Previous Page Next Page 
ఆచరణ లో అభ్యుదయం పేజి 20


    
    "నేను చెయ్యాల్సిందంతా చేస్తాను...' హామీ ఇస్తున్నట్లే అన్నాడు మురళీ.
    'నేను చేస్తాను ని కాదు మనం చేద్దాము అని అనండి.' మనోజ్ఞంగా నవ్వింది కళ్యాణి. 'మీరు చేసే ప్రతి పనిలోనూ మీ నీడలా మీ వెంటే వుంటాను నేను.'
    కొద్ది క్షణాలు ఆమె మొహంలోకి కళ్ళలోకి మృదువుగా చూసి, 'అసలు నిన్ను ఆవాళ ఆఫీసులో మొట్టమొదటి సారిగా చూసినప్పుడు నా కేమనిపించిందో చెప్పనా?' అన్నాడు మురళీ.
    'ఊ.'
    'ఎన్నో యుగాలు ఎన్నో జన్మలు కలిసి ప్రయాణం చేసిన మనం మధ్యలో విడిపోయి తరువాత ఎన్నాళ్ళ కో ఒక దగ్గర హటాత్తుగా కలుసుకుంటే ఆ మనిషికి ఎలాంటి సంతోషం కలుగుతుందో అలా అనిపించింది.'
    'ఖబుర్లు చెప్పటం బాగా వచ్చు' అతని షర్టు గుండీ నిమురుతూ గోముగా అంది కళ్యాణి.
    "గొప్పగా ఖబుర్లు చెప్పటం ఏం కాదిది...నా మనస్సులో మెదిలిన భావాలని మాటల రూపంలో పైకి వ్యక్తం చేశానంతే....జన్మ జన్మల నుంచీ వస్తున్నా మన ఈ అనుబంధం.......'
    'ఇంకా ముందు జన్మలలో కూడా ఎప్పటికీ ఇలాగే వుండాలని కోరుకుందాం.' ఆవాక్యాన్ని పూర్తీ చేసింది కళ్యాణి.
    ఇద్దరూ తృప్తిగా నవ్వుకున్నారు.

                               *    *    *    *
    ఆదివారం మధ్యాహ్నం మురళీ తీరుబడిగా నిద్రకి ఉపక్రమిస్తే కళ్యాణి స్టౌ అంటించి ఫలహారాలు తయారు చేసే తతంగంలో పడింది.
    నాలుగు గంటలకి అతను లేచి బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటూ వంటగది గుమ్మం దగ్గరికి వచ్చేసరికి ప్లేట్లలో పంచరాద కాజాలు ఉల్లిపాయ పకోడీ లు ప్రత్యక్షం అయాయి.
    స్టౌ మీద మంచినీళ్ళ గిన్నె దింపి పాల గిన్నె పెడుతున్న కళ్యాణి, ఒక్కసారి కాస్త ప్రక్కకి తిరిగి 'లేచెరా-- త్వరగా మొహం కడుక్కు రండి ...డికాక్షన్ చల్లారి పోతుంది-- మళ్లీ వేడి చేస్తే రుచే వుండదు.' అంది నీళ్ళల్లో పొడి వేస్తూ.
    'ఇవన్నీ ఒక్కదానివీ కూర్చుని చేశావా? నన్ను లేపక పోయావా ఏదైనా సాయం చేసే వాడినిగా......'
    'సరిపోయింది కాని, మీరు త్వరగా వస్తారా?'
    'చిత్తం' నవ్వుకుంటూ బాత్ రూమ్ వైపు వెళ్ళిపోయాడు మురళీ.
    పనులన్నీ అయిపోయాక స్నానాలు చేసి నీటుగా ముస్తాబయి కూర్చుని అప్పుడు తీరుబడిగా సాయంకాలం ప్రోగ్రాం గురించి చర్చించు కోటం మొదలు పెట్టారు.
    'ఎక్కడికి వెళ్దాం , నువ్వే సజస్టు చెయ్యి.' నీమాట శిరసా వహిస్తాను అన్నట్లే చెప్పాడు మురళీ.
    'మీ శారదక్క య్యా వాళ్ళింటికి . టకీమని సమాధానం చెప్పింది కళ్యాణి. నీకేం మతి పోలేదు కదా అన్నంత విసుగ్గా చూశాడు మురళీ.
    'ఆదివారం సాయంకాలం వెళ్ళకపొతే ఆవిడ అడుగుతారేమో -' నవ్వు దాచుకుంటూ అంది కళ్యాణి అతని అభిప్రాయం గ్రహించుకుని  ' ఏమి అడగదు -- అవిదికే తెలుసు-- మనం ఇప్పుడిప్పుడే ఈ ప్రపంచంలో పడమని , మన ప్రపంచం వేరని...'
    'ఊహూ , అయితే ...'
    'అయితే లేదు గియితే లేదు-- పిక్చరు కి టైమయి పోతోంది పద.' ఇంచుమించు కళ్యాణి రెక్క పట్టుకుని లేవదీసి నంత పని చేశాడు.
    'ఈ మాత్రం డానికి నన్ను అడగటం ఎందుకో.' మూతి ముడుచుకుంది కళ్యాణి.
    'నాకేం తెలుసు నువ్వలాంటి సలహా ఇస్తావని.' తలవంచుకుని సాక్సు వేసుకుంటూనే సమాధానం చెప్పాడు.
    తలుపుకు తాళం పెట్టి ఇద్దరూ గేటు తెరుచుకుని రోడ్డు మీదకి వస్తుంటే ఎదురింటి గది కిటికీ దగ్గర ఒక మధ్య వయస్కురాలు నిలబడి పరీక్షగా తమనే చూస్తుండటం ఇద్దరూ గమనించారు.
    'ఆవిడెవరో, పాపం కాలక్షేపం కాదులా వుంది . అలా కిటికీ వెనకాల నిలబడి రోడ్డు మీద నడిచే వాళ్ళని చూస్తూ పొద్దు పుచ్చు తుందనుకుంటా -- మనం ఎప్పుడు వీధిలోకి వచినా ఆవిడ ఇటే చూస్తూ కనిపిస్తుంది?' అనబోయింది కళ్యాణి-- ఇంతలో మురళి, దారే వెడుతున్న ఖాళీ రిక్షాని పిలవటం, సినీమా హాలుకి బేరం చెయ్యటం ఇద్దరూ అందులో యెక్కి కూర్చోటం ఆ తరువాత ఆ దియేటర్ ని గురించీ, తాము చూడబోయే సినిమాని గురించీ చెప్పుకొటం లో ఆ మాట మరుగున పడిపోయింది.
    రాత్రి సినీమా నుండి తిరిగి వచ్చి, రిక్షా దిగుతూ ఆప్రయత్నం గానే ఎదురింటి వేపు చూసిన మురళీ కి గదిలో లైటు వెలుగు లో కిటికీ వెనక ఆవిడ నిలబడటం, కిటికీ కి వున్న కర్టెన్ కొద్దిగా వత్తిగించి ఇటే చూస్తూండడం స్పష్టంగా కనిపించి,
    'అటు చూడు.' అన్నట్లు కళ్ళతోనే సంజ్ఞ చేశాడు కళ్యాణి వంక తిరిగి.
    'ఈవిడ ఇంతసేపూ అలా, కిటికీ దగ్గిరే వుందా ఏమిటి?' రిక్షా అబ్బికి డబ్బులిచ్చి లోపలికి వస్తున్న అతనితో కాస్త విస్తు పోతున్నట్లే అంది కళ్యాణి.
    'అంతసేపు వుండి వుండదులే -- మధ్యలోవెళ్లి వంట చేసుకుని, భోజనాలు కూడా చేసేసి వుంటారు-- మనం వచ్చామో లేదో నని మధ్య మధ్య కన్ను ఇటు పడేస్తూ వుండి వుంటుంది -- అది మన కంట పడింది.' అన్నాడు మురళీ కుర్చీలో కూర్చుని షూ విప్పుకుంటూ.
    కళ్యాణి మనస్సులోనే వులిక్కి పడింది. అంటే ఈవిడకి నా సంగతి తెలిసి, నన్నే విడ్డూరంగా చూడటం లేదు కదా -- ఇంక ఈవీది వాళ్ళందరూ నన్ను గురించి వింతగా చెప్పుకుంటూ, ఒళ్ళంతా కళ్ళు చేసుకుని నన్నే చూస్తుంటారేమో .... పోన్లే ఏం చేస్తాను , కొత్తలో కొన్నాళ్ళు చెప్పుకుంటారు, తరువాత వాళ్ళే మానేస్తారు.....అయినా గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుముకున్నట్లు నేనిలా ఇదవటం ఏమిటి' అనుకుంటూ.
    'ఏమిటి బాబూ, ఆవిడికి అంత ఇంటరెస్టు మనలో,' అంది, అతని సమాధానం కోసం ఆత్రంగా ఎదురు చూస్తూ.
    'ఇంటరెస్టు కాదు. అసూయ అనాలి...హాయిగా టింగు రంగా అంటూ మనం రోజూ సినిమా కో షికారు కో వెళ్లి పోతున్నాం....'షూ గోడ వారకి తోసేసి లోపలి గదిలోకి దారి తీశాడు.
    'అందుకు అసూయ పడటం ఎందుకు. తనూ వెళ్ళొచ్చు గా ఎవరోద్దన్నారు.' వీధి తలుపు గడియ వేసి , అతని వెనకే లోపలికి వెళ్తూ అంది.
    'సరిపోయింది లే -- ఆ యింటి సంగతి నువ్వు బొత్తిగా కనిపెట్టినట్లు లేదు....నేనైనా, మొన్న వాళ్ళబ్బాయి ఫ్యూజు వైరు వుందా అంటూ వస్తే ఏవో అడిగాను మాటల ధోరణి లో -- ఆవిడకి అరడజను మంది పిల్లలు. అంత సంసారం తో ఈసురో మంటూ ఎప్పుడూ ఇంటి పనికే అంకితమై పోయే ఇల్లాలికి సరదాగా షికార్లు కొట్టే ఓపిక ఏం మిగులుతుంది.' ఒకవేళ అంతో ఇంతో శక్తి వున్నా అతనితో కలిసి వెళ్ళాలీ అంటే ఆ ఆసక్తి కాస్తా చచ్చిపోతుంది. అతన్ని వోసారి చూశాను. వాళ్ళది బీస్టు అండ్ ది బ్యూటీ కాంబినేషన్ -- అతను నల్లగా లావుగా పొట్టిగా వుంటాడు, ఎత్తు పళ్ళు, అరంగుళం దళసరి కళ్ళద్దాలు, తెల్లగా పండిపోయిన జుట్టు......
    'ఒకర్ని చూసి వెక్కిరించటం ఎందుకు మనం ?' ఆ అనాకారీ తనం అతనేం కావాలని తెచ్చుకోలేదు. దేవుడు అలా పుట్టించాడు అతన్ని. దైవ నిర్ణయం వాళ్ళిద్దరి కి పెళ్లి జరగాలని వుంది.'
    'అదే నాకూ అనిపిస్తూ వుంటుంది -- తన చేతిలో వున్న పనే కదా, అందర్నీ మనలా చూడ ముచ్చట యిన జంటల్లా పుట్టిస్తే ఏం పోయింది చెప్పు? ఒక్కో సారి ఆ దేవుడి క్కూడా బొత్తిగా సుప్పనాతి తనం పుట్టుకు వస్తుందేమో-- అందాల బొమ్మ లాంటి అమ్మాయికి అడవి మనిషి లాంటి అబ్బాయి నీ, మన్మధుడు లాంటి అబ్బాయి కి వుత్త కురూపి నీ అంటగడుతూ వుంటాడు -- నీ అదృష్టం బాగుంది కనక ఇంతటి అందగాడ్ని దొరికాను' అంటూ ఎదురుగా వున్న అద్దంలో చూ సుకుని వోసారి క్రాపు సవరించుకుని, తనని చూసి తనే ముగ్ధుడవుతున్నట్లు కళ్యాణి వంక చూసి కళ్ళు ఎగరేశాడు.
    మూతి మూడు వంకర్లు తిప్పింది  కళ్యాణి. 'పూజ కొద్దీ పురుషుడంటారు-- నేను క్రితం జన్మలో బంగారు పువ్వులతో పూజ చేసి వుంటాను. అందుకే మీకింత చక్కదనం ఇచ్చాడు దేవుడు.' ఇందులో మీ గొప్పతనం ఏమీ లేదన్నట్లు తేల్చి చెప్పేసింది.
    మరి మురళీ యేనా తక్కువ తిన్నది -- చటుక్కున కొంగు అందుకుని కళ్యాణి ని దగ్గరకు లాక్కుంటూ సవాల్ చేస్తున్నట్లు ఆమె కళ్ళల్లో కి చూస్తూ గొంతు నిండా తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో అన్నాడు--
    'ఏమిటీ? నువ్వు పూజ చేశావా? మరి నేనేం చేశానొ చెప్పనా....తపస్సు.....అప్సరస ని భార్యగా పొందాలని ఘోర మైన తపస్సు చేసేశాను....అది చూసి ఇంద్రుడు కాస్తా హడలి పోయాడులే .....బాబ్బాబు -- నీ తపస్సు చాలించు -- నీకు అప్సరస యెందుకూ ? వాళ్ళని తలదన్నే సౌందర్య రాసిని భూలోకంలో నీకోసం సృష్టించమని బ్రహ్మదేవుడ్ని బ్రతిమాలు కుంటాను.....'
    ఫక్కుమని నవ్వేసింది కళ్యాణి -- ' మురళీ యింకా ఏదో అనబోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS