
8
పెళ్ళికి తేదికి నిర్ణయం అయిపొయింది. 'ఎంత గుళ్ళో పెళ్లి అయినా కాస్తయినా సందడి వుంటుంది కదా -- అక్కయ్య ఒక్క వారం రోజులయినా ముందుగా రావాలి' అన్నాడు మురళీ వాసుతో.
'నువ్వెంతగా చెప్పక్కర్లేదు -- కళ్యాణి కి స్వంత అన్నయ్యలు లేని కొరత కని పించకుండా చూస్తాం -- సరేనా.' ఆప్యాయంగా స్నేహితుడి చెయ్యి అందుకుని సున్నితంగా నొక్కి వదిలేశాడు వాసు.
తనమీడికి ఎలాంటి నెపం రాకుండా ఏదో అంటీ ముట్టనట్టు ఉంటాడేమో అనుకున్న మురళీ కి వాసు హామీ కొండంత వుత్సాహాన్ని ఇచ్చింది.
ఆఫీసులో అందర్నీ కూడా తమ వివాహ నికీ ఆ తరువాత విందు భోజనానికి ఆహ్వానించారు.
'ఓ యస్ -- తప్పకుండా వస్తాం-- అసలీ వార్తా కోసమే మేము ఎన్నాళ్ళ నుంచో చెవులు దొరగించుకుని కూర్చున్నాం ' అంటూ అందరూ నవ్వుతూ అభినందలు అందజేశారు.
కొద్ది మంది స్నేహితుల సమక్షంలో వాసు దంపతుల అధ్వర్యంలో వివాహం క్లుప్తంగా జరిగిపోయింది-- విందు భోజనం కూడా ముగిసిపోయింది-- వచ్చిన స్నేహోతులు తమలో తాము కాస్త విడ్డూరంగా చెవులు కోరుక్కోటం మాత్రం ముగియలేదు. చివరికి మరి ఉండబట్ట లేక ఇద్దరు ముగ్గురు లౌక్యంగా వాసునీ, మరి ఒకరిద్దరు నిస్సంకోచంగా మురళీని అడగనే అడిగేశారు.
'మీ అమ్మగారూ నాన్నగారూ వాళ్ళెవరూ రాలేదా -- ఆవిడ వైపు కూడా ఎవరూ వచ్చినట్లు లేదు.' మురళీ ఎలాంటి తటపటాయింపు సంకోచమూ లేకుండా పరిస్థితి వెల్లడించేశాడు.
వింటున్న వాళ్ళంతా ఒక్కక్షణం అయోమయావస్థ లో పడిపోయినా, మళ్లీ అంతలోనే తేరుకుని మురళీ మీద ప్రశంశల వర్షం కురిపించారు.
'ఆహా అలాగా-- మీరు చేసింది చాలా మంచి పని -- మేము హృదయ పూర్వకంగా అభినందిస్తున్నాము' అంటూ అభిమానంగా అతని భుజం తట్టిన వాళ్ళు కొందరయితే --
'ఏమో -- అనుకున్నాం, మురళీ ధర రావు గారు గట్టి వాడే-- అతనిలో ఇంతటి అభ్యుదయ భావాలు విశాల హృదయం వున్నాయని ఒక్కనాడైనా సూచనగా కూడా గ్రహించలేక పోయాం-- అసలూ-- నిజం చెప్పాలంటే మనిషి ని ప్రవర్తనని బట్టి వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవించాలి కాని, పుట్టుకలో ఏముంది-- మన సంఘంలో వేళ్ళూ ని పాతుకు పోయిన అర్ధం లేని ఆచారాలు నిబంధనలు; కట్టుబాట్లు సమసి పోవాలంటే రావు గారి లాంటి సంసార ప్రియులు ఎంతోమంది ముందుకు రావాలి-- లేకపోతె, కూపస్థ మండూకాల్లా కులాలూ, శాఖలూ, వర్గాలూ అంటూ గిరి గీసుకుని కూర్చుంటే , దేశం ఎప్పటికీ, ఇదుగో మనలాగే పాత చింతకాయి పచ్చడి భావాలు వల్లే వేస్తూ వుంటుంది.' అంటూ నోటితో పలకరించి నొసటితో వెక్కిరించేవారు కొందరున్నారు.
అందరికీ చిరునవ్వుతోనే సమాధానం చెప్పి అందరినీ మర్యాదగా సాగనంపాడు మురళీ. వాసూ శారదల మాట కాదనలేక వాళ్లతో పాటు వాళ్ళ యింటికి వచ్చి ఆ సాయంకాలం అంతా వాళ్లతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడిపి ఆ రాత్రి భోజనం కూడా అక్కడే చేసి తమ కొత్త యింటికి తిరిగి వచ్చారు మురళీ, కళ్యాణి.
పెళ్లి చేసుకోవాలి అని నిశ్చయించు కున్న వెంటనే మురళీ వో చక్కటి యింటిలో వో భాగం చూసి అడ్వాన్సు యిచ్చేశాడు. వో మంచి రోజు చూసుకుని తన మకాం అందులోకి మార్చేసి తను అదివరకునుండీ ఉంటున్నది ఖాళీ చేసేశాడు. కళ్యాణీ తో సంప్రతించి , శారద సలహాని అనుసరించీ తమ సంసారానికి కావలసినవన్నీ అప్పుడొకటి అప్పుడొకటి సేకరించి వుంచాడు. కళ్యాణి ఒకటి రెండు సార్లు బజారు నుంచి వచ్చినప్పుడు ఆ యింటికి వచ్చింది కూడా. అయినా అదివరకు కలగని వో చిత్రమైన అనుభూతి ఏదో ఇవాళ ఆ యింట్లో అడుగు పెడుతుంటే కళ్యాణి మనస్సులో పులకరింతలు రేపింది.
* * * *

గదిలో మంచం మీద వో చివరగా కూర్చుని , చేతిలోకి తీసుకున్న పుస్తకం పుటలు యధాలాపంగా తిరగావేస్తున్న మురళీకి క్షణం ఒక యుగం లాగే అనిపిస్తోంది -- అంతలో గదిలో అలికిడి అయి తల తిప్పి చూశాడు.
అతిగా అలంకరించుకోక పోయినా మెడలో వున్న ఒక్క వరస బంగారు గొలుసు కు జతగా పచ్చటి పసుపు తాడుతో, శంఖం లాంటి మెడ చుట్టూ కాస్త బిగుతూగా వున్న నల్లపూసల దండతో -- తలలో పట్టెడు మల్లె చెండుతో భువన మోహనంగా కనిపించింది కళ్యాణి మురళి కళ్ళకి --
బిడియంగా మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ వస్తున్న కళ్యాణి నాలుగడుగులు వేసి ఇంక ఆ పైన ముందుకు వెళ్ళటం తన చేత కాదు అన్నట్లు అటు ప్రక్కగా వున్న కిటికీ దగ్గరికి వెళ్లి నిలబడి బయటికి చూడసాగింది. మురళి నవ్వుకుంటూ పుస్తకం టేబిల్ మీద పడేయటం, లేచి తన వైపుకు రావటం అన్నీ తెలుస్తూనే వున్నాయి కళ్యాణి కి. సిగ్గుతో మొగ్గలా ముడుచుకు పోతూ, బయట పుచ్చపువ్వులా పరుచుకున్న వెన్నలనీ, విరగబూసి ఆ పూల పరిమళం తో వాతావరణాన్ని మత్తెక్కించేస్తున్న నైట్ క్వీన్ పోదనీ చూస్తూ అలాగే నిలబడి పోయింది. మురళీ కళ్యాణి రెండు భుజాల మీద చేతులు వేసి తనవేపుకి తిప్పుకుంటూ, 'ఇవాళ నువ్వు ఇలా కొత్తగా సిగ్గు పడుతుంటే ఎంత అందంగా వున్నావో తెలుసా?' చిలిపిగా అన్నాడు.
మెల్లిగా కళ్ళు యెత్తి చూసింది కళ్యాణి -- పెదవి విప్పి యేమీ మాట్లాడా లనిపించలేదు-- అసలు ఏమాత్రం కదిలినా మెదిలినా ఎదురుగా అతని కళ్ళల్లో మెరిసిపోతున్న అలౌకిక తేజస్సు చెదిరి పోతుందేమో అన్నట్లు ఆబగా, రెప్ప కూడా వాల్చకుండా అలాగే చూస్తూ వుండిపోయింది.
'ఏమిటలా చూస్తున్నావు -- ఇవాళ నా మొహం ఏమైనా కొత్తగా వుందా.' లోకంలో వున్న అనురాగాన్నంతటి నీ రంగరించి తన గొంతులో నింపుకున్నంత మధురంగా వున్నాయతని మాటలు.
'ఔను. కొత్తగానే వుంది-- ఇవాళ మీలో భగవంతుడు కనిపిస్తున్నాడు నాకు.' కళ్యాణి కళ్ళలో, మాటలో ఆరాధన స్పష్టంగా కనిపిస్తోంది.
'ఉహూ!-- అలాగా? --ఏదీ --అయితే వరం కోరుకో , అనుగ్రహిస్తాను. పల్చటి నీటి పొరతో మిలమిలా మెరుస్తూ, అందంగా, అమాయకంగా వున్న ఆమె కళ్ళల్లో కి చిలిపిగా చూస్తూ అడిగాడు మురళీ.
'మీ అనురాగాల్ని జీవితం అంతా ఇలాగే పంచు కోవాలని, ఇలాగే ఆనందంగా మీ కళ్ళల్లో కి చూస్తూ మీ చేతులలోనే ప్రాణాలు విడవాలనీ........'
'ఇష్., ఏమిటిది ...నువ్వు ఈ ధోరణి లో మరోసారి మాట్లాడితే నేనేమను కుంటానో తెలుసా -- నీకు నాలో విశ్వాసం లేదనీ, ఏనాడైనా నిన్ను విడిచి వెళ్లి పోతానేమో ననే భయం నిన్ను వదలటం లేదనీ........'
'ఆహా... కాదు....' ఖంగారు పడింది కళ్యాణి. 'మిమ్మల్ని మీ మనస్సుని శంకించే అంత అన్యాయానికి నేను ఏనాడూ ఒడిగట్ట లేను...నా ఒక్కదాని కోసం , కేవలం నాకు ఒక గౌరవప్రదమైన పరిస్థితి కల్పించటం కోసం , పదిమంది ఎదుటా నేను గర్వంగా తల ఎత్తుకు తిరిగేలా చేయటం కోసం , అయిన వాళ్ళందర్నీ వదులుకుని నా ప్రక్కని నిలబడిన మీ పట్ల నాకెంత గౌరవం వుందో అనురాగం వుందో నేను మాటలలో చెప్పలేను....ఊహ తెలిసినప్పటి నుంచి ఇలాంటి అదృష్టం కోసం తపించి పోయిన నేను ఇవాళ ఈ స్థితిలో వుండటం -- ఇదంతా వాస్తవంగా జరిగిందా -- కేవలం నా భ్రాంతి కాదు కదా అనిపిస్తుంది ఒకొక్కసారి.....'
'పిచ్చి కళ్యాణి!'- మురళీ ఆమె తలని గాడంగా గుండెల కదుము కున్నాడు. 'ఇంక ఎప్పుడూ ఇలాంటి ఆలోచనలు చెయ్యకు. ఇది నీ భ్రాంతి కాదు, కల అంతకన్నా కాదు. ఒకవేళ ఇది కలలో చూసిన ఒక అందమయిన దృశ్యం లా వుంది అని నువ్వు అనేటట్లయితే నాసమాధానం ఏమిటో చెప్పనా?....' ఒక చేత్తో ఆమె గడ్డం పట్టి తల పైకెత్తి ఆపేక్షగా చూస్తూ అన్నాడు.
'చెప్పండి.' అన్నట్లు కుతూహలంగా కళ్ళు వెడల్పు చేసుకుని చూసింది.
'మన జీవితం అంతా ఇలాగే ఒక బంగారు కలలాగే గడిచి పోతుంది అని.'
'కలలో నూ ఊహలలో నూ కనిపించేటంత సుందరంగా, మధురంగా, యదార్ధంగా జీవితం అంతా సాగిపోతుందా?'
'అక్షరాలా అలాగే వుండక పోవచ్చు. కాని జీవితాలని సుఖప్రదం, శాంతి దాయకం చేసుకోగలగటం కొంతవరకూ మన చేతులలో కూడా వుంది అనిపిస్తుంది నాకు. మనం ఇద్దరం.......'
'ఔను , నాకూ అలాగే అనిపిస్తోంది -- ఎన్నో అవరోధాలని అడ్డంకు లని ఎదుర్కుని మనం ఈ పెళ్లి చేసుకున్నాం. ఈ ఇల్లు నిలబెట్టుకున్నాం. మన జీవితం నందనవనం చేసుకోవాలని కోరుకుంటున్నాం -- మరి అలాంటప్పుడు ....ఆ వనంలోని ప్రతి మొక్కా ఏపుగా పెరిగి పువ్వులతో వికసించి కలకల లాడుతూ వుండాలంటే , మనం........'
