Previous Page Next Page 
గూడు చేరిన పక్షులు పేజి 23

 

    "పోనీ ...మా అమ్మగారు తీసుకు వెడతా నంటున్నారు....'
    'అక్కర్లేదు...నేనే పెంచుతాను.'
    తృప్తితో కళ్ళు మూసింది రేణుక. రేణూ కు తండ్రి లేదు. ఆమెకు అన్నదమ్ములు గాని...అక్క చెల్లెళ్ళు గాని లేరు. మా మామగారి మరణానంతరం మా అత్తగారు నన్ను యిల్లరికం రావాల్సింది గా ఎంతో బలవంతం చేశారు. నేను అందుకు ఒప్పుకోలేదు. ఆ కోపంతో ఆమె మళ్ళీ మా యింట్లో అడుగు పెట్టలేదు. గర్వం గల వాడిననీ, చిన్న పెద్ద తారతమ్యం తెలియని వాడననీ...నలుగురితో చెప్పి కోపంతో వెళ్ళిపోయింది ఆనాడు. రేణు గాని, నేను గాని మా అత్తగారి యింటికి వెళ్ళలేదు. ఆ కారణంగా శశి ని మా అత్తగారికి ఒప్పజేప్పలేదు. కష్టమో, నిష్టూర మో నేనే ఆ బాధ్యత వహించాను.
    పైవిధంగా ఆలోచిస్తున్న నేను సీతమ్మ రాకను గుర్తించలేదు. ఆలోచనల నుండి తేరుకున్న తర్వాత ఆమెను చూశాను. ఒక మూల ఒదిగి నిలబడింది.
    'సీతమ్మా... నీవొచ్చి ఎంత సేపైంది? ఆలోచనలలో మునిగి ఉన్న నిన్ను నేను గురించ లేక పోయాను. నీవు వెళ్ళి భోం చెయ్యి... ఆ తర్వాత మాట్లాడుకుందాం.'
    వంటమనిషి ని కేకవేసి సీతమ్మకు వడ్డించమని చెప్పాను. వంటవాడి వెనుక వెళ్ళింది ఆమె.
    సీతమ్మ భోం చేయగానే వంటవాడు శలవు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆమె వచ్చి నాకు ఎదురుగా కొద్ది దూరంలో కూర్చుంది. సంభాషణ ను ఆమె ప్రారంభించింది.
    'బాబుగారూ! నేనూ ఒకనాడు బాగా బ్రతికిన దాన్నే! ఇప్పటికీ ఆస్తిపాస్తులు ,యిల్లు....పొలాలు అన్నీ ఉన్నాయి....కాని నా అదృష్టం మాత్రం బాగాలేదు. కూలి చేసుకొని బ్రతుకుదామని యిక్కడికి వచ్చాను. అవమానాల పాలయ్యాను. శీలం కాపాడుకోవలసి వచ్చినప్పుడల్లా ఒకచోటు నుండి మరో చోటికి మారవలసి వచ్చేది ...ఏం చెయ్యమంటారు? ఈ పాపిష్టి లోకంలో దిక్కులేని ఒక అనాధ.... అందులో వయసులో ఉంటె.... ఏం జరుగుతుందో మీరు ఊహించుకోగలరు.'
    'అయితే నీవు యిప్పుడెం చేయదలచు కున్నావు....? ఆస్తి పాస్తు లున్నాయంటూన్నావు. మంచిగా బ్రతికానంటున్నావు. మరి నీ పరిస్థితి కి అర్ధం ఏమిటి? అసలేం జరిగిందో చెప్పు.'
    '...............'
    'చెప్పడానికి అభ్యంతరం ఉంటె అక్కర్లేదమ్మా....'
    'అబ్బే...! అటువంటి దేమీ లేదండీ ...మాది యిక్కడికి దగ్గిర లో ఉన్న కుగ్రామం... మావారికి నేను రెండవ సంబంధం.. మొదటి భార్య చనిపోయాక మళ్ళీ వివాహం చేసుకొనే లోపుగానే వారు చెడు అలవాట్ల కు లోనయ్యారు, త్రాగుడు, జూదం...వ్యభిచారం ...యివన్నీ నిత్య కృత్యాలయ్యాయి. వారికి పేదవారైన నా తలిదండ్రులు ఈ విషయాలన్నీ తెలియక కలవారని సంతోషంతో నన్ను వారికిచ్చి వివాహం జరిపించారు, వారి వయసు ఎక్కువైనా నేను అదేమీ పట్టించుకోకుండా సంతోషంతో వారితో గడప సాగాను . వారికి మొదటి సంబంధానికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. కుమారుడు నాకన్న ఒకటి రెండు సంవత్సరాలు చిన్నవాడు. అతనికి కూడా వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కలిగారు...కుమార్తె పసుపు కుంకుమను పోగొట్టుకొని పుట్టింట చేరింది. తండ్రి అలవాట్లు వారెవ్వరికి నచ్చేవి కావు. నేనంటే ఎంతో అసహ్య పడేవారు. మావారు దురభ్యాసాలకు లోనై త్రాగుడు మరీ హెచ్చిచడంతో నాకు వివాహం జరిగిన రెండు సంవత్సరాలకే మరణించాడు. దాంతో నేను దిక్కులేని దాననయ్యాను. నా సవితి కుమార్తె కు ఎవరి తోనో అక్రమ సంబంధ ,ముంది. ఆ విషయం వారు మరణించాక గాని నాకు తెలిసి రాలేదు.  ఒకరోజు ఆమె తన విటుని తో మాట్లాడుతూ ఉండగా నేను వెళ్లి గట్టిగా మందలించాను. ఆ వచ్చిన యువకునితో నేను ఆవేశంతో మాట్లాడుతున్న సమయంలో తను నేను చూడకుండా వెళ్లి అవతలి గదిలో నిద్రపోతున్న నా సవతి కొడుకుని లేపి తీసుకు వచ్చి తన నేరాన్ని నా పై రుద్దింది. నలుగురినీ పిలిచి రభస చేసింది. అసలే నేనంటే యిష్టం లేని నాసవతి కుమారుడు ఆ విషయం తేలికగా నమ్మి నన్ను యింటి నుండి తరిమేశాడు. ఆ అపవాదుతో , పేదరికం తో బాధపడుతున్న తలిదండ్రుల దగ్గరకు వెళ్ళడం యిష్టం లేక యిక్కడికి వచ్చి కూలి నాలి చేసుకొని బ్రతకసాగాను.'
    ధారాపాతంగా కారిపోతున్న ఆమె కన్నీరు. ఆ ముఖంలోని దైన్యం ఆమె మాటలు నిజమే నన్న విషయాన్ని రుజువు పరచాయి. ఆమె మాటలు నమ్మాను. మనుష్యుల తీరు తరహాలు నాకు విస్మయాన్ని కలిగించాయి.
    'చూడు సీతా! నీకభ్యంతరం లేకపోతె మా యింట్లో ఉండు; మా పాపకు ఆయాగా! నీవు ఎంతకాలం ఉన్నా నా కెటువంటి అభ్యంతరం ఉండదు.'
    'చాలా సంతోషం బాబుగారూ! అంత కన్న కింకేం కావాలి? మీలాంటి ఉత్తముల యింట నా జీవిత శేషం వెళ్ళబుచ్చుకొనే అవకాశం నాకు లభించడం ఎంతో అదృష్టం ....ధన్యురాల నయ్యాను. 'రేపు'గురించి ఆలోచించే అవస్థ నాకు తప్పింది.'
    'సీతా తల్లి లేని నా పాపను నీ కప్పగిస్తున్నాను. ఏ విధంగా చూసుకుంటావో?'
    'నా ప్రాణం కన్న మిన్నగా చూసుకుంటాను బాబుగారూ!'
    'సంతోషం .వెళ్లి పడుకో'
    ఎంతో బరువు తీరినట్లు సంతోషించాను. సీతమ్మ పై శశి భారాన్ని వేశాను. ఆ విధంగా వారం రోజులు గడిచి పోయాయి. ఒకరోజు నేను...పాప భోం చేస్తున్నాం..... సీతమ్మ వడ్డిస్తూ ఉంది.
     'వంటకాలు ఏమాత్రం బాగుండడం లేదు సీతమ్మా! ఏం చెయ్యమంటావు? ఇప్పటికే ఎంతోమంది వంటవాళ్ళ ను మార్చాను. అయినా వంటకాల రుచిలో మాత్రం మార్పు రావడం లేదు.'
    'ఈ వంట మనిషిని కూడా మన్పించండి. రేపటి నుండి నేనే వంట చేస్తాను. పైగా ఈ వంట మనిషి ఏవేవో దాటేస్తున్నట్టుగా కూడా నాకు అనుమానంగా ఉంది.''
    'చాలా సంతోషం సీతమ్మా. అంతకన్నా కావలసిందేముంది? రేపటి నుండే అక్కర్లేదని చెబుతాను...కాని నీకు పని ఒత్తిడి ఎక్కువౌతుందేమో?'
    'అదేం లేదు బాబూగారు...! ప్రోద్దుపోవడం లేదు...మీరు పాప వెళ్ళాక అంతా తీరికేగా....?'
    'నీ యిష్టం ....ఉత్సాహంతో చేస్తానంటూ ఉంటె....నేనెందుకు కాదనాలి? ఇంటి బాధ్యతలన్నీ నీకు ఒప్పగిస్తే నాకూ కొంత విశ్రాంతి గా ఉంటుంది. ఇది ఎప్పటి ఋణానుబంధమో....?'
    'ఏమో బాబుగారూ....?'
    ఆనంద భాష్పాలు రాల్చింది సీతమ్మ... నేను కూడా సంతోషించాను. ఆమెకు పాప పట్ల గల అనురాగాన్ని గమనించి నిశ్చింతగా ఊపిరి పీల్చాను.
    ఒకరోజు నేను...అమ్మాయి రేఖ హుస్సేన్ సాగర్ ట్యాంకు బండ్ కు వెళ్ళాము. రేఖ ఆ సంవత్సరమే ఫిప్టు ఫారం ప్యాసైంది. సీతమ్మ పుణ్యమా అని రేఖ ఆలనా, పాలనా తదితర ముఖ్య బాధ్యతల నుండి తప్పుకున్నాను.
    ఒక ప్రక్కగా కారు ఆపి, దిగి మెల్లిగా నడవ సాగాము. కొంచెం సేపట్లో రేఖ అలసి పోయింది. ఆ తర్వాత ఒక బెంచి లో కూర్చున్నాం. మెల్లిగా సంభాషణ ప్రారంభించాను నేను.
    'అమ్మా రేఖా ....నీ చదువెలా సాగుతుందమ్మా...?'    
    'బాగానే చదువు కుంటున్నాను నాన్నారూ....!'
    'మార్కులు బాగా తెచ్చుకొని ప్యాసవ్వాలి. లేకపోతె మెడిసిన్ లో సీటు దొరకడం కష్టం. నాకు తెలిసిన మెడికలు ప్రోఫిసర్లు చాలామంది ఉండడం వలన సీటును గురించి బెంగ అక్కర్లేదు. అయినా మనం కూడాఅర్హతలు కలిగి ఉండడం ఎంతో మంచిది. వేరే యితర విషయాల పై మనసు పోనీయకుండా జాగ్రత్తగా చదువుకో తల్లీ!  నీవు చదువుకొని డాక్టరు వై నర్శింగ్ హోం బాధ్యత తీసుకున్నప్పుడు నీ తల్లి ఆత్మ సంతృప్తి చెందుతుంది.'
    రేణు గుర్తుకు వచ్చి నా కళ్ళు చెమ్మ గిల్లాయి. రేఖ చూడకుండా తుడుచు కున్నాను.
    'అలాగే నాన్నారూ.... జాగ్రత్తగా చదువుకుంటూ, అమ్మగారి ఆత్మకూ, మీకు తృప్తి ని సంతోషాన్ని కలిగిస్తాను. నా ఈ ప్రయత్నానికి మీ ఆశీర్వదమూ, దైవానుగ్రహము ఉండాలని ప్రతి నిత్యమూ ఆ దైవాన్ని ప్రార్ధిస్తూ ఉన్నాను....'
    'ప్రతిరోజూ పూజ చేయడం నీకెవరు నేర్పారమ్మా....?'
    'సీతమ్మా నాన్నారూ....ఆమె ప్రతిరోజూ పూజ చేస్తుంది. నాతొ కూడా చేయిస్తుంది.
    ఇటువంటి మంచి అలవాట్లు అలవరుస్తున్నందుకు మనసులో ఎంతో సంతోషించాను.
    'సీతమ్మ ఋణం మనం ఎలా తీర్చుకో గలమమ్మా...? స్వంత మనిషి కన్న మిన్నగా మన కుటుంబానికి సేవలు చేస్తూ ఉంది. ఏ ప్రతిఫలమూ ఆశించడం లేదు. ఆ తిండి, బట్ట తప్ప ఎప్పుడైనా , ఏదైనా యివ్వబోయినా తీసుకోదు.....'
    'అవును నాన్నారూ....సీతమ్మ చాలా మంచిది.' అని మళ్లా 'ఇక వెడదామా నాన్నారూ....?'
    'అలాగే నమ్మా....టైము ఎనిమిది దాటింది కూడా!'
    ఇద్దరమూ మెల్లిగా కారు నిలిపిన చోటికి నడవ సాగాము. ఇంతలో అనుకోని సంఘటన ఒకటి జరిగింది. ఎవరో ఒక రౌడి నా ప్రక్కగా వచ్చి కోటు జేబు లో నుండి పర్సు కొట్టేసి టాంకు బండు కు మరొక ప్రక్కగా ఉన్న చెట్ల పొదల వైపు పరుగు ప్రారంభించాడు. ఇదంతా గమనిస్తూ ఉన్న మరొక యువకుడు ఆ రౌడీని వెంబడించడం గమనించాను. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటన నన్ను ఆశ్చర్యం లో ముంచెత్తింది. మరుక్షణం లో 'దొంగ' 'దొంగ' అని గట్టిగా అరిచాను. నా అరుపులకు నలుగురైదుగురు పోగై సంగతేమిటని ప్రశ్నించారు. ఎదురుగా పారిపోతున్న రౌడీ ని, వాడిని వెంబడిస్తూన్న యువకుణ్ణి చూపించి 'ఆ ముందు పరుగెడుతున్న దొంగ వెధవ నా పర్సు కొట్టేసి పారిపోతున్నాడు.' అని ఆదుర్దాతో చెప్పాను. అంతలో మరి కొంత మంది పోగయ్యారు.
    నన్ను గుర్తించిన కొందరు తల పంకిస్తూ ఆ పరిగెడుతున్న యిద్దరినీ అనుసరించారు. నేను కారు దగ్గర కెళ్ళి టార్చి లైటు తీసుకొని, అమ్మాయి రేఖను కారులోనే కూర్చో వలసిందిగా ఆదేశిస్తూ నేను కూడా వారు వెళ్ళిన వైపు వేగంగా అడుగులు వేయసాగాను. టాంకు బండుకు రెండవ ప్రక్క చాలా లోతుగా యిండ్లు ఉంటాయి. యిండ్లె కాకుండా గుబురు, గుబురు పొదలుగా ఉన్న చెట్లు అంతా గజిబిజిగా ఉంటుంది. రోడ్డు నుండి ఆ ప్రాంతానికి దిగడానికి చాలా చోట్ల లో మెట్లున్నాయి. ఆ మెట్ల మీదుగా క్రిందకు దిగి ఆ పరుగెడుతున్న వారిని అనుసరించాను. నాకు వారికీ మధ్యా చాలా దూరం మిగిలిపోయింది. ఆ చెట్ల గుబుర్ల మధ్యగా అంతా ఆగిపోయినట్లు కనుపించింది. వేగంగా అడుగులు వేస్తూ ఆ గుంపు కు దగ్గరయ్యాను. అంతగా ఆదుర్దా పడడానికి కారణం...ఆ పర్సు లో రెండు వేలున్నాయి. రేఖకు నెక్లెస్ కొనాలని ఆ రోజే బ్యాంకు నుండి  తీసుకు వచ్చాను. పని తీరనందు వల్ల కొనడానికి వీలుపడలేదు. రేపు కొనవచ్చునే ఉద్దేశ్యంతో ఆ రెండు వేలూ పర్సు లో ఉంచాను. అనుకోని విధంగా ఈ సంఘటన జరిగింది. గుంపు దగ్గరకు చేరుకున్నాను. సందు చేసుకొని లోపలకు వెళ్ళి నిలుచున్నాను. ఆ రౌడి ని వెంబడించిన యువకుడు బోర్లా పడి ఉన్నాడు. అప్పుడే ఎవరో అతనిని లేవతీయడానికి ప్రయత్నిస్తున్నారు. నేను కూడా దొంతి కూర్చుని ఆ యువకుడిని జాగ్రత్తగా పరిశీలించసాగాను.
    కుడి చేతిలో పర్సు జాగ్రత్త గా పట్టుకొని ఎడమ చేతిని ఆ రౌడీ పారిపోయిన దిక్కుకు చూపిస్తూ సంజ్ఞ చేయసాగాడు. అతను సంజ్ఞ చేసిన వైపుకు యిద్దరు ముగ్గురు పరుగెత్తారు. ఆ యువకుడి కి నోట మాట సరీగా రావడం లేదని గుర్తించాను. ఆ ప్రాంతమంతా చీకటి గా ఉంది. అతని ఎడమ చేయి వణుకుతూ ఉన్నట్లు తోచింది నాకు. టార్చి లైటు వెలుగులో అ చేతిని చూసి నివ్వెర పోయాను. పెద్ద గాయం ....రక్తం కారుతూ ఉంది. బాధతో మూలుగుతున్నాడు. టార్చి లైటును అతను పడి ఉన్న ప్రాంతమంతా వేసి చూశాను. రక్తం మడుగు కనుపించింది. అతను ఆ వెలుతురులో నన్ను గుర్తించి 'బాబుగారూ....! ఇదిగోండి మీ పర్సు.' అని పర్సు ను నా చేతిలో పెట్టి స్పృహ కోల్పోయాడు. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS