11
డాక్టర్ విశ్వం
క్రితం రోజు వచ్చిన పోస్టు చూడసాగాను. నిన్న తీరనందువల్ల ఆ ఉత్తరాలను ప్రక్కగా పెట్టి ఉంచాను. ఆ ఉత్తరాలలో పొడుగుగా ఉన్న కవరోకటి నన్ను ఆకర్షించింది. దానిపై వ్రాయబడి ఉన్న వ్రాతను గురించగలిగాను. అది ప్రసాదు దగ్గర నుండి వచ్చిన ఉత్తరం . కవరు చింపాను. నాకు వచ్చిన ఉత్తరం లోనే అమ్మాయి రేఖకు కూడా మరొక కవరు ఉంది. నాకు వ్రాసిన ఉత్తరాన్ని పూర్తిగా చదివాను. ఆరోగ్యంగా ఉన్నట్టు, యుద్ధం ఆగిపోయే సూచనలున్నందున త్వరలోనే యింటికి రాబోతున్నట్లు వ్రాశాడు ప్రసాదు నాకు ఎంతో సంతోషం కలిగింది. వెంటనే అమ్మాయి రేఖను పిలుచుకు రమ్మని నా ఎదురుగా ఉన్న రాధకు చెప్పాను. ఆమె పిలవడానికి వెళ్ళింది. కొంచెం సేపట్లో రాధ ...రేఖ యిద్దరూ వచ్చారు.
'ఏమిటండీ నాన్నారూ....పిలిచారట!'
'అవునమ్మా...ప్రసాదు నీకు ఉత్తరం వ్రాశాడు.. త్వరలో వస్తాడుట!'
నా మాటలు విన్న అమ్మాయి ముఖంలో జ్యోత్స్న రేఖలు వెల్లి విరిసాయి. ఉత్తరాన్ని ఆదుర్దాతో అందుకొని సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. నా హృదయం ఆనందంతో నిండిపోయింది. అమ్మాయి సంతోషమే నా సంతోషం.... ఈ రోజు అదివారం ....సాయంత్రం డిస్పేన్సరీ మూసి వేస్తాము. కాస్త విశ్రాంతి ఉంటుంది. ఎవరో పేషెంట్లు వచ్చిన అలికిడి కావడంతో నా ఆలోచనలకూ అంతరాయం కలిగింది. ఒకరు...యిద్దరు...ముగ్గురు.... వరుసగా అరగంట వరకు పేషెంట్లు వచ్చారు. వారిని చూసి పంపించాను. భోజనం వేళ కావడంతో అమ్మాయి రేఖను వెంట బెట్టుకొని యింటికి బయలుదేరాను.
భోజనం చేసి విశ్రాంతి గా పడుకున్నాను. ఆలోచనలు నన్ను ముసురుకున్నాయి. ఇక ప్రసాదు త్వరలోనే వచ్చేస్తాడు. రేఖా ప్రసాదుల వివాహం అతను రాగానే జరిపిస్తాను.... వైభవంగా . ఆ విధంగా సంతోషకరమైన ఆలోచనలు కలగడంతో నిద్ర దూరమైంది నాకు. గతం గుర్తుకు వచ్చింది. అమ్మాయి రేఖ చిన్ననాటి సంగతులు స్పురణ కు వచ్చి నా ఆలోచనలు గతంలోకి మళ్ళాయి. ఒకరోజు నేను ఆస్పత్రి నుండి యింటికి వచ్చాను. శశిరేఖ హాలులో, సోఫాలో కూర్చుని ఉంది. ముఖ వైఖరి చూస్తె ఎందుకో అలిగినట్లు కనిపించింది.
'అమ్మా శశీ...!'
'..........'
'ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావేం ?-- అలా దిగులుగా ఉన్నావెం తల్లీ?'
'.............'
'నిన్నెవరేమన్నారమ్మా? మాట్లాడ వేం?'
'నాన్నగారు....'
నేను నాలుగు సార్లు పలకరించిన తర్వాత ఒక్క మాట మాట్లాడింది అమ్మాయి. మాట్లాడితే కన్నీరు క్రిందికి జార్చడానికి సిద్దంగా ఉన్నాయి ఆమె కళ్ళు.
'ఏం జరిగిందమ్మా.... నాతొ చెప్పవూ?' దగ్గరికి తీసుకొని బుజ్జగిస్తూ అడిగాను.
