Previous Page Next Page 
మరుపులో మెరుపులు పేజి 21

 

                                    29

    హోటల్ రూమ్ నుంచి సరాసరి ఆఫీసుకు వెళ్ళాడు. ముఖ్యమయిన పనులు చూసుకోవడం కోసం. ఆరోజు ఎంత త్వరగా యింటికి వెడదామనుకున్నా అత్యవసర మయిన పనులు అతన్ని కదలనివ్వలేదు.

                              
    అయిన ఆలస్యానికి విసుక్కుంటూ గబగబా యింటికి వెళ్ళాడు ప్రభాకర్. లోపలికి వేడ్తూనే దొడ్లోకి వంగి చూశాడు. కుసుమ ఎప్పుడూలా అక్కడ కూర్చుని వుందేమో ! అని. ముఖర్జీ తో తను మాట్లాడటానికి వెళ్ళిన విషయం సానుకూల పడిందని తెలిస్తే ఎంతయినా సంతోషిస్తుంది రాత్రి నుండి భయంతో సతమతమాయి పోతున్న కుసుమకు "మండు టండ లో వాన జల్లులా, ఈ వార్తా ఎంతయినా నిశ్చింతనిస్తుంది.
    ఆవిరి లా హరించి పోతున్న ఆమె  నిబ్బరానికి నిలకడ కలిగించాలి. ఒక్కసారి దగ్గిరకు తీసుకుని యింక భయపడవలసినది ఏమీ లేదని తను ధైర్యం చెప్పగలిగితే.
    కొద్ది రోజులలో కుసుమ మనసులో అజ్ఞాతంగా నిలిచిపోయిన మరుపురాని భయాలకు తనొక కారణం చూపి, అవి కేవలం తన భ్రమే అని నమ్మించ గలిగితే-'
    భారీ ఎత్తున భవిష్యత్తును వూహిస్తూ మెడ మీద గదిలోకి అడుగు పెట్టాడు.
    
                              *    *    *    *
    ప్రభాకర్ ఉదయం యిల్లు వదిలినప్పటి నుండి కుసుమ మనసు ఆమె స్వాధీనం లో లేదు. ధైర్యం చెప్పిన ప్రభాకర్ మాటలు ఆమెకు తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా - అతను యిల్లు దాటంగానే , అతని మాటలు రూపాలు మార్చుకున్నాయి. బాధాకరంగా కనుపించే భవిష్యత్తు ఆమెను భయ పెట్టసాగింది. ఎంతగా నిగ్రహించుకోవాలని ప్రయత్నించినా , గుండెల్లోంచి పుట్టుకొస్తున్న భావాలను అదుపులోకి తేలేకపోయింది.
    మబ్బుగా , మసగా వున్నా ఆకాశాన్ని, చూస్తుంటే మాయని మచ్చలా, ఏదో భయం దొరకని ముల్లులా బాధిస్తోంది మనసులో.
    భయంకరంగా వున్న భవిష్యత్తు ను ఆహ్వానించలేక కోటగోడల్లా ధైర్యం కలిగించే ప్రభాకర్ రక్షణ ను పూర్తిగా విశ్వసించనూ లేకపోయింది.
    అదుపుకు రాని ఆలోచనలను దరి చేర్చలేక నిగ్రహించుకోలేని బలహీనత కు దాసురాలయి పోయింది కుసుమ. 'తను చేయబోయే పని ప్రభాకర్ కి ఎంత కష్టం కలించేదయినాసరే !  తను చేయక తప్పదు. రంగుటద్దాలలాంటి అతని జీవితంలోంచి శాశ్వతంగా తప్పుకోక తప్పదు. తను ఏమయిపోయినా సరే! అతని సుఖం కోసం తన సమస్యలతో అతన్ని జీవితాంతం ఉపయోగించుకోలేదు. ఏ సుఖాలు పంచలేని అతన్ని బ్రతుకంతా బంధించలేదు.'
    అర్ధరహితమయిన ఆవేశంలో ఏం చేస్తున్నదీ తెలియక, పెట్టె తీసి నాలుగు బట్టలు పెట్టుకుంది. సొరుగు లోంచి తాళం చెవులు తీసుకుని అలమారు ముందు నిలబడింది కుసుమ.
    సొరుగులో కట్టలు కట్టలుగా వున్న డబ్బును చూస్తుంటే మనసు చలించ సాగింది. ఆవేశం తో ముఖమంతా అదురుతోంది. పెదిమలు బిగబట్టి  ఎంతో నిగ్రహించుకోవడానికి చేసే ప్రయత్నం లో శరీరమంతా చమట తో తడిసిపోసాగింది. ప్రతి అవయవం చలి జ్వరం సోకినట్లు వణికి పోవడం మొదలు పెట్టింది.
    "ఊ....తీసుకో....సందేహిస్తావెం?" ఖంగున వినిపించిన మాటలతో వులిక్కిపడి బలవంతాన తల తిప్పి చూచింది. అంతవరకూ ఆమె ప్రతి కదలికను గమనిస్తున్న ప్రభాకర్ గుమ్మం దగ్గర నిలబడి వున్నాడు.
    కుసుమ వంక ఒక్క క్షణం చూసి గబగబా ఆమెకు దగ్గరగా వచ్చాడు. ముందుకు సాగనంటున్న చేతిని బలవంతంగా డబ్బు మీద వుంచే ప్రయత్నం చేస్తూ, సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ.
    "తీసుకో - అదంతా నీదని ఎప్పుడో చెప్పాను. ఈ యింట్లో నాదయినా ప్రతి వస్తువు నీదే! ఊ తీసుకో. ఎందుకంత సందేహం?" అన్నాడు.
    అతని కళ్ళలో ఎప్పుడు కనిపించని తీక్షణం చూస్తూ అతని చేతుల్లోకి వాలిపోయింది.
    ఆమెను దగ్గరగా తీసుకుని వీపు నిమురుతూ ఆలోచనలో మునిగిపోయాడు.
    కొద్ది నిముషాలకు కొంచెంగా తేరుకున్న కుసుమ తన దగ్గర నుండి దూరంగా జరుగుతూ పద" మెట్ల వైపు దారి తీశాడు.
    "ఎక్కడికి.....?" అంది తడబడుతూ భయం భయంగా. ఎటువంటి సమాధానం యివ్వకుండా క్రిందకు వచ్చాడు కుసుమతో సహా. కుసుమను ఒక్క క్షణం హాలులో నుంచోమని చెప్పి, పక్క గది తలుపు తీసి చూచి తిరిగి దగ్గిరగా వేశాడు.
    కుసుమ వెనకగా చెయ్యి వేసి బయటకు నడిపించుకొచ్చి ముందున్న నౌకరు తో "మేము పని మీద పై వూరు వేడుతున్నాము. రేపటికి కాని రాము అయ్యగారితో చెప్పు లేచాక." అని ముందు డోర్ తెరిచి కుసుమను ఎక్కించాడు.
    "ఎక్కడికి?' అడిగింది ప్రభాకర్ ముఖంలోకి చూస్తూ.
    "మీ అమ్మ దగ్గరికి."
    చటుక్కున కుసుమ చెయ్యి డోర్ హేండిల్ మీద పడింది తెరవడానికి. వెంటనే ప్రభాకర్ చెయ్యి వచ్చి గట్టిగా కుసుమ చేతిని యివతలకు లాగి, ఆమె మీదుగా పక్కకి వంగి తలుపు  లాగి మళ్ళీ వేశాడు బలంగా.
    "యీ జరిగిన విషయాలేవీ మా అమ్మకు చెప్పడానికి వీల్లేదు. అది నాకిష్టం లేదు." అందిమొండిగా. దూరంగా చూస్తూ.
    "మనం వెడుతున్నది మీ అమ్మకు చెప్పడానికి కాదు. మీ అమ్మ చేత చెప్పించడానికి." అన్నాడు కారు స్టార్టు చేస్తూ.

                                    30

    పొద్దుటి నుంచి మబ్బులు కమ్మిన ఆకాశం బాగా మూసుకు పోసాగింది. చెల్లా చెదురుగా పరిగెడుతున్న మబ్బులు చీకట్లు కమ్మసాగాయి. విసురుగా వూగుతున్నాయి చెట్లు.
    సన్నగా తుంపరగా మొదలయిన వాన మెల్లి మెల్లిగా పెద్దదవసాగింది. చీకట్లు కమ్మిన ఆకాశాన్ని చీల్చుకుంటూ దుందుభులు మ్రోగిస్తున్నాయి మెరుపు తో కూడిన వురుములు.
    రెండు చేతుల్తో గట్టిగా చెవులు మూసుకుని తలను వళ్ళోకి వంచుకో ప్రయత్నిస్తున్న కుసుమ భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా లాక్కున్నాడు ప్రభాకర్. వెన్ను వెనక నుంచి వళ్ళోకి వున్న ఆ చేతిని బలంగా పెనవేసుకు పోతూ గట్టిగా కళ్ళు మూసుకుంది.
    అవిరామంగా పడుతున్న వానను పడుతున్నట్లే వైపర్స్ తుడుస్తున్నా, దారి కనిపించడం గగనమైపోతోంది. ఒక చేత్తో కుసుమను, ఒకచేత్తో స్టీరింగు ను పట్టుకుని ఆ వాతావరణం లో త్వరగా కారు నడపడం ప్రభాకర్ కు సాధ్యం కాలేదు. కారు టాపు మీద పడి శబ్దాన్ని కలిగిస్తున్న ప్రతి వాన చినుకు కుసుమ హృదయంలో సమ్మెట పోట్లలా వున్నాయి.
    ప్రభాకర్ ముందు ముందు కొద్ది రోజులలో చేద్దామను కుంటున్న పని. అంత త్వరగా అప్పటికప్పుడు అనుకుని ఎందుకు బయలుదేరాడో అతనికి తెలియదు ఎడతెగని ఆలోచనలు అతని కర్తవ్య మూడుడిని చేస్తున్నాయి.
    ఇప్పటికిప్పుడు యిలా వెళ్ళి కుసుమ తల్లి దగ్గర నుంచి ఏం తెలుసుకుందామని? దాని వల్ల కుసుమ ఏం ప్రయోజనం సాధించగలుగుతుంది? అసలు వెళ్ళి ఆమెను యేమని అడగడం?...... సమాధానం దొరకని ప్రశ్నలతో అతను అలసి పోయాడు. దాదాపు కుసుమతో పరిచయమయిన నాటి నుండి, ప్రశ్నలే తప్ప సమాధానం తెలియని అతను విసిగిపోయాడు?
    చీకటిని చీల్చుకుంటూ వర్షం లో పోతున్న కారును మల్లేనే అతని మనసు కూడా తొలుచుకు పోతోంది. అతనికి తెలిసిన సంగతుల లోంచి.
    గోపాల్ చెప్పినది రైట్ అయితే , కుసుమ ఆ దరిదాపుల్లోనే లేకుండా వుండి వుంటే యీ భయలన్నిటికీ కారనమేమయి ఉండాలి?
    ఏది ఏమయినా కుసుమ చిన్నతనమంతా తెలుసుకోవాలి. ఆవిడ.....రాజ్యలక్ష్మీ అంగీకరించక పొతే ..... అసలు ఆవిడ కుసుమ తల్లో కాదో గూడా తెలియదు. నిజంగానే ఆవిడకు కూడా కుసుమ చిన్నతనం  ఏమీ తెలియక పొతే.... తన ప్రయత్నం తిరిగి యధాస్థానానికి చేరుతుంది.
    వర్షపు చినుకులలా ఆలోచనలు వస్తూనే  వున్నాయి. కాలం, కారు పరుగెడుతూనే వున్నాయి. మధ్యాహ్నన్నే సంధ్యగా మార్చుకున్న మబ్బులు చీకటి రాత్రిని చేరడానికి ఎక్కువ సేపు పట్టలేదు.
    కటిక చీకటి లో హోరుగా వీస్తున్న గాలి, జోరుగా పడుతున్న వానలో కారేళ్ళీ అతి సామాన్యంగా రేపో మాపో అన్నట్టున్న ఇంటి ముందు ఆగింది.
    తను వేసుకుని వున్న కోటును తీసి కుసుమకు కప్పి, వంగి గ్లన్ బాక్స్ లోంచి బాటరీ లైటు తీసుకుని తలుపు తెరిచాడు.
    ఒక్కసారిగా వురిమిన వురుముకు నిలువెల్లా వణికిపోయింది కుసుమ, ఆమెను గట్టిగా , దగ్గరగా పట్టుకుని వెళ్ళి యింటి ముందుకు వెళ్ళి తలుపు కొట్టాడు.
    వచ్చేశాం. భయపడకు" అన్నాడు దగ్గరకు తీసుకుంటూ.
    అన్ని గంటల ప్రయాణం లోనూ యిద్దరి మధ్య చెప్పుకునేందుకు మాటలెం జరుగలేదు. ఇద్దరి మధ్యా అగాధం లా నిలచిన మౌనం. ఆలోచనలలో కొట్టుకుపోతూ అంతరాయం కలిగంచని మనసు, వాళ్ళిద్దరి నీ ఏ విధంగానూ దగ్గరకు తీసుకు రాలేకపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS