Previous Page Next Page 
ఆదివిష్ణు కథలు పేజి 21


    "ఆయన్నెందుకురా ఇబ్బంది పెడతావ్. మీరు వెళ్ళి రండి మాస్టారూ! థేంక్స్ గుడ్ నైట్."
    అంతా క్షణంలో జరిగిపోయింది. మా రిక్షాలు కదిలాయి. శ్రీనివాసరావు ఒక్కడూ గేటు దగ్గర నుంచుని పోవడం బాధ కలిగించింది నాకు. అదే రాముడితోనూ అన్నాను. 'దాన్ని వాడు చాలా తేలిగ్గా తీసుకుని శ్రీనివాసరావు గురించి యిలా అన్నాను.
    "మంచివాడితోనే బోణి అయ్యింది నీకు. ఇకముందతన్తో కలిసి తిరగడం మానుకో. కనిపించినా తప్పించుకు తిరుగు."
    "ఏం?"
    "సివిలిజేషన్ తెలీని ఫూల్"
    అదిరిపడ్డాను. రాముడు కొత్త సిగరెట్టు ముట్టించి మాట మార్చి అన్నాడు.
    "ఇక్కడ అన్ని సుఖాలూ ఉన్నాయి. కొంచెం అలవాటుపడితే జన్మకిక ఈ వూరొదిలి పెట్టి ఉండనని కూర్చుంటావ్."
    ఇక్కడెన్ని సుఖాలున్నాయో, ఆ రాత్రి రాముడి గదిలో రాముడు కొనుక్కున్న సుఖం చూచి ఖంగారు పడిపోయాను. మేము పడుకునేముందు సూటుకేసులోంచి 'సీసా' తీశాడు. దాని ఖరీదు పదహారు రూపాయల చిల్లరని చెప్పేడు. గట్టిగా ఉపయోగిస్తే వోరోజు సరదా అని అన్నాడు. రెండు గ్లాసుల్లో పోసి వో గ్లాసు నా ముందు పెట్టాడు.
    ఆపళంగా పక్కమీంచి లేచి డాబాదిగి నడిరోడ్డుమీద నించుని గట్టిగా కేకపెడదామనిపించింది. నా ఖంగారు చూచి వాడు నవ్వేశాడు.
    "మరేం లేదు. మొదట్లో....." యేదో చెప్పబోయేడు.
    "నాన్ సెన్స్ - ఇదిట్రా నీ సివిలిజేషను?" గట్టిగా అరిచేను.
    వాడు నా నోటిని తన చేత్తో మూసి కొంచెం సేపు మాటాడేడు నెమ్మదిగా. నా ఒక్కడికే వినిపించేలా.
    "ఉదయం పూట అంబలి తాగడమే సివిలిజేషననుకున్న నీబోటివాడికి దీని ఘనత తెలీదు. దొరలు తాగేమందిది సివిలిజేషన్ దొరలకి తెలిసినంతగా నీకు తెలీదు. నీతీ, జాతీ సాంప్రదాయమూ చట్టుబండలూ అనే పరిమితమైన ప్రపంచంలో పుట్టి పెరిగిన నీకిది సివిలేజషన్ కాదంటే ఆశ్చర్యపడన్నేను టేకిట్ యీజీ! నువ్వు గూడా కొంచెం సిప్ చేస్తే సంతోషిస్తాను లేదూ- నీయెదట పెరిగిపోతున్న నన్ను చూచి ఆశ్చర్యపోతూండు. నీ ఖర్మ నీది."
    భాగ్యనగరాన్ని దూషించేటంత చాతుర్యం నాకు లేదు. నా కన్నుని నేను పొడుచుకునేమ్త సత్తాగూడా లేదు. నాకు పరిచయమైన మహానగరంలో నా చిన్ననాటి మిత్రుడింతగా మారిపోయినందుకు ఆశ్చర్యంగా వుంది.
    రాముడి గురించి నాకు బాగా తెలుసు. వాడు ఇంటి దగ్గర నల్లిలా బ్రతికిన భయస్థుడు మా వూళ్ళో యేవైనా సాహసాలు చేశామని చెప్పుకుంటే అది నాలాటి కొందరు చెప్తే చెల్లుబడి అవుతుంది. తండ్రి చాటు పిల్లవాడు రాముడు. ఇంట్లో పెద్దన్నయ్య మొదలు విధవప్పవరకూ వాళ్ళ వలల ఆంక్షల మధ్య పెరిగిన ఘనుడు రాముడు. ఇంట్లో చెప్పకుండా వాళ్ళందరి అనుమతి లేనిదే కేవలం తెలుగుసినిమా కెళ్ళలేని దౌర్భాగ్యమే క్వాలిఫికేషన్ కాగల రాముడు ఈ భాగ్యనగరంలో యింత ప్రముఖుడై వెలిగిపోతున్నాడంటే నాకు ఆశ్చర్యం గాదు?
    ఈ వూళ్ళో వాడికి రెండున్నర వందల జీతమొస్తుంది. ఖర్చు పెట్టుకోవడానికి వందలైనా చాలని ఈ వూళ్ళో ఇరవై తారీకునుంచి జీతం కోసం ఎదురుచూచే రాముడు ఇంటిదగ్గర తన జాతకాన్ని మరిచిపోతున్నాడు.
    మొదటి వారంరోజులూ బెంగగా గడిచేయి. మళ్ళా మా వూరికి బదిలీకోసం ప్రయత్నించేను. ఫలించే సూచనలు కన్పించకపోగా నాకున్న 'ఇంటిబెంగ'ని యాగీ చేసిన క్షణాలు భరించలేకపోయాను. చివరికి వో మొండిధైర్యం కలుగుతున్నట్టు పసిగట్టగలిగాను.
    రాముడు గదిలోనే కాలం గడుస్తోంది. మనిషిని ఉత్తేజపరిచే 'మందు'ల్లోని వివిధరకాలూ రాముడు చవిచూస్తూంటే కళ్ళప్పగించే నేను వోనాటి రాత్రి నన్ను నేను 'అదుపు'లో పెట్టుకోలేకపోయాను. వాడు ఆనందం అనుభవిస్తోండగా నోరు తెరుచుక అడిగాను.
    "ఒరే కొంచెం నాకూ పోయరా! తాగాలని వుంది."
    వాడు పక పకా నవ్వేశాడు. గ్లాసులో కొంచెం పోసి నా భుజం తట్టుతూ అన్నాడు.
    "కళ్ళు తెరిచిన పసికూనా! రంగుల ప్రపంచాన్ని నీ సొంతం చేసుకోయిక. గుడ్ లక్."
    తాగేను. గుండెల్లో మంటగా వున్నా. మరో తడవ గ్లాసులో పోసుకుని తాగాను. తాగి హోల్డాలు మీద నడుం వాల్చేను. నా వ్రేళ్ళమధ్య సిగరెట్టుంచాడు రాముడు.
    ఉదయానికి కొండని మింగేంత ఆకలి వేసింది. ఆరోజు లగాయితు రాముడు చెప్పిన రంగుల ప్రపంచంలో నడవడం ప్రారంభించేను. నవోత్సాహాన్ని సంపాయించుకుంటున్నాను. కొన్నాళ్ళకి గమనించింది. ఈ నగరం వచ్చిన క్షణం దిగులుతో చచ్చేను. ఇప్పుడలా లేదు. లక్షల జనాభాని భరిస్తోన్న ఈ నగరానికి నేనూ వో పౌరుడినయ్యాను. మా వూరూ, మా రోడ్లూ ఒక్కొక్కటే మరువగలుగుతున్నాను.
    వోరోజు సాయంత్రం అద్దెగదికి వస్తూన్న వేళ కోఠీ ప్రాంతంలో అంతరద్దీలో ఇరువైపులా వున్న ఖరీదైన షాపుల్ని చూస్తూ నడుస్తోన్న శ్రీనివాసరావు నన్ను ఢీకొన్నాడు. నేనూ, అతనూ మొహామొహాలూ చూచుకొన్నాం. అతను చప్పున నా రెండు చేతులూ పుచ్చుకుని ఆదరంగా అన్నాడు.
    "మళ్ళీ యెన్నాళ్ళకి మిమ్మల్ని చూచాను మాస్టారూ! కులాసానా?"
    ఇంత 'ఆత్మీయతను' ఒలికిస్తోన్న శ్రీనివాసరావుని యిన్నాళ్ళూ తలుచుకోనైనా లేనందుకు నొచ్చుకున్నాను.
    "రండి కాఫీ తాగుదాం" అన్నాను.
    అతను నా వేపు చిత్రంగా చూచి అన్నాడు.
    "ఈ వూర్లో కాఫీ తాగడమే. వద్దు మాస్టారూ. ఆ అలవాట్లు మానుకోండి."
    ఇప్పుడు నేని నేర్చుకున్న అలవాట్లని యేకరువుపెడితే విని మతి పోగొట్టుకోగలడు శ్రీనివాసరావు. నిప్పులాటి శ్రీనివాసరావుని చూచి నాలోని 'తాగుబోతు' సిగ్గుపడ్డాడు. భయపడ్డాడు.
    శ్రీనివాసరావు తనతో తెచ్చుకున్న ఫ్లాస్కుని చూపించి అన్నాడు ఉపన్యాస ధోరణిలో.    
    'ఇక్కడ మూడుపూటలా కాఫీ తాగాలంటే రెండు మూడు రూపాయలైనా జేబులో వేసుకోవాలి. అందుచేత యింటిదగ్గరే కాఫీ చేయించుకు తీసుకొస్తాను."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS