Previous Page Next Page 
ప్రేమకు పగ్గాలు పేజి 22


    "అఫ్ కోర్స్! అదీ రైటే....... ఓకే!" అన్నాడు భాస్కరం నవ్వుతూ.
    మిత్రుడు అడిగాడు "ఇవాళ నువ్వు డల్ గా ఉన్నావు కారణం?"
    "లేదే! ఎగ్జిబిషన్ లో కాస్త రష్ ఎక్కువగా ఉందీ అంతే" నన్నాడు భాస్కరం.
    "ఓ ఛెస్ ఆట వేద్దామా?"
    "పోనిద్దూ! ఆర్గానిక్ కెమిస్ట్రీ నోట్స్ రాయాలీ" అన్నాడు భాస్కరం.
    మిత్రుడు బోర్డూ, పిక్కలూ తీసుకు ప్రక్కనున్న వరండాలోకి వెళ్ళిపోయాడు. ఒక్కడే ఆడేసుకోగల డతగాడు!
    "నాపని చెదరంగం పిక్కలాగే ఉంది. ఎవరెటు నప్పుతారో నన్ను నాకే తెలియదు" భాస్కరం నిట్టూర్చాడు.
    "ఏమేనా సరే! నేను పద్మావతికి కథంతా చెప్పలేను. ఆ అమ్మాయి చదువు మానేస్తుంది......" అనుకున్నాడు.

                                *    *    *

    అలా భాస్కరం అనుకున్న దానిలో తప్పేమీ లేదు. అప్పటికే పద్మావతి పదిసార్లు "తిరిగి గుంటూరు పోతాను ..... అమ్మతో బియ్యీడే చదువుకుంటానని చెబుతాను" అనుకుంది.
    భాస్కరం ఎందుకనో తనకు దూరమై పోతున్నాడు. తను బీదదైనందువల్లనే నేమో.......లేదా తనకు ఒక్క తల్లి తప్ప మగదిక్కు ఎవ్వరూ లేరు. సమాజంలో చెప్పుకునేందుకు పెద్ద హోదాగల తండ్రీ, తాతా, మావయ్యా, అన్నయ్యా ఎవ్వరూలేరు-ఒక ఆడది తన సొంత రెక్కలమీద పోషిస్తున్న మరో ఆడపిల్ల తాను-రేపు తనకూ తల్లికీ, కూడా యీ చదువైన తరువాత ఉద్యోగం చేయడమూ చేయించడమూ రెండూ తప్పక పోవు.
    భాస్కరం సంప్రదాయాలున్న కుటంబం లోనించి వచ్చాడు. అతను అతని ఆత్మీయులు అతని అంతస్తూ, ఈ రెంటినీ హద్దులుగా ఒక సమ్మంధం చూసుకుంటాడు-బహుశ అందుకు ఏ సురేఖలాంటి అమ్మాయో-చదువుకొనడం కేవలం చదువుకోసరమే చేసేది సరిపోతుంది-అనుకుంది పద్మావతి.

                          
    ఈ ఆలోచన మధ్యకు కేవలం సురేఖను ఎందుకు తేవాలో తనకే తెలియదు-భాస్కరం ప్రవర్తన పద్మావతికి ఎందుకనో బాధ కలిగిస్తున్నది. కాని "అమ్మతో ఎలా చెప్పను.......తనను మభ్యపెట్టి తెచ్చావే, యీ వాల్తేరు?" అనుకుంటుంది ఒకసారి.
    మరి సారి తనది కేవలం భ్రమ అనీ ఉత్త అనుమానమనీ, "భాస్కరంగారు అనేకమైన బరువు బాధ్యతల మధ్య తనను కాస్త ఉపేక్షిస్తున్నాడేమో న"ని తలపోస్తున్నది.
    "ఆయనగారికి యీ ఏడాది ఫైనల్ యియర్ పైగా చెల్లెలి పెళ్ళి అంటే మాటలా? రక రకాల పనులూ, బాధ్యతలూ ఉంటాయి" అనుకుంటుంది.
    కాని గుంటూరులో అన్ని సినిమాలకు తన్ను దొంగతనంగా తీసుకెళ్ళిన భాస్కరం. బెజవాడలో కృష్ణానది ఒడ్డున రాత్రి ఆఖరి రైలుదాకా తనను కబుర్లు చెబుతూ "వదలలేను పద్మా! నేను నీకు బందీ"ని అన్న భాస్కరం-వాల్తేరు వొచ్చాక కనీసం ఒక్క సినీమాకేనా రమ్మనలేదే. సాయంకాలం సముద్రం-తను ఇదివరకెన్నడూ ఎరుగని సముద్రం - "చూద్దాంరా!" ఆమేనా పిలవలేదే......"
    అదే పద్మావతి గుండెలు పిండేసింది. తాను భాస్కరంమీద పెట్టకున్న ఆశ వేరు. అది అతని యింటికి యిల్లాలై వెళ్ళాలనే-అతని స్నేహం గంటే ఎక్కువ-అతని రక్షణ, తాను కోరుకున్నది.
    పద్మావతి సరిగ్గా అన్నం తినలేదని జయమ్మ గారు చాలా నొచ్చుకున్నది.
    "ఈ పాడు వూరు-ఈ తిండీ నీకు పడటం లేదే అమ్మాయీ!" అనుకున్నది.
    "చివరికి నేను దీని పెళ్ళి గురించి ఆలోచనే చెయ్యలేక పోతున్నాను.......ఛీ! కర్మ" అనుకుంది. కాని తను ఎవరిని సంప్రదిస్తుంది? ఎవరున్నారు తనకి?

                              *    *    *

    పద్మావతి పుస్తకాలు సర్ధుకుని కాలం మరిచిపోయి వెళ్ళిపోతూండటం జయమ్మగారు గమనించింది.
    "అమ్మాయ్! అంత పరధ్యానంగా ఉన్నావేమే?" నన్నది కలం తీసి గుమ్మంలోకి వచ్చి కూతుర్ని వెనక్కి పిలిచి అందిస్తూ.
    పద్మావతి సురేఖనే, యిదివరకు అడిగేది అన్నీ ఇప్పుడు అడగాలనిపించడం లేదు. క్లాసుల్ల్లో కూడా ఎప్పుడూ సురేఖ ప్రక్కన కూర్చునే పద్మావతి, ఎడంగా కూర్చున్నది. సురేఖ కూడా 'ఏమని' అడగలేదు.
    ఆ యిద్దరిమధ్య భాస్కరమనే గోడ పెరిగి పెద్దదై పెద్దదై పోతున్నది.
    భాస్కరం ఇక ఒకటి రెండు నెలల్లో ఇంటికి వెళ్ళాలి.......ఈలోగా ఈ ఎక్సిపెరిమింట్ చేసుకోవాలి. ఈ నోట్సు రాసుకోవాలి అనే ఆదుర్దాలో పడిపోయాడు.

                                  *    *    *

    ఒకనాడు మూర్తి వచ్చాడు. వస్తూనే తాను శైలజతో పరిచయ మేర్పరచుకున్నానని చెప్పాడు.
    భాస్కరం ఇనార్గానిక్ మెటల్స్ చదువు కుంటున్నాడు. "కాస్త చదువు సంగతి పట్టించుకోరా" అన్నాడు మిత్రుణ్ణి మందలింపుగా చూసి.
    "అంటే నీ ఉద్దేశం......శైలజని మరిచిపోమంటావు.....?" అడిగాడు మూర్తి.
    "ఉహూ.......ఎందుకంటానూ....... కానీ......" నీళ్ళు నమిలాడు భాస్కరం.
    "నువ్వు పద్మావతిని మరిచిపోయినట్లేనా?" అడిగాడు చటుక్కున మూర్తి.
    "షటప్!" మండిపోయాడు భాస్కరం. అంతలో సిగ్గుపడిపోయి "క్షమించరా! నాకీ మధ్య బుర్ర బాగోలేదు" అన్నాడు మూర్తి చేతులు పట్టుకుని.
    మూర్తి కూడా తన తొందరపాటుకి నొచ్చుకున్నాడు. "కాదురా! యీమధ్య నువ్వూ....." అని ఏదో చెప్పబోయాడు.. మూర్తి అంతలో మనసు మార్చుకుని "ఏం లేదులే! ఐవిల్ కమ్ ఎగైన్" అంటూ వెళ్ళిపోయాడు.
    భాస్కరం విచారంగా కూలబడ్డాడు. శైలజా, పద్మావతీ, సురేఖ, మూర్తీ ఎవరవ్వనీ, వీళ్ళకు వీళ్ళేనా? బాధ్యులు.........
    ఇవాళ యీ పెరిగిన కండలకు, అందాలకు మరొకరి సొత్తు మరొకరి శక్తీ వెచ్చమయింది. అందుకే మరి .........
    మూర్తిని వెనక్కి పిలిచి క్షమాపణ చెప్పుకుందా మనిపించింది.......కాని ఏం లాభం? వాడన్నది నిజమే. తాను పద్మావతిని ఎన్నోరోజులైంది కల్సుకుని. సురేఖకు ఆవకాయ ఇచ్చి రావాలీ అనుకుమ్తూనే రెండు వారలైపోయింది-అసలా ఆవకాయ ఎలాగుందో......?
    "ఎంత బుద్దితక్కువ పనీ? వెధవది క్లాసు పుస్తకాలు పట్టుకుని వెళ్ళాలీ అంటే సిగ్గేస్తుంది కదా? ఈ ఆవకాయ యిస్తానని తద్దినం తెచ్చుకున్నా వేమిరా భగవంతుడా?" అనుకున్నాడు.
    భాస్కరానికి భయం వేసింది. బెంగగా ఉంది-ఒకవేళ పద్మావతి తొందరపడి తన మీద కోపంతో చదువు మానేయదు కదా? - భయం వేసింది.
    "ఉహూఁ ...... ఎందుకు మానేస్తుందీ? జయమ్మగారు వూరుకుంటుందా?" అనుకున్నాడు.
    మనసు ఇంటిదగ్గర ఒకసారి-పద్మావతి కేసి ఒకసారి సురేఖ గురించి ఇంకోసారి పీకుతున్నది.
    'వసంత'-తమ ఎత్తుకొని ఆడించిన వసంత.....పెరిగింది. పెద్ధధైంది ...... ఇక రెండు మాసాల్లో పరాయిదై పోతుంది.
    నవ్వుకున్నాడు "పరాయి దవడం అంటే? వసంత తన సొత్తా? పినమ్మ సొంత ధనమా? ఉహూఁ .... వసంత వసంతే.......ఆపిల్ల తన ఇంట ఉండటానికి లేదు. మరొకరి యింట మరొక వ్యక్తి యిష్టా నిష్టాలకు అనుగుణంగా, మరో జీవితం, మరో యిల్లూ కట్టుకోవాల్సిందే."
    పద్మావతీ అంతే.
    రేపు పిన్ని 'నువ్వు మాస్టరీ వద్దూ' అంటే ఆమె మానెయ్యాలి.
    "అంతేనా?" అనుకున్నాడు గట్టిగా ...... తీవ్రంగా ఆలోచిస్తున్నవాడు-కాలేజీ మెట్లు దిగుతూ.
    ఔనన్నట్లు క్లాక్ టవర్ మీది చతుర్ముఖ గడియారం "ఠంగు" న ఆరుసార్లు కొట్టింది.
    జయమ్మగారు "వీల్లేదు..... మా అమ్మాయి పంతులమ్మ ఉద్యోగం చెయ్యాలీ అని ఆదినించీ నేను తలపోశాను అంటే.....? "వీల్లేదు" అంటుంది పిన్నమ్మ ..... అంతేగా!!
    "హే భగవాన్! పద్మావతి కితను పరాయివాడు -వసంతకి ముకుందరావు పరాయివాడు-కాని యీ ఇద్దరికీ ఇష్టానిష్టాలు, అభిరుచులు సొంతానివి ఉండరాదు-"
    "వసంతాలు రెండు జెడలు వేసుకున్నా-పంజాబీ దుస్తులు వేసుకున్నా అందంగా ఉంటుంది."
    చెల్లెలు జ్ఞాపకంరాగానే తిన్నగా బజారుకు వెళ్ళి చిన్న చిన్న పసుపు పచ్చని పూలుగల సిల్కు గుడ్డ తీసుకుందామనిపించింది భాస్కరానికి. "దానికి నేను తప్పకుండా సుర్వా షేర్వాణీ కొంటాను-ఎవరు కాదంటాడో చూస్తాను." అనుకున్నాడు.
    తిన్నగా 'ఔట్ గేట్' కు వెళ్ళాడు. బస్సు కేసి నడిచాడు.

                                    32

    జానికమ్మగారికి తలనిండా ఆలోచనలు చేతి నిండా పనీ ఉంటున్నది. పెళ్ళి అంటే మాటలా?
    -అందులోకి ఆడపిల్లను 'కన్నె ధార' పోయడా నికి ఎన్ని చూసుకోవాలి?
    అప్పడాలు వొత్తాలి. అందులోను "దింపుళ్ళ అప్పడాలు విస్తళ్ళంత వొత్తాలి" ఒడియాలు పెట్టాలి. పప్పుతో పదీ ఉప్పుతో పదీ అన్నీ సమకూర్చుకోవాలి-అన్నింటికన్నా ముఖ్యం-పిల్లది అత్తారింటికివెళ్ళిపోతుంది. దానికి నాలుగూనేర్పాలి.
    వసంతకు ప్రత్యేకంగా శిక్షణ నివ్వడంలో మునిగి పోయిందామె. ఇదివరకు రోజుకు పదిసార్లు తల్చుకునే భాస్కరాన్ని ఒకటి రెండుసార్లు కన్నా ఆమె ఎక్కువగా తల్చుకోవడంలేదు.
    భాసడు తనవాడు. వాడు పరాయివాడు కాడు. వాడు తన దగ్గరే-లేదా వాడి దగ్గరే తను ఉంటుంది గాని వసంత-వసంత పరాయి పిల్లయిపోతుంది.
    జానికమ్మగారికి తన గుండెల్లోని నెత్తురు ఎవరో తోడుకుంటున్నట్లు అనిపించింది.
    'కాని తప్పదు' అనుకుందామె.
    "వాడికి ఒక అమ్మగన్న బొమ్మను తేవాలి. దీనిని ఒక అయ్య యింటికి దిగబెట్టాలి-ఈరంపపుకోతనరజన్మకేఉన్నది" అనుకున్నది ఆమె.
    "అమ్మయ్యో! కట్నాలు యిచ్చి, వేలకు వేలు తగలేసి, నెత్తురూ, చెమటా ఏకంచేసి, అన్ని లాంఛనాలు పూర్తిచేసి కాళ్ళు కడిగి కన్నెధార పోస్తేనే ..... ఆనక రాసి రంపానపెట్టే గయ్యాళి అత్తగార్లూ, కాల్చుకుని తినే మొగుళ్ళూ ఉంటారే లోకంలో-ఇక ఆయన అన్నట్లు కట్నం, చట్టం నొప్పడూ అని ఆఖరి క్షణంలో అభాసు చేస్తే ఇంకే మయినా ఉందా?-నా చిట్టితల్లి గతేంగాను?......"
    ఆమె గుండె గతుక్కుమంది. ఎవరో పొడిచినట్లు!- అదుముకుంది.
    "ఒరే! తల్లీ! వసంతా!" అని కేక వేసింది .......వసంత రాగానే దానిని గుండెలకు హత్తుకుని, ఏదో అనబోయి సంభాళించుకుని "నువ్వుపోయి అక్కడ నానబోసిన పప్పు గాలించు" అన్నది దూరంగా జరిగి.
    గాలించడం, చెరగడం ఇవి రెండూ ఆడపిల్లపని వాడి తనానికీ గీటురాళ్ళు-జానికమ్మగారు వసంతకు సంగీతం చెప్పించింది. కాస్తో కూస్తో బళ్ళోనూ ఇంట్లోనూ అల్లికలూ కుట్లూ కూడా వసంతే కుతూహలంగా నేర్చుకుంది. గాని, అసలైన విద్య, అత్తగారు దెప్పి పొడవకుండా కాపాడగల శాస్త్రమూ అయిన వంటా, వార్పూ, అవే యింకా ముక్కుపచ్చలారని ఈ పసిదానికి వస్తాయో రావోనని జానికమ్మగారికి ఆరాటం. ఆడపిల్లకి పది రకాల అవకాశాలు, చనువులూ ఉండవు. చాలా విషయాల్లో తల్లిగాన్నా గురువూ, నేస్తమూ మరెవ్వరూ ఉండరు.
    వసంతకు తను వండటంలోనూ, అత్తమామలకు సేవ చేయటంలోనూ భంగపడతాననే భయం అసలు కళగానే లేదు. తనకు కాబోయే వరుడు "అన్నయ్యంత తెలివైనవాడేనా? అంత చురుకుగా ఉంటాడా?" అన్నదే ఆలోచన అయితే అమ్మ చాదస్తం కాదనలేక, వంట వండటం పట్ల శ్రద్ద చూపుతున్నట్లు నటిస్తుంది.
    "అమ్మా! ఆవకూర కష్టంగదే" అంటుంది.
    "కష్టమూ అంటే కాదనుకో గాని కాస్త రుబ్బుతున్నప్పుడు చెయ్యి మండుతుంది......వెంటనే చేతికి శుభ్రంగా కడుక్కుని వ్యాసలీనో, కొబ్బరి నూనో రాసుకోవాలి" అంటుంది జానికమ్మగారు.
    ఆమె కూతురికి ఆవేళ మధ్యాహ్నం రెండు జెడలు వేసింది.
    "అన్నయ్య వూళ్ళో లేడే" నన్నది వసంత.- తల్లికి జ్ఞాపకం చేయడానికి.
    "బాగుంది తెలివి......నాకు తెలీదా? ఏమిటీ? కాని వాడికి సరదా అయిన నాలుగూ నీకు అలంకారంగా చేస్తే నా కదో తృప్తి-వాడి మాటైనా నా హయామయినా యింకెన్నాళ్ళు చెల్లాలి?......రేపు మీ అత్తారింత వాళ్ళ యిష్టం" ఆమె నిట్టూర్చింది.
    "పోమ్మా" వసంత నొచ్చుకుంది. "నాకు పెళ్ళే వొద్దూ" అంది.
    "ఛీ! ఛీ! అవేం మాటలే? శుభం కోర్రా పెళ్ళికొడకా అంటే అలివేలుకుండకాడ చచ్చి నట్లు తొంగుంటా నన్నాట్టలే ఎవడో నీలాంటి వాడే" ఆమె కూతుర్ని మందలింపుగా, ఆప్యాయంగా ఒక్క చరుపు వీపుమీద చరిచింది.
    "భాసడికి నచ్చిన పిల్ల వస్తే దానికీ ఈ రెండు జెడలు వొద్ధనమా?" ఆమె స్వగతంలా అనుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS