ఉత్తరాన్ని మడిచి వ్యానిటీ బాగ్ లో పెట్టేసింది.
"మేనేజర్ గారు పిలుస్తున్నారు మేడమ్!"
ఎటెండర్ పిలుపుకి ఆలోచనలని ఓ ప్రక్కకి పెట్టి నుంచుంది వెంటనే. మేనేజర్ గదికి వెళ్ళింది.
"కూర్చోమ్మా!" నమస్తే చెప్పగానే అన్నాడు.
"ఇదిగో ఈ ఫైల్ చూడు!"
అది కాన్షిడెన్షియల్ ఫైల్. ఇంకో గుమాస్తాది వచ్చింది అక్కడికి? ఆశ్చర్యపోయింది ఆమె. క్షణం పాటు షాకయింది.
"ఇదెంత బాధ్యతా రహితమో తెలుసా?"
తలూపింది ఆమె భయం భయంగా.
"ఇది ఎలా వచ్చింది బయటికి. వీటిని లాకర్ లో పెట్టి అవి నీ వద్దే వుంటాయి కదూ!" అడిగారాయన.
"అవునండీ!" మెల్లిగా జవాబిచ్చింది.
"ఇది ఆఫీసరుగారికి తెలియదు. తెలిస్తే పనిష్మెంటు ఏమిటో తెలుసా? టెర్మినేషన్ లేదా సస్పెన్షన్ - ఎంక్వయిరీ.
ఆందోళనగా తలూపింది నంద. అవన్నీ అనుకోవడం తనవల్ల ఎంత పొరపాటు జరిగిందో తెలిసి ఆమె గుండె దడదడలాడుతూంది.
"వెళ్ళమ్మాయ్! నేను పట్టుకున్నాను కాబట్టి సరి పోయింది. ఇంకొకరికి ఎవరికి దక్కినా ఫలితం మన చేతుల్లో వుండేది కాదు. అయినా జాగ్రత్తలా వుండాలమ్మాయ్ బివేర్ ఆఫ్ డాగ్స్ అని బోర్డు కట్టినట్టుగా ఆఫీసుల్లో బివేర్ ఆఫ్ రామ్స్ అని రాస్తారా?" మెల్లిగానే చివాట్లు పెట్టాడు.
"మైగాడ్ శివరామ్ పనా యిది!" అనుకుంది నంద. ఆమె మనస్సులో అతనిపై ఏవగింపు- "థాంక్యూ సర్! ఇకపై యిలాంటివి జరగకుండా చూసుకుంటాను!" ఆ క్షణానికి ఆ ఆపద తప్పిపోయిందన్న సంతృప్తితో అంది. మేనేజరు మంచితనం తెలిసొచ్చినట్లయింది.
"నందగారూ! నీపై, నీ వర్క్ పై నాకూ, ఆఫీసరుకు మంచి కాన్ఫిడెన్స్ వుంది! అందుకే ఈ విషయమై రభస జరక్కుండా చూశాను."
"వన్స్ గెయిన్ థాంక్యూ సర్!" అని లేచింది నంద.
ఆమెకి తలపై పడవలసిన పిడుగు పక్కకి తప్పిపోయి నట్టుగా అనిపించింది మరో మారు కృతజ్ఞతలు చెప్పి వచ్చేసింది.
సీట్లోకి వచ్చేసైర్కి అక్కడ స్టెల్లా లేదు.
తలపట్టుక కూర్చుంది నంద.
"హో!" నవ్వుతూ పలకరించాడు శివరాం!
చప్పున తలెత్తిచూసింది నంద.
ఇతను! ఇతను- ఇంతచేసి ఎలా ఇలా హాయిగా నవ్వగలుగుతున్నాడు! నవ్వుతో పలకరిస్తున్నాడు?" అనుకుంది క్షణంపాటు.
"ఫ్రీగా వున్నారా?" నవ్వుతోనే ప్రశ్నించాడు.
అతన్ని కడిగెయ్యాలనిపించింది ఆమెకి. ఒక్క క్షణం పాటులో ఉవ్వెత్తుగా కోపం వచ్చింది. కానీ చప్పున ఆ ఊహని అణచుకుంది. ఆఫీసు గురించి అందులో జనాలని గురించి మేనేజర్ చెప్పిన మాటలు గుర్తుకి వచ్చాయి. దాంతో ఆమెలో సంయమనం వచ్చేసింది! అనవసరంగా ఎందుకు బయటపడాలి తనూ వీళ్ళకి తగిన విధంగా మెలగాలి. వీలయినంత వరకు జాగ్రత్తగా ఉంటే సరి! అనుకుంది. అలా అనుకోగానే ఆమె మామూలుగా అయిపోయింది.
