Previous Page Next Page 
ప్రేమకు పగ్గాలు పేజి 19


    భాస్కరం సిగ్గుతో కుంచించుకు పోయాడు......
    "ఆ సురేఖ ఒప్పుకుంటే నేను ఆ అమ్మాయిని పెళ్ళాడుతాను అని చెప్పు........ముకుందరావు మన వసంత కోసరం ఎంతేనా త్యాగం చేయకలడు........" అన్నాడు అతి కష్టంమీద.
    "ఆలస్యంచేస్తే ఆ రాఘవేంద్రం అటువేపే మొగ్గు చూపుతాడు" అనుకున్నాడు కూడా.
    "ఎందుకు ఒప్పుకోదూ?" అన్నది పిన్ని బరువుగా.
    ముకుందరావును వసంతనూ ఒక చోట చేర్చాలి. వాళ్ళు మాత్రం ప్రేమికులు కారూ?........
    
                                 *    *    *

    భాస్కరం ధనమ్మగారితో సహా అందరితోనూ, తండ్రి కూడా వెళ్ళి అన్నీ మాట్లాడి, నాలుగు చక్కబెట్టుకుని వసంత పెళ్ళి స్థిరపర్చుకున్నాడు.
    "అయితే మీ చెల్లాయి పెళ్ళిలో మా సురేఖకు పరధానం జరుపుకోమంటావు?"
    "అది మీ ఇష్టం. మీ అమ్మాయి ఇష్టం" పొడిగా నవ్వాడు భాస్కరం. కసిగా చూశాడామెను.
    "ఈ కుర్రాన్ని బుర్ర తిరుగు అని అన్నాడే రాఘవేంద్రం...........పాపం........నాలిక కూడా లేనంత అమాయకుడూ, బుద్ధిమంతుడూ అనుకున్నది." ధనమ్మగారు. 'కట్నం ముక్కు గుద్ది మరి యిస్తాను' అని కూడా అనుకుంది.
    వసంతకు ముకుందరావుకి శుభలేఖలు సైతం ఎంచి ఏర్పాటు చేశాడు భాస్కరం.
    జనైకంమగారు సంతోషంగానే ఉందిగాని, ఆమెకు తానేదో తప్పిదం చేయడం లేదుకదా అనే శంకడిస్తున్నందున కాస్త నీర్సంగా ఉన్నది.
    "ఒరే, భాసా! మీ అమ్మలాగే నేనూ ఈ పాటికే పోయివుంటేనా" అన్నది.
    భాస్కరాన్ని ఎవరో శూలంతో పొడిచి నట్లైంది.
    "అమ్మా! అమ్మా! ఎవరమ్మా! నువ్వే నమ్మానాకు అన్నీను" అన్నాడు కోపంగా.
    "ఆడిన మాట తప్పలేనురా నేను. నీకు ఇష్టం లేని గుదిబండను కట్టిస్తున్నాడేమో రా నా చేత దేవుడూ" ఆమె దిగులు పడ్డది.

                                       28

    ఆ మర్నాడు పౌర్ణమి కాబోలు.
    సముద్రం జోత్స్నాభిసారికలా పరవళ్ళు త్రొక్కు తున్నది. సురేఖ ఒక ఏకాంత ప్రదేశాన కూచున్నది. ఇసికెలో బొమ్మలు గీస్తున్నది-ఏనాడూ ఒంటరిగా దిగాలుగా కూచొని ఎరుగదు సురేఖ.
    సాయం సంధ్య కరిగి చీకటి తెరలు జారుతున్నాయి........సంద్రపు టలల హోరు ఎక్కువైంది-తొ వెన్నెల సముద్రం మీద బంగారు మలామా చేస్తున్నది.
    "ఈ భాస్కరం ఇలా అనుకోకుండా అకస్మాత్తుగా నా జీవితంలో ప్రవేశించడమేమిటి?"
    "ఒకవేళ పద్మావతిని అతగాడు ఆమె అనుకునే దృష్టిలో ప్రేమించడం లేదేమో........" ఇది ఎన్నోసారోగాని అదే ఆలోచన పీడిస్తున్నది.
    "అర్ధంలేని మాట........ఈ వయస్సులో వేరే ఆకర్షణ, మరో ప్రలోభమూ ఎక్కడనుంచి వస్తాయి? అలాంటివన్నీ ఇక భాస్కరానికి తనమీద రావాలి."
    సురేఖ ఎంత వారించుకున్నా, ఆమె మనసు విపరీతంగా ఆలోచిస్తూనే ఉన్నది.
    దొడ్డమ్మతో చెప్పాలి.......ఈ భాస్కరం పద్మా వతి అనే ఒక అమాయకురాలిని దగా చేశాడని?
    "భాస్కరం పద్మావతిని దగా చేశాడా?"
    "పోనీ! ఈ అబ్బాయి నాకు వద్దూ..........నీ ఆస్త్రీ నాకు వద్దు......" అందామనుకుంది. కాని, దొడ్డమ్మ గత పది సంవత్సరాలుగా బ్రతుకుతున్నదీ తన సుఖం కోసరమే. ఆమెను ఎలా నిరాశ పుచ్చడం?
    ప్రేమకు ఒక పురుషుడికీ స్త్రీకి మధ్య గల ఆకర్షణ అని మాత్రమే నా నిర్వచనం........ప్రణయం ఎన్నాళ్ళు నిలుస్తుంది?-దొడ్డమ్మది 'ప్రేమ' కాదా?
    ఒడ్డునపడి విరిగే ఆ కెరటంలాగ యవ్వనం పొంగున లేస్తుంది. పెరుగుతుంది. కాని, ఆ వెనుక దూరాన లోతుగా గల పంద్రంలాగ నిలిచేది అనుబంధం కాదా?    
    ఐతే "ఇవాళ భాస్కరాన్ని కాదన్నంత మాత్రాన దొడ్డమ్మ అనురాగం పోతుందా?" అనిపించింది సురేఖకు.    
    "పోదుగాని.........." అనుకుంది. మళ్ళీ ఆలోచించింది. అహంకారంకొద్దీ - భాస్కరం చెల్లి పెళ్ళి తప్పించి ఆ ముకుందాన్ని నా మెడ గడతా నంటుంది దొడ్డమ్మ."
    సురేఖకు కెవ్వున కేక వేద్దామనిపించింది.
    ముకుందరావు వసంతను తన హృదయేశ్వరిగా చేసుకున్నాడు......పుట్టెడు సంబరంగా వచ్చి "సురేఖా సురేఖా! నాకు నాకూ........" అన్నాడు.
    "ఏమిటి నీకూ............" అని తాను నవ్వింది.
    "నా పెళ్ళికి నీకేం బహుమానం కావాలీ?" అన్నాడు.
    "ఆడ బడుచు లాంఛనా లిప్పించ"మంది గభిక్కున తను.
    "ధన్యుణ్ణి-నీలాంటి పెంకె పిల్లలు నిజంగా దేవతలు అని ఎంతమందికి తెలుసు సురేఖా! ఒక్క నాలాంటి అదృష్టవంతులకు తప్ప" అన్నాడు ముకుందరావు.
    "ముద్దుగా పూల మొక్కలను, చెవుల పిల్లు లను పెంచినట్లు పెంచుకుంటారు పిల్లల్ని......ఆనక దాని ఖరీదు రక రకాలుగా వసూలు చేస్తారు ఈ దొడ్డమ్మల్లాంటివాళ్ళు......పాపం.....పద్మావతి తన పెళ్ళి చూపులవైనం చెబితే యేమవుతుందీ?"
    సురేఖకు పద్మావతి ప్రేమ కోసరం ముకుందా రావు వాత్సల్యం కోసరం కూడా తాను త్యాగాలు చెయ్యాలనుంది! కాని దొడ్డమ్మ ప్రేమ ఈ రెండిటి కన్నా ప్రతిబంధకమే. దాన్నేం చెయ్యాలి?
    'తాను ఇన్నాళ్ళు వెచ్చించిన దానికి ఖరీదు అడుగు తున్నది దొడ్డమ్మ.'
    "హే భగవాన్! ఈ సముదంలోపడి చద్దునా." అనుకుంది.
    అటు చూసింది. కెరటాలు త్రుళ్ళి త్రుళ్ళి పడుతున్నాయి. వెన్నెల్లో మిల మిలా తళతళా మెరిసిపోతున్నాయి.......ఆ వెన్నెల కాంతుల్లో కెరటాలు ఒడ్డుకు తెచ్చి పారేసిన ఒక తాటికాయ తళుక్కున మెరిసింది.
    "అదోదాన్ని విసిరేసినట్లే తనను కూడా పారేస్తుందీ సముద్రం.......అప్పుడు తన శవాన్ని చూస్తే పద్మావతి భాస్కరాన్ని నిండుగా ప్రేమించదూ......దొడ్డమ్మ తన ఆస్తి నస్సలు ఇక ప్రేమించనే ప్రేమించదూ......."
    సురేఖకు ఈ పీడ కలల్లాంటి పిచ్చి ఆలోచనలతో ఏదో భయం వేసింది- "మద్యని నేను చావడం ఎందుకు?" అని లేచి గబగబా బయలు దేరింది.
    సముద్రం ఇంచుమించు ఒంటరిగా వెన్నెల్లో ఆడుకుంటోంది - ఉన్న కొంచెంమంది నగరోన్ముఖులైపొయ్యారు.
    "భాస్కరంతో మాట్లాడి పద్మావతి గురించి తెల్సుకుంటాను" అనుకున్నది వడివడిగా నడుస్తూ....
    ఒక రిద్దరూ స్కూటర్ నాలాలు, కాస్త నెమ్మదిగా స్కూటర్ లు నడిపి, ఆమెను వెన్నెల్లో పోల్చగలమా అన్నట్లు ఆశగా చూశారు.
    "కుర్ర వెధవలు" తిట్టుకుంది సురేఖ.
    "ఇలా వెంటబడతారు - తీరా మీరే మాకు గతి అని ఎవడినేనా గుండెల్లో దాచుకుంటే గాయాలు చేసిపోతారు" అనుకుంది. మళ్ళా తన అనవసరమైన కసికి తానే నవ్వుకుంది.
    సురేఖ నేరుగా మెన్స్ కు కూడా వెళ్ళలేదు. రూమ్ కి వెళ్ళిపోయింది.
    అక్కడ తీవ్రంగా ఎదురు చూస్తో, తన మంచం అంచున కూచున్న పద్మావతి అగుపించింది.
    "ఏమిటోయ్!" పలకరించింది.
    "ఏమిటోయ్!" పలకరించింది సురేఖ......
    "అబ్బ! ఎందుకనోగాని నీ కోసరం బెంగపడుతూ కూచున్నాను సుమా!" పద్మావతి లేచి నిలబడి స్నేహితురాలి నెదుర్కొన్నది.
    "ఏమయిపోతానోయ్! నీ చాదస్తం గాకపోతే" సురేఖ ప్రక్కమీద వెల్లకితలా కూలబడుతూ నవ్వింది.
    పద్మావతి ఆ పిల్ల ప్రక్కనే కూచుని "ఏమో మరి! ఎవర్నేనా లేవదీసుకుని......." వేళాకోళంగా కిలకిల నవ్వింది పద్మావతి సురేఖ బుగ్గమీద చిటికెవేసి.
    "నీ మొహం ...... ఎవర్ని ఎత్తుకుపోయినా నీ ప్రియుణ్ణి మాత్రం ముట్టుకోనులే......" పొడిగా నవ్వింది.
    "ఛ! ఏం మాటలే అవీ ...... పోకిరీ"పద్మావతి సురేఖను కౌగలించుకుంది.
    సురేఖ ఏం కదలలేదు.
    పద్మావతి సురేఖ ముంగురులు సవరించింది. "ఈ అందాల రాశిని చూస్తూవుంటే ఆడదాన్ని పరాయి దాన్ని ఐపోయినదాన్ని నేనే చలించిపోతున్నానే, ఇక ఏమగాడు......."
    "అబ్బ! ఉండవే........సొద.......తలకాయ నొప్పిగా వుంది........" అటు తిరిగి పడుక్కుంది సురేఖ.
    పద్మావతి దిగులుపడిపోయింది. "చురుకైన సురేఖ ఇలా ఐపోయిందే?"
    వాస్తవానికి పద్మావతి సురేఖను మంచిగా ప్రాధేయపడి "భాస్కరం నీ వాడేనే" అనిపించుకుందామనే వచ్చింది. ఆ ఉద్దేశం ఆమెకు ఉద్దేశ పూర్వకంగా లేదుగాని అంతర్గతంగా వున్న భయమే ఆమెను - సాయంకాలంనించీ ఈ సురేఖ కోసరం కాచుకుని కూచోమన్నాయి.
    పద్మావతికి ఆందోళన ఎక్కువైంది. సురేఖలో ఉత్సాహం సన్నగిల్లడంతో తాను మరీ బేలపడి పోయింది.
    "కాలేజీలకు ఇందుకా మీరు వస్తున్నారు-చదువులకు కాదూ" అన్నారెవరో మనసులో.
    "ఏమోయ్! సురేఖా! నోట్సు రాద్దామా?" అన్నది పద్మావతి "అన్నట్లు నువ్వు భోంచేశావా?" అని అడిగింది.
    సురేఖ మాటాడలేదు.
    "నే వెళ్తున్నా" నిరాశతో లేచింది పద్మావతి.
    "వద్దు-పడుక్కో"మని ప్రక్కకి జరిగింది సురేఖ.
    "సరే! నిన్ను దేవుడు పుట్టించినప్పుడు బహుశా వాడికి పెద్ద రాజ్య కాంక్ష ఉందేమోనే" పద్మావతి అడిగింది.
    "పిచ్చిదానా? రాజ్యాలేం చేస్తాయే రాజ్యాలు సుఖాల నిస్తే కాశీమజిలీ కధల్లో రాకుమార్తెలు లేచిపోవడం, పారిపోడం ఎందుకు చేస్తారూ?"
    "ఏమో! బాబూ నీ కవిత్వం నా కర్ధం కాదూ...అది సరేగాని" ఉలిక్కిపడి లేచి కూచుంది పద్మా వతి.
    "మనం చదువుకోవద్దుటే......."
    "పాఠాలా? గుణపాఠాలా?"
    "అందుకే పాపం - ఓ రచయిత కష్టపడి, నిష్టపది, ఈ తొలి మలుపు బాధలన్నీ రాస్తే ఓ విమర్శకుడు, "ఏం! హాయిగా యూనివర్శిటీకి వెళ్ళి చదువుకోడం మాని, సినీమాలు, ప్రేమలూ ఎందుకూ?" అని రాశాడట............"
    "ఆ విమర్శకుడు" చిన్నతనాన్ని పాతికముప్పై ఏళ్ళక్రితం ఎక్కడో పారేసి, మరిచిపోయి ఉంటాడు. మనం అనుబంధాలు అనురాగాలు కావాలని తెచ్చు కుంటాముటే ...... శీతగాలికి పెదాలు పగిలి నట్లు, యవ్వనంలో హృదయానికి ఈ "టివ్వు టివ్వు" మనే దోషం వస్తుందిగానీ......" సురేఖ మాటలకు పద్మావతి విస్తుపోయింది.
    "నువ్వు ప్రేమలో పడ్డావా?"
    "ఆహా! మా దొడ్డమ్మ నన్ను తన చరాస్తి అనుకుంటోంది.......కాని నేను నీ ప్రేమలో పడ్డాను- నువ్వు .........నువ్వు.........." సురేఖ, పద్మావతిని ముక్కు మలిపింది.
    "ఇష్షు.......మీ రూమ్ మేటు సెకండ్ షో సినీమాకు వెళ్ళి వస్తోంది బివేర్" పద్మావతి సురేఖ నోరు సున్నితంగా నొక్కింది.
    "అది వార్డెన్ ఫ్రెండుగా! ఆ ఇద్దరూ పోతారు. అది వాళ్ళ అఫైర్. ఇది మన అఫైర్."
    సురేఖ రూమ్ మేటు కాదు. ఎవరో ఆ వరండాలో అటుగా నడిచి వెళ్ళిపోయారు.
    సురేఖ అన్నది. "పద్మా! అనగనగా, ఓ అమ్మాయి ఓ అబ్బాయిని ప్రేమించిందట.........ఊఁ కొడుతున్నావా?"
    "ఊఁ............మించి?" పద్మావతి అడిగింది.
    "కాని ఆ అబ్బాయిని మరో అమ్మాయి సంరక్షకురాలు ప్రేమించిందిట-"
    "ఛా! రంకు గాధ" నవ్వింది పద్మావతి.
    "కాదే! కేవలం అహం అంటే సెంట్ పర్సంట్ మరే మీ మిక్స్ గాని పిసలు ప్రేమేనే ఆమెది. తన కూతురికిచ్చి, ఆ అబ్బాయిని పెళ్ళి చేస్తానందీ"
    "ఐ సీ....... అయితే ఫర్వాలేదు" పద్మావతి నవ్వింది.
    "ఏమిటే నీ మొహం. ఫర్వాలేదు. ఆ ప్రేమించిన అబ్బాయి- ఆ మొదటి అమ్మాయినేం చెయ్యాలీ?"
    పద్మావతి గుండెలు కెలికి నట్లైంది. "నా మొహం! నీ పాటి తెలివి యివ్వలేదు నాకు దేవుడు! పోనీ ఆ అబ్బాయి-ఆ సంరక్షకురాలిని "ఫో నరసమ్మా! నీ ముద్దుల పట్టి నాకు వద్దు" అంటాడు అనుకో"
    "అనడనుకో"
    "నాన్ సెన్స్-అయితే ఆ అబ్బాయి ఆ మొదటి అమ్మాయిని "లవ్" చేయడం హొళక్కన్నమాటా!"
    పద్మావతి చెప్పింది.
    "అంతేనంటావా?" సురేఖ సీలింగ్ కేసి చూసింది సాలోచనగా.
    "ఏమో బాబూ! నా కెలా తెలుస్తుందీ?......నువ్వీమధ్య సూటిగా మాట్లాడటం మానేస్తున్నావూ" అన్నది.
    "చూడు పద్మా! జీవితం గ్రాఫు సీటుమీది బిందువు లాంటిది. దీన్ని దీని ఉనికిని గుర్తించాలీ అంటే అనే కానేక అంశాలను పరిశీలించాలి.......నువ్వు ఉన్నావనుకో.......మీ అమ్మగారు నిన్ను ప్రేమిస్తున్నారా లేదా? ఆమె ఇష్టం ఒకటి ఉన్నది కదా?......" అంటే పద్మావతి అనే అమ్మాయి స్వేచ్చకి వాళ్ళమ్మ 'ప్రేమ' అనే పగ్గ ఒకటి ఉన్నదన్నమాట.........." సురేఖ ఆలోచిస్తున్నది మాట్లాడటం లేదు. గట్టిగా ఆలోచిస్తున్న దంతే!
    వేరే ప్రత్యేకమైన ఒక ఆకర్షణ. శారీరకమైన వాంఛ ప్రవేశించనంత వరకూ, కుటంబమూ అందులోని వ్యక్తులూ, వీరి అనుబంధాలు, ఆటంకాలు వీటికి మించిన తియ్యని అనుభవాలుండవుగాని-తారుణ్యపు తొలి రోజుల్లో ప్రణయం కోసరం మనం ఉవ్విళ్ళూరుతున్నప్పుడు ఈ అనురాగాలు అనుబంధాలు అన్నీ బందాలై పోతాయి." - సురేఖ మాటలను పద్మావతి విన్నది. ఏమో అందామనుకున్నా, నోరు పెగల్లేదు.
    సముద్రం కెరటాలు చూసి భ్రమసి ఇది ఎంత చంచలమైనదీ అనున్నట్లే, చిలిపి సురేఖను చూసి "ఈ పిల్ల ఎంత చీకూ చింతా లేనిదీ అనుకున్నాను కానీ సురేఖకు తనకంటే ఎక్కువ సత్యాలు తెలుసు" ననుకుంది పద్మావతి.
    "నన్నేం చెయ్యమంటావే............" అన్నది ఎట్టకేలకు.
    "బుద్దిగా చదువుకో.......మీ అమ్మగారు నువ్వు మాష్టరీ చెయ్యాలని నిన్ను పాతికేళ్ళు కన్ను లలో ఒత్తులు వేసుకుని పెంచారు." సురేఖ నవ్వింది- వూరికే సర్దాగా అన్నట్లు ధ్వనించాలని ఆమె ప్రయత్నం.
    "చిత్తం.......అలాగే......" మరి చదువుకోసమేగా ఈ వూరొస్తా" పద్మావతి స్నేహితురాలికి దగ్గరగా జరిగింది.
    "ఉహూ!.......అది ఆత్మవంచన........అలా అనకు ప్రేమ కోసమను" సురేఖ నవ్వింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS