Previous Page Next Page 
మరుపులో మెరుపులు పేజి 20

 

                                     27

                  
    తిరిగి యింటికి వెడుతున్నంత సేపు, మౌనంగా వుండి పోయింది కుసుమ. అసలే అంతమాత్రంగా వున్న సరదా ముఖర్జీ ని చూడం గానే పూర్తిగా హరించుకు పోయింది. ఏదో భయం, కంగారు ఆమెను నిలవనీయనంతగా తొందర పెడుతున్నాయి. ఎంత నిగ్రహించుకుందామన్నా ఆగని భయం శరీరమంతా నీరసింప చేస్తోంది. మొద్దు బారిపోతున్న మనసులో , ముందు ముందు రాబోయే దృశ్యాలు నాట్యం చేస్తున్నాయి. ముఖర్జీ పోలీసుల్ని పిలుస్తాడు. తెల్లవారేసరికి ప్రభాకర్ యింటి నిండా పోలీసులు, రిపోర్టర్లు ఆ క్షణం ప్రభాకర్ కి....మామగారికి.....
    ఒక్కసారిగా ఏ జబ్బయినా చేసి ఆ రాత్రికి రాత్రి ప్రాణం పొతే..... తిరిగి తను ఎవ్వరి ముఖం చూడనవసరం లేకపోతె......
    మౌనంగా మనసులో మధనపడుతున్న కుసుమను చూస్తూ నిశ్శబ్దంగా నిట్టూర్చాడు. అతనికి కూడా కర్తవ్యం అగమ్యగోచరంగా వుంది.
    "ప్చ్...... అనుకున్నవి, అనుకున్నట్లు ఏవీ జరగవు . తను ఎన్ని ఆశించాడు? కొద్ది రోజులలో కుసుమ ఆరోగ్యం బాగు పడుతుందన్న నమ్మకంతో కాదూ తను యింతకాలం వేచి వుంది.కుసుమ ఆరోగ్యం చేకూరం గానే స్వయంగా కుసుమ చేత కన్ ఫేస్ చేయించాలనుకున్నాడు  ఎవరికీ తెలియకుండా!
    అనుకోకుండా యీ అవతారం వచ్చింది ముఖర్జీ అసలే దేవాంతకుడు అతని ముఖంలో ప్రతి ఒక్క భావం అతని ఆలోచనలను బయట పెట్టాయి.
    రేపు అతనే పోలీసుల దాకా పొతే.....కుసుమ జన్మ లో మరొకరి ముఖం చూడదు.... అంతటితో అన్నీ సరి.. తన ఆలోచనలు.... ఆశలు...."
    కర్తవ్యం గోచరం కాలేదు.... ఆలోచనలు దరి చేరలేదు. కారు యిల్లు చేరింది.
    కారు గారేజ్ లో పెట్టి మౌనంగా తండ్రి గదిలోకి వెళ్ళాడు ప్రభాకర్.
    పైకి వచ్చేటప్పటికి కుసుమ పెట్టెలో బట్టలు పడేస్తోంది విసురుగా.
    "కుసుమా?" అన్నాడు ఆశ్చర్యంగా.
    తలఎత్తి చూచింది. విశాలంగా, ముఖ మంతటికీ ఒక ప్రత్యేకత చూపించే నల్లటి కాటుక కళ్ళు తడిగా వున్నాయి. ఆ కళ్ళలో ఏదో భయం విరక్తి ఏవో భావాలు స్థావరం చేసుకుని వున్నాయి.
    ఆమె పక్కగా వచ్చి పెట్టెలో బట్టలన్నీ తీసి బయట పడేస్తూ ఏమిటి నీ వుద్దేశ్యం' అన్నాడు సూటిగా.
    ఏమాత్రం తొణుకు బెణుకు లేకుండా అతని ముఖంలోకి చూస్తుండగానే, వెళ్ళిపోతున్నాను యీ సారి మాత్రం నన్ను ఆపవద్దు." అంది.
    "ఎక్కడికి వేడతావ్. యీ అర్ధరాత్రి ?"
    "ఎక్కడి కయినా సరే! ముఖర్జీ సంగతి మీకు తెలియదు. తెల్లవారే టప్పటికి పోలీసుల్తో..... నన్ను వెళ్ళనివ్వండి అడ్డు పెట్టద్దు.."
    'అబ్బబ్బ.... కుసుమా! యిలా అంతార్దానమయినంత మాత్రాన నీ సమస్యలన్నీ ఎక్కడికి పోతాయి?' అడిగాడు అసహనంగా.
    కుసుమకు ఎదురుగా వెళ్ళి రెండు చేతుల భుజాల మీద వేసి బలంగా నొక్కి క్రింద కుర్చీలో కూర్చోపెట్టాడు . కుర్చీకి యిరు పక్కలా వున్న హేండిల్స్ మీద చేతులు వేసి ముందుకు వంగి, కుసుమ వంక సూటిగా చూస్తూ అన్నాడు.
    "ఈ విషయం పూర్తిగా నన్ను హేండిల్ చేయ్యనిస్తావా? ఈ సమస్య ఎప్పుడో అప్పుడు ఎదురవుతుందని నాకు తెలుసు. కాని యింత అర్ధాంతరంగా జరుగుతుందని అనుకోలేదు."
    "ఏముంది? మీరు చేసేందుకు మాత్రం నిస్పృహగా నిట్టూర్చింది.
    "ముఖర్జీ కి , నాకు వ్యాపార రీత్యా ఒకరితో ఒకరికి కావలసినంత అవసరం వుంది. పైగా అతను పక్కా వ్యాపారస్తుడు అంత తొందర పడి తెలివి తక్కువగా ఏ పని చెయ్యడు." అన్నాడు ప్రభాకర్.
    "మీరనుకున్నంత ఇదిగా అతనేమీ వుండడు? నన్ను పెళ్ళి చేసుకుందామని ఎంతో బలవంత పెట్టాడు ఎప్పటికప్పుడు ఏదో చెప్పి తప్పించుకుని పారిపోయాను. ఇవాళ యిలా మీ దగ్గర....మీ భార్యగా .....' ఆగిపోయింది.
    ఆశ్చర్యంగా చూచాడు. అంతలోనే కనుబొమలు ముడిపడ్డాయి. సుదీర్ఘంగా శ్వాస విడుస్తూ 'నన్ను కాసేపు ఆలోచించు కొనీ, నువ్వు మాత్రం నిశ్చింతగా వుండటానికి ప్రయత్నించు." అంటూ రెండు చేతులు పాంటు జేబులో పెట్టుకుని అటూ యిటూ తిరగసాగాడు.
    అతని ప్రతి కదలికను గమనిస్తూ నిశ్శబ్దంగా నిర్లిప్తంగా వుండిపోయింది కుసుమ.
    అటు యిటు తిరుగుతున్న వాడల్లా చటుక్కున వెనక్కి తిరిగి "ముఖర్జీ ఆఫీసులో నేనా యింకెక్కడయినా కూడా ....." మధ్యలోనే ఆగిపోయాడు.
    ఎర్రగా కందిపోయింది కుసుమ ముఖం.
    "మొత్తం ఎన్ని వేలు?' తిరిగి అడిగాడు చెప్పింది.
    "ఓ.కె. నేను చెప్పేది విను. రేపు పొద్దున్న ముఖర్జీతో మాట్లాడుతాను. నీకున్న సమస్యలు వున్నదున్నట్లు చెప్తాను. తీసుకున్న డబ్బంతా తిరిగి యిచ్చేందుకు ఏర్పాటు చేస్తాను. కావాలంటే నువ్వు నీకై కన్ఫేస్ చేసేందుకు ఏర్పాటు చేస్తాను. మిగిలిన చోట్ల కూడా యిదే విధంగా..... ఏమంటావు?"
    ఏమంటుంది? ఏమీ అనలేకపోయింది. మౌనంగా వుండి పోయింది. ఎంత దైర్యం ప్రభాకర్ కి? అవతల వాళ్ళ చర్యలను కూడా తను అరికట్టగలడా? నిశ్శబ్దంగా నిట్టూర్చింది. తనిక్కడ వుండలేదు ఎలాగైనా వెళ్ళిపోవాలి. మౌనంగా వుండి పోయింది. ఎంత ధైర్యం ప్రభాకర్ కి అవతల మనిషి చర్య కూడా తనే అరికట్టగలదనుకుంటాడెం? నిశ్శబ్దంగా నిట్టూర్చింది. తనిక్కడ మాత్రం వుండలేదు. పారిపోవాలి. ఎలాగయినా సరే ! కాని ...ఎలా ....
    ఆ కుసుమ ముఖం వంకయినా చూడకుండా అన్నాడు. "యింక  కాసేపు పడుకోటానికి ప్రయత్నించు. యివాళ యీ తలపులు మాత్రం బార్లగా తెరిచే వుంటాయి." రెండు గదుల మధ్య తలుపులు తీసి వుంచి తన గదిలోకి వెళ్ళాడు పడుకునేందుకు.

                                   28

    పొద్దున్నే త్వరగా పనులు ముగించుకుని ముఖర్జీ ఉంటున్న హోటల్ కు వెళ్ళాడు. కుసుమతో ధైర్యం కలిగేటట్లు చెప్పగలిగినా,ముఖర్జీ తో ఏ విధంగా మాట్లాడాలో మాత్రం తేల్చుకోలేక పోయాడు. ఆలోచిస్తూనే సందేహిస్తూనే తలుపు కొట్టాడు.
    తలుపులు తెరిచి , ఎదురుగా ఉన్న ప్రభాకర్ ని చూస్తూ "గుడ్ మార్నింగ్ మీరు వస్తారని అనుకుంటూనే వున్నాను కమిన్" అన్నాడు కంఠం లో అదొక విధమయిన భావాన్ని ధ్వనింప చేస్తూ.
    ప్రభాకర్ లోపలకు వెళ్ళంగానే వెనుకగా తలుపులు మూసి దగ్గరగా వచ్చాడు ముఖర్జీ. ప్రభాకర్ కి ఎందుకో ముఖర్జీ ముఖం లోకి చూడాలనిపించ లేదు. తను వచ్చింది అతి ముఖ్యమయిన పనే అయినా అతనికి తెలియకుండా పెదిమల మీద చిరునవ్వు లాస్యం చేసింది.
    ముఖర్జీ కి మాత్రం లోలోపల మండి పోతోంది. ఏవిధమయిన సంభాషణ మొదలు పెట్టని ప్రభాకర్ వంక సూటిగా చూస్తూ "వ్యాపారరీత్యా మన యిద్దరికీ సంబంధ ముండి దొంగతనం సంగతి తెలిసి కూడా నాకు తెలియ చెయ్యాల్సిన అవసరాన్ని నిర్లక్ష్యం చేశారు. అయినా, మీ శ్రీమతి , తద్వారా మిమ్మల్ని రిపోర్టు చేసే ముందు మాత్రం మీకు తెలియ చెప్పి మరీ చెయ్యాలని నిశ్చయించుకున్నాను." అన్నాడు. ఇంగ్లీషు లో. ఫోను దగ్గరకు వెళ్ళి రిసీవర్ ఎత్తాడు.
    "థాంక్యూ అంటూ ముఖర్జీ దగ్గరగా నడిచి అతని చేతిలో రిసీవర్ ని తీసుకుని యధాస్థానం లో వుంచాడు.
    "ఆ కాల్ ని కొద్ది నిముషాలు ఆలస్యం చేసినందు వల్ల కలిగే నష్టం ఏమీ లేదనుకుంటాను. ముందు మీతో కొన్ని విషయాలు చెప్పాలి." అన్నాడు ప్రభాకర్ కుర్చీలు వున్నచోటికి దారి తీస్తూ.
    "కుసుమ మీ ఒక్క ఆఫీసులో నే కాక యింక యితర చోట్ల కూడా ఆ పని చేసిందని మీకు తెలుసా?' సరాసరి అడిగాడు.
    క్షణ కాలం ఆశ్చర్య పోయాడు. అర్ధం కానట్లు చూశాడు. అంతలోనే జేబులోంచి సిగరెట్ తీస్తూ "గుడ్. నేను చేయబోయే పోలీసు రిపోర్ట్ కు సపోర్టు కూడా వుందన్న మాట." అన్నాడు నిర్లిప్తంగా.
    వళ్ళు మండింది ప్రభాకర్ కు. బలవంతంగా కోపాన్ని అణుచుకుంటూ "మీకు సపోర్టు కోసం చెప్పడం లేదు. అలాటి పని ఎందుకు చేస్తోందో కూడా తెలియనంత మానసిక మయిన అనారోగ్యంతో వుందని మీకు తెలుసో....;లేదో అని-" సాధ్యమయినంత మాములుగా అన్నాడు.
    "నేను నమ్మను." అన్నాడు పెదిమల మధ్య నుండి సిగరెట్ తీయకుండానే.    
    "నమ్మినా మానినా నేను చేయగలిగింది ఏమీ లేదు. యిది మాత్రం నిజం, యిదొక్కటే కాదు ఆవిడకు చాలా యితర సమస్యలు కూడా వున్నాయి.... అసలు యిలాంటి సమావేశం నేనే పెర్పాటు చేద్దామనుకున్నాను." ఆగిపోయాడు.
    క్షణం సేపు మౌనంగా వూరుకున్నాడు. "మరి యింత కాలం అగారేం?' అడిగాడు. అతని కంఠం లో వ్యంగ్యం గోచరించింది.
    "డాక్టర్ల సలహాలతో ఆమెకు పూర్తిగా ఆరోగ్యం చేకూరుతుందనుకున్నాను. ఆ వెంటనే , ఆమె అనారోగ్యం సంగతి తెలియపరచి అవసరమయితే ఆవిడ చేతే కన్ఫేస్ చేయించి, డబ్బు తిరిగిచ్చే ఏర్పాటు చెయ్యాలనుకున్నాను. ఒక్కొక్కసారి మనం ఆశించినట్లు ఏవీ జరగవు. అందుకు సమయం అవకాశం రెండూ కలిసి రావు. నిట్టూర్చి, వెనక్కి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు.
    క్షణాలు, నిముషాలు గా , మారి నిశ్శబ్దాన్ని అనుసరించ సాగాయి. అసహనంగా సమయాన్ని లెక్కపెడుతున్న ప్రభాకర్ , ఎటువంటి సమాధానం యివ్వని ముఖర్జీ వంక విసుగ్గా చూశాడు.
    "ఒక్క మాటలో చెప్పాలంటే షి యీజ్ మెంటల్లీ సిక్. మీరు సహకరించితే చాలా బాగుంటుంది. లేదా మీరు చెయ్యదల్చుకున్నదానికి ఎవరూ ఆపలేరు." అన్నాడు ప్రభాకర్.
    ముఖర్జీ సాలోచనగా వుండి పోయాడు. సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ, కుర్చీలోంచి లేచి అటూ యిటూ పచార్లు చేయ్యసాగాడు. ప్రభాకర్ ముఖర్జీ తో ఏదో అనబోయి, ఒక్క క్షణం సందేహించాడు. కాని అంతలోనే నిర్ణయించుకుని "పదిమందితో పరిచయమున్న మనిద్దరం పబ్లిక్ గా బయట పడటం, పేపర్ల దాకా వెళ్ళడం ఎవరికీ శ్రేయస్కరం కాదు. ఆ విషయం మీకు తెలుసనుకుంటాను." అన్నాడు కిటికీ లోంచి బయటకు చూస్తూ.
    సూటిగా చూచాడు ప్రభాకర్ వంక. కోపం, చిరాకు ముఖర్జీ ముఖంలో స్పష్టంగా కనిపించింది. కుసుమ మీద, ప్రభాకర్ మీద ఎలాంటి అక్కసు వున్నా మూడు పువ్వులు ఆరు కాయల్లా వుండే బిజినెస్ మీద ప్రతిబింబింప చేయడం ఎంత అవివేకమో అతనికీ తెలుసు. ఎంతయినా యిద్దరూ వ్యాపారస్తులే! ఒకరితో ఒకరు ఎలా డీల్ చెయ్యాలో యిద్దరికీ తెలుసు. మబ్బు మబ్బుగా వున్న ఆకాశం వంక చూసి, మనసులో ఆలోచనలో పడ్డాడు. మౌనంగా వున్న ముఖర్జీ వంక చూసి.... షేక్ హాండ్స్ కు చెయ్యి చాస్తూ "యింక నే చెప్పాల్సింది ఏమీ లేదనుకుంటాను. మీరు చేయబోయే పనిని నేను ఆపలేను. కాని మీరు ఆలోచించకుండా ఏపనీ చేయరన్న నమ్మకం నాకుంది. ఇంక నేను వెళ్ళాలి. ఇవాళ కుసుమను వంటరిగా వదలడం యిష్టం లేదు. రాత్రి నుంచీ ఆమె మనసు మనసులో లేదు." అన్నాడు.
    చిన్నగా నవ్వి హేండ్ షేక్ చేశాడు ముఖర్జీ.
    "కొద్ది రోజులలో కలుస్తాను మళ్ళీ. డబ్బుతో సహా." అన్నాడు ప్రభాకర్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS