Previous Page Next Page 
అదివిష్ణు నవలు -2 పేజి 21

 

    "చదువుకుని -"
    "అంతే చదువుకోవాలి. ఈ చదువులో మీరు పదిమంది చేతా అవుననిపించుకునే స్థితికి రావాలి."
    "వచ్చి?"
    "మిమ్మల్ని మీరు .....అయినా ఏమిటీ ప్రశ్నలు? చదువుకోమన్నాను, చదవండంతే!"
    "ప్రశ్నలేమిటి అడిగితే నేనేం చెప్పలేను. గాని మేస్టారూ! మీతో నిజం చెప్పేదా?" "చెప్పండి"
    "నాకు చదవాలని లేదండి."
    "ఇందిరా?"
    "మరో మరో మాష్టారయితే రెండో రోజునే ఈ ముక్క చెప్పి వుండేదాన్ని. కాని, మిమ్మల్ని మేస్టారు గానే భావించలేదు. అందుచేత డాడీ నాకోసం వెతికి తీసుకొచ్చిన మంచి స్నేహితులుగా భావించెను. అందుచేత మీరేం చెబుతున్నా ఊ కొడుతున్నాను. నేనొకటి అడుగుతాను చెప్పండి మేస్టారూ! ఆడపిల్లలు సినిమాల్లో చేరితే అవమానమా?"
    "..... .... ...."
    "చెప్పండి మాస్టారూ? ఆ కళ అంత నీచమైనదా?"
    "నాకు తెలీదు."
    "ఎందుకో గాని.....నేను గూడా సినిమాల్లో చేరాలని ఉంది."
    "మీ నాన్నగారి నడిగేరా?"
    "యుద్ధం గూడా జరిగింది. కానీ, డాడీ సలహాలేవీ నాకు నచ్చవు."
    'అమ్మగారి నడిగేరా?"
    "అమ్మ యిష్టం ఈ యింట్లో చెల్లదు."
    "మీకు గాని, ,మీ నాన్నగారికి గానీ సినిమావాళ్ళు ఎవరైనా తెలుసా?"
    "నేను సినిమాల్లో చేరాలనుకుంటే, అక్కడి మనుషులు తెలియాలని వుందా?"
    "అదికాదు నా ప్రశ్న సినిమాల్లో వున్న ఆడవాళ్ళు ఎవరైనా మీకు తెలుసా అని ఎందుచేతనంటే , అక్కడ సాధక బాధకాలు వాళ్ళ ద్వారా మీరు తెలుసుకునే అవకాశం వుంటుంది కదా!"
    ఇందిర పకపకా నవ్వేసి అన్నది -
    "ఇంకా నయం మేష్టారూ! వాళ్ళు చెప్పే కట్టుకధలన్నీ వినమన్నారు కాదు. నిరుద్యోగి ఉద్యోగిని పట్టుకుని నీ వుద్యోగం ఎలా ఉందని అడిగితే , ఉద్యోగి యిబ్బందులే చెబుతాడు గాని సుఖం గురించి యెక్కడైనా చెబుతాడా? అక్కడ విషయమూ అంతే."
    "అంటే మీరు చాలా నిర్ణయాలు ఇంతకూ మునుపే చేసుకున్నారన్నమాట."
    "వీలైతే ఇవాళే వెళ్ళాలని అనుకుంటున్నాను."
    "ఆలాటప్పుడింక నా సలహాలెం పనిచేస్తాయి? మీరేం పిల్లలు కాదు. మీకు తోచింది సబబని మీకు తోస్తే , ఇంట్లో మీ పెద్దవాళ్ళ అనుమతి మీదనే వెళ్ళండి. అది ఉభయత్రా మంచిది."
    "ముకుందంగారూ అలాగే వెళ్ళేరా?"
    "అతను మగవాడు."
    "మళ్ళా మీరు, అడ మగా తేడాలు తీసుకువస్తున్నారు మేష్టారూ. ఒకపని చేయాలనికున్నప్పుడు ఈ తేడాలెందుకు సార్"
    "అవున్నిజమే ఏమిటో నేనెంత దూరంగా ఆలోచించలేదు."
    "క్షమించండి మేష్టారూ . మిమ్మల్ని నొప్పించాలనే వుద్దేశంతో నేను ఆ మాట అనలేదు. ఇంతకీ ముకుందంగారు సినిమాల్లో ఎలా ప్రవెశించారో చెప్పనేలేదు."
    (ఇందిర నా మీద దెబ్బ కొడుతుంది. ఇందిర నా గొప్పతనాన్ని గౌరవిస్తూనే, నన్ను హింసిస్తుంది. ముకుందం కధ చెప్పే ప్రయత్నం చేస్తే , నేను నా జాలి కధనీ జ్ఞాపకం తెచ్చుకోవాలి. ముకుందం గొప్ప కధకి నా జాలికధ ముడిపడి వుంది.)
    "ఇంట్రస్ట్ కొద్దీ అడిగేను . అభ్యంతరమైతే వద్దులెండి మేష్టారూ."
    "అతని గురించి మీరు పత్రికల్లో చదవలేదా?"
    "చదివేననుకొండి , అవన్నీ నిజమంటారా? నా వుద్దేశంలో ఏ ఒక్క నటుడూ అకస్మాత్తుగా , సినిమాల్లో చేరిపోడు . దానికేదో ప్రయత్నాలూ కొన్ని కష్టాలూ ...."
    "నిజంగా అతనెప్పుడూ సినిమాల్లో వేషం కోసం ప్రయత్నించనేలేదు. అతి సుళువుగా అతను సినిమాల్లో ప్రవేశించాడు."
    "వండర్ పుల్ ! అంత అదృష్టమే."
    "అవును. అతను ఎమ్మే చదివే రోజుల్లో, ఓ నాటకం లోని అతని హీరో వేషం ఒక పెద్ద మనిషిని ఆకర్షించింది. ఆ పెద్ద మనిషే అతనికి సినిమాల్లో వేషమిచ్చేడు."
    (నేను ఎమ్మే చదవలేకపోయాను. చదివి వుంటే , నేను లేని నాటకాల్లో ముకుందం ఉండేవాడు కాదు. నేనున్న నాటకాల్లో నేనే హీరోని. అందుచేత ఇందిరా , నాది జాలికదై అతనిది గొప్ప కధైపోయింది. అందుచే ఇందిరా , నేనీ మలుపు గుర్తుంచుకోలేను.)
    "మీరెప్పుడైనా మదరాసు వెళ్ళేరా మేస్టారూ?"
    "వెళ్ళెను."
    "ఆయన్ని కలుసుకున్నారా?"
    "వెళ్ళిన ప్రతి మాటూ కలుసుకోలేదు."
    "ఇప్పుడు మీరు వెడితే....."
    (నీ అనుమానం నాకర్ధమైంది ఇందిరా! నన్న తను ఉత్తరాల ద్వారానే పలకరించే మిత్రుడనుకుంటున్నావ్ గదూ. ఈ దౌర్భాగ్యుడికి వెలిగిపోతున్న మిత్రులనేకం. వాళ్ళెప్పుడూ నన్ను నిర్లక్ష్యం చేయరు. చేయలేరు. నా అసలు పేరు రావ్ ది గ్రేట్! ఈ గ్రేట్ గాడి బతుకిప్పుడు డౌన్ అయితే కావచ్చు గానీ , ఇప్పటికీ కూడా వాళ్ళకి నేను గ్రేట్ నే. రేయ్ ముకుందం , సుబ్బారావు, శోభనాచలం , మూర్తీ రండర్రా అని నేను పిలవాలే గాని రెక్కలు కట్టుకు వచ్చి నా ముందు వాలి "నీకు వచ్చిన కష్టం చెప్పు, మా నెత్తురు ధారపోసి నిన్ను గట్టేక్కిస్తామనే మిత్రులు వీళ్ళంతా. నా పేదరికాన్ని వాళ్ళందరి ముందు ప్రదర్శించడం నా కిష్టం లేదు . వాళ్ళు నా పట్ల జాలి పడుతున్నట్టు వాసనా కలిగితే చాలు, ఆత్మహత్య చేసుకుంటాను. కనక, నేనే వాళ్ళందర్నీ దూరంగా ఉంచేను. నన్ను ఆదుకునే ఛాన్స్ వాళ్ళకంత సులువుగా దొరకదు తెలుసా?)
    "పోనీ ఈ మధ్య ఎప్పుడైనా వెళ్ళేరా?"
    "లేదు"
    "వెళ్ళవలసిన పనిపడితే వెడతారా?"
    "అదంత తొందరగా వచ్చేది కాదు."
    "ఏమో .....వస్తే....."
    "రాదని నేనంటున్నాను."
    "వస్తుందని నేనంటున్నాను."
    "ఇందిరా! నేనెంత హీనంగా బతకడం లేదు. విసిగించకండి నన్ను" అతను చాలా కటువుగా అన్నాడు.
    ఇందిర భయపడిపోయింది . మెల్లిగా అన్నది.
    "నా మాటని మీరెలా అర్ధం చేసుకున్నారో ఏమో? నేనడగదలచింది ఒకటి. మదరాసు వెళ్ళాలనుకుంటున్నాను గదా, ఒక్క తడవ ఆయనతో మాటాడి...."
    "అది మీ విషయమైతే నన్నడగట మెందుకు?"
    "మీరు చేయవలసిన సాయమూ వుంది మేస్టారూ! నన్ను కనికరించి మీరూ నా వెంట మదరాసు వస్తే.....వారిని కలుసుకోదానికి గానీ, మాటాడడానికి గానీ ధైర్యంగా ఉంటుంది గదాని...."
    "క్షమించండి నేను మీకు చదువు చెప్పే నిమిత్తమే నేనిక్కడికి వస్తున్నాను. చదువు చెప్పడం తప్ప నేను యితరత్రా ఏ విధంగానూ ఉపయోగించను."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS