"ముందే ఎందుకు చెప్పలేదు?"
"ఏమిట చెప్పాలి! డాక్టరు మందిస్తాడు. తన ప్రయత్నం చేస్తాడు. అంతేగాని, రోగి చస్తాడో , బ్రతుకుతాడో ముందే యెలా చబుతాడు!"
"నీ మాయమాటలు కట్టిపెట్టు. నీ చాతబడి పనిచేస్తుందని వూరుకున్నాం. లేకపోతే ఆ వెధవను చంపించే వాళ్ళం"
"ఏ వెధవ?" బాలరాజు అడిగాడు.
"మా అపోజిషన్ పార్టీగాడు."
వాళ్ళ మాటలను తగువులను బట్టి, వాళ్ళు పొలిటికల్ పార్టీ అని అర్ధం అయింది.
వాళ్ళు తగువులాడుతుండగానే పోలీసులు వచ్చారు. వాళ్ళ ముగ్గురిని అరెస్టు చేసి తీసుకు వెళ్ళిపోయారు.
బాలరాజుకు చిరు చమట్లు పోసాయి. చేతబడి శాస్త్రోక్తమయిన విద్య అన్నారు. కానీ, జవాబు దొరకని ప్రశ్న. అతను మెల్లగా వూర్లోకి వస్తుండగా దార్లో సిద్దార్ధ కలిసాడు.
"నీకోసమే చూస్తున్నాను బాలరాజు"
"నాకోసమా! ఎందుకు?" ఆశ్చర్యంగా అడిగాడు.
"వెళ్తూ మాట్లాడుకుందాం రా." ఇద్దరూ నడక సాగించారు. బాలరాజు కెంతో నిరాశగా, నీరసంగా వుంది. నేర్చుకోవాలనుకున్న విద్యకు మొదటే విఘ్నం కల్గింది.
"ఏమిట్రా అంత నీరసంగా ఉన్నావు."
"అబ్బే......ఏం లేదు....." తడబడుతుండగానే రాజేంద్ర ఎదురయ్యాడు. అతను ఆదుర్దాగా చూచాడు.
"దీక్షలో వుండాల్సిన నువ్వు ఇక్కడున్నావేం?" అనుమానంగా, మార్చి, మార్చి చూసాడు.
"అదిసరే...... ఒరేయ్ రాజేంద్రా మన రుద్రయ్యను పోలీసులు పట్టుకెళ్ళారు నువ్వెళ్ళు."
"ఎందుకు!"
"నువ్వెళ్ళు! నేను దూరంగా వున్నానని వదిలివేసారు. లేకపోతే నన్ను పట్టుకునేవారు." అన్నాడు.
సిద్దార్ధ ఏం అడగలేదు.
"రేపు కలుస్తాను సిద్దూ!" అన్నాడు, అక్కడినుండి పరుగులు పెడుతూ అతను వెళ్ళిపోయాక ఊరవతల వున్న బాలరాజు ఇల్లు చేరారు. ఏదో బడికి కలిసిపోయి. కలిసి రావటంలో స్నేహితులయ్యారుగాని, సిద్దార్ధ తమ ఇంటికి రావటం అన్నది అతనికి గొప్ప థ్రిల్లింగ్........."
"అబ్బో......అబ్బో..... చినబాబేనా..." సంబరంగా పీట దులిపి, చోటుచేసాడు. సిద్దార్ధ నవ్వుతూ కూర్చున్నాడు. జంగయ్య ముఖం వెలిగి పోయింది.
"ఒరేయ్ సిద్దూ! నువ్వు కూర్చో నేనిప్పుడే వచ్చేస్తాను." అని హడావుడిగా వెళ్ళిపోయాడు
"ఏంటో సిద్దార్ధా! నా మాట వినడు, బి.ఏ. అయిపోతే చిన్న వుద్యోగం చేస్తే నాకు సుఖం అనుకున్నాను, ఊరుమీద తిరుగుతాడు." నిట్టూర్చాడు! తండ్రిగా అతను పడేబాధ తలుసు. కాని ఏం చెయ్యలేడు. అతన్ని ఏమని సంబోధించాలో అర్ధం కాలేదు.
"అదికాదు........జంగయ్యగారూ!" ఏదో చెప్పబోయాడు.
"అదేమిటి బాబూ! నేను జంగయ్యనే, ఈ గారు, ఇది ఏమిటి చెప్పు."
"పాపం పార్వతమ్మ పక్షిలా ఏడుస్తోంది" అన్నాడు.
"అవును బాబూ! కడుపుకోత......." అనబోయి నాలుక కరుచుకున్నాడు. అతని ముఖంలో రంగులు మారాయి.
"అయితే శ్రీనివాస్ చచ్చిపోయాడా జంగయ్యా?"
"అబ్బే....నాకేం తెలియదు.....నిజం నాకేం తెలియదు" తడబడ్డాడు.
"అంత తడబాటు దేనికి? నాకు నిజం చెప్పు జంగయ్యా"
"నాకేం తెలియదు బాబూ! ఆ మఠంలో మకాం వెయ్యి. విషయాలు తెలుస్తాయి" అన్నాడు. అతని మాటలు పూర్తి కాకుండా రాజేంద్ర పరుగెత్తుకు వచ్చాడు.
"బాలరాజున -పోలీసులు పట్టుకున్నారు -" ఒగరుస్తూ చెప్పాడు. జంగయ్య గుండెలు బాదుకుంటూ వెళ్ళాడు.
