ముందు ముందు అవసరాల మాట ఎలా వున్నా, అప్పటికప్పుడు డబ్బు కావలసిన అవసరమే ఉంది నీరజకు__నారాయణరావుగారి ఫీజు చెల్లించాలి... ఆ డబ్బు తీసుకుంది.
"బాగా పొద్దుబోయింది పద! నిన్ను మీ ఇంటిదగ్గర దింపి వస్తాను" అన్నాడు రమణ్ లాల్.
రాత్రి రెండుగంటలకు రమణ్ లాల్ కారులోంచి దిగిన నీరజను పైనుండి క్రిందకు కాల్చేసేలా చూసింది లక్ష్మీదేవి.
లక్ష్మీదేవికి సమస్తమూ చెప్పాలనుకునే వచ్చింది నీరజ...కానీ ఆ చూపులతో నీరజ నోరు మూతబడిపోయింది.
ప్రభు మనసుకు చాలా ఆహ్లాదంగా ఉంది. అతడు ఇంకా హాస్పిటల్ లోనే ఉన్నాడు కాని లేచి అటూ ఇటూ తిరుగుతున్నాడు.
ఎక్కడికీ కదలకుండా ప్రభు దగ్గరే ఉండిపోవాలని ఉంది నీరజకి...కానీ రమణ్ లాల్ ఇంటికి వెళ్ళవలసిన సమయం దగ్గరపడుతోంది.
"నిన్ను ఇంకొక్క వారంరోజుల్లో డిశ్చార్జ్ చేస్తానన్నారు డాక్టర్ గారు."
"అవును! ఆ తరవాత ఇంక గుండెనొప్పి రాదనికూడా అన్నారు...నీరజా! ఒక రహస్యం చెప్పెయ్యనా? నిన్ను మా యింటికి తీసుకురాగానే పెళ్ళిచేసుకోవాలని అనుకున్నాను కానీ, ఈ గుండెనొప్పికి భయపడి అందుకు సాహసించలేకపోయాను...ఏమో! ఏది ఎలా జరుగుతుందో?"
"ప్రభూ!..." ఆశ్చర్యపోయింది నీరజ, రోషంగా అంది.
"ఒకవేళ గుండెనొప్పి తగ్గలేదనే అనుకుందాం! నేను నిన్ను వదిలి వెళ్ళగలనని అనుకున్నావా?"
"అనుకోలేదు_అందుకనే నా ఆలోచన నీకు చెప్పలేదు." ఉల్లాసంగా నవ్వాడు ప్రభు.
"ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళగానే పెళ్ళిచేసుకుందాం ... హాయిగా నిశ్చింతగా బ్రతుకుదాం."
అనురాగంతో ప్రభు జుట్టులోకి చెయ్యి పోనిచ్చి దువ్వింది నీరజ.
నీలకాంత్ సకిలించటంతో నీరజ ఉలిక్కిపడి దూరంగా జరిగింది.
ఆ సమయంలో నీలకాంత్ రాకకు ప్రభు ఏమంత సంతోషాన్ని కలిగించలేదు.
"హలో!" అన్నాడు పొడిగా.
"సారీ! రాకూడని సమయంలో వచ్చినట్లుగా ఉన్నాను-నేను ఇంకొక అరగంటలో బొంబాయి వెళ్తున్నాను ప్రభూ! పదిరోజులవరకు రాను-అందుకే నిన్ను చూడటానికి వచ్చాను!"
"వెళ్ళిపోతున్నావా?" ఆందోళనగా అన్నాడు ప్రభు.
"అవును, ఏం?"
ప్రభు వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. అంతకు నాలుగురోజుల క్రిందట ప్రభు డాక్టర్ తో తన ఆరోగ్యం గురించి మాట్లాడాడు.
"యు ఆర్ ఫర్ఫెక్ట్ లీ ఆల్ రైట్! మీకీ జబ్బు ఇంక జన్మలో రాదు..." అన్నాడు నారాయణరావు.
"బిల్ ఎంతయింది డాక్టర్?"
"ఆఫీస్ లో కనుక్కోండి-ఎకౌంట్స్ వేసి ఉంచుతారు."
ఆరోజే ఆఫీస్ లో కనుక్కున్నాడు ప్రభు-వెయ్యి రూపాయలపైన ఉంది... ఇంత డబ్బు నీరజ ఎలా తీర్చగలదు?
మళ్ళీ నీలకాంత్ నే అడగాలని అనుకున్నాడు-నీరజ ఎదురుగా నీలకాంత్ ను అడగటం ఇష్టంలేదు-కానీ, వ్యవధానం లేదు.
"నీలకాంత్? ఇప్పటికే నీకు చాలా ఋణపడి ఉన్నాను-మరో వెయ్యి అప్పుద్గా ఇయ్యగలవా? ఇదంతా వీలైనంత త్వరలో తీర్చుకుంటాను."
ఉలిక్కిపడింది నీరజ-విస్తుపోయి చూశాడు నీలకాంత్.
"నీకు సహాయం చెయ్యటానికి ఎప్పుడూ సిద్ధమే కానీ, ఎందుకు నీకు డబ్బు?"
"డాక్టర్ బిల్ ఇయ్యాలి."
"అది నీరజ ఇచ్చేసిందిగా."
"నీరజ ఇచ్చిందా?"
"పిచ్చివాడా! నీరజ ఉండగా నీకేం లోటు? నీరజ నీకోసం ఎంత త్యాగమన్నా చెయ్యగలదు ... తన శరీరాన్ని అమ్ముకుని అయినా నీకు ఖరీదైన హాస్పిటల్స్ లో వైద్యం చేయించగలదు."
"షటప్!" నీలకాంత్ చెంప పగిలిపోయేలాగ కొట్టాడు ప్రభు.
అప్పుడే వచ్చిన లక్ష్మీదేవి ఆశ్చర్యంగా "ప్రభూ?" అంది.
అంత దెబ్బ తగిలినా నీలకాంత్ కష్టపెట్టుకోలేదు. కోపం తెచ్చుకోలేదు. చిరునవ్వుతోనే ఉన్నాడు.
"సారీ ప్రభూ! నీకు తెలుసుననే అనుకున్నాను...ఇదివరకు దొంగల చేతుల్లోపడి తరిగివచ్చినా ఎలా సహించావో...ఇప్పుడు అలాగే అంతా అర్థం చేసుకుని ఊరుకున్నావనుకున్నాను_అయినా అమ్మగారికి అంతా తెలుసునే! నీకు తెలియకుండా ఎలా ఉంది?" ప్రభు తల్లి ముఖంలోకి చూశాడు.
ఆనాడు రమణ్ లాల్ కారులోంచి రాత్రి రెండు గంటలకు ఫ్రాక్ తో దిగుతోన్న నీరజ స్వరూపం లక్ష్మీదేవి కళ్ళముందు కదిలింది. కంపరంతో శరీరం జలదరించగా తల వంచుకుంది.
నీలకాంత్ కనీ కనిపించకుండా నవ్వాడు.
"ప్రభూ! టేకిటీజీ! పాపం నీరజ నీకోసమేగా ఇంత చేసింది?... నీ ఆరోగ్యం కోసం...నువ్వు సుఖపడాలని."
"షటప్! షటప్!" అరిచాడు ప్రభు.
నీలకాంత్ మాట్లాడలేదు.
నీరజ శిలలా అలానే కూర్చుంది_ప్రభులో సహనం నశించిపోసాగింది_దెబ్బతిన్న పిట్టలా ఆర్త స్వరంతో "నీరజా! ఎందుకు చేశావు ఇలాంటి పని?" అన్నాడు.
ఏం సమాధానం చెప్పాలి? ఏ ప్రాంతాలకు పారిపోయినా ఈ నీలకాంత్ తనను వదులుతాడా? ఈ శాపం నుండి తనకు విముక్తి లేదు_తెలిసి తెలిసి తనతోపాటు ప్రభును కూడా ఈ సుడిగుండాలలోకి లాగటం తనకు న్యాయమేనా? అంత స్వార్థమా తనకు! ప్రభులాంటి అమృతమూర్తికి తను అందించే ప్రేమ విలువ అంతమాత్రమేనా?
నీరజ మాట్లాడకుండా అలానే కూర్చుంది.
"ఛీ! ఛీ! ఇంతకంటే నేను గుండెనొప్పితో చచ్చిపోయినా ఆనందించేవాడిని."
నీరజ లేచి నించుని "వెళ్తాను..." అంది.
"వెళ్ళు! మళ్ళీ ఎన్నడు ఇక్కడికి...నా దరిదాపులకి తిరిగి రాకు"
నీరజ ముందుకు కదిలింది.
"వెళ్ళగలుగుతున్నావా?" కోపంగా అన్నాడు ప్రభు.