'నేను....నా స్నేహితురాళ్ళు అందరమూ కలిసి ఆడుకుంటున్నాము. కొద్దిగా చీకటి పడగానే ' ఇక ఉంటె అమ్మ కోప్పడుతుంది ' 'ఈ రోజు అమ్మతో సినిమాకు వెడుతున్నాను.' 'నేనూ మా అమ్మ పేరంటానికి వెడుతున్నాం శశీ!' అని అంటూ అంతా పరుగెత్తుకు వెళ్ళిపోయారు. మరి...మరి ...నాకు అమ్మేదండీ నాన్నగారూ....?'
బాధతో కృంగి పోయాను. శశి ఊరికే తన తల్లిని గుర్తు చేస్తూ ఉండడం.... నేను బాధపడడం పరిపాటై పోయింది... ఏం చేయను? ఏ లోటూ లేకుండా పెంపకం సాగుతున్నా అమ్మాయి తల్లిని మరిచిపోవడం లేదు. ఎప్పుడూ తల్లిని గురించి ప్రశ్నల వర్షం కురిపోస్తూనే ఉంటుంది, ఇక సాధ్యం కాదు.... మరిపించడం.
'మీ అమ్మ చనిపోయింది'.
'చనిపోయిందా ...? మరెప్పుడు చెప్పలేదేం....నాకు?'
'ఇప్పుడు చెబుతున్నాను గదమ్మా!'
'చనిపోయిన వారంతా ఎక్కడికి వెడతారు?'
'దేవుడి దగ్గరికి.'
'అవుతే నేను కూడా దేవుడి దగ్గరకూ..అమ్మ దగ్గరకు వెడతాను నాన్నగారూ!'
'తప్పమ్మా ....అలా అనకూడదు. దేవుడు నిన్ను రానివ్వడు.'
'ఎందుకు రానివ్వడు? మరి...అమ్మ వెళ్ళిందిగా ..? అమ్మను రానిచ్చాడుగా!"
'నీ కర్ధమయ్యేలా ఎలా చెప్పగలనమ్మా?' శశిని ఎత్తుకొని ముద్దాడుతూ బాధతో లోపలికి వెళ్లాను.
'చెప్పు నాన్నా....'
'ఏం చెప్పనమ్మా?'
దిగులుపడుతూ సోఫా లో కూర్చున్నాను. పాపకు తెలిసీ తెలియని వయసు, పరిస్థితిని అర్ధం చేసుకోలేదు. ఊరుకోదు. ఎంత చీకాకు పెట్టినా ఓర్పుతో సహించాను. ఈ రోజు యింత మొండిగా ప్రవర్తిస్తుందేమిటి? తెలిసీ తెలియని ప్రాయం లో ఉన్న ఈ పాపను ఎలా సముదాయించడం? ఎంతో కష్టం మీద ఆ మాట మరిపించి సముదాయించాను. అప్పటికిక గండం గడిచి నట్లే!

శశిని బడికి పంపించేశాక నేను ఆస్పత్రికి వెడుతూ ఉండేవాడిని. అన్ని సదుపాయాలూ...సౌకర్యాలు పాపకు అమిరే ఏర్పాట్లు చేశాను. అయినా ఏదో ఒక లోపం జరుగుతూనే ఉండేది. బాధపడటం తప్ప ఏమీ చేయలేక పోయేవాడిని. అలా కొంత కాలం జరిగిపోయింది.
ఒకరోజు ఆస్పత్రి నుండి యింటికి బయలుదేరే ప్రయత్నం లో ఉన్నాను. అంతలో నర్సు లోపలికి వచ్చి 'ఈరోజు మీరు డిశ్చార్జి చేసిన పేషెంటు సీత మీతో మాట్లాడుతానంటుంది డాక్టర్! లోపలికి పంపమంటారా?'
'ఇంటికి వెళ్ళాలి...పాప నాకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అయినా పంపించు. త్వరగా ఆమెకు ఏం కావాలో తెలుసుకొని వెడతాను.'
భయపడుతూ బిక్క ముఖంతో లోపలికి వచ్చింది సీత. పరీక్షగా చూశాను. ముఖంలో దైన్యం ఉట్టిపడుతూ ఉంది. గుడ్డలు బాగా మాసిపోయాయి. వయసు సుమారుగా ముప్పై పైన నలుబది లోపు ఉంటుంది.
'ఇలా రామ్మా....భయపడకు....నీకేం కావాలో త్వరగా చెప్పు. నేను యింటికి వెళ్ళాలి.'
'బాబుగారూ! నేను దిక్కులేని దాన్ని. కూలి చేస్తూ నా జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాను. ఈరోజు జరిగిన ప్రమాదం లో ఎవరో నన్ను యిక్కడ చేర్చారు. మీరు నాకు జీవం పోసి నలుగురి లో కలిపారు.... ఎంతో దయతో వైద్యం చేసిన మీకు ఫీజు యిచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను.... ఇవ్వలేనని చెప్పడానికి నా మనస్సోప్పడం లేదు.'
సీతమ్మ ను చూసిన నాకు ఒక ఆలోచన కలిగింది. 'చూడమ్మా... నేనిప్పుడు యింటికి వెడుతున్నాను. అలస్యమౌతే మా అమ్మాయి నాకోసం బెంగ పెట్టుకుంటుంది. నేను త్వరగా వెళ్ళాలి. ఇంటికి వస్తే అన్ని విషయాలు మాట్లాడు కోవచ్చు. ఈ పూట అక్కడే భోజనం చేద్దువు గాని.' అని అడ్రసు చెప్పి నేను యింటికి వచ్చేశాను.
నేను యిల్లు చేరేసరికి శశిరేఖ పనిమనిషి తో గొడవ పడుతూనే ఉంది.....
'నాన్నగారింకా రాలేదు. ఊ...ఊ..... ఊ......'
'వచ్చేస్తారమ్మ...టైమైంది' పనిమనిషి సముదాయిస్తూ ఉంది.
'వచ్చేశానమ్మా ...' అని హాలు లోపలికి అడుగు పెట్టాను. నా అనుమతి తీసుకొని పనిమనిషి యింటికి వెళ్ళిపోయింది.
వడ్డించమని వంట మనిషికి చెబుతూ, శశి ని ఎత్తుకొని బట్టలు మార్చుకోవడానికి నా గది లోపలికి వెళ్ళాను. శశితో యిదే పెద్ద చిక్కు. రాత్రి కొంచెం పొద్దు పొతే చాలు నాకోసం గోల చేస్తుంది. ఆ కారణంగా ఎటూ వెళ్ళడానికి వీలుపడేది కాదు. టీపార్టీలు, డిన్నర్లు అన్నింటినీ ఒదులు కొనేవాణ్ణి.
గుడ్డలు మార్చుకొని శశితో భోజనానికి కూర్చున్నాను. వంట సయించ లేదు. సగం లోనే చేయి కడుక్కొని కొద్దిగా పాలు మాత్రం తీసుకున్నాను. శశికి పాలు పంచదార వేసి కొద్దిగా తినిపించాను. ఈ విధంగా ఎన్నిసార్లు జరిగిందో? ఎంతోమంది వంట వాళ్ళను మార్చి చూశాను. లాభం లేక పోయింది. పాప నిద్రపోయింది. హాలులో సోఫాలో కూర్చొని సీతమ్మ కోసం ఎదురు చూడసాగాను. టైము సుమారుగా 8.30 ని కావచ్చింది. వంటవాడు భోజనం చేసి యింటికి వెడతానని చెప్పడానికి వచ్చాడు.
'ఈరోజు భోజనానికి ఒకరు వస్తున్నారు. ఒక గంట సేపు ఉండి వెళ్ళు.' అన్నాను.
'అలాగే బాబూ!' అని లోపలికి వెళ్ళిపోయాడు.
సీతమ్మ చూస్తె సభ్యత సంస్కారం గల స్త్రీలా కనుపిస్తూ ఉంది...మరి! కూలి చేసుకోవలసిన అగత్యమేమిటో...? ఆ వినయ విధేయతలు ...మాట మంచితనం ...నాకు ఒక ఆలోచనను రేకెత్తించాయి. ఆమెను యింట్లో ఉంచుకొని పాపకు ఆయాగా నియమిస్తే ....? బాగానే ఉంటుంది... కాని ఆమె ఏమంటుందో? సరే....వచ్చాక అడిగి తెలుసుకుంటాను. పాప ఆలనా, పాలనా విషయమే నాకొక చిక్కు సమస్యగా తయారైంది. పాప తల్లి రేణుక ఎంత బలవంతం చేసినా నేను పునర్వివాహానికి ఒప్పుకోలేదు. ఆమె గుండె జబ్బుతో మరణించింది. ఆ సమయంలో ఆమె నాతొ మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చాయి.
'ఈ పిన్న వయసులో మళ్ళీ వివాహం చేసుకోకుండా ఎలా ఉండగలరు....?'
'రోగులకు సేవచేస్తూ గడుపుతాను.'
'పాపనేలా పెంచుతారు....?'
'నేనే పెంచుతాను... ఎవరి మీదా నా శశి బాధ్యత ఉంచను.'
