Previous Page Next Page 
ఆచరణ లో అభ్యుదయం పేజి 21


    'సరిపోయింది -- ఇవాళ భోజనం అదీ ఏమీ అక్కర్లేదా ఏమిటి మీకు? పది కూడా కావస్తోంది-- నాకు ఆకలి దహించుకు పోతోంది-- మీరింకా ఇలాగే ఖబుర్లు చెప్తూ కూర్చున్నారంటే , ఇంత ఆకలి మీద నేను ఇద్దరి వంట తినేసి వస్తాను. ఆ తరువాత మీ యిష్టం ' అని వంట గది వేపు దారి తీయబోయింది.
    'హు-- అంత మాట అనటానికి నీకు నోరు ఎలా వచ్చింది అంట? అసలు ఆడదానికి వుండాల్సిన లక్షణాలు యేమిటో తెలుసా? మొగుడు భోజనం చేసిన తరువాత ఆ ఎంగిలి విస్తరిలో -- పోనీ కంచం  అనుకోలే-- అది కాస్త శుభ్రమైనా చేసుకోకుండా అలాగే అందులోనే అన్నం అధరావు లూ వడ్డించుకుని తినాలి భార్య -- ఇంకో విషయం -- వండిన పదార్ధాలన్నీ భార్తగారిని పదిసార్లు మారు అడిగి బ్రతిమాలి వడ్డించి , అయన తృప్తిగా త్రేనుస్తూ లేచి వెళ్లి చెయ్యి కడుక్కున్నాక, అప్పుడు ఆ మగిలిన వంటకాలు వడ్డించుకుని , ఒకవేళ అధరవులు ఏమీ మిగలకపోతే ఏ వూరగాయి ముక్కో వేసుకు తిని లేవాలి.......'
    'అలాగే మీకు ఒక్కరికీ వడ్డిస్తాను ముందు...రండి.' అంటూ లోపలికి వెళ్ళింది........
    పెళ్లి అయిన తరువాత కళ్యాణి మొదటిసారిగా వంట చేసిన రోజున మురళి కి ఒక్కడికే వడ్డన చేసి భోజనానికి పిలిచింది -- భార్య చేతి వంట ఎప్పుడు రుచి చూద్దామా అని వువ్విళ్ళూరుతూ ఆ పిలుపు కోసమే ఎదురు చూస్తున్న వాడిలా గదిలో కూర్చున్న మురళి గబగబా లేచి వచ్చాడు. వంట గదిలో ఒక్క కంచమే వుంది -- కళ్యాణి వుద్దేశ్యం అర్ధం అయినా , ఆశ్చర్యాన్ని అభినయిస్తూ ---
    'వో! ఇద్దరం ఒక్క కంచం లోనే తిందామా?' అన్నాడు కొంటెగా చూస్తూ.
    కళ్యాణి తెల్లబోయింది ఒక్క క్షణం. తరువాత చిన్నగా నవ్వేస్తూ, 'ముందు మీరు కానివ్వండి -- నేను తరువాత తింటాను. అంది.
    'ఉహు-- అదేం కుదరదు ....ఎవరో పరాయివాడికి పెట్టినట్టు నా ఒక్కడికీ విడిగా పెట్టి ఆ తరువాత నువ్వు తింటావా.....నువ్వు కూడా వద్దించుకో -- ఇద్దరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తినాలి కాని ఈ పద్దతి నాకేం నచ్చదు.' అన్నాడు గుమ్మం దగ్గర నుండి కదిలిరాకుండానే.
    'అహ-- ఎందుకూ? ముందు మీరు కూర్చోండి.' సిగ్గు సిగ్గుగా జవాబు చెప్పింది కళ్యాణి.
    'నువ్వు ఇలా నన్ను ఒక్కడ్ని కూర్చో పెట్టావంటే నేను అర్ధాకలితో నే లేచి పోతాను తెలుసా... నేను కడుపు నిండా తినాలి అని నీకు వుంటే నువ్వు కూడా నాతో పాటు తినాల్సిందే -- ఊ-- కానీ ' అంటూ తనే మరోకంచం తెచ్చి పెట్టి గ్లాసులో మంచి నీళ్ళు పోసి ఒకటే హడావిడి పెట్టేశాడు.
    అదంతా గుర్తు చేసుకుంటూ బట్టలు మార్చుకుని, నవ్వుకుంటూ వంటగది లోకి వెళ్ళాడు. అతడు ఒక్కడికే ఒక కంచం పెట్టి వడ్డన ప్రయత్నం చేస్తోంది కళ్యాణి. ' నువ్వే గెలిచావులే -- వచ్చి కూర్చో ' అంటూ మరో కంచం పెట్టి అన్నం కూరలూ అవీ వడ్డించేశాడు. ముసిముసి గా నవ్వుకుంది కళ్యాణి.

                          *    *    *    *
    పెళ్ళికి పుట్టిన శలవు పూర్తయ్యాక ఆవాళ మొదటిసారిగా ఆఫీసులో అడుగు పెట్టాడు మురళీ--
    తమ పెళ్లి శుభలేఖ తో పాటు, ఉద్యోగానికి రాజీనామా కూడా మేనేజరు కి ఇచ్చింది కళ్యాణి. సాధ్యమైనంత త్వరలో అంటే పెళ్లి నాటికయినా ఆమెని రిలీవ్ చేస్తానని చెప్పారు మేనజరు లింగమూర్తి --
    మురళీ వరండా దాటి హాల్లోకి అడుగు పెడుతుంటే, మిగిలిన వాళ్ళంతా తన వంక కొత్తగా, వింతగా , ఆసక్తిగా చూస్తున్నట్ల నిపించింది తనకి-- ఇంక వీళ్ళు చేసే హస్యాలకి తట్టుకోవాలి కాబోలు , అనుకుంటూ లోపలికి నడిచాడు.
    'మన రావు గారు ఈ నెల్లాళ్ళ ల్లోనే కాస్త ఒళ్ళు పట్టినట్లున్నారు కదూ' అన్నాడు కామేశ్వరర్రావు.
    'ఇంకా సందేహంగా అడుగుతున్నావా -- ఇప్పుడు హాయిగా యింటి భోజనం కదా -- అయినా, కొత్త సంసారం, కోరి చేసుకున్న భార్య , ఆ సంతోషం లో తిండి తినకపోయినా కడుపు నిండిపోతుంది. ఒళ్ళూ వస్తుంది.' అన్నాడు వీర్రాజు.
    'కొత్త సంసారం అంటే గుర్తు వచ్చింది -- మన కమల గారికి కూడా వచ్చేనెలలో పెళ్లి అవుతుందిట -- వాళ్ళ బావ అంటే కాబోయే భర్త నిన్న కనిపించినప్పుడు చెప్పాడు నాతో ' అన్నాడు రమణ మూర్తి.
    'వాళ్ళది కూడా లవ్ మేరేజే అనుకుంటా' అన్నాడు జనార్దనం.
    'ఎలాగయినా అనుకోవచ్చు-- దూరపు బంధువు -- ఒకరి నొకరు కావాలని కోరి చేసుకుంటున్నారు . అసలు...ఈపాటికే అయిపోవలసిన పెళ్ళే , మరి ఇన్నాళ్ళూ ఎందుకు అగారో తెలియదు.' అని కామేశ్వరరావు అంటుంటే.
    'ఆహా అయితే కులాంతరం లాంటి దేమీ కాదన్న మాట.' అన్నాడు జనార్దనం తన మాటలకి తనే నవ్వుకుంటూ.
    'కులాంతరం అంటే జ్ఞాపకం వచ్చింది, 'నేను నిన్న వో కొత్త వార్త విన్నాను. మా చిన్నాన్న కొడుకు వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడుట ఎవరికి చెప్పకుండా, ఈ మధ్యే' అన్నాడు అవధాని.
    'ఆ ఏమిటో? పెద్ద సేన్ సెషన్ క్రియేట్ చేసినట్లు మాట్లాడుతున్నావు-- ఈరోజుల్లో వర్ణాంత' వివాహాలు సర్వసాధారణం అయిపోయాయి. అన్నాడు రమణమూర్తి.
    'అదేదో అతి సహజంగా , రోజూ జరిగిపోయే వ్యవహారంలా అంత తేలిగ్గా నువ్వు మాట్లాడితే నేను ఒప్పుకోను-- మనిషికీ మనిషికీ మధ్య ఈ కులం అనే అడ్డుగోడ నిలవకూడదు. అసలు వర్ణవ్యవస్తే వుండకూడదు, మనుష్యులంతా ఒకే కులానికి ఒకే కుటుంబానికి చెందినట్లు కలిసిపోవాలి అంటూ ఖబుర్లు చేప్పేవాళ్ళే తప్ప అక్షరాలా అలా ఆచరించి చూపిస్తున్న వాళ్ళు ఎంతమంది వుంటారంటారు? పైకి ఎన్ని ఖబుర్లు చెప్పినా ఎవరి కులాభిమానం వాళ్ళు, ఎవరి కట్టుబాట్లు వాళ్ళు పాటిస్తూనే మనుగడ సాగిస్తున్న వాళ్ళే నూటికి తొంబై తొమ్మిది మంది వుంటారు. ఇంక మిగిలిన ఆ ఒక్క పర్సంటూ ఎందుచేత ఈ కొత్త పద్దతి లో నడుస్తున్నారూ అంటే కారణం వాళ్ళ పిల్లలు ఏ క్లాసు అమ్మాయి నొ, తోటి వుద్యోగి నొ ప్రేమించి పెళ్లి చేసుకుంటాం అని భీష్మించు కు కూర్చోటమే -- అప్పుడైనా ఈ పెద్దలు ఒకంతట ఒప్పుకుంటారా? నయానా భయానా నచ్చ చెప్పాలని చూస్తారు. అప్పటికీ లొంగక పొతే సరే వాడి ఖర్మం అన్నట్లు చూసీ చూడనట్లు వదిలేస్తారు. అంతేగాని తమ పిల్లలకి వర్ణాంతర వివాహాలు చెయ్యాలి అనే ఆదర్శంతో కావాలని వేరే కులంలో సంబంధాలు వెతికిన వారు ఎంతమంది వున్నారంటావు........' అని అవధాని అంటుంటే ,
    'అసలు మనిషిలో కుల భావం ఉండనే కూడదు అంటే అదేక్కడికి పోతుంది? ఎలా పోతుంది? నీకు వుద్యోగం కావాలీ అంటే నువ్వు ఏ కులం వాడివో తెలియజేసు కోవాలి, నీ కొడుకుని ఆ అ ల క్లాసులో జేర్పించాలన్నా నీ కులం ఏమిటో వ్రాసుకోవాలి, నీ తమ్ముడికి కాలేజీ లో సీటు కావాలంటే నువ్వే కులానికి చెందిన వాడివో స్పష్ట పరచాలి-- ఇలా అడుగడుగునా , ఎక్కడ మరిచి పోతావో అన్నట్లు, నీ కులాన్ని గుర్తు చేసుకుని బ్రతుకుతున్న స్థితిలో నీలో ఆ భావం పొమ్మంటే ఎలా పోతుంది -- ఏ అప్లికేషన్ ఫారంచూసినా నీ వూరు పేరూ తో పాటు 'కాస్టు ' అంటూ నా తలకాయంత అక్షరాలతో వ్రాసి ఓ కాలమ్ ఇస్తాడు-- అదుగో వాడి కులాన్ని చూసే వుద్యోగం ఇచ్చారు అని ఒకరంటే నా కులం స్పష్టంగా చెప్పుకొటం వల్లే వుద్యోగం దొరక్కుండా పోయింది అని యింకోకరంటారు. ఇంత చిన్న విషయంలో ఇన్ని బేధాలు చూపించే మనం రెండు నిండు జీవితాల్ని బంధించి వుంచే వివాహం దాకా ఏం వెళ్తాం ?' అన్నాడు జగన్నాధం .
    'మీరుచెప్పిన మాట నిజమే .' అన్నాడు వీర్రాజు.
    'ఏది ఏమైనా కాని, అసలు కులం గోత్రం లేని అమ్మాయిని పెళ్లి చేసుకున్న మన మురళీధర రావు గారు మాత్రం అభినందనీయులు.' అన్నాడు కామేశ్వరర్రావు మురళీ వంక అదోలా చూస్తూ.
    'అదంతా కళ్యాణి అదృష్టం.' అంది తార, ఆ  అమ్మాయి గొంతులో రవంత అసూయ తొంగి చూసింది.
    వాళ్ళ మాటలకి మనస్సులో ఏ మూలో ఎలాగో అనిపించినా దాన్ని అప్పుడే మరిచిపోవటానికి ప్రయత్నిస్తూ చిన్నగా నవ్వేశాడు మురళీ.
    'ఏమండీ రావు గారూ, నాకు తెలియక అడుగుతాను -- కళ్యాణి గారి చేత అప్పుడే వుద్యోగం ఎందుకు మానిపించేశారు? ఇంకా పిల్లా పాపా బయలుదేరిం తరువాతయితే ఏమో అనుకోవచ్చు. ఇప్పుడు హాయిగా ఇద్దరూ వచ్చి పని చేసుకోవచ్చుగా .' అన్నాడు రమణ మూర్తి.
    'ఆ, ఎందుకొచ్చిన వుద్యోగం, హాయిగా అయ్యగారు సంపాదిస్తుంటే అమ్మగారు  ఖర్చు పెడుతుంటారు. ఇతని ఒక్కడి జీతంతో సంసారం గడవక పొతే కదా ఆవిడా వుద్యోగం చెయ్యటం.' అన్నాడు నరసింహ మూర్తి.
    'అంతేనా, లేకపోతె మీ ఆవిడ పదిమంది మగవాళ్ళ మధ్య కూర్చుని పని చెయ్యటం ఏమిటి అనే అభ్యంతరం ఏమైనా వుందా మీకు?' అంది తార.
    'నేనేమీ చెప్పలేదు తనే మానేస్తా నంది.' అన్నాడు మురళీ.
    'ఆవిడ గారికి ఆ మంచి బుద్ది పుట్టటం వల్లే నాకీ వుద్యోగం అయినా దొరికింది. లేకపోతె ఇంకా ఎన్నాళ్ళు ఇంట్లో అందరం పస్తులతో గడపవలసి వచ్చేదో.' అనుకున్నాడు కళ్యాణి ప్లేసులో కొత్తగా జేరిన రామస్వామి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS