Previous Page Next Page 
గూడు చేరిన పక్షులు పేజి 21

 

    మరికొంత కాలం గడిచింది. పిల్లలిద్దరూ స్కూలు కు వెళ్లాడమారంభించారు. ప్రసాదు వన్నీ తల్లి పోలికలే....! వాణ్ణి చూసినప్పుడల్లా నా లక్ష్మీ గుర్తుకు వస్తూ ఉండేది. చదువులో అందరి కన్న ముందుండేవాడు. ఊరిలో పిల్లల వద్ద....పెద్దల వద్ద మంచి పేరు తెచ్చుకున్నాడు వాడు. వాడిపై ప్రేమ ఉన్నట్లుగా నటిస్తూనే వాడిని నాకు దూరం చేసింది. లేనిపోని దొంగతనాలు వాడికి అంటగట్టేది... చెడ్డ పనులు చేస్తున్నాడనీ, చెడు మాటలు మాట్లాడుతున్నాడనీ చాడీలు చెప్పేది..... మొదట్లో నేను నమ్మలేదు. వాడు చెడిపోతున్నాడని కంట నీరు పెట్టుకోవడం కూడా ప్రారంభించింది చివరకు. పైగా నేను జాగ్రత్త పడకపోతే నరలోకం లో ఉన్న తన అక్కయ్య మనసు క్షోభించి పోతుందనీ, కల్లిబొల్లి కబుర్లు చెప్పేది. అంతపట్టుదలతో చెబుతూ ఉండడం వల్ల నిజమని నమ్మే పరిస్థితికి వచ్చాను నేను.
    ఈ విషయాలిలా ఉండగా చాలాకాలం తర్వాత రాజీ మాయింటికి వచ్చింది.... ఆమెను మంచి చేసుకొని కొన్ని కొన్ని సందర్భాలలో ఆమెను కూడా నమ్మించింది; ప్రసాదు చెడిపోతున్నాడని. తల్లి లేని పిల్లవాడనీ, చిన్నతనం కావడం వల్ల అలా తుంటరి పనులు చేస్తున్నాడని సర్దిచెప్పి, ఉన్న కొద్ది రోజులు వాడిని ఆప్యాయంగా చూసి వెళ్ళిపోయింది.
    చివరకు కాంతం నా మనసు పూర్తిగా చెడగొట్టింది. ప్రసాద్ ను ద్వేషించడం... వాడు కనిపించినప్పుడల్లా చీరాకు పడడం వరకు వచ్చింది నా పరిస్థితి.... వాడు స్కూలు ఫైనలు వరకు వచ్చాడు. ఎన్నడు లేనిది ఆ సంవత్సరం వాడి పై ఒకటికి నాలుగు సార్లు చేయి చేసుకున్నాను. పూర్వం వాడిని చూడందే ఏమీ తోచేది కాదు. కాని యిప్పుడు వాడు కనుపిస్తే వళ్ళంతా తేళ్ళు జెర్రులు పాకే విధంగా తయారయ్యాను. నన్ను అలా తయారు చేసింది కాంతం.... నేను ప్రసాద్ ను తిట్టినప్పుడు..... కొట్టినప్పుడు తను వాణ్ణి వెనకేసుకు వచ్చేది, లాలించేది, బుజ్జగించేది , వాడి బాగోగులను తను ఒక్కర్తే చూస్తున్నట్లుగా ప్రవర్తించేది. ఆ నటనతో ఆమె చెబుతున్నదంతా నిజమే ననీ, వాడి మంచి కోసరమే తాపత్రయ పడుతూందని మూర్ఖంగా నమ్మాను.... సర్వనాశనం జరిగి పోయింది.... ఆ గ్రుడ్డి నమ్మకమే నా బిడ్డడిని నాకు దూరం చేసింది.... జరగకూడని అనర్ధం జరిగిపోయింది.
    ఆరోజు జరిగిన సంఘటన ....అబ్బ....ఎంత పైశాచిక ప్రవర్తన. నా జీవితం లో మొట్టమొదటి సారిగా అలా ప్రవర్తించాను. ఊరి నుండి తిరిగి రాగానే బీరువా లో నే పెట్టిన వంద రూపాయల నోటు కనుపించలేదు. ఇంటా బయటా ప్రసాదు పై చాడీలు....నోటు పోయిందన్న కోపంతో కాదు...చెడి పోతున్నాడన్న కోపంతో కొట్టాను.... వెళ్ళగోట్టాను.... బుద్ది తెచ్చుకొని భయంతో మసులు కుంటాడని....తను తీసినట్లు ఒప్పుకున్నట్లయితే పేచీ ఉండేది కాదు. రామయ్య తో తను ఆ నోటు తీయలేదని కబురు పంపించాడు... దాంతో నా అనుమానం మరీ బలపడింది.... నాముందు చెప్పకుండా మధ్యవర్తి తో మంతనాలు జరిపించినందుకు అగ్గి బుగ్గయిపోయాను.... నాలో అంత మొండి పట్టుదల... ఆవేశం ... ఎలా ప్రవేశించాయో ఏమో...? పాపం వాడు ఊరి లో ఉన్నంత కాలం నా పట్టుదల ...బింకం సదలనే లేదు. వాడు ఊరు ఒదిలి వెళ్లిపోయాడని తెలిసిన తర్వాత నా గంబీర్య మంతా సడలి పోయింది. తప్పు జరిగిందేమో నని అనుమాన పడ్డాను.... కాని వాడు ఆ దొంగతనం చేశాడనే నమ్మకం మాత్రం నన్ను ఒదలలేదు. అంత చక్కగా... నేను నమ్మేవిద్జంగా ప్లాను ప్రకారం జరిపించింది కాంతం. వాడు ఊరి నుండి వెళ్ళిపోయాక 2,3 వారాలకు ఈ సంగతి చెల్లెలు రాజీకి తెలిసింది.... వెంటనే పరుగెత్తుకు వచ్చింది. అపరిమితమైనకోపంతో యింట్లో కాలు పెడుతూనే నాతొ పోట్లాట ప్రారంభించింది.
    'అన్నయ్యా.... నా అనుమానాన్ని నిజం చేశావ్!....వాడినలా చిత్ర హింస కు గురి చేసి యింటి నుండి వెళ్ళగొట్టడానికి నీకు చేతులెలా వచ్చాయి? దీని వెనుక ఎవరి నటన.... ఎవరి పట్టుదల ఎంత వరకు ఉందొ నాకు తెలుసు.... అయినా వాడిని యింటి నుండి వెళ్లగొట్టే ముందు నాకు ఎందుకు తెలియజేయలేదు...? నీకు నేను ఆనాడే చెప్పాను.... వాడు మీకు బరువైతే నేను తీసుకు వెడతానని ....ఆనాడు తీయని కబుర్లు చెప్పావ్....! ఈనాడెం చేశావు? చేసిన దానికి నాలుగు రెట్లు అనుభావిస్తావ్.... నీ ముఖం కూడా నాకు చూడ బుద్ది కావడం లేదన్నయ్యా! పెద్ద ఒదిన కిచ్చిన మాట తప్పావు; ఆమె సంతానానికి ద్రోహం చేశావు. నీ యింట్లో పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టను. వాడిని వేదికించేందుకు నా శాయశక్తు లా ప్రయత్నిస్తాను.... అదృష్టముంటే దొరుకుతాడు. లేకపోతె నా వాగ్దానం కూడా నీ కారణంగా నే కొరగాకుండా పోతుంది.'
    నాకు మాట్లాడే అవకాశం యివ్వకుండా నే విసవిసా నడుస్తూ వెళ్ళిపోయింది. నేను కూడా వెనకకు పిలవలేదు... నాకు మాత్రం అభిమానం తక్కువా? అ తర్వాత ఆమె పాలేరు రామయ్య ను సంప్రతించి ప్రసాద్ ను గురించి వివరాలు అడిగి తెలుసుకొని వెళ్లి పోయిందట! ప్రసాద్ ను వెతికించడానికి ఆమె చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయని నాకు అ తర్వాత తెలిసింది.  
    ఆ తర్వాత కొంతకాలానికి ఆ విషయం అందరమూ మరిచిపోయాము. అప్పుడప్పుడు మనసులో మెదులుతూ ఉండేది.... బింకంతో వాడు దొంగని మనసులోనే అసహ్యించు కొనేవాణ్ణి.... ఊరిలో పేరు ప్రతిష్టలు చెడగోట్టాడు చిన్నవాడు. దొంగగా పేరు తెచ్చుకొని ఎటో వెళ్ళిపోయాడు పెద్దవాడు. ఇక అక్కడ ఉంటె ఆ జ్ఞాపకాలు మనసులో మేదుల్తూ చీకాకు పరుస్తాయని, తెలుసిన వాళ్ళూ ఊరికే అడుగుతూ ఉంటారని, నా వ్యాధికి అక్కడ సరైన వైద్యం అమరదనీ అలోచించి పట్నం లో కిరాయి కు ఒక యిల్లు తీసుకుని ఖర్చుకు కూడా వెనకాడకుండా జీవిత శేషమంతా యిక్కడే గడపడానికి నిశ్చయించుకున్నాను. ఆ భగవంతుడి దయవల్ల డబ్బుకు కొరత లేదు. ఇంటి నుండి తీసుకు వచ్చిన డబ్బు నాకు నా జీవితాంతం సరిపోతుంది.
    కాంతం ఆరోజు విషయాలన్నీ విడమర్చి చెప్పేంత వరకు నాకు ప్రసాదు పై కలిగిన అపోహ తీరనే లేదు. యదార్ధం తెలిసి నప్పటి నుండీ చేసిన దానికి బాధపడుతున్నాను. ఇప్పుడిక ఎంత బాధపడినా.... తలబడుకున్నా ఫలితమేముంటుంది? నా కన్నబిడ్డడు నాకు దూరమై పది సంవత్సరాలు గడిచాయి. అవును...గత జన్మలో ఏ తల్లి నుంచో బిడ్డను వేరు చేశాను. దాని ఫలితమే యిది...! ఈ మొండి బ్రతుకు యింకెంత కాలం సాగించాలో ఏమో?.... వాలు కుర్చీలో వెనకకు వాలి నీరసంతో నిట్టుర్చాను.
    'ఏమండీ రమణయ్య గారూ.... ఎక్కువగా ఆలోచించనని నాకు మాటిచ్చి ఏదో దీర్ఘాలోచనలో పడినట్లున్నారే ?'
    'ఏమీ లేదండీ... ఎంత కాదనుకున్నా పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి మీరు హెచ్చరించిన తర్వాత ఎక్కువగా ఆలోచించడం లేదు. మీకు అన్ని విషయాలు ఈరోజే చెబుతాను....ఈరోజు మీకు తీరికగా ఉంటుందా....?'
    'ఓ....అలాగే! ఈరోజు ఆదివారం కదండీ! ఎలాగూ సాయంత్రం పూట ఆస్పత్రికి శలవు. కానివ్వండి. మీ మనసులోని ఆవేదన మరొకరి కి చెప్పుకుంటే మీ హృదయ భారం కొంత తగ్గుతుంది.' అన్నారు డాక్టరు గారు.
    మొదలు పెట్టాను.... లక్ష్మీ నా జీవితంలో ప్రవేశించినది మొదలు.... యిప్పటి వరకు జరిగిన విషయాలన్నీ పూస గ్రుచ్చి నట్లు చెప్పాను.
    డాక్టరు గారు ఓపికతో అంతా విన్నారు. దీర్ఘంగా నిట్టురుస్తూ 'దయచేసి మీరు మీ ప్రసాదు పోలికలు చెప్పాలి.'
    'ఎందుకండి! వాడు కనుపిస్తాడన్న ఆశ రోజు, రోజుకూ సన్నగిల్లి పోతూ ఉంది. ముంముర్తూలా వాడివన్నీ వాడి తల్లి పోలికలే! ఎర్రగా....బలిష్టంగా కళ గల ముఖంతో తీర్చి దిద్దినట్లుంటాడు. ఎటువంటి కఠిన హృదయం గల వారినైనా తన మాటలతో ఐదు నిముషాలలో కరిగించ గలిగే స్వభావం కలవాడు. నా ఖర్మ కాలి, చేరులారా వాణ్ణి యింటి నుండి తరిమేశాను నిర్దాక్షిణ్యం తో. వాడి నొక గొప్ప డాక్టరు గా చేస్తానని...నా లక్ష్మీ కిచ్చిన  వాగ్దానాన్ని వమ్ము చేశాను.... యిలా.... తయారయ్యాను చివరకు....'
    'మీరు చెప్పిన లక్షణాలున్న డాక్టరొకరున్నా రిక్కడ... నా స్నేహితుడైన డా.విశ్వం గారి రేఖా నర్శింగ్ హోం లో పని చేసేవాడు.. ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాలలో ఉన్నాడు. డా. విశ్వం గారి యింట్లో ఉండే చదువుకున్నాడు... అతని పేరు కూడా ప్రసాదే! నాకన్న పెద్ద చదువే చదివాడు. నా స్నేహితుడు డా.విశ్వం గారి కుమార్తె నే యిచ్చి వివాహం జరిపే నిర్ణయం కూడా జరిగింది... చాలా తెలివైన వాడు... ఎటువంటి గడ్డు కేసుల నైనా చురుకుగా పరిశీలించి తగిన సలహాల నివ్వడం లో ఆరితేరిన వాడని అంతా అనుకుంటూ ఉండగా విన్నాను. ప్రత్యేక్షంగా అతనితో పరిచయం ఏర్పడలేదు... చూస్తె మాత్రం వినయ విధేయతలు గల యువకుని లాగే కనుపించాడు.. బహుశా అతను మీ ప్రసాదే నెమో....? కాకపోవచ్చు కూడా...! నిర్దాణగా ఎలా చెప్పగలము? అయినా వీలు చూసుకొని ఒకసారి నా స్నేహితుని యింటికి వెడదాం.... మీరు మాత్రం ధైర్యంగా ఉండాలి... ప్రసాద్ మీకు కనుపించాడనే ధైర్యం తోటే మెలగాలి. డా.విశ్వం గారి యింట్లో.... మీకు పూర్తీ వివరాలు తెలుస్తాయి.'
    నాకు బ్రహ్మానందం కలిగింది. నిర్ధారణ జరగక ముందే ఆ ప్రసాదు నా బిడ్డడన్నట్లుగా అనుభూతి కలుగ సాగింది. ఆ తృప్తి, ఆ అనుభూతి నాకు వేయి ఏనుగుల బలాన్నిచ్చింది.
    డాక్టర్ గారు నా ముఖంలోకి పరిశీలనగా చూస్తూ "ఆచూకీ తెలిసేసరికే మీరు ఎంతో బలాన్ని పుంజుకున్నారు... ఆ ప్రసాదే మీ బిడ్డ డౌతే మీకు పట్ట పగ్గాలుంటాయా?'
    'మీ నోటి చలువ వల్ల అలాగే జరగనివ్వండి డాక్టర్! మీ ఈ సహకారానికి జన్మాంతం ఋణపడి ఉంటాను.... మరి డా. విశ్వం గారి యింటికి ఎప్పుడు వెడదామంటారు? నా మనసు నిలవడం లేదు.... పట్టరాని సంతోషంగా ఉంది.'
    ';చూడండి రమణయ్య గారూ! ఇప్పటి మీ పరిస్థితి ఎక్కువ సంతోషాన్ని కూడా భరించ లేదు.... అయినా అతను మీ వాడు కాకపొతే ఈ ఉత్సాహమంతా మాయమౌతుంది. ...దయచేసి ఉద్రేకాన్ని తగ్గించు కొండి. డా.విశ్వం గారు వారి కుమార్తెతో సహా తిరుపతి వెళ్ళారు. వారు తిరిగి రాగానే మిమ్ములను వారి దగ్గరకు తీసుకు వెడతాను. ...నేనిక శలవు తీసుకుంటాను.... చాలా సమయం గడిచి పోయింది....'
    డాక్టరు గారు వెళ్ళిపోయారు. తాత్కాలికంగా నైనా నా హృదయం సంతోషంతో పొంగి పోయింది. ఆ ప్రసాదే నా ప్రసాదు కావాలని అలా జరిగితే తిరుపతి లో ఏడు కొండల వానికి అతి వైభవంగా కల్యాణం జరిపిస్తానని మనసులో మొక్కుకున్నాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS