ఆంజనేయులు బయటికి వస్తూ శ్రీనివాసరావువేపూ, శాంతాదేవి వేపూ చూచి తలదించుకున్నాడు.
"ఏమిట్రా ? ఏం జరిగిందసలు?" వెంకటాచలం అడిగేడు.
"జూనియరంటున్నాడు. మేమేదైనా పప్పులో....." అన్నాడు ఆంజనేయులి వెనక సీటతను.
"కాలువేసేరు. మీరూ నేనూ అందరం వేసేం! ఇదిగో మాస్టారూ, మనమంతా కలిసి ఒకేసారి రిజైన్ చేద్దామా?" పీడా పోతుంది."
"అదేం మాటండీ బొత్తిగా."
"లేకపోతే యింకేమనమంటారు? చస్తున్నాను సమాధానం చెప్పలేక. నేను చేసిందానికి , మీరు చేసిందానికి , నా బాబెవడో వాడు చేసిందానికి -- అన్నిటికీ నేనట బాధ్యుణ్ణి ఛీ......వెధవ ఉద్యోగం . అడుక్కుతినైనా బతుకుతాను గాని.....ఇదిగో శాస్త్రీ! ఇవాళ నుంచి నేనీ మాటలు పళ్ళేను. నాకు తిక్క రేగిందంటే ----ఆదదిగో మళ్ళీ బెల్లు, ఎవడి ఖర్మ కాలిందో , క్షణం గాలి పీల్చుకొనివ్వడు గదా దేవుడు? చస్తున్నాం రా బాబూ" అన్నాడు ఆంజనేయులు.
లోపలకు వెళ్లోచ్చిన ఏడుకొండలు -
శ్రీనివాసరావుకి 'దేవుడు ' నాటకం గుర్తుకు వచ్చింది. అందులోని అంజనీలుని యిక్కడ ఆంజనేయులు అతి త్వరలో అందుకునే అవకాశం దగ్గిర పడిందని అతను అనుకున్నాడు.
ఆఫీసు అవడంతోనే అతను యింటికి వచ్చి స్నానం ముగించేడు. బయటికి వస్తుండగా , బుజ్జి ఓ వుత్తరాన్ని తెచ్చి శ్రీనివాసరావుకి యిచ్చేడు.
"అమ్మకి నమస్కారములు.
క్షేమం. మీ క్షేమం తెలియడం లేదు. నాకీ మధ్యనే ప్రమోషను వచ్చింది. జీతం పెరిగింది. నేను త్వరలో అటు మీదుగా హైదరాబాద్ వెళ్ళవలసిన పని ఒకటి వున్నది. అప్పుడు మిమ్మల్ని అందర్నీ చూస్తాను. తమ్ముడికి, వాడి పిల్లలకి , అమ్మాయికి నా ఆశీస్సులు.
గిరి"
శ్రీనివాసరావు బయటికి వచ్చి అఫీసరింటి వేపు నడక సాగించేడు.
(అన్నయ్య అదృష్టవంతుడు . మిలటరీ మనిషి వాడు. నిక్షేపంగా బతికేయగలడు. పెళ్ళాం, పిల్లలూ, తల్లీ , తమ్ముడూ ఎవ్వరూ అక్కర్లేదు వాడికి. నాకన్నా మిలటరీ మనిషి జీవితం పదునైనది. నేను బి.ఏ. పాసై యెంత సంపాదిస్తున్నానో , వాడు ఎస్.ఎస్.ఎల్.సి తప్పి అంతకి రెట్టింపు సంపాయిస్తున్నాడు. పైగా వాడికిప్పుడు సంసార బాధ్యతలు ఏమీ లేవు. నేను బి.ఏ పాసై వెట్టి చాకిరీ చేసి, అనారోగ్యంతో బాధపడుతూ , ఆర్ధికంగా పతనం చెంది, సంసారా భారాన్ని మోయలేక అయ్యో అన్నయ్యా, నువ్వేరా అదృష్టవంతుడివి. నాన్న చావు నువ్వు చూళ్ళేదు. కళ్ళముందే జరిగిన మన పతనానికి నువ్వు కొన్ని వందలమైళ్ళ దూరంలో ఉన్నావు. రేయ్ బ్రదర్! నీ ప్రయోజకత్వం తెలిసి నేను ఏడుస్తున్నన్రా? పిటీ, పిటీ, పిటీ నువ్వు దేశానికి కావలసిన మనిషివి. నేను వెధవనైపోయాను. ఇంట్లో వాళ్ళ అవసరాల్నే సమకూర్చలేని భ్రష్టుడ్ని . బాగుపడు ఇంటికి జ్యేష్టుడివిగా పుట్టి గూడా రూలుని అతిక్రమించి సుఖ పడుతున్నావు గదరా!.......సుఖపడు. సుఖపడుమా నువ్వైనా సోదరా! పొరపాటున గూడా నువ్విక్కడికి రావద్దురా బాబూ! ఇక్కడ నీకు సుఖం లేదు. ఇంటి నిండా దరిద్రం తాండవిస్తుంది. నువ్వది భరించలేవు.)
ఆఫీసరుగారిల్లు దగ్గిరవుతుండగా అతనికి "ఇసబెల్లా' పాఠం గుర్తుకు వచ్చింది. ఇందిరమ్మకి యివాళ 'ఇసబెల్లా' ప్రేమని గురించి చెప్పాలి. కీట్సు మహాశయుని గురించి చెప్పి , అయన దుర్మార్గాలైన ఇసబెల్లా అన్నల్ని యెలా చిత్రించి మెప్పు పొందాడో చెప్పాలి. ఇవాళ ఇందిరకొన్ని గొప్ప విషయాలు చెప్పి ఒక గంట కాలక్షేపం జరిగితేనే గాని మనసులో దోబూచులాడి భయపెడుతోన్న ఆలోచనలు దూరం గావు.
అతను వేగంగా నడిచి ఆఫీసర్ ఇల్లు చేరుకున్నాడు. అంత విసురుగానే ఇందిర గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు. కాసేపట్లో ఇందిర పుస్తకాలు పట్టుకు వచ్చింది. వస్తూనే "నమస్కారం మేస్టారూ" అన్నది.
(ఇందిర నన్ను మేస్టారూ అని పిలుస్తున్నప్పుడు నా మనసింత హాయిగా వుంటుందేమిటి? ఆ తండ్రిని కూతురైనా పాపం ఆ పిల్లకి లౌక్యం బొత్తిగా తెలీదు. భళ్ళున మాటాడేసి , మనసంతా క్లీన్ చేసుకోవడమే ఈ పిల్లకి తెలుసు. ఎన్నెన్ని విషయాలు చెప్పింది నాకు. ఆ యింట్లో విరివిగా కనిపించే ఖరీదైన వస్తువులు ఎవరెవరు యెప్పుడు తెచ్చారో ఖచ్చితంగా చెప్పింది. "మీరంటే డాడీకి అలుసు మేస్టారూ" అని ఈ పిల్లే ఒకప్పుడు చెప్పింది. ఇందిరకి చదువు చెప్పడం ద్వారా నాకు దొరుకుతున్న సుఖానికి తల ఒగ్గేను గనుక నేనీ దారుణాలు పట్టించుకోవడం లేదు. ఇందిరమ్మా! ఈ జన్మలో నేను నీకు మేస్టార్నే తప్ప ఏమీ కాను - వచ్చే జన్మలో నాకు నువ్వు చెల్లిగా పుట్టి నా అనురాగాన్ని పంచుకో.)
"ఏం మాస్టారూ? డల్ గా ఉన్నారే?"
శ్రీనివాసరావు నవ్వేసి ఊరుకున్నాడు.
ఇందిర కూచుంటూ కొత్త కామెంట్ ఒకటి చేసింది.
"ఏమిటో అనుకున్నాను గాని మేస్టారూ! మీరు చాలా గొప్పవారే!"
"ఇవాళేదో విశేషం జరిగి వుంటుంది. లేకపోతే ఇంత దారుణంగా మాటాడదు. నేను గొప్పేమిటి? నా బొంద. వేళాకోళం చేయకండి ఇందిరా" అన్నాడతను.
ఇందిర అన్నది.
"వేళాకోళం కాదు మేస్టారూ! నేను నిజమే అంటున్నాను. నాకీ విషయం నిన్నటివరకూ తెలీదు. నిన్న కొండలు మా యింటికి వచ్చేడు. ఏదో సినిమా గురించి చెబుతూ మీ ముకుందం గురించీ చెప్పేడు."
"మీ ముకుందమా?"
"తెలీనట్టు ఆశ్చర్యపోకండి మరి. మీరు చెప్పకపోతే నాకు తెలీదనుకున్నారా పాపం? నాకు చాలా తెలిసేయి మాస్టారూ! మీరూ ముకుందంగారూ చిన్నప్పుడు కలిసి నాటకాలు వేసేవారుటకదూ? ఆయనగారెంత సినిమా హీరో అయినా , మీకిప్పటికీ ఉత్తరాలు రాస్తూనే ఉంటారుటగా. ఏం మేస్టారూ ! కొండలు చెప్పింది అబద్దమా?"
"కొండలు నిజమే చెప్పాడు. ముకుందం గొప్ప సినీ నటుడే. అతను నాకు కాలేజిలో స్నేహితుడే. అతను నాకిప్పటికీ ఉత్తరాలు రాస్తున్న మాటా నిజమే. అయితే.....అయితే.....ఏమైందిప్పుడు."
"మరి.....ఈ విషయం నాతొ ఇప్పటివరకూ చెప్పారు కాదేం? పోన్లెండి మేస్టారూ !"
"చెపితే ఏమయ్యింది?"
ఇందిర తల వంచుకుని అన్నది.
"నాకేమో ఈ సినిమాలంటే యిష్టం. ముకుందంగారు మీరు మిత్రులు కావచ్చు గానీ అయన చాలా మందికి దేవుడు. మీకాయన తెలుసుననే ఒక్క మాట నాకు ముందే చెబితే - నేనెంత సంతోషించేదాన్నని?"
శ్రీనివాసరావు నవ్వుకున్నాడు.
"ఎందుకు మేస్టారూ ! నవ్వుతారు?"
"అతను దేవుడైతే కావచ్చును గానీండి - మరీ అంత గుడ్డి పూజ మంచిది కాదు. మీకు యెప్పటినించో చెబుతున్నాను. మీరు బుద్దిగా చదువుకోవాలి ముందు."
