Previous Page Next Page 
స్వాతి జల్లు పేజి 20

 

                                       8
    తన కాలేజీ లో చేరాడు. అతడిప్పుడుంటున్నది కూడా శ్రీధర్ గారింట్లోనే! అతని చదువు పూర్తయి ఉద్యోగంలో స్థిర పడేవరకూ , తను అండగా ఉంటానని వాగ్ధాన మిచ్చాడు శ్రీధర్. రవి కిదంతా చాలా సంతోషంగా ఉన్నా, ఒక విషయానికి మాత్రం విపరీతంగా బాధ కలుగుతుంది. ఈ మహా ప్రయత్నాని కంతకూ ఎవరు కారణమో, ఎవరి చిరునవ్వు వెన్నెల తనలో అంతులేని దీక్షనూ, ఉత్సాహాన్ని కలిగిస్తుందో, అ తార దర్శనం అపురూపమైంది. అందుకు బదులు ఇష్టమున్నా, లేకపోయినా సుందరరావు తో పరిచయం అధికమయింది. సుందర్రావిప్పుడు తరచు డాక్టర్ గారింటికి వస్తున్నాడు. రవిని తనతో తన స్నేహితుల ఇళ్ళకు రమ్మని ఆహ్వానిస్తాడు. రవికి తన చదువు పాడవుతుందనే బెంగ ఒక ప్రక్కన ఉండగా, అంతకంటే ముఖ్యంగా ఇంకొక విషయం అతనికి చాలా ఇబ్బందిగా ఉంది.
    సుందర్రావు తనకు పరిచయం చేసే వాతావరణం తనకు పరిచితమైన దానికి పూర్తిగా భిన్నమైనది. కృత్రిమ మర్యాదలు, నిషా పానీయాలు , పేకాట, ఇంగ్లీష్ సినిమా తారల వ్యక్తిగత చరిత్రలూ, వ్యర్ధమయిన లోకాభిరామాయణం , ఏమాత్రం అవకాశమున్నా, ఎవరి మటుకు వారు తమ ఆధిక్యతను నిరూపించుకోవాలని ప్రయత్నించటం , ఇదంతా రవికి తల తిరుగుతున్నట్లుగా ఉండేది. తన కిలాంటి వాతావరణం లో ఎలా సంచరించాలో, బొత్తిగా తెలియదు. వారంతా తనను గురించి ఏమనుకొంటారో?
    ఇంకొక విషయం కూడా రవిని బాధించింది. సుందర్రావు చాలా అందమైనవాడు. అతని చిరునవ్వులో అద్భుతమైన ఆకర్షణ ఉంది. ఆ ఆకర్షణ కు లొంగిన స్త్రీల సంఖ్య తక్కువ లేదు. ద్వంద్వార్దాలతో కూడిన సంభాషణలు, వెకిలి నవ్వులు, లేనిపోని గారాబాలు , రవికి భరింపరానివిగా ఉండేవి. ముఖ్యంగా స్నేహలత ఇంటికి సుందర్రావు బయలుదేరినప్పుడల్లా రవికి ప్రాణం పోయినట్లే ఉండేది. ఎందుకంటె, స్నేహలత తన స్నేహమృతాన్ని సుందరరావుమీద బదులు రవి మీద కురిపించేది . పాపం! రవికి దాని మీద ప్రలోభమూ లేదు. అందుకు సిద్దంగానూ లేడు-- కానీ, ఎలా తప్పించుకోవాలో మాత్రమే అర్ధమయ్యేది కాదు. అసలే మెత్తనివాడు. అందులో సుందర్రావు తన ఆచార్య దేవత సోదరుడు. ఎన్నో సార్లు అతనితో "నేను రాలేనని" చెప్పాలను కొనే చెప్పలేక పోయాడు. చివరకు కర్మణి ప్రయోగం రూపు దాల్చినట్లుండి పోయాడు.
    తార రవిని కలుసుకోకపోయినా , అతని విషయాలేప్పటి కప్పుడు తెలిసి కొంటూనే ఉండేది. అతను చదువు పాడుచేసికొని, సుందర్రావు తో తిరగటం, ఆమెకు నచ్చలేదు. తన అన్న తిరిగే ప్రదేశాలేటువంటివో ఆమెకు తెలుసు! వాటిలో రవికి కూడా ఆకర్షణ కలిగితే, అంతకంటే దారుణ మింకొకటి ఉండదు. ఈ ప్రమాదం నుండి రవిని ముందే మేల్కొలపాలి. అతని కర్తవ్యాన్ని గుర్తు చెయ్యాలి. కానీ, ఎలా రవిని కలుసుకోవటం? డాక్టరు శ్రీధర్ గారింటికి వెళ్ళటానికి తనకు ముఖం చెల్లటం లేదు. పైగా తనను చూసి రవి కోసం వచ్చినట్లు వూహించి శ్రీధర్ నవ్వుకోవటం తనకు నచ్చదు.
    తనను తాను నిగ్రహించుకోగలదు. కానీ చూస్తూ చూస్తూ రవిని గోతిలో పడనియ్యలేదు. సాహసించి, కాలాన్ని నిర్దేశిస్తూ తనను ప్రకాశరావు గారింట్లో కలిసి కోవలసిన్డిగా రవికి ఉత్తరం వ్రాసింది.
    ఆ ఉత్తరం చదువుకొని రవి ఎంతో పొంగి పోయాడు. సరిగా అతడు తార దగ్గిరకు బయలు దేరబోతుండగా సుందర్రావు తయారయ్యాడు. రవి గుండెల్లో రాయి పడింది. సుందర్రావు హుషారుగా నవ్వుతూ "నేను వస్తానని ముందే ఊహించావు లాగుందే! తయారయి సిద్దంగా ఉన్నావు" అన్నాడు. రవి పిరికిగా నవ్వి "నన్ను క్షమించండి ఇవాళ నేను మీతో రాలేను" అన్నాడు.
    సుందర్రావు ఆశ్చర్యంగా 'అదేం?" అన్నాడు. అబద్దం ఆడవలసిన అవసరం రవికి కనుపించలేదు.
    "తార నాకోసం ప్రకాశరావు గారింట్లో ఎదురు చూస్తూ ఉంటానంది. నాతొ ఏదో మాట్లాడాలిట" అన్నాడు.
    సుందర్రావు కొంచెం సేపు అలోచించి నవ్వుతూ "ఫరవాలేదు . నాతోరా! ఒక్క పది నిముషాలు , స్నేహలత ఇంట్లో కూర్చున్న తరువాత నేనే నిన్ను ప్రకాశరావుగారింటి దగ్గర దిగబెడతాను"..... అని రవిని తన కారులోకి ఇంచుమించు లాక్కుపోయాడు. బెంగగా , సుందర్రావు చేతి గడియారం వంక చూడటం తప్ప రవి ఏమీ చెయ్యలేక పోయాడు.

                               *    *    *    *
    స్నేహలత నవ్వుతూ ఎదురొచ్చింది.
    "లతా? ఇవాళ మీ ఇల్లంతా రవికి చూపించు!" అన్నాడు సుందర్రావు.
    స్నేహలత తమ ఇంటిని చూపిస్తుంటే, రవికి మతిభ్రమ కలిగినట్లయింది. స్నేహలత ఇంత ధనికురాలని తెలియదు. ఇంటి ముందరి వాటర్ ఫౌంటైన్ ఇదివరకే చూసాడు -- ఇంటి వెనక కూడా మరొకటి ఉంది. అందమైన అద్దాల బీరువాలలో మిలమిలలాడే చేపలు -- నేలమీద ఖరీదైన కార్పెట్- పడకగది, వంటగది, హాలు అన్నీ అత్యంతాదునిక పద్దతిలో ఎంతో ఆడంబరంగా ఉన్నాయి. సోఫా సెట్లు, డైనింగ్ టేబిల్ అన్నీ చాలా ఖరీదైనవి. సరిక్రొత్త మోడల్ కారు చివరకు కార్ షెడ్ కూడా ఎంతో అందంగా ఉంది. అంతటి ఐశ్వర్యాన్ని రవి అంతకు ముందెన్నడూ భావనలో నయినా ఎరుగడు. విభ్రాంతి తో తల మునకలయి పోయిన రవి కాలం సంగతి మరిచిపోయాడు. చివరకు సుందర్రావే రవిని బయటకు తీసికొని వచ్చాడు.
    రవి కూడా కారులో కూర్చున్నాక సుందర్రావు సంభాషణ ప్రారంభించాడు.
    "స్నేహలత ఇల్లెలా ఉందీ?"
    'అది వర్ణించడానికి కూడా నాకు శక్తి లేదు."
    "ఐశ్వర్య మంటే, అదోయ్! ఆవిడకు తెలివి. తేటలు బొత్తిగా శూన్యం. మెట్రిక్ దాటలేక నానా అవస్థా పడి చివరకు మానేసింది.
    ఆవిడకు చదువు రాకపోతే, మాత్రం ఏమిటీ! చదువుకొని వెలగ బెట్టెదేముంది?
    అద్భుతమయిన తెలివి తేటలతో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో తీసి కొంటె, నీకోచ్చేది మహా అయితే రెండు వందల నలభై! లేక పొతే మూడు వందలు! అంతేనా? అది కూడా, నిశ్చయంగా చెప్పలేం! పోనీ, దొరికిందే అనుకో ఈ రోజుల్లో ఆ డబ్బు ఏ మూలకు? నిత్యావసరాలు గడవటమే గొప్ప! దర్జాగా ఎక్కడి కైనా వెళ్ళటానికి పట్టుమని పది సూట్లుండవు. ఇంటద్ది ఇచ్చుకోవడానికి కళ్ళు పై కోస్తుంటే రిటైరయ్యే నాటికి గాని స్వంతంగా ఇల్లు కట్టుకోలెం! గోచీకి పెద్ద, అంగ వస్త్రానికి చిన్న -- తరతరాలకూ ఇంతే! దేవుడు మన పిల్లలకు తలలో మెదడు పెడితే కనీసం మనలా నైనా బ్రతుకుతారు. లేకుంటే అధోగతే!
    అస్టంటే స్నేహలతదోయ్! తరతరాలకు తరగని ఆస్థి. ఆవిడను ఎవరు చేసుకుంటారో కాని మహా అదృష్టవంతుడులే! ఈనాడు మన సమాజంలో డబ్బుతో సాధించలేనిది ఏముందోయ్! మహారాజులు లేరు! డబ్బు గల వాళ్ళే మహారాజులు. పూర్వపు రోజుల్లో కొంతమంది కాకపోతే, కొంతమందయినా ప్రజాభిప్రాయం గురించి భయపడే వారు. ఈ డబ్బు గల మారాజులకీ అవస్థ కూడా లేదు. స్నేహలత నిన్ను ప్రేమిస్తూన్నట్లు తోస్తుందోయ్! అహా! నిన్నావిడను చేసికోమని కాదు. నీసంగతి నాకు తెలియదూ? నీకేమీ లేకపోయినా తార నిన్ను ప్రేమించింది. నేను తార కేమీ ఇవ్వలేని స్థితిలో ఉన్నానని తెలిసే, నువ్వు తారను ప్రేమించావు. మీరిద్దరూ అదృష్ట వంతులోయ్! ప్రేమ జీవులు! వెధవది , ఈ సోఫాల్లో కుర్చీల్లో పట్టు చీరల్లో, కారుల్లో ఏముందో మరి? ఏదో అద్దె ఇంట్లో ఉంటూ, ఏం తిన్నా, ఏం కట్టుకున్నా ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటె అదే స్వర్గధామమవుతుంది.
    మంత్ర కట్టువేసిన త్రాచు పాము స్థితిలా ఉంది రవి పరిస్థితి. సుందర్రావు ఏదో మాట్లాడుతూనే అన్నాడు. సుందర్రావు కారు అపెవరకూ రవికి ప్రకాశరావు గారిల్లు వచ్చినట్లే తెలియదు.
    అరుంధతి రవిని చూసి హేళన గా నవ్వింది. "ఇంత త్వరగా వచ్చేవేరా? ఆ పిచ్చి పిల్ల నీ కోసం ఇప్పటి వరకూ ఎదురు చూసి ఇప్పుడే వెళ్ళింది."
    రవి అరుంధతి చూపుల నేదుర్కోలేక పోయాడు. సుందర్రావు మాత్రం చాలా ఆశ్చర్యాన్ని ప్రదర్శించాడు.
    "అరె/ అప్పుడే వెళ్ళి పోయిందా? ఆడవాళ్ళకు ఓపిక తక్కువ"
    అరుంధతి సమాధానం చెప్పలేదు. సుందర్రావు రవితో ప్రవర్తిస్తున్న విధానం ఆనాడే తార ద్వారా వింది. సుందర్రావు ను గురించి ఏమనుకోవాలో ఆమె కర్ధం కాలేదు. అకస్మాత్తుగా సుందర్రావుకు రవి మీద ఇంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చింది? కొందరి ప్రేమ కూడా విషమే! రవిని అతని మానాన అతనిని వదలమని సుందర్రావు కు ఎలా చెప్పాలో అర్ధం కాలేదు అరుంధతికి.
    అసలే ఉక్కిరిబిక్కిరి గా ఉన్న రవి మనసు తార వెళ్ళి పోయిందనే సరికి, మరింత గందరగోళమయింది. సుందర్రావు చాలా మంచి వాడు. స్వయంగా రవిని శ్రీధర్ ఇంటి దగ్గిర దిగవిడిచి మరీ తన ఇంటికి వెళ్ళాడు.

                               *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS