"జ్వరముదేముందే! రానూ వచ్చింది తగ్గనూ తగ్గిందట!"
"ఫర్లేదు లే అయితే! అయినా స్టెల్లా అతన్నిక్కడికి ట్రాన్స్ ఫర్ చేయించుకోమని అడక్కూడదూ?"
"వెయ్యిన్నొకటోసారి అడిగాను మొన్న ఫస్టు వచ్చినప్పుడు, ఎప్పుడూ ఒకటే సమాధానం! నన్నే రమ్మంటాడు. రిజయిన్ చేసి వెళితే అక్కడ ఉద్యోగం చూస్తాడట అదోలా అంది నంద.
"పోనీ వెళ్ళరాదూ?" సజెస్టివ్ గా అంది.
"భలేదానివే! నెలకి ఎనిమిది వందలొచ్చే జీతం వది లేసి, అతనిచ్చే పాకేట్ మనీపై ఆధారపడనా? భార్యయినా భర్తయినా ఇండిపెండెంట్ గా వున్నన్ని రోజులే ప్రేమ అభిమానాలూను" స్పష్టంగా చెప్పింది స్టెల్లా.
"అతనెందుకు రాడు ఇక్కడికి?" ప్రశ్నించింది నంద.
"జననీ జన్మభూమి" చప్పున అంది.
"ఇది తెలుగుదేశమేనని చెప్పలేకపోయవూ? అవును ఆ జననికి మీ పెళ్ళి ఇష్టమేనా?" ఆత్రంగా అడిగింది.
"ఆ సుబ్బరంగా ఒప్పేసుకుంది. కాదన్నా ఇతడు వినడుగా కానయితే ఓ కండీషన్ పెట్టింది. ఒక టేమిటిలే చాలా.
"ఏమిటి?" కుతూహలంగా ధ్వనించింది నంద గొంతులో.
"పెళ్ళికాగానే నేను బొట్టుపెట్టు కోవాలి! క్రాస్ తీసేసి మంగళసూత్రాలు వేసుకోవాలి! ఇప్పుడు తింటున్న ఫిష్ కూడా వదిలేయాలి! రోజూ మడిచీర ఆరవేసుకుని కట్టుకుని వంట చేయాలి. ఆ మాట ఎందుకందంటే మడి చీర ఆరవేసి వంట చేయాలంటే నేను దండేనికి అరవేసి, ఇస్త్రీ చీరతో వంట చేయాలా అని అడిగాను..... మడి, తడి పాటించాలి. వూరగాయలు పెట్టడం, శుక్రవారం తలంటు పోసుకుని లక్ష్మీ అమ్మవారికి సహస్ర నామార్చన చేయటం, చర్చికి వెళ్ళటం మానేసి దేవాలయానికి వెళ్ళటం- నేను సరేనని ఒప్పేసుకోవటం ఆమె పొంగిపోయి నన్ను మడి కట్టించి వంట చేయించింది. తెలుసుగా నా చేతి వంట ఎలా వుంటుందో, భోంచేస్తున్నప్పుడూ, చేశాక ఒకటే పొగడటం, ఆఖరికి తన దిష్టిసోకి ఉంటుందేమోనని తన దిష్టి తీసింది!" తృప్తినిండిన గొంతుకతో అంది.
స్నేహితురాలి ముఖంలో తృప్తి కనిపిస్తోంది.
అది చూసి సంతృప్తిగా నవ్వింది నంద.
"నిన్ను పూర్తిగా బ్రాహ్మణ అమ్మాయిని చేసిందన్న మాట!"
"కానీ ఒక చిక్కు మాత్రం వచ్చిపడిందే!"
"ఏమిటిది?" కుతూహలంగా అడిగింది నంద.
"రాత్రిళ్ళు కూడా చీర కట్టుకుని పడుకోవాలని చెప్పింది ఆవిడ నెగ్లజీలోనో, పెటేకోచ్ లోనో పడుకునే నాకు ఎలాగో ఉండింది!"
పకపక నవ్వింది నంద.
"అఫ్ కోర్స్! పెళ్ళయ్యాక ఆ రహస్యం కాపాడతామన్నారు. శ్రీను-పెటికోటో-నెగ్లజినో నీ ఇష్టం. ఆఖరికి మేరిలిన్ మన్రోజ్ లాగా పడుకున్నా తనకిష్టమే! అన్నాడు సిల్లీఫెలో!'
తెరలు తెరలుగా వస్తోన్న నవ్వుని ఆపుకోలేకపోయింది నంద.
స్టెల్లా పెదాలు బిగించింది గంభీరంగా.
"ఏమిటి జోరుగా నవ్వేస్తున్నారు!" అన్నాడు అప్పుడే అడుగు పెడుతూ శివరాం. అతను అక్కడే కోక్లర్క్ అతని వెంటే ఒక్కొక్కరే వచ్చారు."
అందరూ పావుగంట లేటు!
"మేనేజర్ రాలేదా ఇంకా?"
"ఊహూ ఆయన అరగంట లేట్ పర్మిషన్ పెట్టారు!"
"అందుకే ఇలా వుంది!"
ఆఫీసులో అంతా నిండిపోయారు. ఎవరి సీట్లల్లో వాళ్ళు కూర్చుని నిన్న పెండింగ్ పెట్టిపోయిన రికార్డ్స్, చూడసాగారు.
నందకి ఆ వచ్చిన ఉత్తరం చదవాలనిపించింది. ఎవరు రాశారా అన్న కుతూహలంతో చించింది ఆత్రంగా.
క్రింద సంతకం చూసింది చప్పున. పద్మావతి! ఏం రాసిందో ఏమో కానీ పెద్ద ఉత్తరమే! వ్రాసింది!
అక్షరాలు పట్టి పట్టి రాసినట్టుగా వున్నాయి. ఎలా రాసిందో! ఎన్నాళ్ళు రాసిందో! పద్మావతి!
పద్మావతంటే తనమేనత్త! ఏం రాసిందో! అనుకుని కుతూహలంగా చదవసాగింది.
ఆనందలక్ష్మీ!
నన్ను మీరంతా మరచిపోయే వుంటారు. ఒకవేళ ఎప్పుడయినా గుర్తుకి వచ్చినా ఆ పాపిష్టిదాన్ని మరిచి పోవటమే మేలు అనుకుని చప్పున ఆలోచన మరల్చుకుంటారు. నిజంగా సామాజికపరంగా నేను చేసింది తప్పే! కాదనను! కానీ నా దౌర్భాల్యం నాది. ఏ లేచిపోయిన ఆడదాని చరిత్ర చూచినా అంతే! మగవాడికి లొంగే వరకే ఆడదానికి స్వాతంత్ర్యం- లొంగిందా అంతే సంగతులు!
నేను మన వూళ్ళో వుండగా మన ఇంటి పరిస్థితులు చాలా బావున్నాయి. ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడెలా వుందో నాకు తెలియదు. చాలా కుటుంబాలు దిగజారి పోయాయి. అన్నయ్య ఒక్కడి సంపాదనతో సంసారం ఎలా గడుస్తుందో? రవి ఏం చేస్తున్నాడు? వాడికి పెళ్ళి అయి వుంటుంది. పిల్లలా? ఈ రోజుల్లో పెళ్ళయి ఏడాది తిరక్కముందే పిల్లలు పుట్టుకొస్తున్నారు. మీ అమ్మ బావుందా? దౌర్భాగ్యురాలైన ఈ మరదలి గురించి ఏమని అనుకుంటుంది?
నందా!
నాకు ఒక్కసారిగా రెక్కలు కట్టుకుని అక్కడికి వచ్చెయ్యాలనుంది ఇన్నేళ్ళనుంచీ లేనిది ఈ రోజు ఈ బుద్ది ఎలా పుట్టింది అనొచ్చు!
అన్నేళ్ళు గుట్టుగా వున్నదాన్ని హఠాత్తుగా అతనితో ఎలా వెళ్ళిపోయొచ్చాను. ఇదీ అంతే!
కానీ ఇప్పుడు నా రాకలో వేరే పరమార్ధం వుంది.
నన్ను వెంట తీసుకుని వచ్చిన మోతీ హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయాడు. ఈమధ్య ఈ ఆరునెలలు ఒంటరి జీవితం మీవేపు లాగుతుంది! రోజూ నీ గురించే నా చింత నా చింతన!!
సాటి స్త్రీ కాబట్టి మా వదిన నన్ను రమ్మని రాయమని చెప్పినా అన్నయ్యకి నాపై ఆగ్రహం ఇంకా మిగిలేవుండొచ్చు ఏండ్లు వూండ్లుగడిచాయా కోపం తగ్గడానికే? గట్టిగా ఎనిమిది సంవత్సరాలు గడిచాయా అంతే!
ఇప్పుడు నావద్ద దాదాపు అయిదువేల నగదు వుంది ఇంకా కొన్ని నగలూ వున్నాయి. ఇవన్నీ మోతీ గుర్తులు అదృష్టవశాత్తూ మా ప్రేమ, కామం ఫలితంగా ఏ భారమూ లేదు. ఈ దౌర్భాగ్య జీవితంలో అదో అదృష్టం అనుకోవాలి.
నన్ను రమ్మంటే నేనూ వస్తాను.
నా ముఖం చూట్టానికి మీకెవ్వరికీ ఇష్టం లేకపోతే నగలు నీకూ నగదు రవికీ పంపేసి చార్జీల కోసం వో వందో రెండువందలో వుంచుకుని ఋషికేష్ వెళ్ళిపోతాను. అక్కడ భజన చేసుకుంటూ కాలం గడిపినా నా జీవితం వెళ్ళిపోతుంది. అంతేకానీ ఇక్కడ ఈ మనుషుల మధ్య నేను గడపలేను.
అందరినీ అడిగినట్లు చెప్పు. నీ సమాధానం కోసం ఎదురు చూస్తూంటాను. ఏ విషయమూ తెలిసేదాకా ఆందోళనగా వుంటాను...
పద్మావతి.
