Previous Page Next Page 
అపశ్రుతులు పేజి 20


    "కులం, గిలం, పేరూ ఊరూ!"
    "పేరు రాధ మిగతావన్నీ మనవే..."
    "చదువుతూందా?"
    "పోర్తు ఫామ్..... చదువుతూంది"
    "ఆ అమ్మాయి కెవ్వరూ లేరా?"
    "మేమంతా ఏమయ్యాం?"
    "సరిగా చెప్పవోయ్. ఆమె బంధువుల్లాటి వాళ్ళు"    
    "లేరు."
    ఆ రోజుకంతే రాధ గురించి సంభాషణ.

                                     *    *    *

    "రాధా.....రెండు కప్పుల కాఫీ......రామకృష్ణకీ, నాకూ. వాసూరావ్ గొంతువిన్న రాధ. "తెస్తున్నా వాసూ!" అంది. ఆ గొంతు రామకృష్ణ చెవుల్లో వీణలు మీటినట్టు మృదుమధురంగా మ్రోగింది. డోర్ కర్టెనువైపు చూస్తున్నాడా అమ్మాయి రాకకోసం.
    కాఫీ కప్పులుంచి, వెళ్ళబోతూన్న రాదను "రా కూర్చో. ఇవ్వాళ స్కూలెగ్గొట్టావేం?"... అడిగాడు నవ్వుతూ రావ్.
    "తర్వాత చెప్తాలే అంటూ లేవబోతున్న రాధ చెయ్యి పట్టుకుంటూ. ఏదో పాఠమో, లెక్కో రాలేదు టీచర్ తిడుతుందని అవునా!" అన్నాడు గలగల నవ్వి వాసూరావ్.
    తానూ నవ్వుతూ "అవును. ఎంతచేసినా లెక్కకు ఆన్సరు రాలేదు. ఓసారి చెప్పవా?" అంది.
    నవ్వే ఆ అమ్మాయివైపు చూసిన రామకృష్ణ ఈ పిల్ల పలువరుస ఎంత అందంగా ఉంది?" కళ్ళెంత బాగున్నాయి అనుకున్నాడు పరవశంగా.
    "చంపేశావ్ కృష్ణా నీ కొచ్చునా? ఫోర్తు ఫారమ్ లెక్కలు? అన్నాడు వాసూరావ్.
    అందరూ గలగలా ఒక్కసారి నవ్వుకున్నారు. "తీసుకురా రాధా. చేస్తాను అన్నాడు రామకృష్ణ.
    "నువ్వు చెప్పరాదూ?" అన్నట్టు ఇబ్బందిగా వాసూరావ్ వైపు చూసింది రాధ.
    "ఊ తీసుకురా వాడు చెప్తాడు. అన్నాడు వాసూరావ్.
    నీలంపూల పరికిణీ నల్లని జాకెట్టూ నల్లని నొక్కునొక్కుల పొడవాటి జడా. మెరిసేకళ్ళూ ఎత్తైన నాసికా నిగనిగలాడే బుగ్గలూ, చెవులపై అందంగా జుట్టుజారి. చెవులరింగులు కదుల్తూ ఉంటే రామకృష్ణవైపు బిడియంగా చూస్తూ "నమస్తే..." అంది రాధ నోట్ బుక్కూ లెక్కల టెకష్టూ, పేనూ టేబిలు మీదుంచుతూ.
    నమస్తే అన్నట్టు చెయ్యి కొంచెం ఎత్తిదించి పుస్తకం, పెన్నూ చేతిలోకి తీసుకున్నాడు రామకృష్ణ.
    తలవంచి లెక్క చేస్తున్న అతనివైపు పరిశీలనగా చూసిన ఆమె హృదయం ఏదో తియ్యని సంచలనం "అబ్బా ఎంత అందంగా ఎలా ఉన్నాడు రామకృష్ణ?' అనుకున్న ఆ పిల్ల సిగ్గు పడింది ఎందుకో."
    అరగంటయినా, ఇంకా ఆన్సరు రాక చికాకు పడే రామకృష్ణ వైపు చూసి.... 'నే నెందుకు చెప్పనన్నాను? ఆన్సరు లేనిలెక్కలే రాధ తెస్తుంది.
    'ఛ ఫో అన్నీ హాస్యాలు. లెక్కకు ఆన్సరెందుకుండదు? నీకు చేతకాదు అను' అంటూ నవ్వుతూంది రాధ.
    'ప్చ్ ఆన్సరు తప్పుగా అచ్చయింది.....నేను రైటు చేశాను. ఆన్సరిది. కావాలంటే మీ టీచర్నడుగు. రేపు మళ్ళీ నేను వచ్చినప్పుడు నాకు రిజల్ట్సు చెప్పు. నేను వేసిన ఆన్సరు రైటవునోకాదో!' నోట్ బుక్ రాధ ముందుకి తోశాడు రామకృష్ణ.    
    'నిన్న మా క్లాసందరినీ తిట్టిందండీ టీచరు. ఆన్సరు ఎవ్వరికీ రాలేదని...'
    "ఆమెకూ రాదు ఆన్సరు. అందుకనే తిట్టింది' అంటూ పకపకా నవ్వాడు వాసూరావ్.    
    ఇంతలో పార్వతి అక్కడి కొచ్చింది. వినయంగా లేచి నిల్చుని నమస్కారం పెట్టాడు రామకృష్ణ.
    పార్కులో ఒక ఫ్రెండు దొరికాడని చెప్పావో సారి అమ్మా గుర్తుందా, రామకృష్ణ అని..." అంటూ పరిచయం చేశాడు వాసూరావ్.
    "ఓసి మొద్దూ అతన్నీ పాఠం చెప్పమంటున్నావ్..... మా రాధకి క్రొత్తా బిడియం ఏం తెలియదు. ఇంకా చిన్నపిల్ల తీరే" అంటూ చిన్నగా నవ్వింది పార్వతి. రామకృష్ణవైపు చూస్తూ "కక్కీ నువ్వు చెయ్యి నా లెక్కా....." గారంగా అంది రాధ.
    పకపకా వాసూరావ్. చిన్నగా రామకృష్ణా ఇద్దరూ నవ్వారు.

                                   *    *    *

    "గుడ్ మార్నింగండీ.... మీరు అన్నట్టు" ఆన్సరు తప్పుగా అచ్చయింది" అంది.హాల్లోకి వస్తూన్న రామకృష్ణకి ఎదురుగా వస్తూ రాధ.
    "మీ అన్నయ్య.....వాసు ఉన్నాడా" అడిగాడు రామకృష్ణ.
    "ఇంకా ఇంటికి రాలేదు. కూర్చోండి. కాఫీ తెస్తాను."
    "కాఫీ వద్దు. నే నేసిన ఆన్సరు రైటేనా?" అడిగాడు రామకృష్ణ.
    చెప్తా కూర్చోండి అంటూ లోపలికి వెళ్ళి ఐదు నిమిషాల్లో మళ్ళీ కాఫీకప్పుతో వచ్చింది రాధ.
    "ఎందుకు తెచ్చావ్ వద్దన్నానుగా!......అయితే నువ్వూ కొంచం తీసుకో" ప్లేట్లో కొంచెం కాఫీ పోసి చొరవగా ఆమె చేతికందించాడు రామకృష్ణ.
    కాఫీకప్పు టేబిలుమీద పెడ్తూ "ఏమన్నారు మీ టీచరు?" అని అడిగాడు......."చెప్పాను" అంది.
    "ఏమని చెప్పావ్?" చిలిపిగా ఆ పిల్ల వైపతను చూస్తున్నాడు. అతన్ని చూస్తుంటే, ఆమెకేదో బిడియంగా ఉంది.
    "మా వాసు ఫ్రెండ్. రామకృష్ణ లెక్క చేశారని చెప్పాను."
    "ఊ..... ఏమన్నారు?"
    "ఆన్సరు తప్పుగా అచ్చయింది, మీరు వేసిన ఆన్సరు రైటు అని అన్నారు."
    "ఇంకేమైనా......అంటే....లెక్కలు చెప్పమన్నావా?"
    "మీరు చెప్తారా?" అప్రయత్నంగా ప్రశ్నించింది అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ
    "ఏం? నేను ఎమ్ ఎ ఫస్టు క్లాసులో ప్యాసయి నాలుగు వందల రూపాయలు జీతం వచ్చే ఉద్యోగం చేస్తున్నాను చెప్పలేనా?"
    "అబ్బే అది కాదండి మీకు తీరికుంటుందా!" అని నవ్వబోయింది రాధ.
    ఇంగ్లీషు టెక్ ష్టు తెచ్చుకు అతని ఎదురుగా కూర్చుంది రాధ. క్షణంలో ఇంట్లోకెళ్ళివచ్చి.

                                    *    *    *

    ప్రతిరోజూ చదువు కి వున్నట్టో కబుర్లు చెప్తూ నట్టో, ఆమె అందాన్ని చూస్తూనే కొంతకాలం రాధతో గడచిపోయేది. ఓ రోజు అతని బామ్మకు సుస్తీగా ఉందని ఇంటిదగ్గర నుంచి ఉత్తరం వస్తే వెళ్ళిపోయాడు రామకృష్ణ.
    గార్డెన్ లో గులాబిచెట్ల మధ్య పచార్లు చేస్తూంది రాధ.
    గేటు తెరచి లోపలికి వస్తూన్న రామకృష్ణ చూపు ఆశ్చర్యంగా అలా కొన్ని క్షణాలు రాధపై నిలిచిపోయాయి. తానువెళ్ళి ఆరునెలలై పోయింది ఆ ఉద్యోగం ఊష్టింగవడం మరొక కంపెనీలో ఉద్యోగం కోసం మళ్ళీ ఈ ఊరురావడం జరిగింది.
    ఉదయమే ట్రెయిను దిగాడు. వాసు ఉత్తరాల్లో రాధగురించి మామూలుగానే వ్రాస్తున్నాడే......తన వెర్రిగాని. కాస్త ఎదిగిందని యౌవనాన్ని పుంజుకు అందాన్ని ద్విగుణీ కృతం చేసుకుందనీ. అందంగా పల్లెబాటు వేసుకుంటూందనీ ఉత్తరాల్లో వ్రాస్తాడా? ఆమెను చూస్తుంటే అతని కేదో పరవశంగా మత్తుగా ఉంది.
    "రాధా!" పిల్చాడు.
    "మీరా! అబ్బ ఎన్నాళ్ళకి వచ్చారు, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారండీ." సన్నని గొంతుతో, సంతోషమంతా కళ్ళల్లో వ్యక్తమవుతూంటే చిన్నగానవ్వుతూ అంది రాధ అతని వైపు నడుస్తూ.
    దగ్గరవుతూన్న ఆమెవైపు విస్పారిత నేత్రాలతో చూశాడు రామకృష్ణ. "ఎవ్వరూ లేని ఈమెను ఉదారంగా శ్రీనివాసయ్యరు ఎలా పోషించి బాధ్యత వహిస్తున్నారు? తాను ఈమెను వివాహం చేసుకుంటే! అనుకున్న క్షణంలో తల్లీ తండ్రీ మేనమామా, మిగతా అందరూ చెప్పేసంబంధాలూ, కట్నాలూ గుర్తొచ్చాయి. "ఛ కాదు. ఎది ఏమయినా, ఏనాటికైనా అందర్నీ ఎదిరించి. ఏ అవాంతరాలొచ్సినా ఆమెకు సమ్మతమైతే తప్పకుండా దైవసాక్షిగా రాధను వాదాన్ని చేసుకుంటాను. అనుకున్న రామకృష్ణ బరువుగా నిట్టూర్చాడు.
    అలా మౌనంగా తనవైపే చూస్తున్న రామకృష్ణవైపు చూసిన ఆమె కళ్ళు చలించాయి చిన్నగా "ఏమిటలా చూస్తున్నాడితను? తను పల్లెబాటు వేసుకుందని కాబోలు అనుకున్న క్షణంలో పవిట సర్దుకు సిగ్గుగా తల వాల్చింది రాధ.
    వాసు ఇంట్లో ఉన్నాడా? అడిగాడు రామకృష్ణ.
    లోపల ఉన్నాడు రండి.....ఆ నేను ప్యాసయ్యాను అంది రాధ గబగబా వరండా మెట్లెక్కుతూ.
    చాలాకాలం తర్వాత కలిసిన మిత్రులు చాలా సేపు కబుర్లు చెప్పుకున్నారు. శ్రోతగా మిగిలి పోయింది రాధ.
    వెళ్ళూ 'ప్యాసయ్యావుగా ఇదిగో ప్రజంటేషన్ అంటూ జేబులోంచి పెన్ తీసి ఇవ్వబోయాడు రామకృష్ణ రాధకు.
    సంకోచంగా వాసూరావు వైపు చూసింది రాధ.
    "అంత ఖరీదైన పెన్ను దానికెందుకు రా పారేస్తుంది" అన్నాడు వాసూరావు.
    "నేను ఎంతో ప్రేమతో బహూకరించిన పెన్ను వద్దంటున్నావా? రాధా? చిరునవ్వుతో ఆమె వైపు చూస్తూ అన్నాడు రామకృష్ణ.
    "ప్రతిరోజూ పెన్నులు పారేసుకుంటూన్నట్టు ఎలా చెప్పాడు కబుర్లు. ఇయ్యండీ..... భద్రంగా నా పెట్లోదాచుకుంటాను, అంటూ రామకృష్ణ చేతిలో పెన్ను లాక్కున్నట్టు తీసుకుంది రాధ.
    సిగ్గుపడ్తూనే, చనువుచూపిస్తున్న రాధవైపు చోశాడు రామకృష్ణ కొంటెగా నవ్వుతూ.
    క్రమంగా రామకృష్ణ మరొక వీధిలో వేరుగది తీస్కుని ఉంటున్నా శ్రీనివాసయ్యరింట్లో వారి కుటుంబంలో ఒక వ్యక్తిగా కలసిపోయాడు. ముభావంగా ఎవ్వరితోనూ అట్టే మాటాడకుండా సీరియస్ గా ఉండిపోయే విశ్వనాధన్ కూడా రామకృష్ణతో అప్పుడప్పుడు నవ్వుతూ మాట్లాడేవాడు,
    పార్వతి ఆప్యాయంగా తమ్ముడూ అనిపిల్చేది. తరుచు వారింట్లో రామకృష్ణని భోజనాన్కి ఉంచేసేవారు.
    ఓ రోజు అతని అన్నంలో వెయ్యివేస్తూ 'ఏం తమ్ముడూ అమ్మానాన్నా ఇంకా నిన్ను పెళ్ళి కొడుకుని చెయ్యాలనుకోవటంలేదా?" అని అడిగింది పార్వతి నవ్వుతూ.
    "ఇంటికెళ్ళడమంటే అదే బెంగండీ పెళ్ళి చూపులకు రమ్మని పెళ్ళి చేసుకోమనీ ఒకటే గొడవ. అందుకే రెండేళ్ళయి వెళ్ళడం మానేశాను" అన్నాడు రామకృష్ణ.
    అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళూ, వాళ్ళ కుటుంబం గురించి క్లుప్తంగా ప్రశ్నించింది పార్వతి. చెప్పాడు రామకృష్ణ.
    "మా రాధను చేసుకుంటావా? కృష్ణా మీ నాన్నగారెంత కోరితే అంత కట్నమిస్తాను" అంది పార్వతి నెమ్మదిగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS