Previous Page Next Page 
ఆదివిష్ణు కథలు పేజి 20


    ఆ సమయాన, దూరాన వున్న మా వూరిని శ్రీనివాసరావులో చూచి ఆనందించేను. వెంటనే సమాధానమూ చెప్పలేకపోయాను.
    "పెట్టె బేడా బస్సులోనే ఉన్నాయా! రండి దింపిద్దాం!"
    మా వూరి శ్రీనివాసరావు ఈ వూళ్ళో ఉన్నట్టు తెలియదు. నేనొస్తున్నట్టు తెలీని శ్రీనివాసరావు నన్ను చూడగానే కొండంత ఆదరం చూపించేడు. నా సామాను బస్సు నుంచి దింపడంలో సాయపడ్డాడు.
    అప్పుడడిగేడు -
    'మీ బంధువు లెవరైనా రావాలా?"
    "బలేవారే? మీరు మాత్రం మా బంధువులు కారా?"
    అతను కేవలం నా కోసం వచ్చాడంటే నేన్నమ్మను. లగేజీ తాలూకు శాల్తీలన్నీ సరిగ్గా చేరాయో లేదో లెక్క పెట్టుకున్నాను. శ్రీనివాసరావు అడిగేడు -
    "చెప్పండి! ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి?"
    "మీకు మా రామమోహనరావు తెలుసా?"
    "ఆ మిలట్రీ మీసాలాయనా?"
    "అవును."
    "తెలుసు. అతను ట్రూప్ బజార్లో ఉంటున్నాట్ట."
    "కాసేపట్లో అతనొస్తాడు, అందరం కలిసే వెడదాం."
    "మరి మీరొస్తున్నట్టు ఆయనకి తెలుసా?"
    "రాశాను."
    "అవుతే సర్లేండి"
    "మీ కవతల వేరే పనులేమైనా...."
    "నో... నో... భోంచేసి మనూరి బస్సుని చూద్దామనిలా వచ్చేను. మిమ్మల్ని చూట్టంతో ఆ పని కాస్తా పూర్తయింది. నౌ అయామ్ ఫ్రీ" అన్నాడు శ్రీనివాసరావు. గాలిలో చేతులూపుకుంటూ తర్వాత మెల్లిగా, హాయిగా అందమైన ఆడపిల్ల నవ్వినట్లు నవ్వేడు.
    అతని నవ్వులో వెయ్యి దీపాలు వెలిగిన మాట వాస్తవమైతే కావచ్చు. మా వూరికి దూరంగా వుండి ఇంత హాయిగా నవ్వగలుగుతున్న శ్రీనివాసరావు మీద కోపమొచ్చింది నాకు. సొంత వూరొదిలి విసిరి పారేసినట్టు దూరంగా బ్రతికే మనిషికి హాయిగా నవ్వడం చాత కాకూడదు. నవ్వే హక్కు అతనికి లేదని నా అభిప్రాయం.
    "ఎన్నాళ్ళుంటారు?" మళ్ళీ అతనే అడిగేడు.
    "బదిలీమీద వచ్చేను గనక ఎన్నేళ్ళని అడగండి" కసికొద్దీ అన్నాను.
    "గూడ్"
    మరింత అతన్తో మాటలు పెంచుకోవాలనే అభిప్రాయం తెంచుకున్నాను. నేనింత దూరం వచ్చినందుకు జాలిపడి సానుభూతి పలుకుతుందనుకున్న నోరు 'శుభమని' యాగీ చేస్తే మండుకు రాదూ మరి?
    అతనే చెప్పుకొస్తున్నాడు. అతనీ వూరొచ్చి రెండు నెలలయిందిట. ఇక్కడే వాళ్ళ బావయ్యగారి పరపతిమీదనో ప్రైవేటు కంపెనీలో చేరాట్ట: రెండు వందల పైచిలుకు జీతమట.
    నేను రాముడికోసం ఎదురుచూస్తూ అతని మాటలన్ని విన్నాను. గేటుదాటి వస్తున్న రాముడ్ని చూడగానే శ్రీనివాసరావు చేతిని నొక్కి అన్నాను-
    "మా వాడొస్తున్నాడు."
    బ్రేకు వేసినట్టు శ్రీనివాసరావు మాటలాపేశాడు. రాముడు కిళ్ళీ నోటితో మెల్లిగా నవ్వుతూ సిగరెట్టుని పెదాలతో అందంగా పట్టి ఉంచి వో కన్నుమూసి, కుడి చేత్తో నా భుజం తట్టుతూ అన్నాడు -
    "సారీ మైడియర్ బాయ్! ఐయామ్ లేట్!"
    రాముడి అవతారంలో చాలా మార్పొచ్చి పడింది. వాడు నెత్తిమీద వెంట్రుకలు అరంగుళం మేర పెంచి దానికి తగ్గట్టు కత్తిరింపు చేయించేడు. ఒంటిని గట్టిగా అంటిపెట్టుకున్న పేంటుతోనూ, గాలికి రెపరెపలాగే కాగితం లాంటి షర్టుని భుజం వరకూ మడచి కొత్తగా కనిపించేడు. ఇంగ్లీషు సినిమాలో పేరొందిన సినిమా నటుడిలా ఉన్నాడు. ఆ వేషం నాకు నచ్చదని వాడికి తెలుసు. ఇప్పుడు నా అభిప్రాయం చెప్పేందుకు అదే వేషం భయపడుతోంది నన్ను.
    పలకరింపుతో నవ్వక తప్పదన్నట్టే నవ్వేను.
    సిగరెట్టు పొగని తమాషాగా వదిలి, కాలిన సిగరెట్టుని కసాయివాడి కత్తిలాగున బూటుక్రింద నలిపి అన్నాడు -
    "కెన్ ఉయ్ గో నౌ?"
    "సామానుంది" అన్నాను బెరుగ్గా.
    వాడో పర్యాయం నా హోల్డాలూ, పెద్ద ట్రంకూ, రెండు అట్టపెట్టెలూ, ఒక చేతి సంచీ చూచి ఘోల్లున అరిచేడు.
    "నాన్ సెన్స్ నవ్వొచ్చింది నాగాయలంక కాదు, బండెడు లగేజివెంట తెచ్చావ్"
    సిగ్గుపడ్డాను!
    "ఎవడైనా చూస్తే - లాఫెట్ యువర్ ఫేస్!"
    కోపం వచ్చింది.
    "ఇప్పుడీ సంతనంతా ఎలా చేర్చడమనేది ప్రోబ్లమ్"
    సహించలేక నేనూ నోరు చేసుకున్నాను.
    "ఒరేయ్ తెచ్చింది నేను. నీ సాయం లేకుండా చేర్చుకోగల సత్తా నాకుంది. అనవసరంగా గొంతు చించుకోవద్దు."
    విడిగా పడివున్న అట్టపెట్టెని ట్రంకుమీద ఉంచేడు శ్రీనివాసరావు. అప్పటిగ్గాని అతన్ని చూడలేడు రాముడు.
    "ఐసీ! మీరూ వచ్చారన్నమాట. అయితే చేయి కలపండి. ముందీసరుకు రిక్షాల్లో ఎక్కించండి" అన్నాడు రాముడు.
    "నువ్వు కొంచెం రిక్షావాళ్ళతో బేరమాడు" అన్నాను ధైర్యంగా.
    రాముడు తిక్కగా నవ్వేడు.
    "నో బార్గేయిన్ బిజినెస్. ఇక్కడ మన సంగతి తెలీని రిక్షావాడు లేడు. కమాన్. ఏయ్ గాడీ!" వాడెవడ్నో పిలిచేడు నా ప్రమేయం లేకుండా రెండు రిక్షాల్లో సామాను సర్దించేడు. మూడో రిక్షాలో నన్ను కూర్చోపెట్టి వాడు నా ప్రక్కన కూర్చున్నాడు. మిగిలిపోయిన శ్రీనివాసరావు నుద్దేశించి అన్నాను.
    "మీరూ రండి"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS