Previous Page Next Page 
అపరిష్కృతం పేజి 21


    తను చదువుకుని ఏం చేయాలి?
    ఉద్యోగం చేయాలీ అంటే దొడ్డమ్మ ఒప్పుకాదూ?-పోనీ భాస్కరం లాంటి  కుర్రాణ్ణి తీసుకుని.....కాని భాస్కరాన్నే అయితే మాత్రం పద్మావతి ఏడుస్తుంది!
    నిస్సందేహంగా తనకి తెల్సు-
    భాస్కరంతో తను మాట్లాడినా పద్మావతి ఏడుస్తుంది-పాపం! అది అతగాన్ని ప్రేమించిందిగా! సురేఖ జాలి పడ్డది. చుట్టూరా చూసింది. "పాపం! సముద్రం" అనుకుంది. జాలి పడ్డది. సూర్యుడు ఏ పనీ లేని కుర్రవాడు గోలీ లాడుకుంటున్నట్లు సముద్రంమీద రద్దీలేని రోడ్డుమీదా ప్రతాపం చూపిస్తున్నాడు. "పాపం!" అనుకుంది సురేఖ మళ్ళీ.
    హాస్టలు వచ్చింది. రిక్షావాడు చెమటతో, నల్లగా ఎండలో మిల మిలా మెరిసిపోతూన్నాడు...... సురేఖను వాడు చూడనేలేదు. డబ్బులు చేతులో 'పడగానే యాంత్రికంగా, రిక్షా ఎక్కి వెళ్ళిపోయాడు. 'పాపం!' అనుకుంది- వీణ్ణి కూడా వీడి పెళ్ళాం ప్రేమిస్తుంది. బహుశా పద్మావతి భాస్కరాన్ని కోపం తెచ్చుకున్నట్లు దానికి వీడిమీద కోపం వస్తుందా? ఏమో మరి-"నాకు మతి పోతోందా?" గొణుక్కుంది.
    ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళింది రూముకి. ఇష్టం లేనట్లు-తను కూడా హాయిగా పద్మావతి లాగే ఈ పాటికి భాస్కరంకంటే అందమైన వాణ్ణి ప్రేమించేదేమోగాని, పాపం దొడ్డమ్మ గోల పెడుతుందని మానేసింది.
    రూము తీస్తూనే ఉత్తరం అగుపించగా అది అందుకుని చూసింది - దొడ్డమ్మ రాసింది. "ధనమ్మ వ్రాలు" అని రాస్తుందామె.
    ఆదుర్దాగా మంచం మీద వాలి చదువుకుంది.
    "...నీకు ఆవకాయ - వెల్లులిపాయలు వేసినది యిచ్చెదనని చెప్పినాను-నీవు మరిచిపోయితివి. మన చిరంజీవి భాస్కరరావుగారు అనగా - శ్రీ సుబ్బారావు బావగారి కుమార్డు - అనగా నీకు తెలిసి వుండును. అతగాడు యిచ్చటకు రాగా అబ్బాయీ! నీవు అమ్మాయిని చూస్తావేమో-ఈ తెలివి మీరిన కాలాన యిది తప్పుకాదు - పిల్లది సరదా పడ్డది ఈ ఆవకాయ కాస్త-దానికి అందిస్తావా? అని అడిగినను. పిల్లవాడు అందగాడేకాదు. బహుబుద్ధి మంతుడు- తప్పక ఇచ్చెదనని అన్నాడు పుచ్చుకొనుము-కాస్త మర్యాదగా మాటలాడ వలయును. ఇట్లు కాబోవు అల్లునికి పని పురమాయించి నాను అని ఏమీ నొచ్చుకొనకుము. అట్లా అన్నాను గదాని-చనువుగా తిరగకుము-పెద్ద దాన్ని అన్నాను గదాని అనుకోకు. నీ ఆరోగ్యము జాగర్త-అక్కడ మంచి నీవు వచ్చేముందు రాయి. డబ్బు పంపు తాను........."
    "నీ డబ్బుతో నన్ను కొన్నావు దొడ్డమ్మా........" ఉత్తరం అలాగే పట్టుకుని బోర్లా తిరిగి పడుకుంది.
    "ఏం బాధ వచ్చిందిరా భగవంతుడా? అని కణతలు నొక్కుకుంది.
    "అయ్యో! ఇంకా ఏం రాసిందో దొడ్డమ్మ.......! కాగితం రెండోవైపు త్రిప్పి చదువుకుంది.
    "ముకుందరావుకు వాళ్ళ వసంతకు ఖాయం చేశాను. అన్ని లాంఛనాలు అమర్చ గలిగాను-నువ్వు ఒప్పుకుంటే ఏడాది తర్వాత ఈ ఒక్క ముచతా దీర్చుకుని,-నేను కూడా మీ పెద్ద నాన్నగారి దగ్గిరకే వెళ్ళిపోతాను-నువ్వు చదువు కున్నదానివి. ఇప్పటికే నీకు వయస్సు వచ్చినది- బాగా ఆలోచించుకొనుము-నీ దొడ్డమ్మ కట్నం ఇవ్వదు అని భావించకు-పెళ్ళి కొమరుడు వద్దు అనిననూ, చెవులు మెలి తిప్పి ఇచ్చెదను. అది నా గౌరవము........."
    సురేఖ నవ్వుకుంది. "ఎంత అహంకారం దొడ్డమ్మా! నీది. పెళ్ళికుమారుడు పెళ్ళి కుమార్తె-నీ చేతుల్లో బొమ్మలనుకుంటున్నావా?........" అని ఆలోచిస్తూనే "కాకపోతే యేమిటీ? నేను దొడ్డమ్మకి ఇష్టమైన బొమ్మనేగా మరీ" అనుకుంది సురేఖ.
    దొడ్డమ్మకి ఉత్తరం రాస్తే భాస్కరం చెల్లెలు పెళ్ళీ రెండూ ఆగిపోతాయి. పైగా ఈ ముకుందాన్ని దుఃఖ పెట్టాలి........ పాపం........ పద్మావతికి ఎవరున్నారు-తల్లి ఒక్కర్తెగదా......పోయి ఆమెను చూడనా? ఒక్కసారి......అనుకుంది.
    సురేఖకు సిగ్గేసింది. అల్మారాలో పుస్తకాల మీద ఒక సాలీడు తన ప్రియునికి పట్టు అల్లుకుంటున్నది. బల్లమీద తెరిచివున్న పుస్తకం పేజీలు  అలాగే రెపరెపలాడుతున్నాయి.
    తను "ఎమ్మే" అవ్వాలని కదూ వస్త......షేక్సిపియర్ మీద నోట్స్ కంఠతా పట్టడం వల్లా, తనకీ, తను ఎమ్మే ప్యాసవడం వల్లా దొడ్డమ్మకి ఏమిటి లాభం?? గడుయారం చూసుకుంది. పది నిముషాలు తక్కువ నాలుగు గంటలైంది. ఈ పాటికి పద్మావతి భాస్కరం ఇద్దరూ కూడా కాస్త స్థిమితం చిక్కించుకుని ఉంటారు- అనుకుంది.
    "కాఫీ త్రాగాలి" అనుకుంటూ లేచింది.

                                *    *    *

    ఐతే ఈపాటికి భాస్కరం, పద్మావతి దగ్గరకు వెళ్ళనేలేదు - నేరుగా ఎగ్జిబిషన్ లో తను ప్రదర్శనకర్తగావున్న 'స్టాల్' దగ్గరికి వెళ్ళి కూచున్నాడు-రక రకాల మనుషు లొస్తున్నారు..........పిల్లలు ఆడవాళ్ళు, మగవాళ్ళు............ఒకరు ఇంగిలీషులో చెప్పండి అంటే ఇంకొకరు "హిందీ వచ్చా" అంటున్నారు.    
    "రామన్ ఎఫెక్టుకీ ఆకాశం నీలంగా అగుపించడానికీ సమ్మంధం ఏమిటీ?" అంటున్నారు కొందరు.
    "రామన్ ఎఫెక్టును తెలుగులో చెప్పమన్నా రింకా" కొందరు.
    "కాలేజీలో చదువుకునే అబ్బాయిలకు, అమ్మాయిలకూ వాళ్ళ డిగ్రీలకు వాళ్ళ ప్రేమలకు సమ్మంధమేమిటీ?" అన్నాడు ఒక ముసిలాయన భాస్కరాన్ని అదోలా చూస్తూ..........ముసి ముసిగా నవ్వుతో.
    "యవ్వనం" అన్నాడు భాస్కరం.
    ఆ ముసిలాయన కాస్త ప్రక్కకి జరిగి జనం అంతా వెళ్ళిపోయాకా, "పెళ్ళి అయిందా బాబూ! మీకూ" అన్నాడు.
    "అయింది."
    ఆశ్చర్యపోయాడు అతడు......"నేను కలెక్టరు ఆఫీసులో గుమాస్తాగా ఇరవై ఏళ్ళు చేశా.......అసలు మాకు కరణీకం వుంది, కాస్త పొలమూ వుంది........" అన్నాడు కళ్ళజోడుతీసి మడిచి మళ్ళీ పెట్టుకుని.
    "ఆడపిల్లలు కూడా  ఉన్నారా?" నవ్వుతూ అడిగాడు భాస్కరం.
    వస్తున్నారు జనం! వెళ్తున్నారు జనం! ఆ ముసిలాయన నిరాశపడ్డాడు "ఉన్నారుగాని, నీకు పెళ్లైపోయిందిగా" అనుకుంటూ వెళ్ళిపోయాడు.
    ఐదయింది-గేట్లు మూసేస్తున్నారు.......భాస్కరం మళ్ళీ ఆలోచనలలో పడ్డాడు. తిన్నగా పోయి, సముద్ర పొడ్డున కూచున్నాడు.
    పద్మావతి వెళ్ళిపోయింది........కోపంతో వెళ్ళిపోయింది-సురేఖ ఆవకాయ తననే వేసుకో మంది.
    పిన్ని తను పెళ్ళి చేసుకోవాలంటుంది.
    వసంతకు "సురేఖ" తాను అన్యాయం చేస్తానేమోగాని, ప్రేమించలేనని తెలిసిపోయింది.
    ధనమ్మగారికి కట్నం పుచ్చుకోనంటే తనమీద మరింత వ్యామోహం కలిగింది.......
    "పిన్నికి అన్నీ విపరీతార్దాలు, విశేషార్దాలుగా తోస్తాయి......"
    భాస్కరానికి పరీక్షల్లో ఫస్టుమార్కు వస్తుందనే ఆశ సనగిల్లిపోయింది.
    ధనమ్మ ఇస్తానన్నకంటే కట్నం జయమ్మ ఇస్తానంటే?
    కాని, పద్మావతి తనను పెళ్ళిళ్ళ మార్కెట్ లో గెల్చుకోవల్సిందేనా?......అంతేనా? అంత తాహతు జయమ్మకు లేదు. పద్మావతికి తనను కొనుక్కో గల అవకాశాలు లేవు.......
    తాను కట్నం వద్దంటే పద్మావతి ప్రేమను గౌరవిస్తున్నాడుగాని- పిన్ని ప్రేమను తృణీకరిస్తున్నాడని పిన్ని ఉద్దేశమే మరి?
    ఎవరిది ప్రేమ? తనదా? పిన్నిదా? పద్మావతి దా? ఎవరిది?.......పద్మావతికి మాత్రం తాను ఇవన్నీ చెబుతే అర్ధం అవుతాయా?
    "మీ పిన్నిగారు మీకు కట్నం గల పిల్లను చేస్తారు చేసుకోండి....." అని పద్మావతి వెళ్ళిపోవచ్చును...
    'నేను పద్మావతిని ఒదిలి బ్రతకలేను' అనుకుంటూ లేచి ఏడు గంటలవేళ చీకట్లను చీల్చుకుంటూ, హాస్టల్ కేసి నడిచాడు భాస్కరం.
    "అసలు ప్రేమంటూ ఉందా? ఏమో....ఏమో......."

                                      31

    ఎమ్మెస్సీ కుర్రాళ్ళు, రీసెర్చిచేసే అబ్బాయిలూ వీళ్ళకి సమైక్యతా సిద్దంతాలు, వాటి అవసరం బాగా తెలుస్తుందేమో నన్నట్లు ఒక "కిర్లంపూడి బంగళా" అనే దాన్ని ఇప్పుడా హాస్టలులో ఉంటోన్న విద్యార్ధులకు తెలియనంత పాత కాలంనించీ వసతి గృహంగా ఇచ్చారు విశ్వవిద్యాలయం అధికారులు.
    ఈ భవనం సముద్రంకేసి చూస్తూ ఉంటుంది. ఇందులో కాశీమజిలీ కథలో ఎన్ని మలుపులు లుంటాయో, ఆధునిక యువకుల ప్రేమలో తెనుగు సమాజంలో ఎన్ని ఇబ్బందులుంటాయో అన్ని గదులున్నాయి. అన్ని రకాల మెట్లున్నాయి. అచ్చం పైన పేర్కొన్న ఆ కథల లోని మలుపుల్లో ఎంత 'థ్రిల్' ఉందో-ప్రేమకు కలిగే ఆటంకాలలో ఎంతో "వెంచర్" ఉందో అంత హాయిగానూ ఉంటుంది ఈ హాస్టలు జీవితం.
    దారి కటూ, ఇటూ నల్లని, నున్నని బండలు, వాటికి అలంకారప్రాయంగా అల్లి బిల్లి క్రీపర్ లు అల్లుకున్నాయి. వాటికి అందంగా చిన్ని చిన్ని పూలు విడ్డాయి. వాటికి దూరంగా దిగువగా చిన్నా చితుకు దుబ్బులు దాటుతూ పోతే కావల్సినంత సముద్ర ముంటుంది.
    మాంత్రికుడు రాజకుమారికోసరం ఒకసారి ఒక కధలో ఒక ఒంటి స్తంభం మేడను-ఒక సముద్రంలో కట్టెనట-కాని ఈ కోటలాంటి మేడను సముద్రం ఒడ్డున విద్యార్ధుల కని కేటాయించారు.
    గదిలోనించి గది, హాలులోనించి హాలూ ఒకరి రూమ్ లోనించి మరొకరి గదిలోకి దారీ.
    "పెద్ద మర్రిచెట్టు, దానిమీద నలుగు దిక్కుల నించీ పక్షులు వచ్చెను గూళ్ళు కట్టుకొనెను" అన్నట్లుంటాయి.
    అయితేనేం భాస్కరం అంటాడు.
    "ఈ సముద్రం, ఈ ప్రకృతి రమణీయత ఇవి చాలవూ-హాస్టల్ అన్నంలో రాళ్లుంటేనేం సాంబార్ లో కెంపులుంటేనేమ్! ఫర్వానై"    
    నేరుగా మంచాలు, మనుషుల్నీ దాటుతూ, తనది అనుకునే మంచం, అల్మారా, పెట్టే ఉన్న జాగా లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ 'రూంమేటు' అనకూడదు. భావ్యం కాదు. కాని, వాళ్ళ  'నైబర్' (పొరుగు) అప్పుడే భోజనం చేసి వస్తూన్నాడు.
    "బ్రదర్ భాస్కర్! నీ మంచం క్రింద దాచిన ఆవకాయ వుంది చూసావ్?" అన్నాడు మిత్రుడు.
    మంచంమీద కూలబడి, 'ఔను! నేనే తెచ్చాను" అన్నాడు బాస్కరం.
    "అదీ....దాని కమ్మని వాసన ఈ జిహ్వా రాముణ్ణి గొప్ప ప్రలోభనాకు లోను జేసిందిసుమా...... అందుకనీ........నేనూ దొంగతనం చేశాను..........ఒక ముక్కా కాస్త వూటా మాత్రం........ధాంక్స్ టు యూ."
    "హే! భగవాన్! ధనమ్మగా రన్నంతపనీ అయింది" భాస్కాం మంచాన వెల్లకితలా పడ్డాడు.
    "ఏమయింది బ్రదర్! ఎమేనా కొంపలు మునిగే పని జేసేనా?" మిత్రుడు కాస్త గాభరా పడ్డాడు.
    "కావాలంటే నా చింతకాయ పచ్చడి నీకు స్వయంగా వేస్తాను పద మెస్సుకి బ్రదర్" అన్నాడు.
    "మై గుడ్నెస్! నీ చింతకాయ పచ్చడికేం? బ్రదర్! ఉండనీ గాని అది మన సొంతావకాయ కాదు. ఓ ధనమ్మగారు అనే దొడ్డమ్మగారు తన ముద్దుల పత్తికి యివ్వమని పంపించిన పొరుగింటి పుల్లకూర."
    "ఓ! అయామ్ సారీ!......పోనీ ఆవిడ ముక్కలు లెక్కపెట్టిందంటావా? పెట్టి ఉండదు- అధవా పెట్టిందే అనుకో యివతల బట్వాడా తీసుకొనే శాల్తీకి ఆ సంగతి తెలీదుగా" నొచ్చుకుమ్తూనే అన్నాడు 'నైబరు.'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS