10
రాజే ...ఆమె మామగారు వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. ఇంట్లో కాంతం..బాబు ...నేనే మిగిలిపోయాం. లక్ష్మీ ని ఎంత మరిచిపోవాలని ప్రయత్నం చేసినా వీలుపడలేదు. లక్ష్మీ కి ....కాంతానికి ఏ విషయం లోనూ సామ్యం లేదు.
పై ఆలోచనలన్నీ గుర్తుకు వచ్చి జరిగినదంతా కళ్ళకు కట్టినట్లు తోచింది. మనస్సంతా వికలా వికలమై పోయింది. సూర్యకాంతం నన్ను ఈ స్థితికి తీసుకు వచ్చింది. ఇల్లు, వాకిలి, పుట్టి, పెరిగిన ఊరు అన్నీ వదిలి ఈ బస్తీలో జీవచ్చవంలా జీవించే పరిస్థితి ఏర్పడింది యిప్పుడు. ఎవరిని నిందించి ఏం ప్రయోజనం....? అంతా స్వయం కృతాపరాధం ...అయినా నా పిచ్చి గాని విధి ఎంతో బలీయమైనది. దాన్ని అధిగమించడానికి నేనెంతటి వాడిని? ఇంకా ఎన్ని బాధలు పడాలో?
'ఏమండీ! భోజనానికి లేవండీ! చాలా ప్రొద్దు పోయింది.'
'ఈ పూట నేను భోజనం చేయను.... ఆకలిగా లేదు. నీవు భోజనం చేసి వెళ్లి పడుకో! ఈ రాత్రికిక నాకు నిద్ర కూడా పట్టదు ....అంతా నా ఖర్మ....'
'అదేమిటండీ....! భోజనం చేయకుంటే ఎలా డాక్టరు గారు ఏం చెప్పారు? వేళకు భోజనం....నిద్ర చాలా ముఖ్యమని చెప్పలా....! మీరు భోజనం చేయకుండా నేనెలా భోం చేసేది? జరిగినదానికి నా మనసెంతో క్షోభించి పోతూ ఉంది. నన్ను యింకా చిత్రహింస పెట్టకండి....మీకు పుణ్య ముంటుంది.'
'ఈరోజు యిలా మాట్లాడుతున్నావు.... చేసిందంతా నీవు కదే! అనుభవించు...తప్పుతుందా? నీవు ఉరి పోసుకు చచ్చినా నేను ఈ పూట భోజనం చేయను. నా బిడ్డ ప్రసాదు....తిన్నాడో....తినలేదో.... ఎక్కడున్నాడో....ఏమవస్థలు పడుతున్నాడో? ఈ రోజే కాదు ...యికముందు కూడా రోజూ ఒక్కపూటే భోం చేస్తాను. కృంగి.....కృశించి .....మరణిస్తాను. నా నేరాని కదే శిక్ష...'
'మీరలా అంటే నాగతెం కావాలి చెప్పండి? అయినా యిందులో మీ తప్పేముంది? తప్పంతా నాది.... నే చేసుకున్న ఖర్మ....! అనుభవిస్తున్నాను... అనుభవిస్తాను. ఆ బాబుకు అన్యాయం చేసినందుకు...కన్న కొడుకుకు దూరమయ్యాను.'
కంట తడిపెడుతూ కొంగు చాపుకొని పడుకుంది కాంతం....నాకు దానిపై ఏ మాత్రం జాలి కలగలేదు. పైగా చంపెయ్యాలన్నంత కోపం వచ్చింది... మెల్లిగా ఆ కోపాన్ని దిగమ్రింగి నిద్రపోవడానికి ప్రయత్నించాను.... నిద్ర పడుతుందా? ఎలా పడుతుంది ...? నా లక్ష్మీ....నా బిడ్డడు ప్రసాదు.... వారిని గురించిన ఆలోచనలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భోజనం చేయకపోవడం.... నాకు తగిన శిక్షగా భావించాను..ఎప్పుడో తెల్లవారుజామున కళ్ళు మూశాను.... గాడంగా నిద్ర పట్టింది.
* * * *
ఆలోచనలు అతి కావడం వల్ల మళ్ళీ నా ఆరోగ్యం దిగజారింది. ఒకరోజు పడక కుర్చీలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాను. అప్పుడే డాక్టరు గారు నన్ను పరీక్ష చేసి వసారా లోపలికి వెళ్ళారు. కాంతం వారిని అనుసరించింది.
'డాక్టరు గారూ....! పరిస్థితి ఎలా ఉంది....?'
"ఏం చెప్పమంటారు....? వారి ఆరోగ్యం చాలా వరకు కుదుటపడిందని ఎంతగానో సంతోషించాను... మొన్నటి వారం వచ్చి చూసినప్పుడు బాగానే ఉన్నారు... జబ్బు ఈ వారంలో తిరగబెట్టడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. రక్తపోటు మళ్ళీ ఎక్కువైంది. దగ్గు, ఆయాసం కూడా బాగా ఎక్కువగా వస్తూ ఉన్నట్లుంది. మీరు నా వద్ద ఏదో విషయాన్ని దాస్తున్నారు. వారు ఏదో విషయాన్ని గురించి మనసులో ఎంతో బాధపడుతున్నారు. అలా అవుతే నా వైద్యం ఎందుకూ కొరగాదు. రక్తపోటు ఉన్నవారు ఎక్కువగా ఆలోచించ కూడదు. నే చెప్పినట్లుగా ఆహారం, నిద్ర యేవేళకని అమురుతూ ఉన్నాయా?'
'ఏం చెప్పమంటారండీ....? అంతా నా ఖర్మ... వారం రోజుల నుండీ నాపై కోపంతో ఒక పూట భోజనం మానేశారు... ఏవేవో ఆలోచనలతో రాత్రిళ్ళు సరీగా నిద్రపోవడం లేదు... దయచేసి మీరే వారికి నచ్చచెప్పాలి.... నా మాటలు అసలు వారు లెక్క చేయడం లేదు.'
'ఇలా అవుతే నేనిచ్చే మండులింకేం పనిచేస్తాయి? ఈ సంగతి యిందాకే ఎందుకు చెప్పలేదు... వారితో మాట్లాడి ప్రయత్నిస్తాను.' కాంతం తో ఆ మాటలని మళ్ళీ నా దగ్గరకు వచ్చి ప్రక్కనే ఉన్న స్టూలు మీద కూర్చున్నారు. నా ముఖం లోకి జాలిపడుతూ చూస్తూ 'చూడండి రమణయ్య గారూ....! మీ బాధ ఏమిటో నా కర్ధం కావడం లేదు. డాక్టరు గారు మీ శరీరం లో ఉన్న రుగ్మత ను మాత్రం నయం చేయగలను....కాని మీ మానసిక బాధకు వైద్యం చేయలేను.... మీరు మానసికంగా కూడా కృంగి పోతున్నట్లు యిప్పుడే తెలిసింది... మీరు ఎక్కువగా ఆలోచించ కూడదు. మీ మనసులో మెదులుతున్న బాధలను ఆప్తులనుకున్న వారికి చెప్పండి.... కొంత హృదయభారం తగ్గుతుంది. అసలు మీరు మానసికంగా ఎందుకు బాధపడవలసి వచ్చిందో నాకర్ధం కావడం లేదు.... మిమ్మల్ని చూస్తె ఆస్తిపాస్తులు బాగా ఉన్నవారిలా కనుపిస్తున్నారు.... మరే విషయంలో దిగులు పడుతున్నారు...? ఇంత కాలంగా మీకు నేను వైద్యం చేస్తున్నాను.... కాని మీస్వవిషయాలని అడిగి తెలుసుకోవాలనే కాంక్ష నాకు కలగలేదు.... మీరు రాత్రింబవళ్ళు ఆలోచిస్తూ నిద్ర కూడా పోవడం లేదని కాంతమ్మ గారు చెబుతున్నారు.... ఆలోచనలు మీ శరీరానికి మంచివి కావు. సంగతేమిటో తెలుసుకోవాలని కాంక్ష కూడా కలుగుతూ ఉంది.'
'అలాగే డాక్టర్! ఈ బస్తీ లో మిమ్ములను మించిన ఆప్తులు మాకేవరున్నారు? తప్పకుండా చెబుతాను... కాని యిప్పుడు కాదు...ఆ ఓపిక లేదు.'
'సరే...! మీకు వోపిక ఉన్నప్పుడే చెబుదురు గాని ....నాకు మాత్రం మాటివ్వాలి; ఎక్కువగా ఆలోచించననీ, వేళకు భోజనం చేస్తాననీ....'

'భోజనం.....ఎలా భోం చేయాలి డాక్టర్! నిర్దోషియైన కుమారుణ్ణి దూరం చేసుకున్నాను.... కసాయివానిలా ప్రవర్తించి యింటి నుండి తరిమేశాను..... వాడు ఏ స్థితిలో ఉన్నాడో ...కడుపు నిండా తింటున్నాడో లేదో....? పస్తులుండడమే నాకు శిక్ష.... ఇక ఆలోచనలంటారా...? అవి ఎలాగూ తప్పవు...'
'మీ మాటల వల్ల మీరు మీ కుమారుణ్ణి యింటి నుండి తరిమేసినట్లు అర్ధమౌతూ ఉంది.... త్వరపడి , ఆవేశంలో . అనవసరంగా వెళ్ళగొట్టినట్లు మీరు యిప్పుడు బాధ పడుతున్నారు.... అంటే.... మీరు చేసింది తప్పని తెలుసుకున్నారు.... పశ్చాత్తాపమే తుడిచి వేసింది.... మరొక విషయం ....! మీ నుండి దూరమైన అమీ కుమారుణ్ణి చూడాలని మీకుందా....?'
'అదేం మాటండీ....! వాడి కోసరం తహతహ లాడిపోతున్నాను.... ఎక్కడున్నాడో....? ఎన్ని యిబ్బందులు పడుతున్నాడో....? ఉత్త అమాయకుడు... చనిపోయే లోగా వాణ్ణి చూడాలి.... వాడి పట్ల నే చేసిన ద్రోహానికి క్షమాపణ కోరుకోవాలి.... అప్పుడే నిశ్చింత.'
'ఎక్కడున్నాడో తెలుసా మీకు....?'
'తెలియదు ...అది తెలిస్తే లేని దేముంది....?'
'ఈ విధంగా మీరు క్షీణించి పోతూ ఉంటె, ఎంతకాలం జీవించి ఉండగలరు...? చాలా కొద్ది కాలం మాత్రమే! మరి మీ మాటలను బట్టి....జీవించాలని కోరిక ఉన్నట్లు వెల్లడౌతూ ఉంది. మీకు మీ అబ్బాయి కనుపించాలి... అతనిని మీరు క్షమాపణ కోరుకోవాలి.... అందుకై మీరు తప్పకుండా జీవించి ఉండాలి.... ఏమంటారు ....?'
'అవునండి ....! పోరపడ్డాను. నా బాబుని చూడడాని కైనా నేను జీవించి ఉండాలి. తప్పదు. ఈ ఆలోచన నాకు తట్టలేదు. జీవించాలి....జీవిస్తాను. కోన ఊపిరి తోనైనా జీవించి ఉండాలి.... జీవించడానికి సరిపడే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాను.... ఆరోగ్యం కాపాడు కుంటాను. నిజంగా మీరు నా కళ్ళు తెరిపించారు....' అలసటతో కళ్ళు మూశాను. డాక్టరు గారు వెళ్ళిపోతున్న చప్పుడు వినిపించింది.
* * * *
వారం పది రోజులు గడిచి పోయాయి. ఆలోచనలు తగ్గించుకున్నాను. ఆహారం సవ్యంగా తీసుకుంటున్నాను. ఆరోగ్యం మళ్ళీ కొద్దిగా కుదుట పడినట్లనిపించింది. భోజనం చేసి విశ్రాంతి గా పేపరు చదువుతూ కూర్చున్నాను, 'సరిహద్దు ప్రాంతాలలో మన డాక్టర్ల కృషి' అనే శీర్షిక క్రింద ఒక పూర్తికాలం అచ్చు కాబడి ఉంది. అదంతా చదివాను.... దీర్ఘంగా నిట్టుర్చాను. ప్రసాదును డాక్టరు గా చేస్తానని లక్ష్మీ కి చేసిన వాగ్దానం గుర్తుకు వచ్చింది.... బాధ పడ్డాను. 'లక్ష్మీ.... నేను నీకిచ్చిన మాట నిలబెట్టు కోలేక పోయాను. నన్ను మన్నించవూ... నా మాటలు వినకుండా రెండవ పెళ్ళికి బలవంతం చేశావు. దాని ఫలితం చూడు... కాంతం కారణంగా నీకిచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టు కోలేక పోయాను....' మళ్ళీ నా ఆలోచనలు గతంలోకి పరుగెత్తాయి.
రాజీ ఆ యింటి నుండి వెళ్ళిపోయిన తర్వాత సంసార బాధ్యతలన్నీ కాంతం పై పడ్డాయి. బాబుని ప్రేమగానే చూసుకుంటూ ఉండేది. ఆ విషయంలో నాకు ఎటువంటి అనుమానమూ కలుగలేదు. బాబు విషయంలో కాంతం ప్రవర్తనను ఆమె లేని సమయాలలో పనిమనుషులను, జీతగాళ్ళను అడిగి తెలుసుకొని, తృప్తి కరమైన సమాధానాలను పొందుతూ ఉండడం వలన నిశ్చింతగా గడపసాగాను. సంతోష పడ్డాను. కూడా! కాంతం లక్ష్మీ లా నన్ను సుఖ పెట్టలేక పోయినా బాబుని ఆప్యాయంగా చూస్తె చాలనీ, ఆ ఆప్యాయత బాబుపై చిరకాలం అలాగే ఉండేలా చేయవలసిందనీ, భగవంతుడిని ప్రార్ధిస్తూ ఉండేవాడిని.
ఒకసారి బాబును చూసిపోవాలనే ఉద్దేశ్యంతో రాజీ మా యింటికి వచ్చింది. ఆ విధంగా రెండు మూడు నెలల కొకసారి వస్తూ ఉండేది. ఆమె వచ్చిన వారం రోజులలోనే కాంతం గర్భిణీ అన్న విషయం నాకు తెలిసింది... నాలో మరొక సమస్య తలెత్తింది. ...కాంతానికి పిల్లలు కలిగితే బాబుని సరీగా చూస్తుందా...? ఏమో....? అంతా ఆ ఏడుకొండల వాడి దయ....భారమంతా అతని పై వేశాను.
కాంతం కూడా మగపిల్లవాడినే ప్రసవించింది... భారసాలకు కాంతం తలిదండ్రులు, రాజీ...తదితర ముఖ్య బంధువులు వచ్చారు. బారసాల ముగిసిన తర్వాత అంతా వెళ్ళిపోయారు. కాంతం చంటిపిల్ల తల్లి కాబట్టి బలవంతం చేసి రాజీ ని ఒకటి రెండు మాసాలు యింట్లో ఉంచుకున్నాను. ఆమె వెళ్ళిపోయేటప్పుడు 'అన్నయ్యా! బాబును జాగ్రత్తగా చూసుకో! మునుపటి లా ఓదిన పై నమ్మకం పెట్టుకోకు..... యిప్పుడామే పరిస్థితి గోడమీది పిల్లి వాటం లా ఉంటుంది. ...అనుభవం మీద చెబుతున్నాను. ప్రసాద్ ను ఒకటికి రెండు సార్లు కసిరించి పారవేయడం , అనవసరంగా వాడి చెవులు మెలి వేయడం గమనించాను. నేను కనపడే సరికి మాట మార్చి ఎక్కడ లేని ప్రేమ కనబర్చింది వాడి పై ...ఏమో అన్నయ్యా....! లక్ష్మీ వదిన గుర్తుకు వచ్చినప్పుడల్లా బాబు పరిస్థితి వాడి.. భవిష్యత్తు ఏమౌతుందోనన్న భయం నన్ను పీడిస్తూ ఉంటుంది.
'ఒక్క విషయం నీకు నొక్కి చెబుతున్నాను....వాడు మీకు బరువని తోచినప్పుడు నేను వచ్చి తీసుకు వెడతాను.... వాణ్ణి మాత్రం అన్యాయం చేయవద్దు. ఇలా అంటున్నందుకు నన్ను అపార్ధం చేసుకోవద్దు.... నేను లక్ష్మీ వదినకు మాట ఇచ్చాను.'
'అదేమిటమ్మా అటువంటి పరిస్థితి రానిస్తానా....?'
'అలాగవుతే బెంగే లేదు.'
నాకు యిప్పుడు అర్ధమౌతూ ఉంది. కాంతం ఎంత చాకచక్యంగా నటించి ప్రసాద్ ను నాచేత వెళ్ళగొట్టించిందో....? నేను యింట్లో ఉన్నప్పుడు నాపై అభిమానం గల వ్యక్తుల ముందు ప్రసాదు పై ఎంతో ప్రేమ ఉన్నట్లు నటించేది.... మనసులో బాబును ద్వేషించేదేమో? అనుమాన మెందుకు....? ద్వేషించింది .... ఆ తియ్యటి మాటలు....ఆ పొగడ్తలు. చిన్నవాడు సూర్యాన్ని దెప్పుతూ.... తిడుతూ ....నా ముందు ప్రసాదు ను పొగుడుతూ ఉండేది.
