Previous Page Next Page 
మరుపులో మెరుపులు పేజి 19

 

                                     25
    ప్రభాకర్ బొంబాయి నుంచి వచ్చేటప్పటికి రంగానాధం గారి ఆరోగ్యం కొంతవరకు బాగుపడింది. వెళ్ళేరోజు కోపంతో, అసహనంతో ప్రభాకర్ ఎప్పుడు వెళ్ళిపోతాడా అని ఎదురు చూచిన కుసుమకు, ప్రభాకర్ లేని ఆ యిల్లు ఓ ఎడారి లా తోచింది. ఎంతో చనువు, ధైర్యం కలిగించే అతని ప్రవర్తన, భయం పెట్టె అధికారం, యింట్లో వుండే కొద్ది సేపు యిల్లంతా తానై తిరిగే ప్రభాకర్ లేని లోటు బాగా కనిపించ సాగింది కుసుమకు.
    కాని అంతలోనే ఆమె భావాలు ఆమెనే ఆశ్చర్య పరచాయి. అతను వెళ్ళిపోయే ముందు రోజు రాత్రి యింక యీ యింట్లో, అతని దగ్గర ఒక్క రోజు కూడా గడపలే ననుకుంది. తన దారిన తను పోతానని ఖచ్చితంగా, చెప్పాలను కుంది. శాశ్వతంగా దూరమవడానికి వెనుకాడని తను ఒక్క వారం రోజులకు ప్రభాకర్ కోసం ఇంత  ఆతృత పడుతోందనుకుంటే, అదో విధమైన సిగ్గు కూడా కలిగింది.
    అయినా యింతచేరువకు ఎలా రాగలిగింది. సమాధానం దొరకని ప్రశ్నను ఎన్ని సార్లు ప్రశ్నించు కుందో ఆమెకే తెలియదు. సహజంగా భార్యాభర్తల మధ్య వుండే బంధాన్ని ఎంతగా అసహ్యించుకున్నా, అతని సమక్షంలో గడిపే ప్రతి క్షణానికి, ఆ క్షణపు విలువ దానికే! అన్నంత మధురంగా వుంటుంది కాని అది ఎలా సాధ్యం?
    అతని స్పర్శ నయినా భరించలేని అసహ్యం అతని సమక్షాని కి తహతహలాడే అంత అభిమానం. ఈ రెండూ ఒకచోట ఎలా సంభవమాయినాయి?
    కాని ప్రభాకర్ కు ఏమీ తెలియదు. అతని సహచర్యం అంటేనే తనకు అసహ్యమనే గాని, ఆ అసహ్యానికి అడుగున అభిమానం అనే అందమయిన భావం లేకపోలేదని అతనికి ఎలా తెలుస్తుంది? తనేం చెప్తుంది? అసలు ఎలా చెప్పగలుగుతుంది?"
    వాకిట్లో కారు దిగుతున్న ప్రభాకర్ ని చూడం గానే తెలియకుండానే ఎంతో తెలికతో నిట్టూర్చింది కుసుమ.
    క్రింద తండ్రిని పలకరించి పైకి వచ్చేటప్పటికి కాఫీతో ఎదురుగా వున్న కుసుమను చూచి హాయిగా  నవ్వాడు ప్రభాకర్. స్వచ్చంగా అతను నవ్వుతుంటే ఏదో జంకు లాంటి భావం మెదిలింది కుసుమలో.
    "ఏం చేశావు యీ వారం రోజులు. వారం రోజుల కబుర్లు చెప్పాలి." అన్నాడు కాఫీ అందుకుంటూ.
    "ఏముంటాయి యిక్కడ? మధ్యలో రెండు సార్లు ఫోనులో మాట్లాడాక? అయినా వూళ్ళు తిరిగి వచ్చింది మీరు?..... ' అంది నవ్వుతూ అతని వంక చూస్తూ.
    "రమ్మంటే రానన్నావుగా." అన్నాడు తప్పు తనది కానట్టు.
    "నన్నా? ఎప్పుడు రమ్మందీ?' అంది వచ్చే నవ్వు దాచుకుంటూ.
    "సరే? అలాగే అను ఈసారి రానన్నా తీసుకు వెళతాను. ఎందుకులే బలవంతం పెట్టడం అని వూరు కుంటుంటే?"
    'అవును పాపం, యింతమటుకు నన్ను బలవంత పెట్ట కుండానే పనులన్నీ జరుగుతున్నాయి కాబోలు." అంది.
    ఆమె వంక అభిమానం గా చూస్తూ " మనం వాదించుకోవడానీకేం  గాని- నాకు నిజంగా, నువ్వు కూడా వచ్చి వుంటే ఎంతో బాగుండేది అనిపించింది." అన్నాడు.
    అతని వంక చూచి తల దించుకుంది. తను కూడా "మీతో రావాలనిపించిందని, మీరు లేకపోతె యిది యిల్లు లాగే లేదని తను కూడా చెప్పగలిగితే?" అతనంత తేలికగా తను కూడా తన మనస్సు విప్పి చూపగలిగితే -- ఆ క్షణంలో ఆనంద జ్యోతులు వెలుగుతాయి అతని ముఖంలో - చెప్పాలన్న కోరిక మనసులో ప్రగాడం గా మెదలుతూ వున్నా ఎవరో బలవంతాన పెదిమలు నొక్కి పట్టినట్లు ఆగిపోయింది.
    వెన్నెల్లో వెలుగులా ఆమె ముఖంలో ప్రతి ఒక్క భావం చదవ గలిగిన ప్రభాకర్ నిశ్శబ్దంగా కుర్చీలో వెనక్కి వాలాడు.

                                     26
    "ఇవాళ మనం వెళ్ళి తీరాలా" అంది కుసుమ అద్దం ముందు నుంచుని టై కట్టుకుంటున్న ప్రభాకర్ వెనుకగా వచ్చి, వేళ్ళ మధ్య వున్న ముడి లోంచి టై కిందకు లాగుతూ వెనక్కి తిరిగాడు. "అదేం?' అన్నాడు. అయిష్టం గానే అయినా అందంగా అలంకరించుకున్న కసుమ వంక చూస్తూ.
    "అంతా తయారయి మళ్ళీ...."
    "ఏమిటో నాకు వెళ్లాలని లేదు" అంది కుసుమ పక్కకి తిరిగి వాజ్ లో వున్న గులాబుల్ని సవరిస్తూ. "వస్తామని అన్నాం గా అదీగాక అంతా రెడీ అయి....." అన్నాడు లేత నీలం రంగు చీరలో సంధ్యా కాంతలా వెలిగిపోతున్న కుసుమ వంక చూస్తూ.'
    "అయితే నేం? మనిద్దరం విడిగా ఎక్కడి కయినా వెడదాం." అంది అనాలోచితంగా.
    "కుసుమా!" అన్నాడు సంభ్రమంగా. ఆమె రెండు భుజాల్ని గట్టిగా నొక్కి పట్టుకుంటూ అతని కళ్ళలో ఆశ్చర్యం, ఆనందం, అనుమానం రకరకాల భావాలు పోటీపడి బయటకు వస్తున్నాయి. కుసుమ తనంతట తాను ఒంటరిగా తన కంపెనీ కోరిందంటే- అతనికి ఆనందం కంటే ఆశ్చర్యం, ఆస్థానే ఏదో చెప్పలేనంత ఆశ కలిగాయి.
    తనన్న మాట అతనిలో తెచ్చిన పరిణామాన్ని చూస్తూ ఒక్క అడుగు వెనక్కి వేసింది కుసుమ. అతని చేతులు తప్పించుకుంటూ. ముఖంలో ఎంత ప్రయత్నించినా దాగని భావాలను అతను చూడకుండా వుండాలని పక్కకు తిరిగింది. కొద్ది క్షణాల్లో సద్దుకుని "పదండి టైమయింది." అని గబగబా మెట్ల వైపు నడిచింది. తిరిగి అతని ముఖమయినా చూడకుండా.
    ఆమె తొందరపాటును గమనించి తనలోనే మెల్లిగా నవ్వుకుంటూ, కుసుమను అనుసరించాడు.
    "ఎవరెవరు వస్తారు? అక్కడికి" అడిగింది యధాలాపంగా పక్కన పోయే కార్లను చూస్తూ.
    "అందరునూ. ప్రముఖులంతా." అన్నాడు నవ్వుతూ. ప్రముఖులన్న పదానికి ప్రత్యెక మయిన శబ్దాన్ని కలిగిస్తూ.
    నవ్వుతూ అతని వంక చూసింది.
    హోటల్ పైకి వెళ్ళే టప్పటికి పైన గార్డెన్ అంతా రంగు రంగుల తోరణాలతో అలంకరించి వుంది. అప్పటికే చాలామంది అతిధులు వచ్చారు. గుంపులు గుంపులుగా నుంచునే కబుర్లు చెప్పుకుంటున్నారు. అధునాతనంగా అలంకరించుకుని వుల్లాసంగా, అడ, మగ బేధం లేకుండా చాలా హడావుడిగా వుంది అప్పుడే.
    ప్రభాకర్ పరిచయమున్న వాళ్ళను చిరునవ్వుతో షేక్ హేండ్స్ తో విష్ చేస్తూ , కొత్త వాళ్ళను కుసుమకు పరిచయం చేస్తున్నాడు.
    అప్పుడే ఎవరితో నో మాట్లాడి యివతలకు నడిచి అప్రయత్నంగా కుసుమ వంక చూసిన ప్రభాకర్ ఒక్క క్షణం తెల్లబోయాడు. ఆమె చూపుల్తో పాటు తన దృష్టిని కూడా పోనిచ్చి ఆమె నంతగా నిశ్చేష్టిత చేసిన దేమయి వుంటుందా అని పరికించకుండా వుండలేక పోయాడు.
    ఎత్తుగా, లావుగా మంచి ఖరీదయినా సూటు తో, ఠీవి గా , చేతిలో పంచ్ గ్లాస్ తో ఎవరోతోనో కబుర్లు చెప్తున్న వ్యక్తీని చూచి ఆశ్చర్య పోయాడు. అతను హైదరాబాద్ లో వున్నట్లు తెలుసు. నిజానికి మధ్యాహ్నం కలిశాడు కూడా. ఆ విషయం కుసుమతో చెప్దామనుకుంటూనే మర్చిపోయాడు. ఒకసారి చుట్టూ చూసి కుసుమ వెనకగా చేయి వేసి నడిపించుకుంటూ పిట్ట గోడ వైపు వచ్చాడు. క్రింద హడావిడిగా పొయే కార్లను చూస్తూ "కుసుమా" పిల్చాడు పొడిగా.
    "యిక్కడి నుంచి వెళ్ళిపోదాం ప్లీజ్" అంది నిలవనీయనంత కంగారుతో.
    ఒకసారి సానుభూతి గా ఆమె వంకచూచి "యిప్పుడా? వచ్చి వెళ్ళిపోతే బాగుండదు." అన్నాడు.
    "మీకు తెలియదా?' అడిగింది అతని కళ్ళలోకి చూస్తూ, ఆ చూపులు భరించ లేనట్లు వాల్చుకున్నాడు.
    "యిక్కడికి వస్తున్నట్లు నాకు నిజంగా తెలియదు. అతను వూళ్ళో ఉన్నాడని తెలుసు. ఒకసారి కలుసుకున్నాను కూడా! కాని ఎక్కడ కలకత్తా-- ఎక్కడి హైదరాబాద్ ...గుడ్ గాడ్."
    "నాకెందుకు చెప్పలేదు."
    పాలిపోయినట్లున్న ఆమె ముఖం వంక చూస్తూ " అప్పటికి యిప్పటి కి నీలో చాలా మార్పు వుంది.
    "ముఖర్జీ గుర్తు పట్టలేడు. నువ్వు మాములుగా వుండటానికి ప్రయత్నించు. త్వరగా యిటు తిరుగు."
    "మీకు తెలియదు ముఖర్జీ సంగతి." అంది జడ కింద నుంచి మీద మీద చేయి వేసి బలంగా నిక్కుకుంటూ.
    "నీకెందుకు? నేను కవర్ చేస్తాను. చూడు వాళ్ళంతా యిటే వస్తున్నారు. మనిద్దరం వంటరిగా నుంచుని కబుర్లు చెప్పుకుంటుంటే బాగుండదు.' అంటూ బలవంతం పెట్టి ముందుకు నడిచాడు.
    ప్రభాకర్ తో షేక్ హేండ్స్ యిస్తూ, కుసుమ వంక తిరిగి "మనం యింతకుముందు ఎక్కడో కలిశా మనుకుంటాను." అన్నాడు యింగ్లీషు లో . ఆమెను పరిశీలనగా చూస్తూ.
    నవ్వి వూరుకుంది. తనకేమీ అలా అనిపించనట్లు. అతని చూపులు తప్పించుకుంటూ. అంతలోనే ఎవరో కొత్తవారు రావడంతో అందరి దృష్టి అటు తిరిగింది. "నైస్ , సీయింగ్ యు. యగైన్ మిస్టర్ ముఖర్జీ" అంటూ కుసుమతో సహా ముందుకు నడిచాడు ప్రభాకర్.
    పార్టీలో ఉన్నంత సేపు రెండు కళ్ళు కుసుమ ప్రతి కదలికను గమనిస్తూనే వున్నట్లు కుసుమకు ప్రభాకర్ కు యిద్దరకూ తెలుసు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS