29
కోలాహలంగా వుంది విశ్వ విద్యాలయ ఆవరణ మంతా! తోరణాలు, ద్వారాలు, అంతా సంబరంగా ముస్తాబు చేసుకుంది. "యూనివర్శిటీ కాలేజీ లన్నిం"టా ఎగ్జిబిషన్ జరుగుతోంది. మూడేళ్ళ కోసారి జరిగే ఎగ్జిబిషనే అయినా, గత రెండు మూడు దశాబ్దాలుగా ఉంటున్న విశ్వవిద్యాలయమే అయిన పాత ఏట్లోకి కొత్త నీరు వచ్చినట్లు పాత మొక్కకి కొత్త పూత పూసినట్లు అంత కలకలంగా, కన్నుల పండువుగా ఉంది. యువతీ యువకులంతా, ఏ 'శాఖ' కా 'శాఖ' నీ విభాగాని కా 'విభాగం' ఏ కాలేజీ కా కళాశాల, విజ్ఞానాన్ని, వినోదాలుగా, విన్యాసాలుగా మార్చి యూనివర్శిటీ ఎగ్జిబిషన్ గా రూపొందారు.
జనం చూస్తున్నారు. చాలామంది మూడు సంవత్సరాల కేఇతం పెట్టిన ప్రదర్శనలే బాగున్నాయంటున్నారు. మూడు సంవత్సరాల క్రితం ఈ మాటే అన్నారు కొందరు-మూడు సంవత్సరాల తర్వాత తిరిగి ఈ మాట "ఈ సారిదే బాగుండ"ని అంటారు కూడా.
మిట్ట పల్లాలను, ఎగుడు దిగుళ్ళను అందంగా కలిపి, భవనాలు కట్టినది వాల్తేరు యూనివర్శిటీ -విద్యార్ధులు ఎక్కువ మంది, విదార్ధినులు తక్కువ మందీ అయినా, సందడి సంబరం అంతా విదార్ది నుల చుట్టూరా పెరుగుతోంది. వెతుక్కోకుండానే అడావుడీగా, అక్కర్లేకపోయినా ఆదుర్ధాగా, జనం కలివిడిగా తిరుగుతున్న తరుణంలో, సూర్యుడు సైతం వీళ్ళ సరదా సంబరాల ముందు వీగిపోయిన సమయంలో-
భాస్కరం ఆర్ట్స్ డిపార్టుమెంటులో ఏదో పోగొట్టుకున్న వాడిలాగ వెతుక్కుంటూ వచ్చాడు.
పద్మావతీ, సురేఖా ఒకే స్టాలు దగ్గర ఉన్నారు.
జనానికి వాళ్ళిద్దరూ "రికార్డ్ ప్లేయర్" మీద "టు బీ ఆర్ నాట్ టూ బీ" (షేక్స్ పియర్ నాటకం వేసి) వినిపిస్తున్నారు.
"ఎలా వెళ్ళడం?- ఆ ఇద్దరూ ఒకేసారి తనను చూసి ఏమనుకుంటారు?
"దగుల్బాజీ" అనుకోరూ.......
"ఒక్కరే అయితే వెళ్ళగలను. ఇద్దరున్నారే......" అక్కడే నిలబడ్డాడు.........
అటూ, ఇటూ జనం క్యూలో నించున్నారు. "మొవ్వావ్! కదలండి మాష్టారూ" అంటున్నారెవరో.
"అమ్మాయి లిద్దరు సీతాకోక చిలుకల్లా అగుపిస్తోంటే-చిలక పలుకుల్లా నాలుగూ విడమర్చి చెబుతూ ఉంటే ఈ బ్రహ్మావతారం కదల్డెం?" నలుగురూ తనను విసుక్కుంటున్నారు.
భాస్కరం బయటకు వచ్చాడు. అంతలో రివ్వున మూర్తి వచ్చాడు.
"బ్రదర్! నేను శైలజతో మాట్లాడా" నన్నాడు గొప్ప ఫీట్ చేసి వచ్చిన వాడిలాగ.
"శైలజా?" భాస్కరం మెల్లిగా అన్నాడు.
"ఔనురా! నువ్వు బాగుంటుందీ అనే వాడవుగా-సన్నని ముక్కూ, ముక్కున ముచ్చటగా పుడకా.........దట్ టాల్ అండ్ స్లిమ్ గాల్........" మూర్తి ప్రపంచ యుద్ధంలో గెల్చి వచ్చినట్లున్నాడు.
"ఏమందిరా!" భాస్కరం అడిగాడు.
"ఆ అమ్మాయేం?!......." చెప్పబోతూ, అంతలో ఆగి, "ఉహూ! కమాన్ ఇలా కాదు ఇక్కడ ఇది సంత గోల-ఆ కాంటీన్ లో ఓవార మనం జయించాం-స్పెషల్ గా సీట్ లున్నాయి. చెబుతారా" అన్నాడు మూర్తి.
"కాని బ్రదర్! నాకో చిన్న పని ఉంది......." కన్నీళ్ళొక్కటి తక్కువగా, ఇంచుమించు దీనాతి దీనంగా అన్నాడు భాస్కరం.
"ఏం-ఏ చల్లనమ్మ బోవు భామకై వేచితివిరా ఇందు?" నవ్వాడు మూర్తి కాస్త వెటకారంగా-
"ఓ చల్ల నమ్మాయి కోసరం" భాస్కరం కూడా శృతి కలిపాడు.
"అయితే! ఆ 'జలజ'గారి కోసరమేగా-ఆవిడ ఇప్పుడు యమ బిజీగా ఉంది గానీ - ప్రస్తుతం రా! శైలజ గురించి చెబుతా" లాక్కుపోయాడు మూర్తి.
భాస్కరం కాఫీ రాంగానే త్రాగేశాడు-"మంచి నీళ్ళు కావురా" అన్నాడు మూర్తి ఆశ్చర్యపడి!
సిగ్గుపడ్డాడు భాస్కరం.....
"నిజంగా మంచినీల్లే అనుకుని త్రాగేశానురా బ్రదర్" అన్నాడు పరధ్యానంగా.
"మరే! పడ్డావురా ప్రేమలో పోనీగాని.....ఇది విను....." చెప్పసాగాడు మూర్తి.
"శైలజను నేను ఓసారి బస్సులో చూశాను........కొంటెగా చూస్తుందిరా ఆ అమ్మాయి! సరిలే.......అలవాటేమో ననుకున్నా......కాని దిగుతూన్నప్పుడు వెనుదిరిగి చూసిందిరా ..... చూసి కిసుక్కున నవ్వింది కూడా ....... ఇంకా చూడు భాయ్! నాకు గుండెల్లో ఎలక్ట్రిసిటీ లా కదిలింది-"
"చూడు మూర్తీ......నువ్వు కూడా......"
"వాట్ డు యూ మీన్? నేనేం వామనమూర్తినా? పైగా అది శైలజ నవ్వులా! బ్రదర్ దానికీ గుండెల్లో దూరి కాపురం ఉండే కలత పెట్టే నైజం ఉందీ......."
మూర్తిని ప్రేమగా చూసి, "ఒ. కే........! చెప్పు!.........గో ఎహెడ్!" అన్నాడు భాస్కరం.
మూర్తి సిగరెట్ కాలుస్తూ, చాలా కధ చెప్పాడు.
శైలజ ముక్కుమీద మల్లెమొగ్గ కొస ఉందన్నాడు. ఆ అమ్మాయి కళ్ళల్లో వశీకరణ మంత్రశక్తి కాపుర మున్న దన్నాడు. అలా యిలా చాలా అన్నాడు.
"అసలింతకీ ఇవాళ ఏమిటేడ్సేవోయ్?" విని విని మండిపోయాడు భాస్కరం.
"ఉండవోయ్! మిస్టర్ జెలసీ! ఇవాళ శైలజ నీలిరంగు చీరే కట్టుకుంది వాళ్ళ డిపార్టుమెంట్ ఎగ్జిబిషన్ లో పూల మొక్కలు సెక్షను పెట్టారులే......అందులో ఎన్ని రకాల పూల మొక్కలూ, పూల్ గుత్తులూ-పళ్ళూ అవీ ప్రదర్శిస్తున్నారో నీకూ తెలుసుగా........ వాటి మధ్య శైలజ అచ్చం వన కన్యలా.....అసలు పువ్వులా......"
"లేళ్ళూ, నెమళ్ళూ ఉన్నాయా?"
"తోడేళ్ళు, నక్కలూ ఉన్నాయి......వినరా అంటే....." విసుక్కున్నట్లు మొహంపెట్టి అన్నాడు మూర్తి.
"చెప్పరా? షేక్స్ పియర్!.......రోమాన్స్ రాయి? భాస్కరం వినసాగాడు.
"శైలజ, నీళ్ళ కుండీలో ఇన్ని ఎర్ర గులాబీలు, నల్ల ద్రాక్షపళ్ళూ పడేసుకుందిరా......అణాయిస్తే చాలు, ఆ నీళ్ళ కుండీలోనించి పువ్వు లేదా పండూ తీసుకోమందిరా......."
"ఎంతమంది ఎన్ని అణాలు ఇచ్చారు?" పక పకా నవ్వాడు భాస్కరం.
"ఉండవోయ్-అందరూ నీళ్ళల్లో చేయి పెట్టడం అమ్మ బాబోయ్ మని 'షాక్' కొట్టి చెయ్యి తీసెయ్యడం......ఆ నీళ్ళకు కాస్త ఎలక్ట్రిసిటీ పట్టించారులేవాళ్ళు......అదీ సంగతీ"
"బహుశా మీ శైలజ చూపుల్లోదై ఉంటుంది" భాస్కరం అందించాడు.
"మరే! నినూ.......నేనేం చేశానూ......సాహం చేసి పోతే పోయింది ఎడం చెయ్యె కదాని ఈ నా నామహస్తంబును', 'డింగ్' మని దూర్చి రెండు పువ్వులు లాగేసుకున్నాను.....మై గుడ్నెస్.....ఆ అమ్మాయి కళ్ళు 'అప్రసియేషన్'తో ఎలా మెరిశాయనుకున్నావ్?"
"నీ చెయ్యి ఏమంది?" నవ్వాడు భాస్కరం.
"జివ్వుమంది.......వెధవది ఆ వోల్టేజీ ఓ లెక్కా మనకి, శైలజ చూపుల్లోని విద్యుత్తు గుండెల్లో జివ్వు మందిగా....." మూర్తి కూడా నవ్వాడు-మళ్ళీ మధురానుభూతిని స్మృతికి తెచ్చుకుని, "మాష్టారూ! రెండు పూలు పట్టుకు పోతున్నారు......అణాకి ఒక్కటే" అన్నదిరా ఆ అమ్మాయీ?......అబ్బ! ఇది మరీ షాక్ అయిందనుకో......."
-"నన్నా?" అన్నాడు వెంటనే......"
-"మరే! మరెవర్ననుకున్నారూ?" అంది. ఇలా చూసి.......
-"ఐతే ఓ పువ్వు మీ కిచ్చేయ్ నా?" అన్నాను నేను."
-"కాదూ, ఈ కుండీలో పడేయండి" అంది.
-"ఉహూఁ" కావాలంటే "ఏమేనా ఇస్తానుగాని, నేను అందులో మరి చెయ్యి పెట్టాను," అన్నాను. ఆ పువ్వు ఆమె చేతికి అందిస్తూ......మొదట అటూ, ఇటూ చూసింది గాని.......తీసుకోనా, మానవా అం తటపటాయించిందిగాని, తీసేసు కుందిరా.......చివరికీ" మూర్తికీ ఆనందం పట్టలేనట్లుంది.
"గుడ్! ఇంకేం-వాళ్ళ నాన్నగారి ఎడ్రస్ తీసుకో......."
"ఛా! ఎంతమాటన్నావురా.......విరహం ఆనక సందేశం తర్వాత ప్రణయం, తదుపరి......."

"ఇంకేమిటి నీ మొహం-నీకు క్లాసులో సున్నా.......వాళ్ళ నాన్న ఆ అమ్మాయికి వేరే పెళ్ళీ" భాస్కరం లేచాడు.
"ఒరే! అలా అనకురా-పరీక్షలు జీవితంలో నెగ్గ లేనంత దద్దమ్మనురా నేనూ?" అన్నాడు మూర్తి బాధగా.
"కావు! ఐ విష్ యూ గుడ్ లక్" శైలజను సురేఖనీ, పద్మావతినీ "యిన్సై"ట్ చేస్తూ.
ఓపిక్ నిక్ పెట్టు. నే వస్తా" నన్నాడు భాస్కరం సీరియస్ గా.
"ఓ...........కే..........అవునూ సురేఖా అంటే ఎవరూ ఆ డిబేట్ ల అమ్మాయేనా?" మూర్తి కొంటెగా అడిగాడు.
"అక్షరాల ఆ ఎత్తు మడమల జోళ్ళు తొడుక్కునే అమ్మాయే!" భాస్కరం అర్జంట్ పని ఉన్నవాడిలా వెళ్ళిపోయింది.
అట్నుంచి వస్తూన్న సురేఖ పద్మావతీ, భాస్కరాన్ని చూశారు.
సురేఖ వెంటనే "వెళ్ళవోయ్! నీ అనిరుద్ధుడు వస్తున్నాడూ" అంటూ వెళ్ళిపోబోయింది.
పద్మావతికి సంభ్రమం కలిగింది కాని, భాస్కరం ఆమెను పలకరించలేదు.
"మాట!........సురేఖగారూ!......" భాస్కరం పద్మావతి దగ్గరకు వస్త్జూనే నాలుగు అడుగులు అటు వేసిన సురేఖను పిలిచాడు-
పద్మావతిని ఎవరో కమ్చీలో చెళ్ళున కొట్టి నట్లైంది-మొహం కందిపోయింది.
"గుడ్ మార్నింగ్! నాకూ కాస్త లైబ్రరీలో..." అంటూ సురేఖ వెళ్ళడం మానలేదు-వెను దిరిగి చూసిందంతే-
భాస్కరం వారించి అన్నాడు "మీ దొడ్డమ్మ గారు నా చేత మీకు పాత ఆవకాయ ఒకటి పంపించారు......మీరు వస్తూ వస్తూ అడిగి అలాగే మరిచి పోయారుటగా.........అదీ........"
"వ్వాట్? దొడ్డమ్మకి మతిపోయింది లావుంది! ఆవకాయకు మరెవ్వరూ దొరకలేదా పాపం! మీరా?" నొచ్చుకుంది సురేఖ సిగ్గుపడిపోయింది మరీ.
పద్మావతికి ఆ యిద్దరి మాటలూ హిబ్రూవో లాటివో అయితే తెలియనట్లుంది-
"మీ దొడ్డమ్మ?" అంది స్వగతం పలికి నట్లు-
"ఔను పద్మా!......వాళ్ళ దొడ్డమ్మగారు దొడ్డ మనిషి......కావాలంటే నన్ను కూడా వేసుకోమన్నారు కాస్త ఆవకాయ" భాస్కరం చెప్పేడు అవసరం లేకపోయినా నవ్వుతూ.
"వేసుకోండి......" సురేఖ నవ్వుతూ చర చరా వెళ్ళిపోయింది.
భాస్కరం ముక్కున గుద్దినట్లు విస్తుబోయాడు.
పద్మావతి ఉడుకు మోత్తనం దాచుకోలేక సతమతమై పోయింది.
"నాకూ కాస్త పనుంది" అంటూ వెళ్ళబోయింది.
"నీతో మాటాడాలి పద్మా" అన్నాడు భాస్కరం కాస్త కృంగిపోయి.
"పదిమందిలోనూ పద్ మా....! అనకండి" విసవిసా వెళ్ళిపోయింది పద్మావతి.
కోపం, ఈర్ష్యా ఆమె ప్రతి కదలికలోనూ కదిలాయి.
"మై గుడ్నెస్......." భాస్కరం నిర్విన్నుడై పోయాడు "ఏం చెయ్యను! ఈ సురేఖగారు అంతా చెప్పేసింది-ఇక లాభంలేదు.......పోయి ఆ సముద్రంలో దూకాలి" అనుకుంటూ ఏం చెయ్యాలో తెలియక పద్మావతి మలుపు దాటేదాకా అక్కడే నిలబడ్డాడు. "పద్మా! పద్మా" అనుకున్నాడు తిడుతున్నట్లు.
"ఏమండీ! కాస్త ఔట్ గేటు చూపెడతారూ" ఒకావిడ పిల్లలతో సహా ఎగ్జిబిషన్ చూడ వచ్చిందికాబోలు దారి తప్పి, అడిగింది.
"పదండి! నేనూ అటే వెళ్తున్నాను. దిగబెడ్తాను" భాస్కరం వలను సొంత బంధువు లైనట్లు తీసుకు వెళ్ళాడు.
30
పద్మావతి చాలా పెద్ద తప్పు చేశానని ఆనక నొచ్చుకుంది. ఇంటికివెళ్ళి ఏడ్చింది కూడా.
"అమ్మాయి ఇప్పన్నుంచీ చదవకపోతే క్లాసు మార్కులు రావు......... బి.ఏ.లో ఎలా చదివే దానివి.....అలాంటిది ఇప్పుడు కాస్త పుస్తకాలేనా దుమము దులపడం లేదు......" జయమ్మ బాధ పడ్డది. కాని, పద్మావతి మారు పలకలేదు.
"ఒంట్లో బాగో లేదమ్మా" అన్నది. తలగడలో తల దూర్చుకుంది.
సురేఖ కూడా నొచ్చుకుంది. తను అమర్యాద కరంగా ప్రవర్తించానేమో ననుకుంది-ఆ ఇద్దరి మధ్య నేనో పెద్ద అగాధమై నిలబడట మెందుకు? లేదు........లేదు.......సరిగ్గా నాగరికత ఎలా నేర్పిందో అదే సభ్యతను ప్రదర్శించాను అనుకుంది మళ్ళీ.
చుట్టూరా ఉన్న వాతావరణమంతా వూళ్ళోని పిల్లా పీచూ, ఆదా మగా బలగంతో కలకలమంటూ ఉంటే తన కెందుకనో వెలితిగా వుంది. పద్మావతి "వెర్రిది ఏడుస్తుందేమో-దాని ఇంటికి వెళ్దువా?" అనుకుంది మళ్ళీ ఆ తలంపు మానేసింది.
అన్ని బస్సులకీ రద్దీగానే వుంది. క్యూలో నిలబడటంలాంటి మంచి పనులు విశాఖపట్నమంత దూరం ఇంకా రాలేదు-హాస్టలు బస్సులో తాను వెళ్ళదల్చుకోలేదు. అప్పుడు తనకు తెలిసిన స్నేహితుల నెవ్వరినీ చూడాలని లేదు సురేఖకి.
ఎట్టకెలకు ఒక రిక్షా దొరికింది. అది ఎక్కిందన్న మాటేగాని, వాడు హాస్టలు చేరేలోగా ఎన్ని సార్లు ఎంత ఆయాసపడి, ఎగుడు దిగుడు రోడ్ల మీద పోవాలో తల్చ్జుకుని జాలి పడ్డది. ఆధునిక జీవితంలో, ఉచ్చ నీచాలిలాగ, ధనిక బీద వర్గాలకు మల్లే, ఎత్తు పల్లాలు, దిబ్బలూ, మలుపులూ, విశాఖపట్టణం రోడ్లు.
ఎర్ర మట్టి దిబ్బలను సాధించి రవిటి నేలను ఇసికె పర్రలనూ వేధించి, వాటికి రెడ్ లాండ్స్ అని అంత లేసి భవనాలు కట్టుకున్నారు మనుషులు-అంచాతనే కాబోలు వెర్రిగా సముద్రం మరీ మరీ నవ్వసాగింది.
'హాయిగా వూరి పాకలు నేను కోరాదూ? ఇంతలేసి మేడలూ, వాటిముందు బోర్డ్ లూ, ఇంకా ముందు కుక్కలూ పెట్టుకుని 'సముద్రం గాలి' మెయ్యకపోతే?.........'
కాని, రిక్షా జర్రున జారుతూ వెళ్తూంటే ఈ ప్రాంతమే బాగుంది. అనుకుంది సురేఖ హాయిగా ఒక ప్రియుడు ప్రేయసీ ఇంత సముద్రమూ, అంతా ప్రశాంతమూ. ఒక్క సముద్రానికే చెల్లింది, హోరుమంటూ ప్రశాంతతనూ, గాంభీర్యాన్నీ ఇవ్వగలగడం-
కాని, తాను ఎవరి ప్రేయసి కావాలి?
వెనుకటికి గుంటూరు కాలేజీలో జానకీరాం అనే అబ్బాయి తనకి ప్రేమలేఖ రాశాడు- తను ప్రిన్సిపాల్ తో చెప్పి, అతణ్ణి 'సస్పెండ్' చేయించింది. ఇవాళ బాధగా ఉంది-తప్పు చేసినట్లు వుంది.
ఆ జానకీరాం ఇవాళ ఇలాంటి ఏ బీచ్ లోనో సాయంకాలంచేసి, తనకంటే అందమైన మరో మల్లికతో షైరు వచ్చాడేమో? కాని-ఇవాళ తనను కావాలని వెంటపడ్డ వారందర్నీ నెమరు వేసుకుని ఏం లాభం?
"హాయిగా చదువుకోవాలి" అనుకుంది.
నీలంగా ఆకుపచ్చగా, తెల్లగా, బస్సున, ఎత్తున హోరున సముద్రం లేచి లేచి పడుతూనే ఉన్నది-వృధా పోతున్నదనిపించింది........
