22
దుర్గకు నెల తప్పిందనే వార్త అందరికీ సంతోషాన్ని కలుగజేసింది. ఇక శంకర్ గర్వానికి హద్దులు లేవు. గిరి వచ్చి హెచ్చరించిన దగ్గరనుంచి అతనిలో పరివర్తన కలుగ సాగింది. అన్నిటి కంటే తన సంసారం లో నిత్యమూ కలిగే చికాకులు, అతనే భరించలేక పోతున్నాడు. దుర్గ తనను గాడంగా ప్రేమిస్తుందని శంకర్ కు తెలుసు. గిరి మాటల వల్ల తానా ప్రేమను పోగొట్టు కుంటానేమోననే భయం, శంకర్ లో కలిగింది. కానీ, తన సర్వ శక్తులు, కేంద్రీకరించుకొని తానొక, మనిషిగా నిలబడాలని ప్రయత్నించిన దుర్గ, తన ప్రయత్నం విఫలం కాగా, ఒక విధమైన నిర్లిప్తతను అలవరచుకోంది. ఇప్పుడామె శంకర్ ఆప్యాయత కు పొంగి పోవటమూ లేదు-- అతని నిరాదరణ కు కృంగి పోవటమూ లేదు. శంకర్ దుర్గ ను ప్రసన్నురాలినిగా చేసుకోవటానికి శత విధాల ప్రయత్నించాడు కానీ, ఆమెలో నిజమైన చైతన్యం తీసికొని రాలేక పోయాడు. శంకర్ నిజమైన ఆప్యాయత తో పలకరించినా దుర్గ అది నిజమని నమ్మలేక పోతుంది. ఆమెకు ప్రతిదీ కృత్రిమం గానే కన్పిస్తుంది.
దుర్గకు ఏడవ నెల ప్రవేశించింది. సావిత్రమ్మ వచ్చి సూడిధలు చేసి దుర్గను తీసి కెళ్లబోయింది. శంకర్, అభ్యంతరం పెట్టాడు. దుర్గను, చాటుగా గదిలోకి పిల్చి, "నిన్ను విడిచి ఉండలేను దుర్గా? పోనీ, పురుడు ఇక్కడే పోసుకుంటే నేం ?' అన్నాడు.
దుర్గ నమ్మలేనట్లు చూచింది. అతని వంక అట్లాంటి మాటలు విని ఎన్నో యుగాలయినట్లుగా ఉంది దుర్గకు. తీరా వెళ్ళబోయే సమయానికి దుర్గ కు కూడా, తానింకా శంకర్ ను ఎంతగా ప్రేమించేది అర్ధమయింది -- శంకర్ ను విడిచి ఐదారు నేలలుండాలనే భావనకు ఆమె తట్టుకోలేక పోతుంది. నిద్రిస్తున్న ఆమె హృదయం కొద్దిగా కనులు విప్పింది. శంకర్ మెడ చుట్టూ, చేతులు వేసి, గుండెల మీద తల ఆన్చి , "నాకూ వెళ్లాలని లేదు. కానీ, అమ్మ కష్ట పెట్టుకుంటుంది. ఈ కొంచెం రోజులూ, వోపిక పట్టండి, మీ బాబుతో సహా తిరిగి వస్తాను." అంది.
"వీల్లేదు. నువ్వెలా వెళ్తావో చూస్తాను." అన్నాడు శంకర్ చటుక్కున -- దుర్గ ముఖం వెలవెల పోయింది. అతని మెడను చుట్టిన ఆమె చేతులు అప్రయత్నంగానే సడలి పోయాయి. "ఇంతేనా?' అన్నట్లు శంకర్ వంక చూస్తూ నిల్చుంది.
శంకర్ కు తన పొరపాటు తెలిసి వచ్చింది.
'సరే! వెళ్ళు." అన్నాడు.
అన్నాడే కానీ, అతని ముఖంలో విసుగు స్పష్టంగా కనిపిస్తుంది. దుర్గ తో మరేమీ మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు. దుర్గ కేమీ తోచలేదు. సావిత్రమ్మ దిగాలుగా హల్లో కూర్చుంది. దుర్గ బయటకు రాగానే "ఏం దుర్గా! నువ్వు రావా? ఇక్కడ నీకెవరు చేస్తారూ?' అంది.
దుర్గ తల్లి ఒడిలో తల పెట్టుకుని మౌనంగా కూర్చుంది. శంకర్ కు తాను వెళ్ళటం ఇష్టం లేదు. వెళ్లక పొతే , తల్లి ఎంతో బాధపడ్తుంది. వెళ్లక తనూ ఉండలేదు. శంకర్ లో ఏ పరివర్తన కోసం ఇన్నాళ్ళు తపస్సు చేసిందో ఆ పరివర్తన కనుపించీ కనుపించక ముందే, పరిస్తితులిలా వచ్చాయి. ఛీ! తనంత దురదృష్ట వంతులు ఇంకెవరూ ఉండరు.
సావిత్రమ్మ కూతురి తల నిమురుతూ "ఏరి కోరి చేసుకున్నారు. ఎంతో సుఖ పడతారని అనుకున్నాను. ఎందుకమ్మా! మీ కలత లన్నీ?' అంది.
"నా దురదృష్టానికి ఇంకా వేరే వ్యాఖ్యానా లెందుకమ్మా!" దుర్గ దీనంగా అంది. సావిత్రమ్మ కడుపు తరుక్కు పోయింది. దుర్గ చూడటానికి చాలా బలహీనంగా ఉంది. దీనికి తోడూ ఏడవ నెల-- ఆమెను అక్కడ వదిలి వేయడం , సావిత్రమ్మ కెంత మాత్రమూ ఇష్టం లేదు. "ఈ కలతలన్నీ అవే సర్దు కుంటాయి. నువ్వు బయలుదేరు" అంది. దుర్గ కూడా నిశ్చయించుకుంది. కొన్నాళ్ళు తన తల్లి ఒడిలో , తను పుట్టి పెరిగిన ప్రదేశం లో మసిలి రావాలని దుర్గ కూడా తహతహ లాడుతుంది.
దుర్గ తన సామానులన్నీ సర్దుకుంటుంటే శంకర్ మనసులో మండసాగింది. తనను విడిచి వెళ్తున్నదనే బాధ కంటే , తన మాట కాదని వెళ్తున్నదనే బాధ అతనికి అధికం కాసాగింది. ఎంత అణచుకుందామన్న , అతనిలో ఏదో కసి పెరుగుతుంది. దుర్గ దగ్గిరగా వచ్చి "అవును మనసులో ప్రేమ లేని వాళ్ళను ఎవరు కట్టి పడేసి ఉంచగలరు?" అన్నాడు.
దుర్గ ఒకసారి తలెత్తి చూసి మళ్ళీ మాట్లాడక తన పని తాను చూసుకోసాగింది.
"నాలాంటి చదువుకొని వాడి దగ్గిర నీకేం తోసుందీ? అక్కడికి వెళ్తే, హాయిగా అందరూ నీలా చదువు కున్న వాళ్ళు-- నాలా మోటుగా మాట్లాడక చక్కగా సంస్కారంగా మాట్లాడతారు. నీకు హాయిగా ఉంటుంది."
దుర్గ లేచి బీరువా తాళం చెవులు శంకర్ చేతి కిచ్చి "జాగ్రత్త" అంది.
శంకర్ ఆ తాళాలు విసిరి కొట్టి "నాకెందుకూ?" అన్నాడు.
"అయితే, అత్తగారి కిస్తాను." అని దుర్గ వెళ్ళిపోయింది.
శంకర్ మనసు మరింత కుతకుత లాడుతుంది. ఏదో ఉడుకు మోత్తనము, ఏదో కసి , ఏదో అశాంతి.
ఈ దుర్గ ఇలా తయారయ్యిందేం?
కొంచెం సేపటి వరకూ, దుర్గ మళ్ళీ వస్తుందేమోనని ఎదురు చూసాడు. ఆమె ఎంతకూ రాకపోయే సరికి తానె "దుర్గా" అని పిలిచాడు. దుర్గ వచ్చింది.
"పిలిచారా?"
"అవును. నీకు తొందరగా నా నుంచి విరగడై పోవాలని ఉంది. కానీ, నేను మాత్రం నిన్ను వదలలేక పోతున్నాను. నీకిష్టం లేకపోయినా, నా కోసమైనా కాస్సేపు నా దగ్గర కూర్చో! ఈ శ్రమ ఇంకొంచెం సేపు పడు.'
దుర్గ మాట్లాడక వచ్చి శంకర్ ప్రక్కన కూర్చుంది.
శంకర్ రోషంగా "ఏం మాట్లాడవెం?' అన్నాడు.
చాలా రోజులకు దుర్గ పకాలున నవ్వింది. ఆమెలో మళ్ళీ చిలిపితనం ప్రవేశించింది.
"ఏం మాట్లాడాలో కూడా మీరే చెప్పండి." అంది.
శంకర్ త్రాచు పాములా బుసలు కొడ్తూ అటూ, ఇటూ పచారులు చేస్తూ, "నువ్వు ప్రయాణం మానడానికి వీల్లెదా?' అన్నాడు.
"వీల్లేదు."
శంకర్ నిర్ఘాంత పోయాడు. క్షణ కాలం దుర్గ మొఖం లోకి చూసి "అయితే అనుభవిస్తావు." అన్నాడు.
దుర్గ లేచి వెళ్లి రూళ్ళ కర్ర పట్టుకొచ్చి శంకర్ చేతి కిచ్చి "ఆ అనుభవించేదేదో తొందరగా అనుభవింప జేయ్యండి-- మళ్ళీ ఎన్నాళ్ళ కో!!' అంది.
శంకర్ కళ్ళు ఎర్రబడ్డాయి. అతనిలోని పశుత్వ మంతా ఒక్కసారి విజ్రుంభించింది.
"ఉహూ! నీ మీద ప్రేమ ఉన్నన్నాళ్ళూ నువ్వు నా దానివనుకున్నన్నాళ్ళూ , నిన్నలా శిక్షించను. వెళ్ళు-- ఇక నీకూ, నాకూ ఏం సంబంధం లేదు. అక్కడ నీ మొగ స్నేహితులందరూ, నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు పరిగెట్టు."
శంకర్ పళ్ళు పటపట నూరాడు. దుర్గ పైకి ఎంత బింకంగా నుంచుందో, లోలోపల ఆమె గుండెలంత పగిలి పోతున్నాయి. అక్కడి నుంచి అతి నిగ్రహంతో బయటకు వెళ్లి, తల్లి ఒడిలో పడి బావురు మంది. "లాభం లేదమ్మా! ఏం లాభం లేదు. నీకు నేను కూతురిననే మాట మరిచి పో!"
సావిత్రమ్మ గుండె కలుక్కుమని "ఛీ! ఛీ! అవెం అప్రాచ్యపు మాటలు?' అంది.
అంతలో కామేశ్వరమ్మ అక్కడకు వచ్చింది.
"నువ్వు మరీ పిచ్చి దానివమ్మా దుర్గా! వాడేదో నిన్ను విడిచి ఉండలేక వెళ్ళవద్దంటే, ఇలా గందర గోళ పడ్తావేమిటి? ఇంకొకరయితే , మురిసి పోయేవారు. బొత్తిగా వెర్రి మాలోకం -- వాడితో రెండు మంచి మాటలు మాట్లాడి ప్రయాణం కా! తెలివి తక్కువగా రొష్టు పెట్టుకోకు." అంది కామేశ్వరమ్మ.
ఎంత జరిగినా , దుర్గ ప్రయాణం మానుకోక పోవటం, శంకర్ మనసులో జ్వాలలు లేచాయి. తానొక ఆడదాని ముందు వొడి పోతున్నాడు. తన భార్య తనను లెక్క చెయ్యకుండా వెళ్ళిపోతుంది.
దుర్గ వెళ్లబోయే ముందు శంకర్ దగ్గరకు వచ్చి "వెడుతున్నాను." అంది.
"నాకు చెప్పాలా?"
"అది నా ధర్మం."
"ఓహో ! నీకు ధర్మం కూడా తెలుసు. ఎప్పుడక్కడకు పోయి, అడ్డు, అయిపూ లేకుండా ఇష్ట మొచ్చిన వాళ్లతో వూరేగుదామా? అని చూస్తున్న దానవు. నీ కిక్కడ కాలేలా నిలుస్తుంది?' అంతవరకూ నిగ్రహించుకున్న దుర్గ ఇక వోర్వ లేకపోయింది.
"మీరీ మాటలు నిజంగా అనక పొతే, నేను వీటి నసలు మనసుకు పట్టించుకోనక్కరలేదు. నిజంగానే అంటే, నేనసలు ఇక్కడ ఉండవలసిన అవసరమే లేదు. మీ ప్రేమ స్వరూపం అర్ధం చేసికో లేక పోతున్నందుకు క్షమించండి. కానీ, నా ఆరోగ్యం ఏమీ బాగుండ లేదు. నాకు విశ్రాంతి కావాలి. అత్తగారు అన్ని విధాలా సహాయం చేస్తున్నా నేను స్వాతంత్ర్యంగా ఆమెను సహాయం కోరలేను. న్యాయంగా ఈ పరిస్థితులలో మీరే నన్ను ప్రోత్సహ పరిచి పంపించ వలసినది పోయి, వెళ్ళ వద్దని పంతం బట్టి కూర్చుంటే నేనేం చెయ్యాలి? మీ మాటను నేనెప్పుడూ గౌరవిస్తాను. కానీ మీ మాట కోసరం ఈ పరిస్థితులో నా ఆరోగ్యం నాశనం చేసుకునే టంత స్వార్ధ త్యాగిని కాలేక పోయినందుకు మన్నించండి.
అక్కడ నిలబడకుండా వెళ్ళిపోయింది దుర్గ.
