కాలచక్రం మరో మూడు సార్లు దొర్లిపోయింది సహజంగానే. ఆ మూడేళ్ళు అదృష్టవంతులకు సంతోషంగాను, దురదృష్ట వంతులకు దుఃఖమయంగానూ గడిచాయి.
రామనాధం మాస్టారు కొన్ని నెలల క్రిందటే రిటైరై ఇంటి దగ్గరే నాలుగైదు ప్రైవేట్లు కుదుర్చుకున్నారు. "ఇంకా ఎందుకు, నాన్నా, ఈ తాపత్రయం? నీఅరోగ్యం బొత్తిగా బావుండటం లేదు. కొన్నాళ్ళ పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోకూడదు? ప్రస్తుతం మనకేమంత ఇబ్బంది లేదుకదా?" అంటూ ఎన్నో విధాల నచ్చ చెప్పబోయింది పార్వతి. అన్నిటికి ఆయనో అర్ధం గాని నవ్వు నవ్వటం నేర్చుకున్నారు. "నా కింకా తాపత్రయం ఎందుకంటున్నావా? నా బరువు పూర్తిగా వదిలించుకుని నీ మీదే పడెయ్యమంటావా? బావుందమ్మా, బావుంది! సూర్యాన్ని కాలేజీ లో చేర్చావా? రుక్కు తల్లి చూస్తుండగానే ఎదుగుతోందా? నువ్వూ నేనూ పూనుకోకపోతే వీళ్ళిద్దరూ ఎలా ఒడ్డెక్కుతారు? ఏమిటో! అంతా ఆ శ్రీనివాసుడి దయ....."
పార్వతి మరి సంభాషణేమీ పెంచలేదు. తండ్రిని అన్నిటి కన్నా మించి తన దిగులే అధికంగా తినేస్తుందని తెలుసు. దాన్ని కప్పెట్టు కోటానికి ఏమిటేమిటో మాట్లాడుతాడు. తను సుఖంగా సంతోషంగా ఉన్నానని చెప్పినా నమ్మడు. నిజానికి పార్వతి కేమంత దిగులూ లేదు. గతాన్ని గతంలోనే విస్మరించించి కొంత వరకూ. మిగిలిందేమైనా ఉంటె అది అలా జీవితాంతం , స్మృతులు గోల్పోయేవరకూ ఉండవలసిందే. ప్రస్తుత పరిస్థితులు చక్కదిద్దుకు పోవాలనే కోరిక తప్ప మరేమీ లేదు. సూర్యం అల్లరి చిల్లరి పోకిళ్ళు పోకుండా శ్రద్దగానే చదువుతున్నాడు. ఏమాట చెప్పినా అక్షరాలా పాటిస్తున్నాడు. ఖర్చుల విషయంలో కూడా కష్టం సుఖం అలోచించి మరీ ప్రవర్తిస్తున్నాడు. తమ్ముణ్ణి చూసుకుంటే చాలు కొండంత ధైర్యం వస్తుంది పార్వతికి. రుక్మిణి కూడా ఫొర్తు ఫారం లోకి వచ్చింది. ఇంటి దగ్గర సరదాకు చీరలు చుట్ట బెట్టుకునెంత ఎదిగింది. మరెంత ఎదిగినా రుక్కు పసితనం పోదని పిస్తుంది. అప్పుడప్పుడు. కొత్త కొత్త పరికిణీ లు కావాలని పేచీ పెట్టు కూర్చుంటుంది రోజుకోసారి. "ఇందిర కట్టుకుంది. శేషు కట్టుకుంది. ఛీ! వెధవది. నాకెప్పుడూ ఆ చుక్కల పరికిణీ యే" అంటూ చంటి పిల్లలా పెచీలకు ఉపక్రమిస్తూటుంది.
"మా అమ్మవి కదూ? నువ్వూ కట్టుకుందువు గాని. పండక్కి నీకు కుట్టిస్తాగా? మరి ఏడవకు. లేచిరా! చుక్కల పరికిణి ఎంచక్కా ఉంది. ఇంకా చిరగనైనా లేదు" అంటూ బుజ్జగించబోయిన కొద్దీ బిగుసుకు పోతుంది.నేనూ
"ఇంకా ఎప్పుడేమిటి ఆ పండగ? మొన్నే వెళ్ళిందిగా?"
"మరోటి వస్తుంది. అబ్బో! సంవత్సరానికి ఎన్ని పండుగలున్నాయో!"
"అమ్మా! పారూ! దాన్నలా నెత్తి నేక్కించుకోకు. మాట్లాడకుండా ఊరుకో. పరికిణీ నచ్చకపోతే బడికి వెళ్ళకుండా మానేస్తుందిలే. అంతేగాని బొత్తిగా చంటి పిల్లలా బ్రతిమిలాడుతూ కూర్చుంటే దానికి కష్టం సుఖం తెలీకుండా పోతోంది" అంటూ పెద్ద కూతుర్నే మందలిస్తారు మాస్టారు.
అక్కడితో రుక్మిణి అలక కొంత తీరుతుంది. మాట్లాడకుండా లేచి గబగబా ఆచుక్కల పరికిణీ కట్టుకుని అక్కగారి కేసి ఓరగా కోపంగా చూసి బడికి బయల్దేరుతుంది. ఎంత విసుగులో కూడా పార్వతి చెల్లెల్ని మందలించదు. "అందరి కన్నా చిన్నది అమ్మే ఉంటె దాన్ని ఇంకెంత ముద్దు చేసేదో!' అనుకుంటుంది.
పార్వతికి కాలం మాములుగా సాగిపోతుందని చెప్పుకోవచ్చు. పద్మజ ఉత్తరాలందుకొని జవాబులు వ్రాస్తుండటం కూయా పార్వతి కార్యక్రమాలలో ఒకటి. పద్మజ నాలుగో సంవత్సరం చదువుతుంది, మద్రాసు లోనే. సుజా స్కూలు ఫైనల్ కు వచ్చింది.
విజయ శాస్త్రికి పెళ్ళయి జానకి కాపరానికి కూడా వచ్చింది. కామేశ్వరమ్మ కు తగని సందడి. కోడలంటే చాలా ఇష్టం. ఎందుకో జానకి ఆవిడకి బాగా నచ్చింది. ఆడపిల్లకు ఉండవలసిన లక్షణాలన్నీ తన కోడలికి ఉన్నాయని ఆవిడ అభిప్రాయం. శాస్త్రికి అన్నివిధాలా సరిగ్గా సరిపోయిందని మరో నమ్మకం. నిజంగానే జానకి చూడటానికి అందంగా లక్షణంగా ఉంటుంది. అత్తగారన్నా, ఆడబిడ్డలన్నా వినయ విధేయతలతో ప్రవర్తిస్తుంది. కోడలు ఎక్కువగా చదువుకోక పోవటమే అత్తాగారికి బాగా నచ్చింది. తల్లి సంతృప్తి పడిన భార్య జానకి అంటే శాస్త్రికి చాలా గారం.
చూస్తుండగానే కాల గమనం లో మరో మార్పు జరిగింది. రామనాధం మాస్టారు రెండు రోజులు జ్వరపడి మంచం పట్టారు. వారం పది రోజులకు కూడా ఆయనకే మంత స్వస్థత చిక్కలేదు. "ఈ ఖాయిలా అంతానికే కాదు గదా' అన్న అనుమానం ఆయన్ను మరి తెరుకోనివ్వటం లేదు. "పిల్లవాడింకా చదువుకుంటూనే ఉన్నాడు. చంటిది బొత్తిగా లోకజ్ఞానం తెలియకుండా ఉంది. ఇంత భారాన్నీ పార్వతి మీద పెట్టి.... అది మాత్రం జీవితంలో ఏం చూసింది? ఏం అనుభవించింది? తండ్రి కూడా లేని లోకంలో వీళ్ళెలా నెగ్గుకు వస్తారు?' అన్న ఆవేదనే ఆయన్ను మరీ క్రుంగదీస్తుంది.
రెండు రోజులుగా తండ్రికి బొత్తిగా బాగుండక పొతే పార్వతి ఆఫీసుకు సెలవు పెట్టింది. ఆరోజు వేపుడు నూకలు విసురు తుంటే వీధిలోంచి రెండు మూడుసార్లెవరిదో పిలుపు వినిపించింది -- "మాస్టారూ!" అని.
తిరగలి ఆపి వింది పార్వతి. మళ్ళీ "మాస్టారూ" అని పిలుపు. గబగబా లేచి వెళ్ళింది గుమ్మం దాటి. ఒక్క క్షణం తటపటాయించి తడబడుతూ వచ్చేసింది వెనక్కు.
"రండి. నాన్న లోపల పడుకున్నారు, రండి." గడిచిన మూడేళ్ళ లో పార్వతి రఘుపతి తో మాట్లాడనూ లేదు. అంత దగ్గరగా చూడనూ లేదు. సుశీల కోసమైనా మళ్ళా ఆ యింటి గేటు దాటలేదు. అసలు సుశీల ఎక్కువగా పుట్టింట్లోనే ఉంటూ ఉంటుంది. అత్తింటికి వచ్చిన కబురూ, ఉన్న కబురూ కూడా తెలీదు.
"మాస్టారికి బాగా లేదంటే చూసి వెళ్దామని." వీధి గుమ్మం లోనే నిలబడ్డారు రఘుపతి.
"లోపలికి రండి. నాన్నగారు పిలుస్తున్నారు." ఎత్తు పీట తెచ్చి తండ్రి మంచం దగ్గరగా వేసి గబగబా లోపలికి నడిచింది పార్వతి.
కూతురు చెప్పటంతో రఘుపతి రాకకోసం నీరసంగా కళ్ళు విప్పి ఎదురు చూస్తూ చిక్కి శల్యంలా వున్న చేతితో పీట చూపిస్తూ సాదరంగా ఆహ్వానించారు మాస్టారు.
రఘుపతి పీట మీద కూర్చుని ఒక్కసారి గదంతా పరకాయించి చూశాడు. "ఎన్నాళ్ళ నుంచి మేస్టారూ? మందెం తీసుకుంటున్నారు?"
"ఓ నెల్లాళ్ళ పైనే అవుతోంది , నాయనా! మందుల దారి మందులదే , నాదారి నాదే. ఊ బావున్నావా నువ్వు? అమ్మాయి ఇక్కడే ఉందా?" లేచి కూర్చోవాలని ప్రయత్నిస్తూ అన్నారు.
"లేవకండి , మాస్టారూ! పడుకొండి. చాలా నీరసంగా ఉన్నారు. ఎలా కూర్చుంటారు?" వారించాడు రఘుపతి.
మాస్టారు తిరిగి పడుకుంటూ దీనంగా చూశారు. "నిజమే నాయినా, లేవలేను. ఇక లేచి తిరుగుతానని నమ్మకం లేదు. పిల్లలు పసివాళ్ళు." గుంటలు పడిన అయన కనుకొలకుల్లో నీరు నిలిచింది.
రఘుపతి గుండెలు బరువుగా కొట్టుకోసాగాయి. మాస్టారు బొత్తిగా అంత అనారోగ్యంగా ఉన్నారనుకోలేదు తను. అయన పరిస్థితి చూస్తుంటే అనుమానంగానే ఉంది. అంత దిగులుతో బాధపడుతున్న ఆయనను ఏదో విధంగా ఒదార్చితే బావుండుననిపించింది. కళ్ళకు కనపడుతున్న పరిస్థితుల్నీ మభ్యపెట్టి ఎలా ధైర్యం చెప్పాలో అర్ధం కాలేదు. నిజంగా ఆయన్ను ఒదార్చగలిగే రోజు ఏమీ చెయ్యలేక పోయాడు. మాటలతో సానుభూతి కురిపిస్తే పరిస్థితులు చక్కబడవన్న సంగతి అందరికీ తెలుసు. ఎంత ప్రయత్నించినా రఘుపతి కంఠం పెగలలేదు. మాస్టారి మొహంలోకి చూడలేనట్టు కిటికీ లీని మందు సీసాల కేసి చూస్తూ కూర్చున్నాడు.
వంటగది తలుపు తెరుచుకుంది. తల దించుకుని మెరుస్తున్న ఇత్తడి గ్లాసు పట్టుకు వచ్చింది పార్వతి. బల్ల దగ్గరగా పెడుతూ అంది నెమ్మదిగా. "కొంచెం కాఫీ తీసుకోండి."
రఘుపతి తల తిప్పి చూడలేకపోయాడు వెంటనే. చూసేసరికి పార్వతి అక్కడ లేదు.
"కాఫీ తెచ్చినట్టుంది . తీసుకో , నాయనా!"
ఆప్యాయంగా గ్లాసు అందుకున్నాడు రఘుపతి. సర్రు సర్రున వేళ్ళు కాలుతున్నా చేతులు మార్చి మార్చి పట్టుకున్నాడే గానీ గ్లాసు కింద పెట్టలేదు. కాఫీ లోంచి లేస్తున్న పొగలు తనే విడుస్తున్న నిట్టుర్పుల లాగ కనిపించాయి. ఖాళీ గ్లాసు కూడా చేతుల్లోనే ఉంచుకుని కూర్చున్నాడు. మాస్టారి తో ఇంకా ఏం మాట్లాడాలో తోచలేదు. చూడటానికి వచ్చాడు. రాగానే ఏదో అడిగాడు. అధైర్య పడవద్దని చెప్పాలనుకున్నాడు. చెప్పలేకపోయాడు.
"అధైర్యం గాక ఏముంది, నాయనా?' అంటే? నిజమే. అయన బాధ తనకెలా అర్ధమౌవుతుంది.
నిశ్శబ్దంగా కూర్చున్న రఘుపతిని మాస్టారే పలకరించాడు. "అమ్మా, నాన్నా అంతా బావున్నారా, నాయనా?"
"ఆ బాగానే ఉన్నారండీ!"
"నువ్వేం చేస్తున్నావిప్పుడు?"
"అదే. ఆ వ్యాపారమే చూస్తున్నానండీ!"
"పోనీ, నెమ్మదిగా ఏదైనా పరీక్ష కి కట్ట లేకపోయావా?"
"........."
"ఆ మధ్య కొన్నాళ్ళు ఊళ్ళో లేనట్టుంది నువ్వు?"
"లేనండీ. ఆవిడికి కొంచెం బాగా లేదంటేనూ అమ్మా, నేనూ ఓ నెల్లాళ్ళు అక్కడే ఉన్నాం."
"ఎవరికీ? సుశీలకా? ఏం? ఏం బాగా లేదు?"
"అదేమో! నాకు సరిగ్గా తెలీదండీ! ఏమిటో కొంచెం జబ్బు చేసింది."
మాస్టారు నీరసంతో మరీ తరిచి తరిచి అడగలేక పోయారు. అతిమందంగా మరో పావుగంట గడిచింది.
"వెళ్లొస్తాను మాస్టారూ!" రఘుపతి లేచి నించున్నాడు.
"మంచిది, నాయనా!' నీరసంగానే కొంచెం గట్టిగా కేక వేశారు మాస్టారు: "అమ్మాయ్! రఘూ వెళ్తున్నాడమ్మా!" అప్రయత్నంగా వంటింటి కేసి చూశాడు రఘుపతి.
"మంచిది, నాన్నా!" పార్వతి బయటికి రాలేదు. మరో క్షణం నించుని, భారంగా కదిలాడు రఘుపతి. పార్వతి తో రెండు మాటలు మాట్లాడాలనీ , ఏమీ బెంగ పెట్టుకోవద్దని చెప్పాలనీ వెళ్ళిపోతుంటే అనిపించింది , పార్వతి నవ్వినా సరే. మరేమీ చెయ్యలేక ముందుకే నడిచాడు.
పార్వతి బాధగా నిట్టుర్చటం తండ్రికి కూడా తెలీలేదు. ఆయనకు చిన్న కునుకు పట్టింది. మూడవ నాడు కునుకు మాస్టారికి శాశ్వతంగా విశ్రాంతి ప్రసాదించింది.
