నీరజ గ్యాంగ్ చేతుల్లో పడటమూ, ఏ అపాయమూ జరగకుండా తప్పించుకోవటమూ-మురళికి విచిత్రంగా తోచింది_ ఆ గ్యాంగ్ లో ఎవరితోనైనా నీరజకు ఏదో ఒకవిధమైన సంబంధం ఉండవచ్చునని అనుమానం తోచింది_అప్పటినుండీ నీరజను రహస్యంగా అనుసరిస్తూనే ఉన్నాడు.
నీరజను తన గ్యాంగ్ వాళ్ళు ఎత్తుకుపోయిన సంగతి రమణ్ లాల్ కు తెలియదు...నీరజ విషయం పేపర్లలో చూశాడు కాని అప్పుడే మరిచిపోయాడు. నీరజ వేషమూ, పేరూ కూడా మార్చుకోవటంతో అసలు అనుమానించలేదు_ నీలకాంత్ కు తెలిసినా రమణ్ లాల్ కు చెప్పలేదు_చెప్పవలసిన అవసరం అతనికి తోచలేదు_ నీరజను అనుసరించే మురళికి అప్రయత్నంగా రమణ్ లాల్ రహస్యాలు తెలియటం మొదలుపెట్టాయి_చివరకు నీరజ ఇచ్చిన ఫోన్ నెంబర్ సహాయంతో అందరినీ పట్టుకోగలిగాడు.
వార్తాపత్రికలన్నీ మురళిని ప్రశంసించాయి_గ్యాంగ్ లో అందరి ఫొటోలూ పేపర్లలో వచ్చాయి_ నీలకాంత్ ను గ్యాంగ్ లో చూసి జనం నిర్ఘాంతపోయారు_ ఒక ప్రఖ్యాత పురుషుడి కొడుకు గ్యాంగ్ లో వ్యక్తి!!
* * *
విచారణలో అన్ని విషయాలూ బయటపడ్డాయి. నీలకాంత్ ను కావాలనే తన గ్యాంగ్ లో చేర్చుకున్నాడు రమణ్ లాల్! ఒక ప్రముఖ వ్యక్తి కొడుకు తమలో ఒకడు కావటం గ్యాంగ్ కి రక్షణగా ఉంటుందని అనుకున్నాడు... రమణ్ లాల్ ఆశించినట్లే నీలకాంత్ కారణంగానే గ్యాంగ్ మొత్తం ఒకటి రెండుసార్లు ఆపదలలోంచి తప్పుకుంది_తరువాత తండ్రి నీలకాంత్ ను చాలా కఠినంగా మందలించాడు_కానీ నీలకాంత్ చెవిన పెట్టలేదు. చదువు సంధ్యలు అబ్బని అతనికి ఆ జీవితం ఎంతో నచ్చింది.
నీరజ తనను చెంపమీద కొట్టి అవమానించి వెళ్ళిపోగానే ఎలాగైనా నీరజ పైన ప్రతీకారం సాధించాలని నిశ్చయించుకున్నాడు...వల్లమాలిన కండకావరంతో నీలకాంత్ తనవాళ్ళను పంపి పట్టపగలు నీరజను బలాత్కారంగా తన దగ్గరకు రప్పించుకున్నాడు.
నీరజ అదృష్టంకొద్దీ సరిగ్గా ఆ సమయానికి బాలూ కూడా అక్కడికి వచ్చాడు...నిలువెల్లా వణికిపోతూ కన్నీళ్ళతో నిస్సహాయంగా ఉన్న నీరజను చూశాడు. విషయం తెలుసుకున్నాడు.
"ఈ అమ్మాయిని వదిలెయ్యండి..." అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా.
"వీల్లేదు." అన్నాడు నీలకాంత్...గ్యాంగ్ ఒకరిముఖాలు ఒకరు చూసుకున్నారు_ నీలకాంత్ హోదానుబట్టి అతనంటే అందరికీ భయ గౌరవాలున్నాయి. కానీ బాలూ అంటే భక్తి...ప్రేమ...ఆరాధన.
ఎవరికి కాలులో ముల్లుగుచ్చుకున్నా ప్రాణాలొడ్డి తీసేవాడు బాలూ. ఎవరు ఆపదలో చిక్కుకున్నా ఎంతకైనా సాహసించి విడిపించేవాడు బాలూ! నీ, నా, భేదం లేకుండా అందరినీ అన్నివేళలా ఆదుకునేవాడు బాలూ! ఆ కారణంచేత ఎవరూ బాలూ మాట కాదనరు.
నీలకాంత్ విషయం అర్థంచేసుకున్నాడు.
"బాలూ! జరిగిందేదో జరిగింది ఈ విషయంలో ఇంక నువ్వు కలిగించుకోకు." అన్నాడు.
"ఒక అమాయకురాలి బ్రతుకు నాశనం చేస్తానంటావా? నన్ను కల్పించుకో వద్దంటావా?"
"నేను ఆ అమ్మాయి బ్రతుకు నాశనం చెయ్యను. పెళ్ళిచేసుకుంటాను."
"ఉద్ధరించావు! ఆ అమ్మాయికి ఇష్టంలేకపోయినా పెళ్ళిచేసుకోవటం ఆ బ్రతుకు మరింత నాశనం చెయ్యడం కాదా? ఇదంతా జరగనివ్వను."
బాలూ పట్టుదల నీలకాంత్ కు తెలుసు. గ్యాంగ్ లో అతనికున్న విలువా తెలుసు. అన్నింటినీ మించి ఇది రమణ్ లాల్ కు తెలియకుండా జరిపించిన వ్యవహారం. "ఒక్క విషయం ఆలోచించు. ఇప్పుడు నీరజకు మన రహస్యం తెలిసిపోయింది. మనం వదిలిపెడితే బండారం బయటపెట్టదూ."
బాలూ ఆలోచనలో పడ్డాడు.
"అవును అదీ నిజమే?" అన్నాడు.
బాలూ వచ్చి తనను విడిపించమని అన్నదగ్గరనుంచి చచ్చిపోయిన ఆశలకు ఊపిరి పోసుకుంటున్న నీరజ ఈ మాటలతో హడలిపోయింది.
"లేదు, లేదు! నేను మీ రహస్యాలేవీ బయటపెట్టను" అంది ధీనంగా.
"ఇంకేం నీలకాంత్! వాగ్దానం చేస్తోందిగా!" అన్నాడు బాలూ.
"నాన్సెన్స్? ఇలాంటి వాగ్దానాలు నేను నమ్మను. ఇక్కడినుండి బయటపడ్డాక ఈ వాగ్దానం నిలబెట్టుకుంటుందని నమ్మకమేమిటి?"
"మనం మనుష్యుల్ని నమ్మాలి నీలకాంత్!"
"ఓహో! ఏం శ్రీరంగనీతులు! నీనోట రావటం, నేను వినటం! భలే!..."
"పోనీలే నమ్మకు. అయినా ఈవిడ మన రహస్యం చెప్పదు. అలా చెబితే ఆ మరుక్షణం మళ్ళీ నువ్వు ఈవిడను తెప్పించుకోవచ్చు...అప్పుడు నేను అడ్డురాను..."
"తీరా చెప్పేశాక ఏంచెయ్యగలం?"
"అమాయకంగా మాట్లాడకు! నీమీద నేరం ఆరోపించి రుజువుచెయ్యటం నీరజలాంటి సామాన్యురాలికి సాధ్యంకాదు. ఈలోగా ఆవిడ బ్రతుకు సర్వనాశనమయిపోతుంది. అంత తెలివితక్కువగా ఆవిడ ప్రవర్తించదు. కానీ ఈలోగా ఈవిడమీద నువ్వు ఏదైనా అత్యాచారం చెయ్యడానికి సాహసిస్తే నన్ను మొదటిసారిగా హంతకుణ్ని చేసిన ఘనత దక్కించుకుంటావు. జాగ్రత్త..."
నీలకాంత్ రక్తం చల్లబడినట్లు అయింది. బాలూ అన్నంతపనీ చేస్తాడని అతనికి తెలుసు.
బాలూ స్వయంగా నీరజను విడిపించి ఇంటికి పంపించాడు.
నీలకాంత్ రహస్యం చచ్చినట్లు తనలోనే ఇముడ్చుకోవలసి వచ్చింది. నీరజ ఇది ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటూ ఎప్పటికప్పుడే నీరజను చిత్రవధ చెయ్యటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు నీలకాంత్.
బాలూ మీదకూడా నీలకాంత్ పగబట్టాడు. కానీ బాలూను అతను ఏమీ చెయ్యలేడు. అటు రమణ్ లాల్ కూ ఇటు గ్యాంగ్ కూ బాలూ గుండెకాయ.
సుశీలకు అతి ప్రయత్నంమీద గర్భం నిలిచిందేకాని ఆరోగ్యం పాడయింది. అదివరలో ఆవిడ తిన్న మందులూ, చేయించుకున్న ఒకటి రెండు ఆపరేషన్లూ ఆవిడ ఆరోగ్యాన్ని బాగా కృంగదీసాయి.
ఒక మగపిల్లవాణ్ని కని మరణించింది.
చివరి క్షణాలలో సుశీల దగ్గరే ఉన్నాడు బాలూ.
"ఇదీ? చివరికి నువ్వు సాధించింది..." అన్నాడు నిష్ఠూరంగా.
"ఏం నా బ్రతుకులో నేను సాధించింది చాలా అమూల్యమైనదే! నా చివరి క్షణాలలో నాకోసం కన్నీళ్ళు కారుస్తూ నా అనేవాళ్ళు నా దగ్గర ఉన్నారు. ఏ వేశ్యకు పడుతుంది ఇలాంటి అదృష్టం. ఆమాటకొస్తే ఎంతమంది గృహిణులు ఇలాంటి ప్రేమను అనుభవించగలరు? నాకు ఏ దిగులూ, ఏ విచారమూ, ఎలాంటి పశ్చాత్తాపమూలేదు. చాలా సంతృప్తిగా, సంతోషంగా ఉంది. బాబు గురించి కూడా నాకు దిగులులేదు. వాడు మీ కొడుకు. మీ మంచితనం వాడిని కాపాడుతుంది..."
