నువ్వు నన్ను నమ్మలేవా?" సీరియస్ గా అడిగాడు తను.
"నమ్మందే నీ వెనుక ఎక్కేశానా?" విషయాన్ని తేలిగా చేసింది నంద.
"బావుంది! ఈ చమత్కారాలతోనే నేను డవున్ అయిపోతున్నాను!" అన్నాడు నవ్వుతూ.
"అనిల్! నా మనస్సులోనూ కోరికలున్నాయి. ఇదో ఇలాగా నీతో షికార్లు చెయ్యాలనీ, మంచి మంచి చీరలు కట్టుకోవాలనీ, హాయిగా వుండాలనీ వుంటుంది కానీ-"
"నందా!" ఆమె మాటలకి అడ్దొచ్చి అన్నాడు. మధ్య తరగతి కుటుంబాలలో ఉద్యోగం చేయక తప్పని అందరి అమ్మాయిల్లాగే నువ్వూను! అయినా ఎన్నేళ్ళు? ఎన్నేళ్ళు?"
అతను ఆపగానే ఆఫీసు గేటు ముందు దిగింది నంద.
"ఇప్పుడు ఇద్దరూ ఫస్టియర్ లోకి వచ్చారు. ఇంకో రెండేళ్ళు డిగ్రీ కాగానే విమలకి ఇదే ఆఫీసులో ఉద్యోగం, శశికి నువ్వెక్కడయినా చూపితే ఆ ఉద్యోగం తరువాత ముగ్గురి పెళ్లి అంతే!" నవ్వుతూ అంది నంద.
ఆ కొద్ది ఆశతో అతను ఎంతో సంతోషించాడు.
"ఆఫ్టరాల్ అయిదేళ్ళు ఆగేను, ఇంకో రెండేళ్ళు- అంతేగా వెయిట్ చేస్తాను ఆరాధిస్తూ! ఈవినింగ్ వచ్చి పికప్ చేస్తాను. సరిగ్గా అయిదింటికి ఒకే!" అని చప్పున ఆమె చేయి అందుకుని ముద్దు పెట్టుకుని సైకిల్ ని స్టార్ట్ చేసి రివ్వున వెళ్ళిపోయాడు అనిల్!
అటూ యిటూ చూసి ఎవరూ లేకపోవటంతో అతను ముద్దుపెట్టుకున్న చేతిపై ముద్దుపెట్టుకుని కాంపౌండులో అడుగుపెట్టింది. అతని లిఫ్ట్- అతని మాటలు- అతనిచ్చిన ధైర్యం! అతను చివరగా చేసిన చమక్కు ఆమె మనస్సునిండా ఆనందాన్ని నింపేయి! ఎక్కడలేని ధైర్యాన్ని కలిగించింది మనస్సులో మరుమల్లెలు పూయించింది. పల్లకీ ఎక్కించింది ఆకాశంలో పల్లటీలు కొట్టేలా చేసింది. ఉదయంనుంచి అదోలా వున్న మనస్సు ప్రశాంతంగా అయింది. జరిగిన ఒకటి రెండు అపశృతులూ మధురస్మృతుల్లా అయ్యాయి. గుండెనిండా కుతూహలాన్ని ఉత్సాహాన్ని నింపుకుంది.
12
"గుడ్ మార్నింగ్!"
చిరునవ్వుతో ఎదురొచ్చింది స్టెల్లా! స్టెల్లా నడిసొస్తోన్న ఉత్సాహంలా వుంటుంది! ఆమె ఆఫీసులోనే స్టెనో
స్టెల్లాకి నంద అంటే ఎంతో ప్రేమ! అభిమానం!
స్టెల్లా చెల్లాయి మేరీ, నంద ఒకప్పుడు క్లాస్ మేట్ మేరీ డిగ్రీ అవుతూనే వోమాంచి ధనవంతుడిని పట్టి పెళ్ళాడి అమెరికా వెళ్ళిపోయింది.
ప్రతివారికి ఫారిన్ పై వున్న మోజు అలాటిది. మేరీ కూడా అంతే ఆలోచించింది! అక్కడి పెళ్ళి కాలేదే అని ఒక్క నిమిషమయినా ఆమె ఆలోచించలేదు.
"గుడ్ మార్నింగ్!" నవ్వుతూ పలకరించింది నంద.
"ఎలా వుంది కాలం?"
అర్ధం కాలేదు ఆ ప్రశ్న నందకి.
"ఎలా వుంది ఒళ్ళు?"
పెదవి నొక్కి పట్టింది అర్ధం కాలేదన్నట్లుగా.
దగ్గరగావచ్చి కన్నుగీటి "ఎవరే ఆ మొగాడు? దర్జాగా బైక్ పై దించాడు. పబ్లిగ్గా రోడ్డుమీద చేయి ముద్దుపెట్టుకున్న వీరుడెవడే? ఎంత ధైర్యం? ఎంత ధైర్యం? ఈరోజు చేయి అయింది. రేపు చెంప అవుతుంది?" అంది నవ్వుతూ.
ఒక్క క్షణం విస్తుపోయినా అంతలో తేరుకుని తనూ నవ్వేసింది నంద. చూడవలసింది చూశాక ఇంకా దాచేందుకి ఏముంది? అనుకుంది. మెల్లిగా నడిచివెళ్ళి తన సీట్లో కూర్చుంది ఇంకా ఆఫీసులో ఎవరూ అడుగుపెట్టలేదు.
"ఎవరే బాయ్ ఫ్రెండా? బ్రా ఫ్రెండా?" అని ఓ క్షణంగా 'ఎఫెండా?' అంది.
"నథింగ్ స్టెల్లా! నువ్వేమన్నా నాకు కోపం లేదే? అతను నా క్లాస్ మేట్! అనిల్ అని యిక్కడే సి.ఐ.గా పని చేస్తున్నాడు. హి లవ్ స్ మీ! పెళ్ళికూడా చేసుకోవాలనుకున్నాం. మా వాళ్ళకీ తెలుసు, వాళ్ళమ్మకీ తెలుసు! ఇష్టమే అంది నవ్వుతూ. ఆమె కంఠం కొద్దిగా విచలితమయింది.
"మరింకేమిటి ఆలస్యం? కట్నం గొడవలా?"
నథింగ్ డూయింగ్. ఇచ్చే స్థాయి మాకు లేదు. వూరుకునే ఇష్టం అతనికి లేదు మా కుటుంబ విషయాలు తెలుసు కదా? చెల్లాయి, తమ్ముడు ఉద్యోగంలో స్థిరపడితే తనకు లాభం లేదు."
"నందా! నేనో సలహా చెబుతాను విను! నువ్వు వెంటనే అతన్ని పెళ్ళి చేసుకో" సలహా యిచ్చింది మనస్ఫూర్తిగా.
ఆ మాట వినగానే చప్పున కదిలింది నంద.
"కోపం వచ్చిందా?" నంద చేయందుకుంది స్టెల్లా,
"కోపం కాదు స్టెల్లా! వెంటనే పెళ్ళి చేసుకోమన్నావుగా అందుకని! అతనిప్పుడే స్టేషన్ కి వెళ్ళి వుంటాడు! అతడి దగ్గరికి వెళ్ళి అటునుంచి అటే వెంకటేశ్వరుడి గుడికో - రిజిస్టార్ ఆఫీసు కో వెళ్ళిపోతాం!"
నంద చమత్కారానికి ఫక్కున నవ్వింది స్టెల్లా!
నందకూడా గలగల నవ్వింది. జత కలుపుతూ.
అంతలో పోస్ట్ మాన్ వచ్చాడు, ఆఫీస్ టపాల్ అన్నీ స్టెల్లాకి ఇచ్చాడు. నందకి ఓ కవరు ఇచ్చాడు. ఆనందలకీ డాటర్ ఆఫ్ నారాయణ అని ఆమె పూర్వం అడ్రసుకి వచ్చింది ఎవరి నుంచబ్బా అనుకుంది ఆమె. ఎక్కడా తగిలిన వ్రాత కాదు, పరిచయం గుర్తుకి రావటం లేదు.
నంద ముఖంలో తారట్లాడుతున్న సంశయాలని గమనించిన స్టెల్లా అడిగేసింది "లవ్ లెటరా?"-
నవ్వింది నంద. జవాబు చెప్పలేదు.
స్టెల్లాలో విశేషమే అది!
తను గలగల నవ్వుతుంది- అరమరికలు లేకుండా!
తన చుట్టూ వున్న వాళ్ళని నవ్విస్తుంది తనలాగే.
ఎక్కడ లైఫ్ బాయ్ వుందో అక్కడ ఆరోగ్యం వుంటుంది అన్నట్టుగా ఎక్కడ స్టెల్లా వుంటే అక్కడంతా నవ్వుల పువ్వుల జల్లులే!
"నీకేమొగానీ నాకు లవ్ లెటర్ వచ్చిందే!" అంది స్టెల్లా.
మళ్ళీ పెదాలు నొక్కిబట్టి చదువుతూ అంది నంద. స్టెల్లా ముఖాన్నే గమనిస్తూ "ఎవరు? శ్రీనివాస్ రాశాడా?" అడిగింది.
"ఆ ఇంకెవరున్నారు? మహానుభావుడికి జ్వరమంట! నూట రెండు! విరహ జ్వరమేమో! వెంటనే వచ్చేయ్ అని రాశాడు!"
"అరె ఎన్నాళ్ళనుంచిట" ఆత్రంగా అడిగింది.
