అరుంధతితో పరిచయమయిన కొత్తలో ఆమెతో మాట్లాడటం శ్రీధర్ కు చాలా హాయిగా ఉండేది. నిర్వికారంగా విజ్ఞాన పిపాస తో మాట్లాడే ఆమెతో ఎంతసేపు మాట్లాడినా, ఏమీ అనిపించేది కాదు. ఆమె నవ్వు స్వచ్చంగా ఉండేది. అట్లాంటి మిత్రురాలు లభించినందుకు శ్రీధర్ కెంతో సంతోషమయింది. వైయుక్తి కస్తాయి నదిగమించిన ఒకానొక వాతావరణం లో సాగేవి వారి సంభాషణలు.
అట్లాంటి అరుంధతి లో ఇటీవల మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె చిరునవ్వు సాధారణ పరిచయ సూచకంగా లేదు. అందులో ఆత్మీయత ఎట్లాంటి వారికైనా స్పష్టంగా తెలుస్తుంది. ఆమె కళ్ళల్లో మనసులోని మమత స్పష్టంగా ప్రతి ఫలిస్తుంది. సూటిగా తన కళ్ళలోకి చూడలేక పోతుంది. వాలుగా చూడటం చటుక్కున చూపు త్రిప్పుకోవటం, సంకోచం లేకుండా స్వేచ్చగా మాట్లాడే ఆమె కంఠం ఇటీవల ఉండుండి వణుకు తుంది.
ప్రగాడమయిన అనురాగం సగం వాల్చిన కనురెప్పల కింద నీలాల వంటి కళ్ళు మెరుస్తుంటే ప్రాణం పెట్టె చిరునవ్వు ముఖానికి వింత కాంతులను కలిగిస్తుంటే, స్పష్టా స్పష్టమయిన మనసులోని మధుర భావన చెక్కిళ్ళను రాగ రంజితం చేస్తుంటే రూపు దాల్చిన సమ్మోహన శక్తి లాగ తన ఎదుట నిల్చిన అరుంధతి సమక్షంలో నిర్వికారంగా ఉండగలగటం శ్రీధర్ కు అసిధారావ్రత చర్యయే అయింది.
అయితే, అరుంధతి ప్రవర్తన లో ఏ కోశానా వెకిలితనం లేదు. ఆమె ఏం చేస్తున్నదో, ఆమెకు తెలియదు. తనను తాను గుర్తించలేని ఒకానొక తన్మయ స్తితిలో పడిపోయింది ఆమె! ఆకారణం గానే తను తట్టి మేల్కొలిపాడామేను. ఇంక ఆమె తన కర్తవ్యం తాను నిర్ణయించుకాగలదు.
* * * *
మనోరంజని , సుందర్రావు ల బలవంతం మీద అరుంధతీ ప్రకాశరావు లు కూడా సినిమాకు బయలు దేరారు. వాళ్ళు నలుగురూ కలిసి సినిమాకు వెళ్ళటం తరచూ జరుగుతూనే ఉంటుంది. ఆ సినిమా చాలా బాగుంది. దర్శకుడు ప్రతి సన్నివేశం లోనూ, తన ప్రతిభను బాగా వ్యక్తం చేయగలిగాడు. అందరూ ఆయా సన్నివేశాలలో లీనమయి పోయి చూస్తున్నాడు. చిట్టచివరి దృశ్యం ఒకరి కొరకు ఒకరు జీవించిన నాయికా నాయకు లిరువురూ ఒకరి కళ్ళలో మరొకరు ప్రపంచం లోని సౌందర్యాన్నంతా చూసుకొంటున్నారు. ఒకరి స్పర్శ లో మరొకరు సౌఖ్యానికి పరమావధి ని కనుగొంటున్నారు. ఒకరి సాన్నిధ్యం లో మరొకరికి మిగిలిన లోకమే నశించింది.
గుండెలు కలుక్కుమనగా నిస్పృహగా వెనక్కు వాలింది అరుంధతి. అప్రయత్నంగా ఆమె చూపులు బాధగా నుదురు రాసుకుంటున్న సుందర్రావు మీద నిలిచాయి.
నవ్వాలో, ఏడవాలో అర్ధం కాలేదు అరుంధతి కి. తామిద్దరూ వివాహితులే! అయినా, ఇద్దరూ తమ హృదయాలలో జనించిన మధుర స్పందనకు ప్రతి ధ్వనిని పొందగలిగే స్థితిలో లేరు.
వేసవి సాయంత్రం చల్లని వెన్నెలలు విరిసే వేళ సుందర సంధ్యారాగం ప్రకృతికే గిలిగింతలు పెడ్తూన్నప్పుడు తెల్లని మల్లెలు, సన్నని జాజులు నకనకలాడుతూ జడ పదార్ధాలకు కూడా చిలిపితనం ఉపదేశించే సమయంలో సంగీతం పాడే ఏరులకు , తలలూచే తోటలు, రారమ్మని పుష్పాంజలులతో అర్దించే ఏకాంత తరుణం లో వ్యక్తా వ్యక్తంగా మనసులో కదలాడే భావాలను మూగగా తమతో పంచుకోగలిగే ప్రాణి లేదు.
దారుణమైన ఈ దురదృష్టానికి విధిని కాని, సంఘాన్ని కాని నిందించి, ప్రయోజనం లేదు. నూటికి నూరు పాళ్ళూ దానికి కారణం స్వయం కృతమే! కారుల్లో తిరగటానికి, ఉలెన్ సూట్లు వేసికొనటానికి బార్ లకు వెళ్ళటానికి బావ చెల్లించుకొన్న మూల్యమిది.
తన విషయంలో విధికి కొంత భాగమున్నా అధికం స్వయం కృతమే!
జీవితాంతమూ ఉండే వివాహబంధంలోకి తాత్కలికమైనా ఒక నిర్లిప్తతతో ఆలోచనా రహితంగా అడుగు పెట్టింది. ఎంతటి గాయానికైనా మందు పూసి హృదయం లో ఎప్పటికప్పుడు కొత్త ఆశలను చిగురింపజేయగల శక్తి కాలానికుందనే మహత్తర సత్యాన్ని గుర్తించలేకపోయింది.
తనకు చదువుంది. ఆలోచన వుంది. అనాకారి కాదు. బీదది కాదు. కొంత స్థిమితంగా ఆలోచించు కొని ఉంటె, తన భావి జీవితాన్ని పరిపాలించే మూర్తిని కొంతలో కొంతైనా అర్ధం చేసికొనటానికి ప్రయత్నించి ఉంటె ఈనాడు జీవితం మరీ ఇంత పొడిగా ఉండేది కాదేమో?
అనుకూల దాంపత్యమంటే , సినిమా లలో లాగ "చేయి చేయి కలిపి హాయి హాయి' గా తిరగనక్కర్లేదు. బేధాభిప్రాయాలు రావచ్చు -- తిట్టుకోవచ్చు-- అంతగా అయితే తన్ను కొన్నా పరవాలేదు. కానీ ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరికి నిజమైన అభిమానం, ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు గుర్తించి గౌరవించగలిగేపాటి సంస్కారం ఉంటె చాలు! ఆ ఆర్ద్రత మిగిలిన చికాకుల నన్నింటినీ వేయగలదు!
ఇప్పుడీ గతజల సేతు బంధన మెందుకూ? గడిచిన జీవితం కంటే గడపవలసిందే ఎక్కువగా ఉంది. గతాన్ని తవ్వుకొని విచారిస్తూ కూర్చోవటం కంటే, వర్తమానం లో పరిస్థితులను సాధ్యమయినంత అనుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నించాలి. ప్రకాశరావు పట్ల సహజంగా తనకు ప్రేమ లేకపోయినా, తరతరాలుగా గౌరవింపబడుతూ వచ్చిన మంగల్యాలను తగుదునమ్మా అని మెడలో ధరించి నందుకు అతనిని ప్రేమించి తీరాలి.
సినిమా పూర్తయింది. జాతీయ పతాకం తెర ,మీద అల్లాల్లాడుతుండగా , జాతీయ గీతం వినిపిస్తుంది. ప్రకాశరావు పాట మధ్యలోనే బయటకు నడిచాడు. అతని వెనుక సుందర్రావు , అతని వెనుక మనోరంజని కూడా బయటకు నడిచారు. అరుంధతి ప్రాణం ఉసూరు మంది. అతి ప్రయత్నం మీద తాను చేసికొంటున్న నిర్ణయాలు గాలిలో దీపాలలా అల్లాడిపోతున్నాయి. బయటకు నడిచిన ప్రకాశరావు అరుంధతి రాకపోవటం గమనించి 'ఆరూ!' అని పిల్చాడు. అరుంధతి పలకలేదు. జాతీయగీతం పూర్తయిన తరువాత బయటకు వచ్చిన అరుంధతి మీద ప్రకాశరావు విసుక్కోన్నాడు.
'అంత చివరి వరకూ ఉండకపోతేనేం? రష్ చూడు!"
అరుంధతి కి పెదవి కదల్చటానికి భయమయింది. తన నోటి నుండి ఎలాంటి మాటలు వస్తాయో? మనోరంజని , సుందర్రావు లు కూడా ఉన్నారు.
భగవాన్! ఏ త్యాగాలూ చెయ్యక్కర్లేదు . ఏ సేవలూ వద్దు. కనీసం జాతీయగీతాన్ని , జాతీయ పటాకాన్నీ, గౌరవించగలిగే సంస్కారం కూడా కరువయిందా ఈనాటి విద్యాధికులకు?
"ప్రకాశరావు గారూ! కాసేపు లిడో లో కూర్చొని వెడదామా! ఇంటి కెళ్ళి చేసేదేముంది?' కారు నడుపుతున్న సుందర్రావు అన్నాడు. నిర్మల ప్రణయ గాధను సుందరంగా ప్రదర్శించిన , ఆ చిత్రం చూసిన సుందర్రావు మనసు పాడయింది. అందుకని లిడోకి? మనశ్శాంతికి! ప్రకాశరావు వెంటనే ఒప్పుకొన్నాడు. తన మాట చెల్లదని తెలిసినా, "నాకు నిద్ర వస్తోంది" అంది అరుంధతి.
"ఫరవాలేదు. అక్కడ నిద్రా గిద్రా యెగిరి పోతుంది." ఉత్సాహంగా అన్నాడు ప్రకాశరావు.
లిడో లో రకరకాల జంటలు చేసే నాట్యాన్ని చూడటం మనోరంజని కి చాలా ఇష్టం! అందరి మధ్య సుందరరావుతో కలిసి నాట్యం చేయటం ఆమెకు గర్వకారణం. అందుకని మనోరంజని అభ్యంతర పెట్టలేదు.
అరుంధతి కి వాళ్లతో కలిసి కూర్చోక తప్పలేదు. తలనొప్పి భరించలేక ఆలోచించడం మానేసింది.
ఇంటికి చేరుకోనేసరికి పన్నెండు దాటింది. ఎర్రబడిన కళ్ళతో కొద్దిగా తూలె ప్రకాశరావు ను చూడలేక తొందరగా తన పక్క మీదకు వెళ్ళిపోయింది అరుంధతి. ఆమె చుట్టూ చేతులు తన వైపుకు తిప్పుకొన్నాడు ప్రకాశరావు. అరుంధతి ఆ చేతులను తోసి పారేసింది. ప్రకాశరావు పకపక నవ్వుతూ ఆమెను బలంగా తన వైపుకు తిప్పుకొని గుండెల కదుముకొని తప్పించుకోవడానికి వీల్లేకుండా చేతులతో చుట్టేసాడు.
స్త్రీలు అక్షరాలా అబలలు! అరుంధతి తన పై తనకు గల హక్కును వదిలేసుకుంది.
ఏదేదో మాట్లాడుతున్నాడు ప్రకాశరావు . అరుంధతి కి ఏదీ అర్ధం కాలేదు.
వ్యర్ధ ప్రయత్నమని తెలిసే గోముగా, "మీరీ అలవాటు మానతారా? నేను భరించ లేకుండా ఉన్నాను" అంది.
"నువ్వసలు రుచి చూడలేదు గనుక, ఇలా మాట్లాడుతున్నావ్! ఉండు! ఈసారి నీకు బలవంతంగా రుచి చూపిస్తాను. అప్పుడు నువ్వే తెమ్మంటావ్?" మత్తుగా నవ్వాడు ప్రకాశరావు. అరుంధతి హడలి పోయింది. ఆమె కిక మాటలు రాలేదు.
సంఘ జీవిగా సాంఘిక నియమాలను పాటించగలదు. హైందవ యువతి గా వివాహ బంధాన్ని గౌరవించగలదు. తన జీవితానికి అర్ధ మింతే!
