నీరజ ఆగి శాంతంగా అంది.
"వెళ్ళగలుగుతున్నాను_ఇంక నీకు ఆ గుండెనొప్పి రాదని తెలుసుకున్నాను_ ఎక్కడ ఉన్నా...నువ్వు సుఖంగా_సంతోషంగా...ఉంటావన్న ధైర్యంతో_ వెళ్ళిపోగలను."
నీరజ గుమ్మం దాటకుండానే వచ్చి అడ్డుగా నిలబడ్డాడు ప్రభు.
"నిన్ను వెళ్ళనివ్వను__నాకు నిజం చెప్పు నీరజా?"
"మాటలలోకి మార్చి చెప్పగలిగినదంతా నిజంకాదు ప్రభూ! అంతకు మించిన నిజం...మనసుతో అర్థంచేసుకోగలిగినది_వేరే ఉంది...నన్ను వెళ్ళనియ్యి_అదే మన ఇద్దరికీ మంచిది."
ప్రభును తప్పించుకుని వెళ్ళిపోయింది నీరజ.
* * *
నీరజ తనదగ్గర ఉండిపోవటానికే వచ్చిందని తెలుసుకుని చాలా సంతోషించాడు రమణ్ లాల్ ... కుంటిపిల్లవాడు ఆనందంతో చప్పట్లు చరిచాడు... చివరకు వెఱ్ఱిబాగులపిల్లకూడా "నువ్వు ఇక్కడే ఉండిపోతావా?" అని వెఱ్ఱిగా నవ్వింది.
కుంటిపిల్లవాడిని వీల్ చైర్ లో కూర్చోబెట్టి సాయంత్రం వేళ అటూ ఇటూ తిప్పుకుని వస్తుంది నీరజ_ అలాంటి సమయంలో ఒకనాడు తనను ఎవరో పరిశీలనగా చూస్తున్నట్లు తోచి, తనూ ఆ వ్యక్తిని పరీక్షగా చూసింది_ తనూ చూడటం మొదలుపెట్టగానే ఆ యువకుడు అక్కడినుండి వెళ్ళిపోయాడు_ ఎక్కడో బాగా చూసిన ముఖం అనిపిస్తోంది_ ఎంత ఆలోచించినా గుర్తుకురాలేదు. ఇంటికి వచ్చాక గుర్తుకు వచ్చింది_ పోలీస్ ఆఫీసర్ మురళి! కలుసుకుని చాలా రోజులు కావటం వల్ల_మఫ్టీలో ఉండటం వల్ల...వెంటనే గుర్తుపట్టలేకపోయింది...అయితే మురళి ఇంకా తనను అనుసరిస్తూనే ఉన్నాడన్నమాట!
రమణ్ లాల్ భార్య ఆరోగ్యం నానాటికీ దిగజారుతూ ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్నట్లుగా ఉంది.
ఆ రోజు ఆవిడ మరీ మూసిన కన్ను తెరవకుండా పడిఉంది_రమణ్ లాల్ ఎప్పటిలాగే ప్రయాణమయ్యాడు.
"ఇవాళ వెళ్ళకండి! ఆవిడ స్థితి మరీ ప్రమాదకరంగా ఉంది..." అంది నీరజ.
రమణ్ లాల్ ముఖం చిట్లించుకున్నాడు.
"నేను ఉండిమాత్రం ఏంచెయ్యాలి?"
రమణ్ లాల్ ను తను ఆపుచెయ్యలేనని గ్రహించింది నీరజ.
"పోనీ, మీరిక్కడికి వెళ్తున్నారో చెప్పండి! అవసరమయితే కబురు చేస్తాను." అంది.
రమణ్ లాల్ కొంచెంసేపు ఆలోచించి చిన్న కాగితంమీద ఫోన్ నంబర్ వేసి "ఈ నంబర్ రింగ్ చెయ్యి అత్యంత అవసరమయితేనే..." అని వెళ్ళిపోయాడు.
రమణ్ లాల్ భార్య ఊపిరాడక అవస్థపడుతోంది_ప్రాణాలు ఉగ్గబట్టుకుని రోగి దగ్గరే కూర్చుంది నీరజ.
కాలింగ్ బెల్ మోగింది.
రమణ్ లాల్ వచ్చేశాడా? ఎంతైనా అతనూ ఒక మనిషేగా.
వెళ్ళి తలుపు తీసింది నీరజ_ఎదురుగా మఫ్టీలో మురళి.
"మీరా..." అంది.
"గుర్తుపట్టారన్నమాట!"
కూర్చోమని అనకుండానే కూర్చుంటూ అన్నాడు మురళి, తాపీగా సిగరెట్ వెలిగించుకుంటూ "కూర్చోండి!" అన్నాడు.
వణుకుతోన్న చేతులను ఒకదానిలో ఒకటి చేర్చి నిబ్బరాన్ని కూడదీసుకుంటూ కూర్చుంది నీరజ.
"నాతో ఏంపని?"
"పని మీతో కాదు, రమణ్ లాల్ గారితో."
"ఆయన ఇంట్లో లేరు."
"ఎక్కడికి వెళ్ళారు?"
"నాకు తెలియదు!"
"నిజం చెప్పండి!"
"నిజంగా తెలియదు."
"ఆయన భార్య చావు బ్రతుకుల మీద ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో...మీతో కూడా ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయారా?"
"ఈ సంగతులు మీకెలా తెలుసు?"
"ఏం ప్రశ్న? నేనెవరో మీకు తెలియదా! అన్ని సంగతులూ తెలుసుకోవటమే నా వృత్తి. చెప్పండి! ఆయన ఎక్కడికి వెళ్ళారు? అత్యవసరంగా కలుసుకోవాలి."
"నిజంగా ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు. ఫోన్ నెంబర్ మాత్రమే ఇచ్చారు ఫోన్ చెయ్యనా?"
ఫోన్ దగ్గరకు నడిచింది నీరజ_ఫోన్ చెయ్యబోతున్న నీరజ చేతిని గట్టిగా పట్టుకున్నాడు మురళి.
"వద్దు! ఫోన్ చెయ్యకండి. అ నంబర్ ఇయ్యండి చాలు." తన దగ్గరున్న ఫోన్ నెంబర్ మరొక కాగితంమీద వేసి మురళికి ఇచ్చింది నీరజ.
ఆ కాగితం జేబులో పెట్టుకుని చిరునవ్వుతో వెళ్ళిపోయాడు మురళి.
కొన్ని క్షణాలు అయోమయంగా కూర్చుండిపోయింది నీరజ.
రమణ్ లాల్ కు ఈ విషయం ఫోన్ చెయ్యాలా? వద్దా? తను అతని దగ్గర పనిచేస్తోంది. ఫోన్ చెయ్యటమే తన కర్తవ్యం.
ఫోన్ చెయ్యబోయింది - ఆర్డర్ లో లేదు_అంతవరకు బాగానే ఉంది! అకస్మాత్తుగా ఎలా పాడయింది? మురళి డిస్ కనెక్ట్ చేయించి ఉండాలి!
ఎందుకు? ఏం జరగబోతోంది?
మరొక్క అరగంటకే రమణ్ లాల్ భార్య కన్ను మూసింది.
మురళి రమణ్ లాల్ ని అతని గ్యాంగ్ తో సహా పట్టుకున్నాడు. నీరజను కూడా కస్టడీలోకి తీసుకున్నాడు.
వివరాలన్నీ ఆ మరునాటి వార్తాపత్రికలన్నింటిలోనూ వచ్చాయి.
