"రవీ! నీకు ఫోన్ కాల్ వచ్చింది.
హాల్లోంచి పిలిచాడు శ్రీధర్ -- రవి ఆత్రంగా వెళ్ళి ఫోన్ అందుకొన్నాడు.
"నేను తారను! మీరు కనీసం ఉదయమైనా ఇంట్లోనే ఉన్నందుకు సంతోషం."
"నిన్న వచ్చాను తారా!"
"తెలిసింది. మనం అనుకొన్న సమయానికి రెండు గంటల తరువాత , నేను వచ్చేసాను. విద్యార్ధి దశలో ఉన్న మీరు కాలాన్ని ఇంత నిర్లక్ష్యంగా చూడటం వాంఛనీయం కాదు."
"క్షమించు తారా! మీ అన్నయ్య...."
"మా అన్నయ్యతో నన్ను కలిసికోవటానికి బయలుదేరినట్లు ఎందుకు చెప్పారు?"
"ఏం? ఆయన కిప్పుడే అభ్యంతరమూ లేదు కదా!"
"అయితే మాత్రం....! సరే! మా అన్నయ్య రోజూ ఎన్ని గంటలకు వస్తాడు?"
"కాలేజీ వదిలే వేళకు! నాలుగున్నర లేక అయిదూ..... అలా...."

"మీరివాళ రెండు గంటలకు ప్రకాశరావుగారింటికి రండి! అరుంధతి వదిన కూడా ఉంటుంది. ముగ్గురము కలిసి మాట్లాడుకోవచ్చు.
అరుంధతిని తలుచుకోగానే రవికి గుండెలు దడదడ లాడాయి. ఆమె చూపులు తన అంతరాంతరాలను శోదిస్తున్నట్లు ఉంటాయి.
"నాకు కాలేజ్......"
"ఫరవాలేదు. ఒక్క పూటకు సెలవు పెట్టండి."
రవి కొన్ని క్షణాలాగి "సరే!" అన్నాడు తార ఫోన్ పెట్టేసింది.
ఆనాడు రెండు గంటలకు తారను చూస్తూనే రవి " ఇవాళ నా కాలేజి పోయింది" అన్నాడు.
సమాధానం అరుంధతి చెప్పింది.
"చదువు మీద నీకింత శ్రద్ధ నిజమే అయితే అదృష్టవంతుడివి రవి!"
రవి సిగ్గు పడ్డాడు.
అరుంధతి మళ్ళీ అంది.
"నువ్వు డాక్టర్ శ్రీధర్ గారింట్లో ఉంటున్న దెందుకూ? చేసున్నదేమిటీ?"
"నేనేం చేస్తున్నాను?"
"ఇంకా ఏమి చెయ్యాలి?"
అరుంధతి ఏమంటున్నదో రవికి అర్ధం కాక పోలేదు.
"ఈ పరిస్థితి నాకూ ఆనందకరంగా లేదు. కానీ సుందర్రావు గారు నన్ను తీసి కేళ్తుంటే నేనేం చేయగలను?"
ఈ మాటలకు తార మండిపడింది.
"ఒకరు తీసికెళితే వెళ్ళడానికి మీరేం పసి పిల్లలా? ఎవరెలా ఆడిస్తే, అలా డూ, డూ, బసవన్న లా ఆడవలసిన అగత్యం మీకేమొచ్చింది? ఈ నాటికి మీ వ్యక్తిత్వం మీరు గుర్తించక పొతే ఏనాటికి మనిషి కాగలరూ? మీదైనా అభిప్రాయాలు, మీదైనా ఆలోచనలు అసలు లేనే లేవా? అన్నయ్యకు మీరేవిధంగా ఋణపడి ఉన్నారు? ఎందుకు, ఆయనకు గాని, మరెవరికి గాని మీరు భయపడటం? మిమ్మల్ని చదివిస్తున్నది డాక్టర్ శ్రీధర్ తప్ప మరెవరూ కారు. ఆ విషయం గుర్తుంచుకోండి!"
ఒక్కొక్క మాటా, ఒక్కొక్క శూలం పోటులా వచ్చి తన గుండెను తాకుతుంటే వంచిన తల ఎత్తలేక పోయాడు రవి. ఆమె అన్న మాటలన్నీ తిరిగి తిరిగి అతని గుండెలలో ప్రతిధ్వనించాయి. పాలిపోయిన అతని ముఖం చూసి తార తగ్గిపోయింది.
"మీ మనసు నొప్పిస్తే క్షమించండి. మనసారా మీ మేలు కోరేదాన్ని గనుకనే అలా మాట్లాడాను. మీద్యేయం ఏమిటో అర్ధం చేసికొని అందు కనుగుణంగా నడుచుకోండి. అన్నయ్య ప్రవర్తన అన్నయ్య వంటి వారికే తగింది. కానీ మనలాంటి వాళ్లకు కాదు"
పాపం , తార "మన" అనే అన్నా రవి మనసు కలుక్కుమంది. ఆమె తన బీదరికాన్ని ఎత్తి చూపుతున్నదా అనిపించింది. ఈ బీదరికం ఎంత భయంకర మైనది? ఈ నాడు తార, అరుంధతి తనను ముద్దాయిలా నిలువ బెట్టి విచారణకు పూనుకోవడానికి కూడా బీదరికమే కదా కారణం!
రవి ముఖంలోకి చూస్తున్న తార మనసు చాలా కలత పడింది. అప్పుడే అన్నయ్య తన ప్రభావాన్ని రవి మీద చూపించాడు. రవి ముఖంలో వెనుకటి అమాయకత్వం లేదు. చూపులు వెనుకటి బెదిరిన లేడి చూపుల్లా లేవు. వాటిలో బెడురుతనం పోలేదు కాని, వెనుకటి బెదురుకూ, ఇప్పటీ బెడురుకూ చాలా బేధం ఉంది. వెనుకటి బెదురూ లో ముగ్ధత్వం ఉంది. ఈనాడది పూర్తిగా నశించింది. స్వచ్చమైన నీతి నిజాయితీ ల ముందు రాటు దేరని కాలుష్యం ప్రదర్శించే బెడురిది!
కొంచెం సేపు ,ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చొని రవి వెళ్ళిపోయాడు. ఆరాత్రి అతనికొక విచిత్రమైన కల వచ్చింది. తాను రెండు జేబుల నిండా రూపాయలు నింపుకొంటున్నాయి. తార వాటిని లాగేసుకొని చెరువు లోకి విసిరేస్తుంది. రూపాయలు! రూపాయలు! వాటి కోసం, ఒళ్ళు తెలియకుండా చెరువు లోకి పరుగెత్తాడు. నీళ్ళలో ఉక్కిరిబిక్కిరి అవుతూ , రూపాయల కోసం వెతుక్కోసాగాడు కానీ ఒక్క రూపాయి కూడా కనబడలేదు. సరిగదా భయంకరంగా ఉన్న తేళ్ళు పాములు తనను చుట్టు ముట్టి తన మీదకు పాక సాగాయి.
కెవ్వున కేక వేసి లేచి కూర్చొన్నాడు. రవి తెలివి గల వాడే! తగినంత కృషి ఉంటె డాక్టర్ గారి సహాయంతో పైకి రాగలడు. కానీ, అతని జీవితంలోకి సుందర్రావు రాకతో, ప్రయత్నించీ పుస్తకాల మీద మనసు నిలప లేకపోతున్నాడు.
ఆ కల తలచుకొన్న కొద్ది రవికి ఒళ్ళు జలదరించింది. తన అంతరాంతరాలలో తొంగి చూస్తున్న భావాలూ , కలలో రెక్కలు విప్పుకొన్నాయి. ఛీ! తనను తాను సంస్కరించు కోవాలి . క్రిందటి రోజు తానెన్నడూ చూడని దీనత్వం తారలో కనుపించింది. సంతోషానికి మారు పేరులా ఉండే తారలో అదైన్యం తోచడానికి కారకుడు తనేనా? అదేవ కన్యకు తన వల్ల కష్టమా?
ఆ మరునాటి నుండి ఏమైనా సరే సుందర్రావుతో కలిసి తిరగకూడదని నిశ్చయించు కున్నాడు. కాలేజీ నుండి ఇంటికి రాకుండా నేరుగా దగ్గరలో ఉన్న లైబ్రరీ కి వెళ్ళి అక్కడ ఏడు గంటల వరకూ చదువుకొని అప్పుడు ఇంటికి వెళ్ళేవాడు.
ఇలా వారం రోజులు మాత్రమే గడిచింది. ఒకనాడు అనుకోకుండా లైబ్రరీ లో తార తారసపడింది. ఇద్దరూ ఒకరిని చూసి, ఒకరు ఎంత ఆశ్చర్య పోయారో, అంత సంతోష పడ్డారు. రవిలోని ఈమర్పుకు తార మనసారా సంతోషించింది. మెరుస్తూన్న ఆ కళ్ళను చూస్తూ తన్మయుడయ్యాడు రవి.
"మీరెందుకొచ్చారిక్కడికి?" ఆశ్చర్యంగా అడిగాడు రవి.
తార కొంచెం సేపు సమాధానం చెప్పలేక పోయింది. చివరకు పక్క చూపులు చూస్తూ "ఇక్కడి లైబ్రరియన్ కు అసిస్టెంట్ కావాలిట! నేను దరఖాస్తు పెట్టుకున్నాను. ఇవాళే పనిలోకి వచ్చాను. పార్టు టైం ! సాయంత్రం ఆరు నుండి ఎనిమిదిన్నర వరకూ, అంతే! మా వదిన బారి నుండి తప్పించు కొన్నట్లూ ఉంటుంది. నాకూ ఆ యాభై రూపాయలూ ఎందుకైనా ఉంటాయి." అంది.
రవికి మాట రాలేదు. కొంచెం సేపలా బొమ్మలా నిలబడి "మీరు యాభై రూపాయల కోసం ఉద్యోగం చేస్తున్నారా?" అన్నాడు.
నిజానికి తారకు ఉద్యోగం చెయ్యవలసిన అవసరం లేదు. సుందర్రావు కు ఆమె అపురూపపు చెల్లెలు! ఆమె ఖర్చులన్నీ ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా, మనోరంజని భరించి తీరవలసిందే! తార ఎంతడుగుతే ,అంత మనోరంజని ఇస్తుంది కాని తను తీసుకొన్న ప్రతి పైసాకూ తార మనోరంజనికి లెక్క చెప్పాలి. అలా లెక్కలు వ్రాయటం , ఆమె అలవాటు! రవి చేత ఉద్యోగం తనే మాన్పించింది. తనే చదువు లోకి దింపింది. పాపం రవికి ఏ క్షణంలో డబ్బుతో , ఏ అవసరం వస్తుందో ? ఎన్నింటికనీ శ్రీధర్ అడగ్గలడూ? అతనికేలా నైనా కొంత డబ్బు సర్దుబాటు చెయ్య గలుగుతే బాగుండుననుకొనేది తార! కానీ ఎలా? మనోరంజని కేదైనా దొంగ లెక్కలు చెప్పచ్చు! కానీ తన అవసరాలకు అడగటానికి కటకటలాడే తారకు ఇందుకు మనసొప్ప లేదు. ఈ యాభై రూపాయలూ రవి కీయటానికే ఆమె ఈ ఉద్యోగంలో చేరింది. కానీ ఈ సంగతి అతనితోచేప్ప లేకపోయింది. ఏదో త్యాగం చేస్త్గున్నట్టు బడాయి చెప్పుకోవటమేమిటి? తనే అర్ధం చేసి కొంటాడు.
తార మౌనం రవికి మరొక విధంగా అర్ధమయింది. ఆమె ఇంత చిన్న ఉద్యోగంలో చేరినందుకు అభిమాన పడ్తుందను కొన్నాడు. అయితే పాపం అన్నా వదినల దగ్గిర తార పరిస్థితి ఏమీ బాగుండలేదన్న మాట! తాను త్వరగా ఈ చదువు పూర్తీ చేసికొని తారను గట్టేక్కించాలి.
అను నిత్యమూ తాము కలిసికో గల అవకాశం లభించినందుకు వారిద్దరూ ఎంతో సంతోషించారు. తార వల్ల రవి చదువు కే విధమైన భంగమూ రాలేదు.సరికదా మరింత ప్రోత్సాహము లభించింది.
* * * *
