"వద్దు సుశీలా! ఆ మాట అనకు..." ఆ సమయంలో కూడా 'మంచి' మాట విని సహించలేక అడ్డుతగిలాడు బాలూ.
సుశీల పెంకెగా తల అడ్డంగా తిప్పుతూ "మీరు మంచివారు. ఆ మంచితనం కాపాడుతుంది. తప్పకుండా కాపాడుతుంది." అంటూ బాలూ చేతిని ఆప్యాయంగా చెక్కిలికానించుకుని కళ్లు మూసింది.
తల్లిపోయినప్పుడు కూడా కన్నీళ్లు కార్చని బాలూ కుమిలికుమిలి ఏడ్చాడు. అతనినుండి ఏదో శక్తి దూరమయినట్లు అనిపించింది.
కళ్ళు తెరవని పసిగుడ్డు-సుశీల అప్పగించిన యాభైవేల రూపాయలు బాలూకు మిగిలాయి.
బాలూను సాధించటానికి నీలకాంత్ కు మంచి ఉపాయం దొరికింది. ఆ శిశువును స్వాధీనం చేసుకుని బాలూను లొంగదీసుకోవాలని అనుకున్నాడు. ఇలాంటి విషయాల్లో రమణ్ లాల్ కల్పించుకోడు. ఒకసారి ఆ శిశువును తీసుకుపోవటానికి ప్రయత్నించాడు. సమయానికి బాలూ అడ్డుకుని కాపాడుకున్నాడు. రాజేశ్వరికి సుశీల సంతానంమీద ఏం శ్రద్ధ? జరిగిన గొడవలతో చికాకుపడి ఆ శిశువును వదిలించుకోవాలనే ఆవిడ చూస్తోంది. బాలూకు భయపడి ఏమీ అనలేకపోతోంది.
బాలూ విషయం అర్థంచేసుకున్నాడు. రాజేశ్వరి రక్షణలో తన బాబును ఉంచటం ఇష్టంలేకపోయింది. అతనికాసమయంలో నీరజ గుర్తుకు వచ్చింది. రాత్రివేళ రహస్యంగా నీరజను కలుసుకున్నాడు.
"ఈ బాబు నా కొడుకు! వేడిని కాన్వెంట్ లో అప్పగించండి! అనాథ అని చెప్పండి! వీడికోసం వీళ్ళ అమ్మ యాభైవేల రూపాయలు ఇచ్చింది. అవి ప్రస్తుతం మీపేర బ్యాంక్ లో వేసాను. వాడికోసం ఖర్చుపెట్టి వాడు ప్రయోజకుడు అయ్యేలాగ చూడండి."
"ఎంత నమ్మకం నామీద మీకు! ఈ డబ్బు ఒకవేళ నేను వాడుకుంటే..."
"మీ యిష్టం! ఒక దీనురాలు తన సర్వస్వమూ కరిగించి కొడుకుకోసం దాచిన డబ్బు అది! నేను చెయ్యగలిగినది నేను చేస్తున్నాను. మీరు చెయ్యాలనుకున్నది మీరు చెయ్యండి..."
బాలూ తనకు చేసిన మహోపకారం నీరజ మరిచిపోలేదు. అతడు తనను అంత చిన్న సహాయం కోరుతుంటే కాదనలేకపోయింది. ఆ రాత్రివేళ అప్పటికప్పుడే బాలూ కొడుకును కాన్వెంట్ లో చేర్చింది.
నీలకాంత్ బాలూ ఏంచేసాడో తెలుసుకున్నాడు. బాలూను, నీరజను ఏ విధంగానూ సాధించలేక నీరజను అవమానించి పగతీర్చుకున్నాడు.
శేఠ్ రమణ్ లాల్ ఆస్తి, ఇంకా గ్యాంగ్ లో అందరి ఆస్తిపాస్తులూ ప్రభుత్వం స్వాధీనపరచుకుంది. ఒక్క బాలూకే సొంత ఆస్తి ఏమీలేదు. విచారణలో అతడు ఎన్నెన్ని సంస్థలకు సహాయపడ్డాడో అతనికి ఇష్టంలేకపోయినా బయటపడింది.
నాలుగు మూలలనుండీ "బాలూ చాలా మంచివాడు. అతడిని వదిలిపెట్టండి" అంటూ అభ్యర్థనలు కుప్పలుతిప్పలుగా వచ్చాయి.
కానీ, ఆ అభ్యర్థనలకు బాలూయే ఒప్పుకోలేదు.
"నేను చేసిన నేరాలకూ, ఇతరులకు చేసిన సహాయాలకూ ఏ విధమయిన సంబంధమూ లేదు. ఈ గ్యాంగ్ తో మిగిలినవాళ్ళతో పాటుగానే నాకూ శిక్ష విధించండి!" అన్నాడు.
జడ్జి ఆశ్చర్యంగా బాలూను చూసి అప్రయత్నంగా "నువ్వు మంచివాడివి" అన్నాడు.
బాలూ కసిగా పిడికిలి గట్టిగా బిగించి "డేమ్" అన్నాడు కసిగా.
నీరజను విడుదల చేశారు.
కోర్టు బయట తనకోసం ఎదురుచూస్తున్న లక్ష్మీదేవిని చూసి ఆశ్చర్యపోయింది నీరజ. ప్రభుకోసం చూసింది కనపడలేదు.
"నేను నిర్దోషినని తెలిసి వచ్చావా అత్తయ్యా!" అంది నిష్ఠూరంగా.
"లేదమ్మా! నువ్వు ఇక్కడ ఉంటావనే తెలిసి వచ్చాను. నువ్వు ఎక్కడ ఉంటావో, నిన్ను ఎలాగ కలుసుకోవాలో తెలిస్తే ఎప్పుడో వచ్చేదానిని..."
లక్ష్మీదేవి మాట్లాడే ధోరణికి నీరజ భయపడింది.
"ఏం జరిగింది అత్తయ్యా!" అంది.
"నీకు పుణ్యం ఉంటుంది. వెంటనే రా. చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. నా ప్రభును నాకు దక్కించు..."
నీరజ ఇంక ఏ ప్రశ్నలూ వెయ్యలేదు. లక్ష్మీదేవితో బయలుదేరింది.
"అదిగో ఎప్పుడూ ఆ గదిలో తలుపులు వేసుకుని కూర్చుంటాడు. అప్పు తీర్చాలని ఆఫీసుకు మాత్రం వెళతాడు. ఎవరితోనూ మాట్లాడడు." బాధపడుతూ అంది లక్ష్మీదేవి.
నీరజ తలుపు తట్టింది.

"ఎవరు?" అన్నాడు ప్రభు తలుపు తీయకుండానే.
"నేను!" కంపిస్తోన్న గొంతుకతో అంది నీరజ.
వెంటనే తలుపులు తెరుచుకున్నాయి.
కొద్దిరోజులలోనే గుర్తుపట్టరానంత మారిపోయిన ప్రభును చూసి నీరజ కళ్ళు చెమ్మగిల్లాయి. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ బొమ్మల్లా నిలబడిపోయారు.
"నిన్ను నా దగ్గరినుంచి పొమ్మన్నాను. మళ్ళీ ఎందుకొచ్చావ్?"
"ఇప్పటికీ నీ మనసులోంచి పొమ్మనలేక పోయావని తెలుసుకుని వచ్చాను..."
"ఒక్క నిజం విని వెళ్ళిపో! నువ్వు శీలం పోగొట్టుకున్నావని నా బాధ కాదు. నా ఆరోగ్యంకోసం, అనవసరంగా అంత త్యాగం ఎందుకు చెయ్యాలని..."
"ఒక్క నిజం చెప్పి వెళ్ళిపోతాను. నువ్వు నిజం చెప్తే నమ్మలేవని కాదు. అనేక గొడవల మధ్య ఇరుక్కుపోయిన నాతో నిన్నుకూడా చిక్కుల్లోకి దింపటం ఇష్టంలేక..."
నీరజ పోయేదానిలా వెనక్కు తిరిగింది.
ప్రభు "నీరజా!" అని పిలిచాడు. నీరజ గిర్రున తిరిగి చిరునవ్వు నవ్వింది.
ప్రభు చేతులు జాపాడు.
నీరజ అతని హృదయంమీద వాలిపోయింది.
* సమాప్తం *
