"కానీ, అక్కడ మీ కోసం, మీ తల్లుదండ్రులు లెంత క్షోభిస్తున్నారో, హరి ఎంత వ్యధ పడుతున్నాడో, ఆలోచించారా? మొన్న హరి చెప్పాడు. మీ అమ్మగారి ఆరోగ్యం ఏమీ బాగులేదట. అహర్నిశలూ, మీ గురించిన ఆలోచనలతో, బెంగతో ఆవిడ మంచం ఎక్కే లాగ ఉన్నారట. మీ నాన్న గారు సరేసరి! అయన ప్రతి వారితో మీ ప్రస్తావన తేకుండా ఉండలేరు. మిమ్మల్ని తలవని క్షణం ఉండదు."
తన తల్లిదండ్రుల ప్రస్తావన వచ్చేసరికి ఉమ కళ్ళలో నీళ్ళు తిరిగాయి -- చిన్నతనం నుండి తన కెంతో గారాబ మిచ్చి తన ప్రతి చిన్న కోరికనూ నెరవేర్చే వాళ్ళ కోరికకు వ్యతిరేకంగా తానిక్కడకు వచ్చింది.
"మీరు మా అమ్మనూ, నాన్న గారినీ చూశారా?"
"లేదు నాకు హరి చెప్పాడు. హరి తరచూ వెళ్లి వాళ్ళను కలిసి వస్తూనే ఉంటాడు."
ఉమ దీర్ఘంగా నిట్టూర్చి వూరుకుంది. చాలాసేపు మవునం వహించి, "దురదృష్ట వంతు రాలీని."కని పెంచినందుకు వాళ్ళ కోరిక తీర్చలేక పోయాను." అంది.
ఇద్దరూ ఒక చిన్న మైదానం లో కూర్చున్నాక "ఇప్పటికైనా , ఏం మించి పోయిందీ? మీ తల్లిదండ్రుల కోరిక తీర్చి, మీ ఋణం తీర్చుకోండి." అన్నాడు గిరి.
ఉమ గాద్గదికంగా "క్షమించండి -- అది నా చేతులలో పని కాదు." అంది.
గిరి కొంచెం సేపు తటపటాయించి "నాకు తలచుకుంటే ఆశ్చర్యంగా ఉంది. మొట్టమొదటి సారిగా మనం దుర్గ విషయం ప్రస్తావిస్తూ ఆత్మీయంగా మాట్లాడుకున్నాం. ఆనాటి నుంచీ మన మధ్య కొంత సాన్నిహిత్యం అధికం కాసాగింది. ఆనాడు మీకు ఆత్మీయురాలైన దుర్గ కోసరం మీరు నా వ్యక్తిగత విషయాల్లో కలిగించు కునేందుకు సంకోచించ లేదు. ఆ ధైర్యం తోనే, నేనిప్పుడు నా అత్మీయుడైన హరి కోసం మీ వ్యక్తిగత విషయాల్లో కలుగ జేసుకుంటున్నాను.' అన్నాడు.
"మీరు నా వ్యక్తిగత విషయాల్లో కలుగ జేసుకుంటున్నారని నేనేమీ అనుకోను. నా మీద మీకన్నీ విషయాలలోనూ సంపూర్ణధికార ముంది. ఆ విషయం మీకూ తెలుసు. అయితే మీరిప్పుడూ బావ తరపున వచ్చారన్న మాట."
"హరి తరపున రాలేదు. హరి కోసం వచ్చాను" హరీ, నేనూ చిన్నతనం నుండీ , ఒక్క ప్రాణం లా మెలిగాం. ఒకరి సంతోషం కోసం మరొకరు ఏమైనా, చెయ్యగలిగేటంత గాడమైన స్నేహం మాది. హరి ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. అతనిలో వెనుకటి ఉత్సాహము , చైతన్యమూ మచ్చుకైనా లేవు. ఏదో పెద్ద జబ్బు పడి లేచిన వాడిలాగా ఉన్నాడు. ఎప్పుడూ చిలిపితనం ప్రతి ఫలించే అతని కళ్ళలో ఇప్పుడు దైన్యం తప్ప మరొకటి కనుపించటం లేదు. హరి ఉద్రిక్త స్వభావుడు. అతని ఆరాధన కాని, స్నేహం కాని , ద్వేషం కాని అన్నీ తీవ్రంగా ఉంటాయి. సంతోషం కానీ, దుఃఖం కానీ , మనసా అనుభవిస్తాడు. అతడిని చూస్తె నాకు భయం వేస్తుంది. నా స్నేహితుడి కోసం, నేను ఏమైనా చెయ్యగలనెమో ప్రయత్నించటానికి వచ్చాను."
ఉమ నీరసంగా నవ్వి"ప్రయత్నించండి.' అంది.
"అంత తేలిగ్గా తోసి పారెయ్యకండి ఉమా దేవీ! నా ఉద్దేశం మీ కర్ధం కాలేదంటే, నేను నమ్మను. మీ సమాధానం చెప్పండి."
'అలాగే, నా సమాధానం కూడా మీకు తెలియదంటే నేను నమ్మను. నేను చెప్పేదేముంది?"
గిరి మాట్లాడలేక పోయాడు. అతని లా పాండిత్యమంతా ఉమ ముందు ఎందుకూ, పనికి రాకుండా పోతుంది.
చటుక్కున "మీరు నన్ను ప్రేమిస్తున్నారా?' అన్నాడు.
ఉమ ముఖం ఎర్రబడింది. "అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతే?"
"అవునని చెపుతాను. నా మనసంతా మీరే ఆక్రమించు కున్నారనీ, మీ ధ్యానం లోనే , నా ఆనందం వెతుకున్నాననీ చెపుతున్నాను."
ఉమ పులకరాలతో నిండిన శరీరంతో, సంతోషంతో నిండిన కళ్ళతో, గిరి వంక చూసి "ఇన్ని సంవత్సరాల నా తపస్సు ఫలించింది. ఈ మాటలు చాలు నాకు-- వీటిని తలచుకుంటూ జీవిత మంతా హాయిగా గడపగలను." అంది.
గిరి తమాషాగా నవ్వాడు.
"మీరు వినవలసింది ఇంకా ఉంది. నా ప్రేమను నేను గుర్తించక ముందు నుంచీ కూడా మీరు నా వారు కాలేరని నాకు తెలుసు. మిమ్మల్ని నా దాన్నిగా చేసుకోవాలనే , ఆశ కానీ, ఆ ప్రయత్నం కానీ, నాలో లేనే లేదు. కేవలం నా మనసులోని భావనలతో మాత్రమె నేను సంతృప్తి పడగలను. కానీ, హరి సంగతి ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. ఊహలు తెలియని పసితనం నుంచీ కూడా మిమ్మల్ని తన దానిగా భావించాడు. ఆ భావననే పెంచుకున్నాడు. అందుకనే ఈ అఘాతానికి తట్టుకోలేక పోతున్నాడు. అత్యంత సున్నిత హ్రుదయుడైన అతడు ఏ క్షణం లో ఏమవుతాడో నని నాకిప్పుడూ భయంగానే ఉంటుంది. అతని జీవితం నాశనం చేయటం, మనకు న్యాయం కాదు.'
"మీరు చెప్పేది అంతా నిజమే! కాని ఇది మనసుకు సంబంధించిన విషయం -- భావనలు వాటి అంతట అవి పుట్తాయి. మనం కలిగించు కోలెం కదా!"
"అవును మన మనసులోని కోరికలకు వ్యతిరేకంగా కూడా కొన్ని సార్లు మనం ప్రవర్తించ వలసి వస్తుంది. అది మన కర్తవ్యం."
"అంటే మీరనేది హరి మీద నాకు ప్రేమ లేకపోయినా , అతడిని వివాహం చేసుకుని నా కర్తవ్యం నిర్వహించమనా?"
"అవును."
"కానీ అందువల్ల ఎవరికి సుఖం?"
"మీరర్దాం చేసికోవటం లేదు ఉమాదేవీ? హరి మిమ్మల్నెంత గాడంగా ప్రేమించాడో మీకంటే నాకెక్కువ తెలుసు. ఒక్క మీ సమక్షమే అతడిని అన్ని దుఃఖాల నుండీ దూరంగా చేయగలదు."
ఆ సంగతి ఉమకూ తెలుసు. మాట్లాడలేక తల వంచుకుంది ఆమె మనసులో ఎంత సంక్షోభం కలుగుతుందో అర్ధం చేసుకో గల్గిన గిరి లేచి "పదండి పోదాం! స్థిమితంగా ఆలోచించు కొండి. ఇంకొక ముఖ్యమైన సంగతి కూడా దృష్టి లో ఉంచుకోండి. ఎంత చదువుకున్నా, ఏమైనా మన సంఘం లో స్త్రీ అవివాహిత గా ఉండటం దుస్తరం. సంఘం మాట అలా ఉంచి, వ్యక్తీ గతంగా కూడా అలాంటి ఏకాంత వాసాన్ని భరించటం కష్టం. ఆ శూన్యాన్ని, భరించలేక మీరేనాడో ఒకనాడు వివాహం చేసుకోక తప్పదు. ఎవరినో చేసికొనే బదులు, హరినే చేసికుంటే మీకోసం పరితపించే ఒక ప్రాణిని సంతృప్తి పరచిన వారవుతారు" అన్నాడు. ఎంతో గంబీరంగా ఉన్న అతని మాటలు ఉమ మనసులో, అంతవరకూ రేగుతున్న ఆనంద తరంగాలను పూర్తిగా అణచి వేశాయి. వెలెవెల పోతూన్న ముఖంతో "అంటే మీరు...." అని సందిగ్ధంగా ఆగిపోయింది.
"నన్ను క్షమించండి ఉమదేవీ! నేను మిమ్మల్ని మొదటిసారిగా నా ప్రాణ మిత్రుడి కాబోయే భార్యగా చూశాను. బ్రతికి ఉన్నంత కాలమూ మిమ్మల్ని అలాగే గౌరవిస్తాను. ప్రస్తుతం నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. ఆ కోరిక కలిగిన నాడు, నన్ను కోరే ఎవరినో ఒకరిని వివాహం చేసికుంటాను."
గుండెలను చీలుస్తున్నట్లుగా వచ్చిన ఉమ నిట్టుర్పు తన గుండెలలోని మంటను మరింత అధికం చేసినా, ఆ జ్వాలలను తనలోనే అణచు కుని, ప్రశాంత మైన చిరునవ్వుతో పాటు ఉమ వంక తిరిగి "మనం సాధారణ మానవులం ఉమాదేవీ! రాకూడదని ఆలోచనలు, మన మనసులోకి అనేకం వస్తూనే ఉంటాయి. కానీ , వాటికి లొంగి పోకుండా , మన మార్గం లో మనం నడువ గలిగినప్పుడే మన మానవత్వం సార్ధక మవుతుంది.' అన్నాడు.
ఉమ సమాధానం చెప్పలేదు. లోకమంతా కటిక చీకటిగా ఉందామెకు.
ఇంటికి రాగానే హోల్డాలు చుట్టూ కుంటున్న గిరిని చూసి సంభ్రమంగా 'ఇప్పుడే వెళతారా?' అంది ఉమ.
"సెలవు లేదు. అయినా, ఇక్కడ ఉండి మీకు మరింత క్షోభ కలిగించటం తప్ప, నేను చెయ్యగలిగిందేమీ ఉంది?"
ఉమ నిలువెల్లా వణుకుతున్న శరీరంతో లేచి వచ్చి గిరి దగ్గర వాలిపోయింది. గిరి సంభ్రమంగా 'ఛీ! ఉమాదేవీ! లేవండి. ఇందుకు నేను అర్హుడి ని కాను." అన్నాడు.
కానీ ఉమ లేవలేదు. అతని పాదాల పై ఉమ కళ్ళలో నుండి ఆగకుండా స్రవిస్తున్న కన్నీరు అతని పాదాల మీద పడుతున్నది.
"ఈ ఒక్క కోరిక తీర్చుకోనివ్వండి. ఇందువల్ల కలిగే పున్యాన్నీ, నా ఒక్క దానికే?"
గిరి కరిగి పోయాడు.
"పాప పుణ్యాల సంగతి కాదు ఉమా! సరే! మీ జీవితం శుభప్రదం కావాలని ఆశీర్వదిస్తున్నాను." అని ఆమె శిరస్సు పై చేయి వేసి నిమిరాడు.
గిరి లేవతీయాలని ఎంత ప్రయత్నించినా, కొన్ని క్షణాల వరకూ, ఉమ అతని చెంత నుంచి లేవనే లేదు. తరువాత లేచి, ముఖం కడుక్కుని తనూ తయారై "నేను కూడా స్టేషను కు వస్తాను." అంది.
ప్రశాంతంగా ఉన్న ఆమె ముఖం లోకి చూస్తూ ముగ్ధుడై గిరి "రండి" అన్నాడు.
"నన్ను 'మీరు' ని పిలవట మెందుకూ? 'నువ్వు' అని పిలవలేరా?"
"నాకు లేని హక్కును వినియోగించు కోవటానికి ప్రయత్నించట మెందుకూ?"
ఉమ సమాధానం చెప్పలేదు.
ట్రైను ఎక్కుతూ "ఏం నిశ్చయించుకున్నారూ?' అని అడిగాడు చివరిసారిగా గిరి.
ఉమ తల వంచుకుని "రేపే బావకు ఉత్తరం వ్రాస్తాను. కానీ, నా ఉద్యోగం, నేను చేసుకోవటానికి బావ అంగీకరిస్తేనే, మా వివాహం జరుగుతుంది." అంది.
గిరి సంతృప్తిగా నిట్టూర్చాడు. ట్రైను కదలబోయే సమయానికి ఉమ తన చెయ్యి అందించింది గిరికి. గిరి ఆ చెయ్యి అందుకుని ఆప్యాయంగా నొక్కి విడిచి పెట్టాడు. కాల చక్రంలా రైలు కూడా అమితమైన వేగంతో ముందుకు సాగిపోయింది.
