'ఆవేశపడకండి రమణయ్య గారూ! ఎక్కడికి తీసుకు వెళ్ళినా ఈ స్థితిలో లాభం లేదు. తీసుకు వెళ్ళడం కూడా సాధ్యపడదు. మీరు అధైర్య పడకండి. మానవ ప్రయత్నానికి లోటు లేకుండా చేద్దాం. ఆ తర్వాత భగవంతుడున్నాడు.. మనము అంతకు మించి ఏం చేయగలము?'
అంతలో లోపలి నుండి మంత్రసాని బయటికి వచ్చి లక్ష్మీ కి స్పృహ వచ్చినట్లు చెప్పింది. నేను డాక్టరు గారూ లోపలికి వెళ్ళాము.
ఆమె ప్రసవ వేదనతో బాధపడుతూ, ఆయాస పడుతూ, 'ఏమండీ....? భగవంతుడు నన్ను పిలుస్తున్నాడు... ఈ మందులు ఆ భగవంతుని పిలుపు నడ్డు కోలేవు. ఇక ఆ ప్రయత్నాలేవీ చేయకండి.' మూలుగుతూ ఎంతో కష్టం మీద అంది... మళ్ళీ స్పృహ తప్పింది ఆమెకు.
డాక్టరు గారు తమ ప్రయత్నాలు ప్రారంభించారు . ఒక గంట తర్వాత స్పృహ వచ్చింది. అందరినీ బయటికి వెళ్ళమని కోరింది. నన్ను దగ్గరగా రమ్మని పిలిచింది. నేను మంచం మీద కూర్చొని ఆమె తల లొపలికి వ్రేళ్ళు జొప్పించి ఆప్యాయంగా చూస్తూ లక్ష్మీ.... భయపడకు. డాక్టరు గారు నయమై పోతుందని అంటున్నారు. ధైర్యంగా వుండి భగవంతుడిని తలుస్తూ ఉండు.' నాకే అసలు ధైర్యం లేనప్పుడు లక్ష్మీకి ఏం ధైర్యం చెప్పగలను? నాకు కన్నీరు ఆగలేదు. ప్రక్కకు తిరిగి కళ్ళు తుడుచుకున్నాను. ఎంతో కష్టం మీద లేచి కూర్చొని నా పాదధూళి తన నొసట అద్దుకొని హీనస్వరంతో డగ్గుత్తి పడుతూ 'దైవాన్ని స్మరించ మంటున్నారు. మీకన్న ప్రత్యక్ష దైవం నాకింకేవ్వరు? మీరే నా దైవం.... మీరు ఎంత ధైర్యం చెప్పినా డాక్టరు గారు ఎంత ప్రయత్నించినా యిక లాభం లేదు. నా పరిస్థితి నాకు క్షుణ్ణంగా అర్ధమౌతూ ఉంది. చూడండీ... బాబు ....మన బాబును నా చిహ్నంగా మీ వద్ద వదిలి వెడుతున్నాను... మీరు మళ్ళీ వివాహం చేసుకోండి ....బాబును జాగ్రత్తగా చూడండి... మన బాబు గొప్ప డాక్టరు కావాలి.... పది మందిలో పెద్ద పేరు సంపాదించు కోవాలి... నాలాంటి అభాగిను లెంతమందికో వాడు సేవ చేయగలగాలి... పై లోకాలలో ఉండి వాడు రోగులకు చేసే సేవలు చూస్తూ ఆనందించాలి నేను... మళ్లా చెబుతున్నాను. మీ జీవితం నాపై గల బెంగతో మోడుబారి పోగూడదు... ఆ విధంగా జరిగితే నా బాబుకు ఏ వేళకది అమర్చి పెట్టె వారుండరు. బాబును జాగ్రత్తగా చూస్తానని, వివాహం చేసుకుంటా నని నాకు మాటివ్వండి. ఈ రెండే నా తుది కోరికలు.'
'అలాగే లక్ష్మీ ....నీ కోరిక నేనెప్పుడు కాదన్నాను? బాబును జాగ్రత్తగా చూస్తాను. మళ్లీ వివాహం మాత్రం చేసుకోను. నీతో గడిపిన ఈ జీవితం మరొకరితో గడవదు. నీతో గడిపిన మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుంటూ శేష జీవితాన్ని పూర్తీ చేస్తాను. పునర్వివాహ విషయంలో మాత్రం నన్ను బలవంతం పెట్టవద్దు. మళ్లీ పెళ్లి చేసుకుంటే బాబుకు అన్యాయం జరుగుతుందో...ఏమో?'
'అలాగని మీరు వివాహం మానుకుంటారా? మీ వయస్సెంతని....? వివాహం చేసుకొని బాబుని వేయి కళ్ళతో కనిపెట్టండి.... బాబు కోసం మాత్రం మీరు వివాహం మానుకోవద్దు...ఆడదిక్కు లేని సంసారం అతి హీనంగా ఉంటుంది.'
'నీ యిష్ట ప్రకారమే చేస్తాను...యిక నైనా విశ్రాంతిగా పడుకో....'
'నాకిక విశ్రాంతి కి కొదవేమిటండి? అంతా విశ్రాంతే!' అని నాచేత పునర్వివాహం జరిపించుకొనేందుకు వాగ్దానం చేయించుకుంది. ఆ క్షణం లో నా కళ్ళు బొటబొట కన్నీరు కార్చాయి.
'మీకు చివరి నమస్కారం చేస్తున్నా నండీ! తెలిసో ...తెలియకో మిమ్ములను యిబ్బంది పెట్టినా, మీ మనసుకు కష్టం కలిగించే విధంగా ప్రవర్తించినా నన్ను మన్నించండి.' ఒంట్లో లేని వోపికను తెచ్చుకొని సంభాషణ ను ముగించింది. ఆ విధంగానే నిర్జీవ ప్రతిమలా లక్ష్మీ మంచం మీద కూర్చొని ఆమె ముఖంలోకి చూస్తూ గడిపాను. ఆమె కొద్దిగా సేద తీర్చుకొని 'మీరు వెళ్ళి రాజ్యలక్ష్మీ వదినను పంపించండి. ఆమెకు కూడా రెండు మాటలు చెప్పి నిశ్చింత గా కళ్ళు మూస్తాను.'
ఆమె చెప్పిన ప్రకారం నేను బయటికి వెళ్లి రాజీని లోపలికి పంపించాను. ఆమె లోపలికి వెళ్లి అరగంట తర్వాత వెలుపలికి వచ్చింది. 'వదినే అందరినీ లోపలికి పిలుస్తూ ఉంది.' అని చెప్పింది. అందరమూ లోపలికి వెళ్ళాము. మా అందరికీ వరుసగా నమస్కరిస్తూ, అందరి వద్ద శలవు తీసుకొని, మమ్ములనందరినీ వదిలి పెట్టి కళ్ళు మూసింది.
అంతా ఒకేసారి గొల్లుమన్నాం....చివరకు మా జీతగాళ్ళు కూడా కంటికి, మంటికి ఏకధారగా ఏడ్చారు. ఆమె అంత్య క్రియలకు ఊరు ఊరంతా కదిలింది. ఎవరి నోట చూసినా 'పుణ్యాత్మురాలు పసుపు కుంకుమ లతో భర్త చేతి మీదుగా వెళ్ళిపోయింది. అంతటి అదృష్టం ...ఎందరికి కలుగుతుంది?' ఈ విధమైన మాటలే! ఈ మాటలను వింటున్న కొద్ది నా దుఃఖం ఎక్కువైంది. నా బంధువులంతా వచ్చారు. ఎందరు ఎన్ని విధాల ఓదార్చినా నా దుఃఖం ఆగలేదు.
పరామర్శలు పూర్తయిన తర్వాత ముఖ్య మైన బంధవులు తప్ప మిగతా వారంతా వెళ్ళిపోయారు. నా చెల్లెలు రాజీ, నా మామగారు ...అత్తగారు... యింకా ఒక రిద్దరు ముఖ్యులు మాత్రం ఉన్నారు. ఖర్మ యిత్యాది కార్యక్రమాలన్నీ సక్రమంగా జరిగిపోయాయి. ఒకరోజు ఆ ఉన్న ముఖ్యమైన బంధవు లంతా ఒకదగ్గర కూర్చొని నా సమస్యను చర్చించ నారంభించారు. బాబును నా ఒళ్లో కూర్చో బెట్టుకొని యివన్నీ నాకు పట్టనట్లు ఒక మూల దిగాలు పడి కూర్చున్నాను. అ పది పదిహేను రోజులలో బాబు పూర్తిగా చిక్కి సగంయ్యాడు. ఎవరి గొడవల్లో వారు ఉండి వాడి సంగతే ఎవ్వరూ పట్టించు కోలేదు. వాడిని దగ్గరకు తీసుకున్నప్పుడల్లా లక్ష్మీ గుర్తుకు వచ్చి మనసంతా వికలా చికలం అవుతూ ఉండేది. ఏదో ధ్యాసలో ఉన్న నాకు మామగారి మాటలు వినపడి నా ధ్యాసను అటు మళ్ళించాను.
'అమ్మా.......! రాజ్యలక్ష్మీ ...యిక ముందు కర్తవ్యమేమిటి? అల్లుడు గారు పెద్దగా వయసు మళ్ళిన వారు కాదు. పైగా పిల్లవాడున్నాడు. మళ్ళీ పెళ్లి జరిపించకపోతే వీరిద్దరి ఆలనా పాలనా చూసేదెవరు?'
'నాకూ అలాగే తోస్తుంది మామయ్య గారూ! అన్నయ్యకు పెళ్లి జరిపించాలని వదినే మాట తీసుకుంది కూడా! మొండి కెత్తి వద్దంటే నచ్చజెప్పి ఒప్పించమని కూడా చెప్పింది.'
'మరి అన్నయ్య దగ్గర ఈ విషయం కదిలించావా?'
'లేదు....ఎక్కడ వీలు చిక్కిందనీ....? అంతా హడావుడే గద! ఈ రోజే కాస్త తెరిపిగా ఉంది...అడుగుదాం....'
ఆ మాటలు విన్న నేను 'అమ్మా... రాజీ! నా లక్ష్మీ మరణించి నేలైనా నిండలేదు. అప్పుడే ఈ ఆలోచన లేమిటమ్మా? కొంతకాలం జరగనీ.... యిప్పుడప్పుడే నా పెళ్లి ఆలోచనలు తలపెట్ట వద్దు.' బాబుని రాజీకి కిచ్చి అలా బయటికి వెళ్లాను చీకాకుతో.
మామగారు రెండవ రోజు వెళ్ళిపోయారు. ఇక మిగిలింది యింట్లో యిద్దరమే! రాజీ...నేను.
'రాజీ.... ఆరోజు వదిన నీకేం చెప్పిందే?'
'ఏముంటుందన్నయ్యా చెప్పడానికి....? నిన్ను మళ్ళీ ఒక యింటి వాణ్ణిగా చేయమంది.... నీ పెళ్లి జరిగాక అప్పుడప్పుడు బాబు యోగ క్షేమాలు తెలుసుకుంటూ ఉండవలసిందని కోరింది. ఏమో అన్నయ్యా? వదిన చనిపోయిందంటే నమ్మకం కలగడంలా--! కళ్ళకు కనిపిస్తూ ఉన్నట్లుగానే ఉంది. నీ ఈ పిన్న వయస్సు లోనే నీ కుటుంబం యిలా అవుతుందని కలలో కూడా తలచలేదు..... నారాత అలా అయ్యింది. ....నీవైనా పిల్లా పాపలతో సుఖ పడతావను కుంటే నీకీ కష్టం వచ్చిపడింది....'
'రాజీ....! నీకు మాత్రం మీ అత్తవారింట్లో ఎవరున్నారమ్మా? ఒక్క మామగారే గదా! రేపే వెళ్లి అన్నీ చక్కబెట్టుకొని వచ్చేసేయ్యి.... ఎలాగూ మీ వ్యవసాయం పనులు.... యితర వ్యవహారాలు నేనే చూస్తున్నాను...కొంతకాలం మీరిద్దరూ యిక్కడే ఉండండి...'
'అలా ఎంతకాలం జరుగుతుందన్నయ్యా....? ఎప్పటి కైనా నీ యిల్లంటూ నీకు ఏర్పడాలి.. అయినా మామగారేమంటారో?'
'అనడానికే ముంటుందమ్మా....? అక్కడున్నా యిక్కడున్నా ఒకటే!'
'అది నిజమే ననుకో...! ఇంటికి కాపలా ఉండాలి కద! గొడ్డు...గోదా ...అన్నీ యిక్కడికే మార్చాల్సి వస్తుంది.'
'అలాగే మార్చుదాం! అదేమంత శ్రమని? పోనీ నీవిక్కడే ఉండు. రేపు నేను మీ ఊరు వెళ్లి మామగారికినచ్చజెప్పి ....అక్కడి వ్యవహారాలన్నీ సరిజేసి వచ్చేస్తాను...నీవేమంటావమ్మా?'
'నీ యిష్టం అన్నయ్యా!'
అనుకున్నట్లు గా రాజీ మామగారిని యింటికి తీసుకు వచ్చాను. అక్కడి వ్యవహారాలన్నీ సరిచేశాను. ఒక బరువు తీరిపోయినందుకు సంతోషించాను. సాఫీగా ఒక సంవత్సరం గడిచి పోయింది. బాబుకు నాలుగు సంవత్సరాలు నిండాయి. రాజీకి అనుకోని విధంగా టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఆమెకు జ్వరం తగ్గేంత వరకూ నేనే చేయి కాల్చుకున్నాను. జ్వరం తగ్గిన తర్వాత కూడా చాలా నీరసంగా ఉండడం వల్ల మరి కొంతకాలం బాగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టరు సలహా యిచ్చాడు. అప్పుడిక రాజీకి నా పెళ్లి విషయమై వత్తిడి చేసే అవకాశం లభించింది. పోరు పెట్టసాగింది.
'నీకు విశ్రాంతి కొద్ది కాలమే కదమ్మా కావలసింది . ఎవరినో ఒకరిని వంటకు కుదుర్చుకుంటే సరిపోయే దానికి నాకిప్పుడు పెళ్లి ఎందుకమ్మా?'
తప్పించుకున్నాను. వంటమనిషిని కుదుర్చాను. ఒక నెల రోజులు వంట వడ్డన బాగానే చేసింది. నా సమస్య తీరిందని సంతోషించాను.... ఆమె మీద నమ్మకం కూడా కుదిరింది. అనుకోకుండా ఒకరోజు తెల్లవారే సరికి రెండొందలు రూపాయలు దొంగతనం చేసి పరారై పోయిందా వంట మనిషి. ఎటూ తోచక తలపట్టుకున్నాను. ఒక్కనాటి జ్వరమే అరుమాసాల బలాన్ని తీసివేస్తుంది. అటువంటిది 3,4 వారాలు టైఫాయిడ్ జ్వరంతో బాధపడిన రాజీ అంత త్వరలో కోలుకోడు. మరిప్పుడెం చెయ్యాలి? నా పెళ్లి విషయంలో రాజీ వత్తిడి, ఆమె మామగారి వత్తిడి ఎక్కువైంది. నేను కూడా బాగా అలోచించి, అందుకు ఒప్పుకున్నాను. సూర్యకాంతం తో నా పెళ్లి ఎంతో వైభవంగా జరిగిపోయింది. పెళ్లి జరిగిన కొద్ది కాలానికే సూర్యకాంతం కాపరానికి వచ్చింది. నాలుగయిదు మాసాలు గడిచాయి. రాజీకి బాగా కులాసా చిక్కింది. నేను ఒకరోజు రాత్రి భోజనం చేసి పడుకోవడానికి వెడుతున్న సమయంలో 'అన్నయ్యా! వదిన కాపరానికి వచ్చింది గద! ఇక మేము మా యింటికి వెడతాము. ఎప్పుడో వెళ్లి ఉండవలసింది. కొత్త కాపురమని ఉండిపోయాను.' అంది రాజీ.
'అదేమిటమ్మా....? అప్పుడే ఏం తొందర? మరొక ఆరు మాసాలుండి వెడుదురు గాని.'
'లేదులే అన్నయ్యా! ఎక్కడ ఉండవలసిన వాళ్ళం అక్కడ ఉండడం మనందరికీ మంచిది.'
నాకు ఆమె మాటలలో బాధ చూచాయగా తోచింది. పదిహేను రోజుల నుండీ కాంతం...రాజీ మాట...మాట.. పెంచు కుంటున్నారు. దాని పర్యవసానమే యిప్పటి ఈ మాటలై ఉండాలి.
'చూద్దాం లే....!' అని వెళ్లి పడుకున్నాను. నిద్ర పట్టలేదు. సూర్యకాంతం చాలా విచిత్రమైన మనిషి. మనసులో ఏముంటుందో ఎవరికీ తెలియదు... పైకి మాత్రం అందరి మీద ప్రేమ కనబరుస్తుంది. బాబుని కూడా ఎంతో ప్రేమతో చూస్తూ ఉంది. కాని ఒక్కొక్కప్పుడు చేసే చేష్టలతో ఆమె అసలు స్వభావం బయటపడుతూ ఉండేది. అయినా చేయగలిగిందేముంది. జీవితాంతం ఆమెతో గడపవలసిందే గద!
